హోం

20, జనవరి 2013, ఆదివారం

తెలంగాణా పోరాట యోధులు..

స్వామి రామానంద తీర్థ:

స్వామి రామానంద తీర్థ స్వాతంత్య్ర సమరయోధుడు. హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటుబడ్డ మహా నాయకులు. రామనంద తీర్థ 1903 అక్టోబర్ 3న గుల్బర్గా జిల్లా జాగిర్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సన్యాసం స్వీకరించడంతో బంధువుల ఔదార్యంతో విద్యాభ్యాసం కొనసాగించారు. 

రామానంద కమ్యూనిస్టు భావాలున్న హిందూ సన్యాసి. ఆయన అసలు పేరు వెంక భగవాన్‌రావు ఖెడ్గికర్. మొదట లోకమాన్య బాల గంగాధర తిలక్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే, గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. కార్మిక నాయకుడు ఎన్‌ఎం జోషితో కలసి కార్మికోద్యమంలో పాల్గొన్నారు. 

1938లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో తన శాఖను ప్రారంభించిన అనంతరం తీర్థ నిజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. విద్యాలయాలను నెలకొల్పడంతో పాటు ఆర్యసమాజ్‌తో కలసి ఉద్యమించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లోవిలీనం కావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. చివరకు 22 జనవరి 1972న రామానందతీర్థ శాశ్వతంగా కన్నుమూశారు. 

పండిట్ నరేంద్ర జీ:

పండిట్ నరేంద్ర జీ 1907 ఏప్రిల్ 10న హైదరాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే ఆర్యసమాజ్ పట్ల ఆకర్శితుడై సంస్థ ఉపాధ్యక్షునిగా సేవలందించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. హైదరాబాద్ ఉక్కుమనిషిగా ఈయనను పిలుస్తారు. 

1938లో నిజాం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు 3 సంవత్సరాలు మన్ననూరు జైలుకు వెళ్లవలసి వచ్చింది. జైలునుండి వచ్చాక వైదిక దర్శనం పేరుతో పత్రిక పెట్టి దాని ద్వారా నిజాం నిరంకుశత్వాన్ని తీవ్రంగా నిరసించారు. దీంతో నిజాం, పత్రిక మూత వేయడంతో పాటు ఆస్తులన్నీ జప్తు చేశాడు. అయినా ఆయన ఉద్యమాన్ని వదలలేదు. 

హైదరాబాద్ రాజ్యం విముక్తి కోసం తీవ్రంగా కృషి చేశారు. 1947లో మళ్లీ జైలుకు వెళ్లవలసి వచ్చింది. హైదరాబాద్ భారత యూనియన్‌లో కలిసిన తర్వాత నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నరేంద్రజీ పనిచేశాడు. 1952లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1975లో రాజకీయాలకు స్వస్తి చెప్పి సన్యాసం స్వీకరించాడు. 1976 సెప్టెంబర్ 24న ఆయన తుదిశ్వాస విడిచారు.

అమృతలాల్ శుక్లా:

కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన అమృతలాల్ శుక్లా తెలంగాణ సాయుధ పోరాటంలో మడమతిప్పని సేనాని. తన సాయుధ దళంతో నిజాం సైనికులను ముప్పుతిప్పలు పెట్టిన వీరుడు. తన దళంతో సిరిసిల్ల, ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్ క్యాంపులపై దాడులు చేసి నిర్భంధంలో ఉన్న వారిని విడుదల చేయించారు. హుజురాబాద్ తాలుకా పరిధిలోని సైదాపూర్, నిమ్మపల్లి తదితర ప్రాంతాల్లోని పోలీస్ క్యాంపులపై అక్కడి సమరయోధులు దాడులు చేశారు. నిజాం రాజ్యంలో ఇవి పెను సంచలనాన్ని సృష్టించాయి. అమృతలాల్ శుక్లా గెరిల్లా దళానికి నాయకునిగా వ్యవహరించారు. నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి 13 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా సికిందరబాద్ రైల్వేస్టేషన్ నుంచి తప్పించుకున్నారు. అలా అమృతలాల్ తిరిగి పోరాటంలో భాగస్వామి అయ్యారు.
ఉప్పల రామయ్య:

జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర వహించిన వారిలో నల్గొండ జిల్లా మునగాలకు చెందిన ఉప్పల రామయ్య ఒకరు. 1905లో జన్మించిన రామయ్య ఆనాటి మునగాల పరగణా జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1929లో పరగణా జమీందారు నాయని రంగారావు గ్రామానికి చెందిన ఇమ్మడి పాపయ్యతో పాటు మరి కొంతమంది రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారు. దీనికి నిరసనగా రామయ్య తొలిసారి సత్యక్షిగహం చేశారు. అయితే, నాటి బ్రిటీష్ ప్రభుత్వం రామయ్యతో పాటు రైతులపై కేసులు నమోదు చేసింది. రామయ్య విద్యాభివృద్ధికి కూడా ఎనలేని సేవ చేశారు. గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేశారు. 

సాయుధ పోరులో ఆరుట్ల, దేవులపల్లి వెంక కలసి పనిచేసిన రామయ్య సాయుధ దళాలకు మందుగుండు సరఫరా చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. నాటి ప్రభుత్వం ఆయనపై కేసులు బనాయించి జగ్గయ్యపేట జైలులో నిర్భంధించి కనీసం ఆహారం కూడా అందివ్వకపోవడంతో 1948 సెప్టెంబర్ నెలలో కన్నుమూశారు. స్థానిక విద్యార్థులు చందాలు వేసుకుని ఆయన దహన సంస్కారాలు నిర్వహించాల్సి రావడం పెద్ద విషాదం. ఆయన జ్ఞాపకార్థం మునగాలలో విగ్రహన్ని నెలకొల్పారు.

సర్వదేవభట్ల రామనాథం:


పుట్టింది జమీందారీ కుటుంబంలో అయినప్పటికీ నైజాం సర్కార్ రజాకార్లు సాగిస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ కమ్యూనిస్టు నాయకుడు సర్వదేవభట్ల రామనాథం. నిజాం పాలన, జమీందార్, జగీర్ధార్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరి ఉద్యమించారు. లక్షలాది రూపాయల విలువైన తమ ఆస్తిని, వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన గొప్ప త్యాగమూర్తి. పార్టీ కార్యక్షికమాలతో పాటు సింగరేణి కార్మికుల సమస్యల పట్ల రాజీలేని పోరాటాలు నిర్వహించిన యోధుడు. 
కార్మిక హక్కులకోసం పలువురు కమ్యూనిస్టు నాయకులతో కలసి ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్’ పేరుతో కార్మిక యూనియన్‌ను స్థాపించి ప్రప్రథమ అధ్యక్షునిగా 1945లో ఎన్నుకోబడ్డారు. 1947లో అరెస్ట్ కాబడి 1948 వరకు జైలు జీవితం గడిపారు. 1948 నుండి 1949 వరకు రహస్య జీవితం గడిపారు. ఆయన ఆదర్శ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తిదాత. తన యావదాస్తిని పేదలకు పంచి తనకంటూ ఏమీ లేకుండా తన చివరి ఊపిరి వరకు ప్రజల కోసం పనిచేసిన త్యాగశీలి. 
రాంజీగోండు:

అడవి బిడ్డలను దోచుకుంటున్న నిజాం ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఉద్యమం నెరపిన వీరుడు రాంజీగోండు. ఆయన ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సాయుధపోరాటానికి ఊపిరిలూదిన విప్లవసేనాని. నిర్మల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 

రాంజీగోండు నాయకత్వంలో గోండులు బ్రిటీష్ వారికి తొత్తులుగా ఉంటూ నైజాం సంస్థానాన్ని నడిపించిన వారిపై తిరగబడ్డారు. ‘జల్-జమీన్-జంగల్’ కోసం గిరిజనుల తరఫున పోరాడిన ఆయన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం. 

నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను 1880 ఏప్రిల్‌లో నాటి నైజాం ముష్కరులు రాంజీగోండుతో పాటు ఆయన వెయ్యిమంది అనుచరులను మర్రిచెట్టుకు సామూహికంగా ఉరి తీశారు. తరువాత ఆ మర్రినే ‘గోండ్ మర్రి’, ‘ఉరుల మర్రి’ అని పిలిచేవారు. ప్రస్తుతం ఆ చెట్టు లేదు. దాని స్థానంలో అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు.

టి.బి. విఠల్‌రావు:

ప్రపంచ కార్మికోద్యమంలో మిలిటెంట్ పోరాటాలను మిలితం చేసి అనేక హక్కులు సాధించుకున్న సింగరేణి కార్మికులకు తెలంగాణ సాయుధ పోరాటమే స్ఫూర్తినిచ్చింది. సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో సింగరేణిలో అనేక ఉద్యమాలు జరిగాయి. 

నిజాం నవాబుతో పాటు స్థానిక గ్రామీణ భూస్వాముల పెత్తనం కింద ఉన్న సింగరేణి సంస్థలో 1939 నుంచే ఉద్యమాలు మొదలయ్యాయి. తొలి తరం కార్మిక నాయకులలో టి.బి. విఠల్‌రావు ఒకరు. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు సింగరేణి కార్మిక హక్కుల కోసం ఉద్యమించిన నేత విఠల్‌రావు. పనిగంటల తగ్గింపు, పనికి తగిన వేతనం, కార్మికులకు వసతులు వంటి వాటికోసం ఆయన ఉద్యమించారు. రహస్య జీవితాన్ని గడుపుతూనే ఆయన కార్మిక హక్కుల కోసం ఉద్యమించారు. 


సింగరేణి తొలినాళ్లలో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా నిర్బంధాలను ఎదిరించిన నాయకుడిగా విఠల్‌రావును కార్మికులు గుర్తు చేసుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలోనే ఇటు సింగరేణి సంస్థలో కార్మిక హక్కుల కోసం పోరాడిన యోధుడాయన!

బత్తుల సాయన్న వెంకట్ రావు :

బత్తుల సాయన్న వెంకట్ రావు 1900 డిసెంబర్ 11న సికిందరబాద్‌లోని న్యూబోయిగూడలో సాయన్న, ముత్తమ్మలకు జన్మించారు. వెంకవూటావు ఎనిమిదవ తరగతి వరకు చదివినప్పటికీ, ఆయన సొంత ప్రతిభతో నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జోగిని వ్యవస్థను ప్రభుత్వం నిషేధించేటట్టు వెంకవూటావు చేయగలిగారు. ఆయన ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, మన్నసంఘం, స్వస్తదళ్ యువజన సంఘం, హైదరాబాద్ దళిత జాతి సంఘం, అరుంధతీయ యువజన సంఘం వంటి సంఘాలతో కలిసి పనిచేశారు. 

బొంబాయి మహర్ సదస్సుకు అధ్యక్షత వహించే అరుదైన గౌరవం ఆయనకు దక్కింది. ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ బి.ఎన్. వెంకవూటావుకు ‘వీరరత్న’, నిజాం ప్రభుత్వం ‘ఖుస్రూ-ఎ- దక్కన్’ అనే అరుదైన బిరుదులతో సన్మానించింది. 1947లో లాయక్ అలీ మంత్రివర్గంలో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన భారత మిలటరీ యాక్షన్‌లో గృహ నిర్బంధానికి గురయ్యారు. ఆ తర్వాత 1951లో ఇండిపెండెంట్‌గా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆల్వాల్ సమీపంలో తన స్థలాలను పేదలకు విరాళంగా ఇచ్చారు. 1953 నవంబర్ 4న ఆయన తనువు చాలించారు.

వానమామలై జగన్నాథచార్యులు:
‘రైతు వాల్మీకి’గా పేరుగాంచిన వానమామలై జగన్నాథచార్యులు శ్రీరాముణ్ని రైతుగా అభివర్ణిస్తూ ‘రైతు రామాయణం’అనే గొప్పకావ్యం రాశారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో 1908 డిసెంబర్ 19న సీతారామమ్మ, బక్కయ్యశాస్త్రీలకు మూడవ సంతానంగా జన్మించారు. వానమామలై వరదాచార్యులకు వీరు స్వయనా సోదరుడు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, తమిళం, ఇంగ్లీషులో ఆయనకు ప్రవేశం ఉంది. తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ హరికథలు చెబుతూ, పాటలు పాడుతూ నాటి పోరాట యోధులను ఉత్సాహ పరిచేవారు. నైజాం సర్కార్ నిర్భంధానికి గురి చేయడంతో మహారాష్ట్రలోని చాందకు వెళ్లి అజ్ఞాతవాసం గడిపారు. నాడు రైతులు అనుభవించిన బాధలు, అనుభవాలతో జగన్నాథచార్యులు ‘రైతు రామాయణం’ కావ్యం రచించారు. ఈ కావ్యం మొత్తం తెలంగాణ సంప్రదాయ రీతిలో కొనసాగింది. జిల్లాలోని జూలపల్లి వరాహస్వామిని కీర్తిస్తూ శతకాలు, 1968లో ఇల్లంతకుంట సీతారామస్వామి సుప్రభాతం రాయడంతో పాటు 1971లో గోదాదేవి రచించిన తిరుప్పావణిని తెలుగీకరించారు. ‘రైతు రామాయణ’ కావ్యానికి 1984లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
                                                                  -from namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి