- అఖిలపక్షం తర్వాత యూపీఏ నుంచి తెలంగాణకు మొదటి మద్దతు
- కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి
- ప్రభావం చూపనున్న కీలక భాగస్వామి నిర్ణయం
- ఇతర పార్టీలూ మద్దతుగా నిలిచే అవకాశం
తెలంగాణ ఏర్పాటుకు యూపీఏలో కీలక భాగస్వామి బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే మద్దతునిస్తామని స్పష్టం చేసింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటును తాము కోరుకుంటున్నామని బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మంగళవారం మరోమారు స్పష్టం చేశారు. తన యాభై ఏడో పుట్టినరోజును పురస్కరించుకుని ఢిల్లీలో ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే బీఎస్పీ ఎంపీలంతా మద్దతునిస్తారని తెలిపారు. చిన్న రాష్ట్రాలు, తెలంగాణ గురించి ఆమె వివరంగా మాట్లాడారు. ‘‘మా పార్టీ మొదటినుంచి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగానే ఉంది. చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండటం వల్లనే దేశంలో పరిపాలన క్షేత్ర స్థాయిలోకి వెళుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపాం. పశ్చిమ యూపీ, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, మధ్యాంచల్ ప్రాంతాలను రాష్ట్రాలుగా చేయాలని కేంద్రాన్ని కోరాం. ఆంధ్రప్రదేశ్ కూడా వైశాల్యంలో పెద్ద రాష్ట్రం. అక్కడ దశాబ్దాల కాలంగా స్వరాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. మేము గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపాం. ఇప్పుడు కూడా పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే మా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది’’ అని వివరించారు. ఈ సమావేశంలో ఆమె జాతీయ రాజకీయాలతో పాటు, ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు.
మాయావతి ప్రకటనతో కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి :
తెలంగాణపై అఖిలపక్ష సమావేశం తర్వాత జాతీయస్థాయిలో బీఎస్పీ మద్దతు ప్రకటించడం కొత్త పరిణామాలకు దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీఏలో కీలక భాగస్వామి అయిన ఈ పార్టీ సానుకూలంగా స్పందించడంతో కాంగ్రెస్‌పై ఒత్తిడి మరింత పెరుగుతుందనేది స్పష్టం. అలాగే ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రకటనకు మరికొద్ది రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో మాయావతి ప్రకటన తెలంగాణవాదుల్లో ఆనందాన్ని నింపింది. బీఎస్పీ మొదటినుంచి తెలంగాణకు మద్దతునిస్తున్నా.. ఈ సమయంలో ఇలా ప్రకటించడం ఎంతో కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. మాయావతి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీపైన మరింత ఒత్తిడి పెరిగినట్లయిందంటున్నారు. ఎప్పుడూ ఏదో వంక పెట్టి తప్పించుకుందామనుకునే కాంగ్రెస్ మాయావతి ప్రకటనను తేలికగా తీసుకునే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు.
ఆమె ప్రకటన యూపీఏలోని ఇతర భాగస్వామ్యపక్షాలపై కూడా ప్రభావం చూపుతుందని, పలు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా స్పందించే అవకాశముందని విశ్లేషకుల అంచనా. యూపీఏ భాగస్వామ్యపక్షాలైన ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీలకు కూడా తెలంగాణలో దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటాల పట్ల పూర్తి అవగాహన ఉందని, శరద్‌పవార్ లాంటి నాయకులు గతంలో తెలంగాణకు బహిరంగ మద్దతు తెలిపిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. మరోవైపు.. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ మూడు) ఉన్నందున ములాయంసింగ్ లాంటివారు వ్యతిరేకించినా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందంటున్నారు. అదే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కొనసాగుతున్నట్లు సమాచారం.
యు పీ ఏ లో మరో కీలక భాగస్వామి లాలూ ప్రసాద్ యాదవ్ గతం లోనే తెలంగాణకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసినదే...http://www.naatelangaana.blogspot.in/2011/11/blog-post_3237.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి