-ఖైదీ నంబర్ 7546
-22 వరకూ రిమాండ్
-ఆదిలాబాద్ కోర్టు ఆదేశం
- మొత్తం ఏడు సెక్షన్ల కింద అభియోగాలు
- హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించండి
- అక్బరుద్దీన్ తరపు న్యాయవాది పిటిషన్
- చెంచల్‌గూడ జైలుకు మార్చాలని వినతి
- రెండు పిటిషన్‌లనూ కొట్టేసిన మేజిస్ట్రేట్
- జిల్లా జైల్లోనే మెరుగైన వైద్యానికి ఆదేశాలు
- రాత్రంతా నిర్మల్ ఠాణాలోనే అక్బర్
- ఉదయం ఐదున్నరకు మేజిస్ట్రేట్ ముందుకు
- ఆయన ఆదేశాలతో ఏడున్నరకు జైలుకు
ఆదిలాబాద్, జనవరి 9 (టీ మీడియా): విద్వేష ఉపన్యాసాలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదిలాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలుకు బదులు అక్బర్ను ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అరెస్టు చేసిన అక్బరుద్దీన్‌ను అదే రోజు రాత్రి నిర్మల్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
రాత్రి స్టేషన్‌లోనే గడిపిన అక్బరుద్దీన్‌ను ఉదయం 5.15 గంటలకు జిల్లా అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అజేష్ కుమార్ ఎదుట ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ జనవరి 22 వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అక్బర్‌ను ఆదిలాబాద్ జిల్లా జైలు కు ఉదయం 7.30 గంటలకు తరలించారు. అక్కడ ఆయనకు అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ 7546ను కేటాయించారు. అంతకు ముందు ఆయనను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ జరుగనుంది. అక్బరుద్దీన్‌కు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రికి తరలించాలని వేసిన పిటిషన్‌తోపాటు.. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి చెంచల్‌గూడ జైలుకు తరలించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆయనకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని జిల్లా జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
తొలుత ఐపీసీలోని 121, 153-ఏ సెక్షన్ల కింద అక్బరుద్దీన్‌ను అరెస్టు చేసిన నిర్మల్ పోలీసులు.. విచారణ అనంతరం 120-బీ, 124-ఏ, 153-ఏ, 188,195-ఏ, 505 సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టారు. 120 సెక్షన్ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 121 ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం) 124-ఏ సెక్షన్ (దేశ ద్రోహం) కింద జీవితఖైదు పడే అవకాశముంది. 153-ఏ సెక్షన్ ప్రకారం.. మతం, జాతి, వర్గాలమధ్య శతృత్వం పెంచిన నేరం కింద ఐదేళ్ల జైలు శిక్షకు, సెక్షన్ 188 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వును ధిక్కరించిన నేరంకింద 6 నెలలు, 195 -ఏ సెక్షన్ ప్రకారం.. వేరే మతాన్ని బహిరంగంగా కించపరిచిన నేరం కింద మూడేళ్లు, సెక్షన్ 505 ప్రకా రం.. ప్రజలను దుశ్చర్యకు పాల్పడేటట్లు రెచ్చగొట్టే ప్రకటన చేసిన నేరం కింద మూడేళ్ల జైలు శిక్షలకు అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి.
అక్బర్‌కు 14రోజుల రిమాండ్ విధించిన వెంటనే నిర్మల్‌లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కవరేజీ కోసం వచ్చిన నేషనల్ చానళ్ల ఓబీ వ్యాన్‌లపై అల్లరిమూకలు రాళ్లతో దాడికి దిగాయి. వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తొలిరోజు ములాఖత్‌లో అక్బరుద్దీన్‌ను కలువడానికి నలుగురు సమీప బంధువులు, ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్, జిల్లా నాయకులు సిరాజ్ ఖాద్రి, ఫారుఖ్ హైమద్ జిల్లా జైలుకు వచ్చారు.
ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాకే అరెస్టు
అక్బర్‌పై ఎక్కువ కేసులు నమోదైనందున విచారణకు చాలా సమయం పడుతుందని, అందుకే ఏడురోజులు తమకు అప్పజెప్పాలంటూ పిటిషన్ వేశామని కరీంనగర్ రేంజ్ డీఐజీ రాథోడ్ భీమానాయక్ చెప్పారు. అక్బర్‌ను జిల్లా జైలుకు తరలించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఇతర పోలీసు అధికారులున్నారు.
కనిపించని బంద్ ప్రభావం
అక్బరుద్దీన్ అరెస్టును నిరసిస్తూ బుధవారం భైంసా బంద్‌కు ఎంఐఎం పిలుపునిస్తే, తమను అనవసరంగా అరెస్టు చేశారంటూ హిందూ వాహిని సభ్యులు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. భైంసాలో కొందరు మాత్రం స్వచ్ఛందంగా దుకాణాలు మూశారు.
రిమ్స్‌లో అక్బర్‌కు వైద్య చికిత్సలు
అనారోగ్యంతో ఉన్నానని అక్బర్ పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో ఆయనకు ఆదిలాబాద్ రిమ్స్‌లో వైద్యచికిత్సలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం ఓ ప్రత్యేక గదిలో అక్బర్‌కు చికిత్స అందించనున్నారు. ఇక్కడ బుధవారం నుంచే భద్రత ఏర్పాటు చేశారు.
వరంగల్ జిల్లాలో రెండు కేసులు
వరంగల్ లీగల్, జనగామ: అక్బరుద్దీన్‌పై కేసుల పరంపర ఆగలేదు. బుధవారం వరంగల్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. యూ ట్యూబ్‌లో ప్రసారమైన అక్బరుద్దీన్ ప్రసంగంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కాజీపేటకు చెందిన న్యాయవాది కొత్త రవి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన మేజిస్ట్రేట్ గోవిందడ్డి.. విచారణ జరపాలని కాజీపేట పోలీసులను ఆదేశించారు. ఇవే ఆరోపణలతో జనగామలో యంగ్‌ఫోర్స్ ఫర్ బెటర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కీసర దిలీప్‌డ్డి కోర్టును ఆశ్రయించారు.
కరీంనగర్‌లో ఎంఐఎం నేతల అరెస్టు
కరీంనగర్ క్రైం/కార్పొరేషన్: జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్‌లో ఎంఐఎం నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎంఐఎం కార్యకర్తలను చెదరగొట్టి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మరోవైపు నుంచి వచ్చిన ఎంఐఎం కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు వాహాజోద్దీన్, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్, మాజీ డిప్యూటీ మేయర్ షమీని అరెస్టు చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో తెలంగాణ చౌక్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల చొరవతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. గంగాధర మండలంలో ఎంఐఎం నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
బోధన్‌లో షాపులపై దాడులు
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఎంఐఎం బంద్ సందర్భంగా బుధవారం ఆందోళనకారులు షాపులపై దాడులు చేశారు. పలు దుకాణాలను ధ్వంసం చేశారు. వాటిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగాడ్డి పరిశీలించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి