- చంచల్‌గూడా జైల్లోనే మతవిద్వేషాల కుట్రకు వ్యూహరచన
- తెలంగాణ లెక్చరర్ల ఫోరం డైరీ ఆవిష్కరణ సభలో వక్తల హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 8 (టీ మీడియా): తెలంగాణను ఆరు దశాబ్దాలుగా అడ్డుకుంటున్న కాంగ్రెస్ మరోసారి ఆఖరి ప్రయత్నంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణను వాయిదా వేసేందుకు రాజకీయంగా కుట్రపన్నుతున్నదని తెలంగాణ జేఏసీ నేతలు, పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. ఈ కుట్రను రాజకీయంగానే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జనవరి 27 తర్వాత కూడా తెలంగాణను వాయిదావేసేందుకు ప్రయత్నిస్తే సీమాంధ్ర నాయకులు పాదయాత్రలను ముగించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తప్ప మరో ధ్యాస తెలంగాణ ప్రజలకు లేనేలేదని మంగళవారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ లెక్చరర్ల ఫోరం (టీఎల్‌ఎఫ్) డైరీ, క్యాలండర్ ఆవిష్కరణ సభలో వక్తలు స్పష్టం చేశారు.
టీఎల్‌ఎఫ్ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి అధ్యక్షత వహించిన సభలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ శాసనసభా పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, న్యూ డెమొక్రసీ నేత సూర్యం, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కే స్వామిగౌడ్, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ విఠల్, ఎంపీజే అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్, రసమయి బాలకిషన్, హైదరాబాద్ జేఏసీ కన్వీనర్ ఎంబీ కృష్ణయాదవ్, డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడు నర్సయ్య, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, ఇంజినీర్ జేఏసీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
సీమాంధ్ర వలస పాలకుల తాబేదార్లు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని, కచ్చితంగా ఇది రాజకీయ కుట్రనేనని జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ కుట్రపట్ల అప్రమత్తంగా ఉండాలని, కుట్రను రాజకీయంగా ఛేదించాలని కోరారు. తెలంగాణ సంఘటిత ఉద్యమశక్తిని చాటి చెప్పాలని, ఇందుకు తెలంగాణ లెక్చరర్లు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఒక పరిష్కార దశకు చేరుకునే ప్రతీ సందర్భంలో రాజకీయ దుర్మార్గాలు పెరుగుతున్నాయని, మతవిద్వేషాలు ఈ దుర్మార్గంలో భాగమేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కాకుండా మరే అస్పష్ట ప్రకటనలు చేసినా, తెలంగాణ సహించే స్థితిలో లేదని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేయాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమ పథం నుంచి బీజేపీ పక్కకు జరిగే ప్రసక్తి లేదని, మతవిద్వేషాల కుట్రలోభాగం కాకుండా జాగ్రత్త పడుతున్నామని యెండల లక్ష్మీనారాయణ చెప్పారు. ఎంపీజే అధ్యక్షుడు హమీద్ మహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ డిసెంబర్ 28, 2012 నుంచి జనవరి 8 వరకు మతఘర్షణలను పెంచేందుకు కుట్రలు జరిగాయని, ఈ కుట్రలో భాగంగానే అక్చరుద్దీన్ అరెస్టు డ్రామాను కిరణ్ సర్కార్ నడిపించిందని హెచ్చరించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ ఈ కుట్రలో పాత్రధారులేనని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఈ కుట్రలో భాగం కావద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని గంగాజమున తెహజీబ్‌లో విషం చిమ్ముతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చెంచల్‌గూడా జైల్లోనే మతవిద్వేషాల కుట్రలకు వ్యూహరచన జరిగిందని స్వామిగౌడ్ అన్నారు. అదృష్టవశాత్తు పాతబస్తీలో ఎలాంటి అల్లర్లు లేవని, తెలంగాణ ముస్లింలు, హిందువులు కలిసి తెలంగాణ జెండా నీడలో ఈ దుర్మార్గాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
మల్లెపలి లక్ష్మయ్య మాట్లాడుతూ చర్చించుకున్న విషయాలనే మళ్లీ మళ్లీ చర్చిస్తున్నామని, జేఏసీ సారథ్యంలో భారతదేశాన్ని ప్రభావితం చేసే ఒక బలమైన ఉద్యమానికి రచన జరుగాలని అభిప్రాయపడ్డారు. అద్దంకి దయాకర్ ప్రసంగిస్తూ ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తెలంగాణ ఉద్యమంలోకి రాకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, చిమ్ముతున్న విషమేఘాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని అన్నారు. వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగిస్తూ ప్రజలను రెచ్చగొ సీమాంధ్ర వలస పెత్తందార్లు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొ జేఏసీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. న్యూడెమొక్రసీ నేత సూర్యం ప్రసంగిస్తూ తెలంగాణ ప్రజల ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.పల్లె రవికుమార్ ప్రసంగిస్తూ కుట్రలను ఛేదించడానికి, తెలంగాణ తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. - from namaste telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి