హోం

31, జనవరి 2013, గురువారం

ఎందుకు కాలిపోతవ్.. నువ్వు ఎందుకు రాలి పోతవ్ !!


ఈ రోజు పేపర్ తెరచి చూడగానే కనిపించిన విషాదకర వార్త ఒకే రోజు తెలంగాణ కోసం ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు అని, నిన్న గాక మొన్న ఒక పత్రిక విలేకరి మరణించిండు ఈ రోజు మరో ముగ్గురు, 2009 లో తెలంగాణా కోసం శ్రీకాంతచారి చేసిన తొలి బలిదానం తో మొదలైన బలవన్మరణాలు నేటికి కొనసాగుతున్నాయి, తెలంగాణా లో ఈ మూడేళ్ళలో సుమారు వెయ్యి మంది మరనిన్చారంటే ఇది ఎంత తీవ్రమైన సమస్యనో అందరు ఆలోచించాలి..
                             ఎందుకు కాలి పోతావు నువ్వు, ఎందుకు రాలిపోతావు కాలకు రా నువ్వు రాలకు రా, మాడి బూడిద కాకురా, మాడి బూడిద కాకురా.. నీకు అండగా ఉండే డాక్టర్లుండ్రు, ఆపద వస్తే లాయర్లుండ్రు.. నువ్వు యుద్ధం చేసి గెలుస్తానంటే సరిహద్దులు లేని ప్రపంచమున్ధి.... ఎందుకు కాలి పోతావు నువ్వు ఎందుకు రాలిపోతావు కాలకు రా నువ్వు రాలకు రా.. అని విమలక్క చెప్పినట్టుగా ..తెలంగాణా కోసం ఇకపై ఎవరు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను.
                      ఒక ఊరిలో ఓ  కుటుంబం ఉండేది, బార్య భర్తలు పొద్దంత కష్టపడి వ్యవసాయం చేసి పంట పండించే వారు, తరువాతి కాలంలో చెరువు ఎండిపోయి కరువు కాటకాలు విలయ తాండవం చేసాయి, ఎన్నో నోములు నోచి పూజలు చేస్తే ఒక్క కొడుకు పుట్టాడు, ముద్దు మురిపెము తీరకముందే ఆ వ్యక్తి డబ్బు సంపాదించడానికి దుబాయి పోవాలని అనుకుంటాడు, మధ్య ధలారికి కోరినన్ని పైసలు ఇచ్చి అప్పుచేసి దుబాయి పోతాడు, అక్కడ పని దొరికించుకొని ఇంటికి పైసలు పంపుతుండే వాడు, రెండు మూడేళ్ళ కు ఒకసారి ఇంటికి వచ్చి చూసి పోతున్దేటోడు, కొడుకు పెద్దవాడవుతాడు, పానాలన్ని వాడి మీదే పెట్టుకొని బతుకుతుంటారు అవ్వ,అయ్యా, సదువు సంద్యలు లేక ఇట్లా దుబాయి పొంట పొయ్యి బతుకంతా ఈడనే గడిచిపాయే, పెళ్ళాం పిల్లలతో కలిసి బతికే రోజులన్నీ ఈ ఎడారిదేశం లోనే ఆవిరైపోయే అని బాధపడుతుండే వాడు ఆ వ్యక్తి, తనలా తన కొడుకు  అవ్వ, అయ్యాను, పెళ్ళాన్ని పిల్లల్నిఇడిచి పెట్టి దుబాయి పొంట పోవద్దని అనుకుంటాడు, అందుకే తన కొడుకు మంచి చదువులు సదువుకోవాలని ఎన్ని పైసలైన పెట్టి సదివిస్తుంటాడు, 2009 లో హైదరాబాద్ లో ఇంజనీరింగ్ లో చేరుతాడు, కొడుకు ఇంజనీరింగ్ పూర్తయినంక ఉద్యోగం వస్తది ఇక తాను దుబాయి పోవాల్సిన పని లేదు హాయిగా కుటుంబంతో ఉండవచ్చు అని ఆశపడుతాడు ఆ తండ్రి, తెలంగాణా మహోద్యమం ప్రారంభమవుతుంది ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొంటాడు ఆ యువకుడు, తనతో చదువుకునే ఆంద్ర స్నేహితులతో తెలంగాణా వస్తుంది అని వాదించేవాడు, ఎంతకైనా తెగించి కోట్లాడి తెలంగాణా సాధించుకుంటామని వారితో వాగ్వాదం పెట్టుకునే వాడు, కొంతకాలం శ్రీకృష్ణ కమిటి పేరుతో ఆ తర్వాత అంతర్గత చర్చల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తుంది, సీమంద్రకు చెందినా స్నేహితులు తెలంగాణా ఇవ్వరు, ఇచ్చే పరిస్థితులు లేవు అంటూ అతనిని అవహేళన చేసే వారు, ఐన ధైర్యంగా ఎక్కడ సభలు జరిగిన వెళ్ళేవాడు, చివరికి కేంద్రం తెలంగాణా ఇచ్చే పరిస్థితులు కనిపించే సరికి ఆనందిస్తాడు, కాని అంతలోనే మాటమార్చే సరికి తీవ్ర నిరాశకు గురవుతాడు.
                          దుబాయి నుండి కొడుకు ను బార్యను చూడాలని ఈ యువకుని తండ్రి ఇంటికి బయలు దేరుతాడు, వచ్చే ముందు కొడుకు కి ఫోన్ చేస్తాడు, కాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటది, శంషాబాద్ లో దిగిన ఆ తండ్రి నేరుగా తన గ్రామానికి చేరుకుంటాడు, ఇంటిముందు జనం, ఇంట్లోకి వెళ్లి చూస్తాడు, కొడుకు శవమై ఉన్న ఆ దృశ్యాన్ని చూసిన అతని గుండెలు పగిలిపోయాయి, కళ్ళల్లో నుండి రక్తం కట్టలు తెంచుకొని వచ్చింది, గుండెలవిసేలా అతని తల్లి ఏడుస్తూనే ఉంది, స్పృహ కోల్పోతూ లేస్తూ మల్లి మల్లి స్పృహ కోల్పోతూ...దుక్క సాగరంలో మునిగి పోతుంది, గుండెలవిసి పోయే ఆ దృశ్యం తో ఊరంతా ఒక్కటే విషాదం ఆవహించింది, ఊరువాడ ఏకమై వచ్చి అతని అంతిమ యాత్రలో పాల్గొన్నాయి.
                             ఆ తల్లి తండ్రుల జీవితాలు మోడువారిపోయాయి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కొడుకు తమ కళ్ళ ముందే మరణించడం వారిని కోలుకోకుండా చేసింది, ఇంతకి అతను ఎందుకు చనిపోయినట్టు, ఆ తల్లి తండ్రులకు ఎందుకు అంతటి తీవ్ర వేదనకు గురి చేసినట్టు..? ఒక్కటే ఆశయం.. ఒక్కటే నినాదం.. ఒక్కటే పోరాటం .. అదే జై తెలంగాణా!!!
                           తెలంగాణా లో ఒక వ్యక్తి చనిపోతే అది బీహార్ లో కాని, కాశ్మీర్ లో గాని వార్త కాకపోవచ్చు, ఎక్కడో ఒక అస్సాంలో ఒక వ్యక్తి మరణిస్తే అది ఇక్కడ వార్త కాకపోవచ్చు, కాని ఆ వ్యక్తిని కోల్పోయిన కుటుంబ సబ్యులు పడే వేదన మాత్రం ఎక్కడైనా ఒక్కటే, ఆ చావులోని తీవ్రత బయటి వారికి అర్థం కాదు, ఆ తల్లి తండ్రులు కుటుంబ సబ్యులు పడే క్షోభను ఎవరు అనుభవించలేరు, తమకు ఆ అనుభవం అయితే తప్ప, శవాలపై ప్రమాణాలు చేసిన వారికి ఆ వ్యక్తులను కోల్పోయిన వారి కుటుంబాలు పడే క్షోభ ఎం తెలుసు..? కోమటిరెడ్డి కొడుకు చనిపోతే కాని అతనికి అందులోని బాధ తెలిసి రాలేదు, అలగే ప్రతివారు తమ వరకు వచ్చే వరకు సమస్య సమస్య గా కనిపించదు..
                            ఈ దేశం లో వెయ్యిమంది చనిపోయిన ఇక్కడి పాలకులకు అది సమస్యల కనిపించదు, అదే నార్వే అనే దేశం లో ఒక వ్యక్తి జరిపిన కాల్పులలో 70 మంది చనిపోతే జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు, అక్కడ ప్రాణానికి ఉన్న విలువ అంతటిది, కాని ఇక్కడ ప్రాణానికి లక్షో,రెండు లక్షలో విలువ కట్టి ఇస్తారు, అన్ని రోజులు తమ తో ఉండి తమతో తిరిగిన వ్యక్తి జ్ఞాపకాలను, ఆ వ్యక్తి లేని లోటును ఆ లక్ష రూపాయలు పూడ్చాగల్గుతాయ..? ప్రాణం ఎక్కడైనా ఒక్కటే అంతెందుకు ఎ జీవిధైన ప్రాణం ఒక్కటే, ఈ దేశంలో ధనవంతుని ప్రాణానికి ఉన్న విలువ పేద వాని ప్రాణానికి లేదు, ఈ దేశ మాజీ ప్రధాని చనిపోతే అది వార్త అదే ఒక సామాన్యుడు మరణిస్తే అది వార్త కాదు, అది ప్రాణం, ఇది ప్రాణం కదా...? దేశంలోని అత్యున్నత పదవులను అనుభవించిన ఒక వ్యక్తి మరణిస్తే అయ్యో పాపం అని ఆలోచించే వారు, పక్క ప్రాంతంలో, ఒకే రాష్ట్రం లో అందునా సమైక్యత కోరుకునేవారు, జీవిత మాధుర్యం ఏమి చవి చూడని పిల్లవాడు ఉద్యమం కోసం అసువులు భాసిన అతని గురించి ఆలోచించరేం..? స్పందిన్చారే..? ఇదేనా మానవత్వం..? ఇదేనా సమైక్యత..? , ఇక్కడ పదవులకు ఉన్న విలువ ప్రాణాలకు లేదు, అందుకే మన మంత్రులు పదవులనే పట్టుకొని పాకులడుతున్నారు.
                         తెలంగాణా ఉద్యమం లో కులాలకు మతాలకు అతీతంగా ఎంతో మంది అసువులు బాశారు, అందులో దళితులు, బహుజనులు, అగ్రకులాలవారు అందరు ఉన్నారు. హిందువులే కాదు ముస్లిం లు కుడా ఉన్నారు, పుట్టేబిడ్డ నేను ఈ మతంలో పుట్టాలి, నేను కులంలో పుట్టాలి అని నిర్ణయించుకొని పుట్టరు, కాబట్టి ఉద్యమం లో మా కులం వారే మరణిస్తున్నారు, మీ కులం వారు మరణించడం లేదు అని మాట్లాడడాన్ని మించిన పాశవికత ఇంకోటి ఉండదు, ఎవరు కూడా నేను దళితునిగా పుట్టాలని, అగ్రకులం లో పుట్టాలి అనుకోని పుట్టరు,అందరు తెలంగాణా కోసం పోరాడుతున్నారు, ప్రాణాలు విడుస్తున్నారు, కాబట్టి ఇప్పటికైనా కులాల కుమ్ములాటలు మరచి తెలంగాణా కోసం అందరు కలిసి పోరాడి యువకులలో ఉన్న అభద్రతా బావాన్ని పోగొట్టాలి., దేశంలో ఎ పార్టీ ఐన అన్ని మతాల కులాల వారి ప్రయోజనాన్ని కోరుకోవాలి,సరే కొన్ని పార్టీ లు మతం ప్రాతిపదికగా పని చేస్తున్నాయి, అలంటి వాటిలో MIM ఒకటి, తెలంగాణా జిల్లాలలో మీటింగ్ లు పెట్టి జనాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉపన్యాసాలు దంచి, ఇన్ని రోజులు కలిసి ఉన్న రెండు మతాల మధ్య చిచ్చుపెట్టాలని చుసిన వీరికి ముస్లిం యువకులు తెలంగాణా కోసం ఆత్మ హత్యలు చేసుకుంటే కనిపించలేదా..? ఆనాడు ఎందుకు రాలేదు, ఎందుకు స్పందించలేదు.. ముస్లిం ల ప్రయోజనాల కోసం పోరాడాతం అనే  మీరు ముస్లిం యువకుల కు ఎందుకు దైర్యం చెప్పలేక పోయారు..? 
                ఇన్ని రోజులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ లోనే శవాలు ఉండేవి కాని నేడు భారత ప్రభుత్వం తెలంగాణా నే ఒక మార్చురీ గా మార్చేసింది. మాది అతి పెద్ద ప్రజా స్వామ్యం అని చెప్పుకునే వీరు సాగిస్తునది, ప్రజా స్వామ్యం అనే ముసుగు కప్పుకున్న సామ్రాజ్యవాదమ్,ఈ సామ్రాజ్యవాద పులి తెలంగాణా బిడ్డలను బలితీసుకుంటుంది, ఈ పులిని మట్టు పెట్టె ఆయుధం మన చేతుల్లోనే ఉంది, పెట్టుబడి దారుల పెంపుడు మొక్క గా ఉన్న ఈ ప్రభుత్వాన్ని తప్పించి మనం కోరుకునే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోవడానికి మరో సంవత్సరం మాత్రమె సమయం ఉంది, అందుకే యువకులార మీ విలువైన ప్రాణాలను విడువకండి తెలంగాణా ప్రజలను చైతన్య పరచండి, తెలంగాణాను యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకెళ్ళేది మీరే... రేపటి తెలంగాణా మీకోసమే.. తెలంగాణా కై బరిగీసి కోట్లడుధాం.. బతికుండి తెలంగాణా ను కళ్లారా చూద్దాం..
            ఒంటిపై కిరసిన్ పోసుకొని ఒక అమ్మాయి కవిత(17) ఆత్మహత్య కు ప్రయత్నించింది, తన మరణమే చివరిది కావాలని, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని తన మరణ వాంగ్మూలం లో చెప్పిందట, తెలంగాణా ఉద్యమం లో చురుగ్గా పాల్గొంటున్న ఈ అమ్మాయి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది, శరీరం 90% కాలిపోయిందట, బతకడం కష్టమని ఉస్మానియా డాక్టర్ లు చెప్పారట.
 ఒంటిపై చిన్నగా నూనె చిట్లి పడితేనే విలవిలలాడిపోతం, అలాంటిది శరీరమంత దాహించుకుందంటే ఆ బిడ్డ ఎంత క్షోభకు గురయ్యిందో, ఇంతటి త్యాగానికి సిద్దమయ్యింది..యువకులార మీ విలువైన ప్రాణాలను విడువకండి, తెలంగాణ ప్రజలను చైతన్య పరచండి, తెలంగాణాను యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి తీసుకెళ్ళేది మీరే... రేపటి తెలంగాణా మీకోసమే.. తెలంగాణా కై బరిగీసి కోట్లడుధాం.. బతికుండి తెలంగాణా ను కళ్లారా చూద్దాం..
              ఎందుకు కాలి పోతావు నువ్వు, ఎందుకు రాలిపోతావు కాలకు రా నువ్వు రాలకు రా, మాడి బూడిద కాకురా, మాడి బూడిద కాకురా.. నీకు అండగా ఉండే డాక్టర్లుండ్రు, ఆపద వస్తే లాయర్లుండ్రు.. నువ్వు యుద్ధం చేసి గెలుస్తానంటే సరిహద్దులు లేని ప్రపంచమున్ధి.... ఎందుకు కాలి పోతావు నువ్వు ఎందుకు రాలిపోతావు కాలకు రా నువ్వు రాలకు రా.. 
                                      
                                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి