హోం

1, జనవరి 2013, మంగళవారం

మధుగోపాల్ ఛాయచిత్రాలలో కాకతీయ వైభవం..!




మధుగోపాల్ బాల్యం అత్యంత సాదాసీదాగానే గడిచింది. గ్రామీణ భారతంలోని అనేక గ్రామాల్లో మాదిరే, ఖిలా వరంగల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక వాడకట్టు. అక్కడ జీవితం సర్వసాధారణం. దైనందిన జీవితంలో ఆశ్చర్యానికి గురిచేసేదేమీ ఉండదు. సహజమూ, అనివార్యమూ అయిన వివిధ కులవృత్తులతో కూడిన జీవన వ్యాపారం నిదానంగా సాగిపోతూ ఉంటుంది.

ఇవాళ ఎట్లుంటుందో రేపూ అలాగే ఉంటుంది. ఆ తర్వాతి రోజూ అలాగే ఉంటుంది. ఏదైనా కాస్త విశేషమూ అంటే అది పిల్లలకు బడే. అప్పుడప్పుడూ సినిమాలు. అంతే! ఎనభయ్యవ దశకంలో టీవీ ఇంకా దిగువ మధ్యతరగతి ఇండ్లలోకి రానందున మధుగోపాల్‌కు పెద్ద ఉత్సాహవంతమైనదేమీ కనిపించలేదు. అయితే, ఇంట్లో తన అన్నయ్య మొదట్లో పెయింటింగ్ చేసేవాడు. అటు తర్వాత ఫొటోక్షిగఫీలో నిమగ్నమయ్యాడు. అలాంటి వాతావరణంలో పదో తరగతి, ఇంటర్, పిమ్మట డిగ్రీ...మధ్యలో కొందరు ఎంసెట్ ఇంకొందరు బిఎడ్...ఇట్లా విద్యార్థుల చదువులు సాగేవి.

అయితే, అన్నయ్య పెయింటింగ్స్ చేస్తుంటే చూడటం, అలాగే తన 120 బాక్స్ కెమెరాలో ఫిల్మ్ లోడ్ చేయించుకుని సైకిల్ మీద కోటలోకి వెళ్లి ఆ శిథిలాలను ఫొటోలు తీయడం - ఇవి రెండే అతడి బాల్యంలోని మధుర జ్ఞాపకాలు.

అదృష్టవశాత్తూ మధుగోపాల్‌కు డిగ్రీ రెండో సంవత్సరంలో బాలాజీ అన్న మిత్రుడితో పరిచయం కలిగింది. బాలాజీ వాళ్లకు వరంగల్‌లో ‘జయ ఫొటో స్టూడియో’ ఉండేది. అతడి చొరవ కారణంగా మధుగోపాల్ జెఎన్‌టియులో చేరాడు. బాలాజీ అప్పటికే రెండుసార్లు ఫొటోక్షిగఫీలో డిప్లొమా చేయడానికి ఎంట్రెన్స్ టెస్ట్ రాశాడు. ఆ సంగతి తెలిసి ఈసారి ఇద్దరూ కల్సి రాశారు. 13వ ర్యాంకు వచ్చింది. కానీ, ఇంట్లో ఒప్పుకోలేదు. డిగ్రీ చదివే పిల్లగాడు ఇంటర్‌కి సమానమైన డిప్లొమాలో చేరుతానంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది! వద్దన్నారు. దాంతో పొద్దున్నే రైలెక్కి మిత్రుడితో కలిసి హైదరాబాద్ చేరుకుని ఫొటోక్షిగఫీ కోర్సులో జాయినైపోయాడు మధుగోపాల్. తర్వాత వాళ్లు ఒప్పుకున్నారు. అది వేరే విషయం.

అయితే, మధుగోపాల్ అన్నయ్య ఇప్పుడు ప్రసిద్ధ ఫొటోక్షిగాఫర్ ఐన రామ వీరేష్ బాబు. తన తమ్ముడి అభిలాషను అర్థం చేసుకున్నాడు. వద్దని వ్యతిరేకించలేదు. తమ్ముడి చదువుకు పూర్తి సహాయకారిగానూ ఉన్నాడు. అలా చదువు పూర్తయినాక కొన్నేళ్లు లెక్చరర్‌గా అటు తర్వాత దుబాయ్‌లో రెండేళ్లు ఫొటోక్షిగాఫర్‌గా పనిచేసి మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేశాడు మధుగోపాల్. అప్పట్నుంచి అంటే 2001 నుంచి ఇప్పటి దాకా అతడు ఫొటోక్షిగఫీనే జీవికగాను, జీవితంగానూ చేసుకుని పనిచేస్తున్నాడు.


సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వారు కళా జీవితంలో నిమగ్నమైతే వారెన్నో ప్రయోగాలు చేయడానికీ వీలుంటుంది. ఆ అదృష్టం తనకు దక్కలేదని తీరిగ్గానే మధుగోపాల్‌కు అర్థమైంది. అవును మరి. సాంకేతికంగా కెమెరా కళలో అనేక ప్రయోగాలు చేయాలనుకున్నాడు. అందుకోసం అమెరికా వెళ్లి ఎంఎఫ్‌ఎ చేయాలని ప్రిపేర్ అయ్యాడు. (అప్పట్లో ఎంఎఫ్‌ఎ మన దగ్గర లేదు.) చివరి నిమిషం దాకా ప్రయత్నించాడు. కానీ, కుదరలేదు.

వీసా తిరస్కారంతో ఇక తాను ఇక్కడే ఉండి తన కళను సాధన చేయాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ‘‘అది ఒక విధంగా నయమే అయింది’’ అన్నాడాయన. నిజమే. సాంకేతికత స్థానాన సౌందర్యం పట్ల, స్థానిక విషయాల డాక్యుమెం పట్ల ఆసక్తి తనలో ద్విగుణీకృతమైంది ఇందువల్లే. అతడు తన పనిని మూడు విధాలుగా విడగొట్టుకోవలసి వచ్చింది కూడా. ఒకటి, కమర్షియల్ పనులు. రెండు, డాక్యుమెం మూడు, లాంగ్‌టర్మ్ ప్రాజెక్టులు. ‘‘ఇందులో మొదటి రెండూ నాకు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చే పనులుకాగా, చివరిదైన ‘లాంగ్‌టర్మ్ ప్రాజెక్టులు’ ఆత్మతృప్తిని మిగిల్చేవి’’ అంటారాయన. అయితే, ఆ చివరి రెండూ కూడా ఫొటోక్షిగాఫర్‌గా అతడిని తెలంగాణ భూమి పుత్రిడిగా నిలిపేవే కావడం యాధృచ్చికం కాదేమో!



అవును మరి. అతడిది ఓరుగల్లు. రెండవది అతడు ఎదిగి వచ్చే సమయానికి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష తీవ్రమైంది. అందువల్లే 2001 నుంచి ఆయన తన మూలాలవైపు దృష్టి మరల్చాడు. మలి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటినుంచీ ఉద్యమాన్ని డాక్యుమెంట్ చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో మూడు లక్షల విలువైన కెమెరాను ‘సాగర హారం’ సమయంలో, అతడెవరో తెలియక పగలగొట్టారు. అయినా, తాను నిరాశకు గురికాలేదు. పని చేస్తూనే ఉన్నాడు. ఇక రెండవది, కాకతీయ శిల్పకళపై ఆయన చేస్తున్న ఫొటోక్షిగఫీ లేదంటే ప్రస్తుతం ఎత్తుకున్న వ్యాసం.

కాకతీయ శిల్పంపై ఆయన చేసిన ఫొటోక్షిగఫీ ఒక చూడముచ్చట. నిజానికి ఛాయచిత్ర రచనలో శిల్పం ఎప్పుడూ మానవుడికి సవాల్ విసురుతూనే ఉంటుంది. చరిత్ర పట్ల అవగాహన ఒక్కటే మంచి ఫొటోక్షిగాఫర్‌ను చేయదు కూడా. అయినా ప్రతి ఫొటోక్షిగాఫర్ మార్మికమైన వెలుగునీడలతో శిల్పాన్ని తదేకంగా ధ్యానిస్తూనే ఉంటాడు. అయితే ఒక్కో ఫొటోక్షిగాఫర్‌కు ఒక్కో దశలో కొన్ని మెలకువలు పట్టుబడతాయి. తనవైన పద్ధతులు అవలంభిస్తాడు. ఒక్కోసారి తనకూ శిల్పకళకూ సమన్వయం కుదిరే అంశాలతో భేటీ అవుతాడు. లేకపోయినా కొనసాగుతాడు. 

అయితే, మధుగోపాల్‌కు కాకతీయ శిల్పంపై పని చేయడానికి బాల్యంలో అక్కడ ఆడ్డుకున్న వైనం ఒక ముచ్చటైన తోడు ఒకటైతే, ఎదిగిన తర్వాత ఒక భూమి పుత్రుడిగా అక్కడి కళను భవిష్యత్తరాల కోసం భద్రపర్చాలన్న ఆకాంక్ష రెండవ అంశంగా తోడైంది. అయితే, అతడు కాకతీయ శిల్పంపై చిన్నప్పుడు అన్నయ్య కెమెరాతో ఫొటోక్షిగఫీ చేశాడు. కానీ, అవి బాగా రాలేదు. పెద్దయ్యాక తీసినవి బాగా వచ్చాయా అంటే ఒక దశ దాకా రాలేదనే చెప్పాలి. 2005లో జూన్ మాసంలో... తొలకరి వచ్చిన పిదప ఒక అద్భుతం జరిగింది.

‘‘అప్పుడే వర్షం కురిసి వెలిసింది. నేను కెమెరా పట్టుకుని కోటలో తిరుగుతూ ఉన్నాను. సమయం నాలుగవుతోంది. అప్పటిదాకా పనిచేయడం వల్ల అలసిపోయి ఒక పొడవాటి స్తంభం దగ్గర విశ్రాంతికోసం ఒరిగాను. కాసేపటి తర్వాత తలెత్తి చూస్తే, ఆ స్తంభం ఒక కాగడా మాదిరిగా వెలుగుతూ ఉంది. అది కలా నిజమా! అన్న భ్రాంతికి లోనయ్యాను. పైన ఆకాశంలోని మబ్బులన్నీ ఆ కాగడా నుంచి జ్వలిస్తున్న మంటల్లా కానవచ్చాయి. ఆశ్చర్యంతో లేచి నిలబడి చూట్టూ చూశాను. ఆ సరికొత్త వాతావరణానికి షాక్ అయ్యాననే చెప్పాలి’’ అని గుర్తు చేసుకున్నాడు మధుగోపాల్.


చుట్టు ముట్టూ ఉన్న శిల్పాలు, ఆ శిథిలాలూ, కాకతీయ తోరణాలు అన్నీ కూడా ఆకాశాన్ని కాన్వాసుగా చేసుకున్న పెయింటింగుల మాదిరి సరికొత్త శోభతో వెలిగిపోతూ ఆహ్లాదంగా అమోఘంగా కానవస్తుంటే అతడు విభ్రమానికి లోనై చూడసాగాడట. అప్పడర్థమైంది. శిల్పం అంటే స్థలం మాత్రమే కాదు, కాలం కూడా అని. తగిన వాతావరణంలో శిల్పం అసామాన్య వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే, భారతీయ శిల్పం సాధారణంగా ఓపెన్‌గా ఉంటుంది. ఏ శిల్పమైనా మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది తప్ప యురోపియన్ శిల్పం మాదిరి మనల్ని కేవలం ఆశ్చర్యపరిచేలా ఉండదు. ‘‘చూస్తుంటే శిల్పం నన్ను సరికొత్తగా ఆహ్వానించింది. ఇక నిదానంగా ఆ కోటలో తిరగసాగాను’’ అన్నాడు.

ఒక్కొక్క శిల్పం తన రహస్యాలను చూపుతుంటే మధుగోపాల్ అప్పుడే కళ్లు తెరుచుకున్న బాలుడిలా తల్లిని తదేకంగా చూస్తున్నట్టు ఆ కాకతీయ వైభవాన్ని ఆ రోజు తనవితీరా ఆస్వాదించాడు. ఇక మెల్లగా కెమెరాను సరిచేసుకున్నాడు.

సంగతి అర్థమైన కొద్దీ ఇక శిల్పాన్ని కేవలం శిల్పం మేరకే కాకుండా దూరంగా నిలబడి చూడటం మొదపూట్టాడు మధుగోపాల్. ఈసారి ప్రకృతిలో అత్యంత అపూర్వంగా సృజించిన కాకతీయ వైభవం తాలూకు రహస్యాలను ఆయన మళ్లీ అనుభవించడం ప్రారంభించాడు. ‘‘ఒక రకంగా పరుసవేదినే అయ్యాను. బంగారం తయారీకి సంబంధించిన రహస్యం దొరికినంత ఆనంద పరవశుడినయ్యాను’’ అంటాడు మధుగోపాల్.

‘‘పంచభూతాలు నన్ను ఆశీర్వదించాయనే చెప్పాలి. ఇక ఆ శిల్పం నీటితో కడిగి, ముత్యంలా మెరిసే సమయం కోసం వేచి చూడటం అర్థమైంది. అంటే నీటి మహిమ తెలిసింది. చల్లటి గాలి వీస్తుండగా అలాగే ఒక్కొక్కసారి ఈదురుగాలి వీస్తుంటే వాటినుంచి శిల్పాన్ని చూడటమూ తెలుసుకున్నాను. అలా గాలి మహత్తు తెలిసింది. శరీరాన్ని హాయిగా మారుస్తున్న గాలి నుంచి, కురిసి వెలిసిన వర్షం నుంచి ఆయా శిల్ప పరిసరాలు సంతరించుకుంటున్న రూపురేఖలను చూడటం మొదలైంది. ఆ రోజు తర్వాతి రోజు...మరునాడు...ఇక నా అన్వేషణ అలా కొనసాగింది. అప్పటిదాకా వెలుగునీడల గురించి మాత్రమే గమనింపు ఉండేది. అటు పిమ్మట ఆ వెలుతురులో ఒక్కోసారి నిప్పులా మండిపోతున్న శిల్పాలను, ఆ శిల్పాల కింద గాఢంగా ఉన్న మట్టినీ గమనించసాగాను.

ఇలా తల వంచి పుడమినీ, తలెత్తి ఆకాశాన్ని మధ్యలో కాకతీయ శిల్పకళా వైభవాన్ని పంచభూతాల సాక్షిగా ఫీలయ్యానని మధుగోపాల్ చెబుతుంటే, నిజంగానే ఆయన అదృష్టవంతడనే అనిపించింది. ఎందుకంటే, ఆయన తాను అనుభూతికి లోనైన స్థితిని కెమెరా కంటితో కూడా బంధించాడు. ఆ అద్భుత చిత్రాలను మనమూ చూసే వీలూ కల్పించాడు.
ఇలా వేల ఏళ్ల కిందటి చరివూతను, ఆనాడు జనించిన శిల్ప లావణ్యాన్ని, ఒకానొక ఆధ్యాత్మిక స్థితిలో దర్శిస్తున్నట్టు సందర్శించానని మధుగోపాల్ చెప్పారు. ‘‘ఇదీ అసలైన మేలుకొలుపు’’ అంటారాయన. అంతకుముందు ఎన్నోసార్లు ఫొటోలు తీశాను. 

కానీ, అవన్నీ వీటిముందు ఇక దిగదుడుపే’’ అని అప్పుడే అనుకున్నాడట. అలా, అనాటినుంచి మధుగోపాల్ కాకతీయ శిల్ప విన్యాసాన్ని అపూర్వంగా ఆవిష్కరించసాగాడు. వేర్వేరు రుతువుల్లో ఆ శిల్ప సముచ్ఛయాన్ని బంధించ సాగాడు. అయితే, ఇదంతా తనకు పొటోక్షిగఫీలో ఒక జీవిత కాలం పాఠాన్ని బోధిస్తుండగా అతడికి విజయనగర వైభవాన్ని ఫొటోక్షిగఫీ చేసే అవకాశం రావడం, యాధృచ్చికమే అయినా అదీ ఇందులోంచి జనించిన వరంగానే అనిపిస్తుంది!

విజయనగరం శిల్పకళా వైభవాన్ని వందేళ్ల క్రితం Alexander Green Law ఫొటొక్షిగఫీలో బంధించాడు. 1983లో సరిగ్గా అయన ఎక్కడ నిలబడి ఎలా వేటినైతే చిత్రీకరించాడో అలాగే John Gollings అనే మరో ఫొటోక్షిగాఫరూ చిత్రీకరించాడు.



ఆ పుస్తకం అనుకోకుండా తనకు దొరికింది. అదృష్టవశాత్తూ తానూ సరిగ్గా ఆయా చిత్రాలను మళ్లీ అవే స్థలాల్లోకి వెళ్లి రంగుల్లో చిత్రీకరించే అవకాశం లభించింది. అలెగ్జాండర్ తీసిన అప్పటి నలుపు తెలుపు చిత్రాలు, తాను రంగుల్లో తీసిన చిత్రాలు- రెండింటినీ కలిపి 2008లో ఢిల్లీలో సుప్రసిద్ధ ఫొటోక్షిగఫీ క్యూరేటర్ ఇబ్రహీం అల్కాజీ గొప్ప ఫొటోక్షిగఫీ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన వల్ల మధుగోపాల్ పనితనం కూడా దేశవ్యాప్తంగా రఘురాయ్ వంటి సుప్రసిద్ధ ఫొటోక్షిగాఫర్ల మెప్పు పొందేలా చేసింది. అయితే, ఎగ్జిబిషన్ సందర్భంగానే, అలెగ్జాండర్ గ్రీన్ చిత్రించిన విజయనగర వైభవాన్ని Splendour in ruins పేరిట ఒక పుస్తకంగా తెచ్చారు. ఆ పుస్తకం చూడగానే మధుగోపాల్‌కు తళుక్కున తన ఏకశిళా నగరం... మహత్తరమైన కాకతీయ వైభవం కళ్లలో మరోసారి మెదిలింది.

‘శిథిలమౌతున్న వైభవం’ లేదా Splendour in ruins అనగానే తన జీవితంలో ఒకానొక భాగమైన ‘కాకతీయ శిల్పాలన్నీ గుర్తొచ్చాయి. ‘‘ఆ టైటిల్ విజయనగరానికి కాదు, నిజానికి శిథిలావస్థలోఉన్న మన కాకతీయ వైభవానికి, తెలంగాణకు సరిగ్గా నప్పుతుందని అప్పుడే అనుకున్నాను. ఇక అప్పట్నుంచే అదే పేరుతో కాకతీయుల శిల్పకళా వైభవాన్ని పుస్తకంగా తేవాలన్న సంకల్పం నాలో స్థిరపడింది. నాటినుంచీ కాకతీయల చరివూతపై వచ్చిన పుస్తకాలన్నిటినీ లోతుగా అధ్యయనం చేశాను. కొన్ని వందల సార్లు ఆయా స్థలాలను సందర్శించాను. అలా ఇటు చారివూతక అవసరాన్ని అటు పంచ భూతాల్లో ఒక అలౌకికంగా కానవచ్చే శిల్పాన్ని నిరంతరాయంగా ఫొటోక్షిగఫీ చేస్తున్నాను’’ అని మధుగోపాల్ వివరించారు.

చిత్రమేమిటంటే, అలెగ్జాండర్ గ్రీన్ నిలబడ్డ చోటునుంచే తానూ విజయనగరాన్ని చిత్రీకరించిన మధుగోపాల్ మరో విషయాన్నీ అందిపుచ్చుకున్నాడు. అది మన ‘రాజా దీనదయాల్’ ఫొటోక్షిగఫి. అవును. ఆ మహానుభావుడు తీసిన ఫొటోలనూ అధ్యయనం చేశాడు. మళ్లీ అతడు తీసిన పరిసరాల వద్దకు వెళ్లి సరికొత్తగా ఆ ప్రదేశాలను ఫొటోక్షిగఫి చేయసాగాడు. ‘‘అలా హైదరాబాద్ మీద కూడా పనిచేస్తున్నాను’’ అని వివరించారు మధుగోపాల్. ‘‘అదేమిటోగానీ - గత వైభవాన్ని, ప్రదేశాలను, పరిసరాలను అపూర్వంగా చిత్రీకరించే అవకాశం నాకు తెలియకుండానే, యాధృచ్చికంగానే లభిస్తూ వస్తోంది. ఆ లెక్కన నేను అదృష్టవంతుడినే’’ అన్నారాయన. నిజమే. అతడు నాలుగేళ్ల క్రితం వరదలు సంభవించినప్పుడు ఆలంపూరు దేవాలయం, ఆ గ్రామ పరిసరాలను, అక్కడి విధ్వంస చరివూతనూ అమిత శ్రద్ధతో చిత్రీకరించాడు.

‘‘కానీ, నాకొక్కటే అనిపిస్తుంది’’ అన్నారు చివరగా. ‘‘ నేను పుట్టి పెరిగిన స్థలంలో ఒక గొప్ప రాజవంశం వారు అపూర్వంగా ఒక రాజ్యాన్నే ఏలారని, వారిది అద్భుతమైన పరిపాలన అని నాకు ఇంత ఆలస్యంగా తెల్సిందేమిటా? అని ఆశ్చర్యపోతుంటాను. ఇలా ఎందుకు జరిగింది? అని విచారిస్తూ ఉంటాను?’ అన్నారాయన. 


‘‘నిన్న మొన్నటి నిజామ్స్ గురించి తెలుసు. కానీ, మనం అంతకు ముందరి చరివూతను ఎందుకు పట్టించుకోలేదని పదే పదే ఆలోచిస్తుంటాను’’ అని కూడా అన్నారాయన. ‘‘ఈ ప్రశ్నలకు జవాబుగానే ఆయన తన పనిని మలుచుకుంటున్నట్టుగా చెప్పాడు కూడా. ‘‘నా మాదిరిగా చారివూతక విషయాల పట్ల అలక్ష్యంగా కొత్త తరం పెరగవద్దనే భావిస్తున్నాను. అందుకే నా వంతుగా నేను మన వైభవాన్ని అర్థం చేసుకొని, పదిల పరిచే పనిలో ఉన్నాను. దీన్ని వెంటనే నలుగురికీ చూపించాలన్నా, పుస్తకంగా ప్రచురించాలన్నా నా ఒక్కడితో కాదు. అందుకే ఇలాంటి పనులన్నీ ‘లాంగ్ టర్మ్’ పనులుగా పెట్టుకున్నాను. నిశ్శబ్దంగా పని చేసుకుంటున్నాను’’ అని వివరించారాయన. ‘‘ఎవరు ముందుకు వచ్చినా, రాకున్నా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను’’ అని ముగించారాయన.
జనవరిలో తెలంగాణ చిత్రాల ప్రదర్శణ

కొత్త సంవత్సరంలో జనవరి 3 నుంచి ముంబైలోని నారీమన్ పాయింట్‌లో ఉన్న ‘సెంటర్ ఫర్ ఫొటోక్షిగఫీ యాజ్ ఆర్ట్ ఫాం -పిరామల్ ఆర్ట్ గ్యాలరీ’లో తెలంగాణలో జరిగే పండుగలు, జాతర్లపై మధుగోపాల్ ‘ఫేసెస్ ఆఫ్ ఫేత్’ పేరిట ఛాయచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఇంతకన్నా ముందే, కాకతీయ శిల్పంపై ఆయన ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ, కలెక్టర్ చైర్మెన్‌గా ఉన్న కాకతీయ ఉత్సవ కమిటీ ఆయన ప్రతిపాదనను ఆచరణలోకి తేనేలేదు. అయితే, 2009లో ఆయన ‘పోయెట్రీ ఇన్ స్టోన్’ పేరిట విజయనగర శిల్పం, అలాగే కాకతీయ శిల్పంపై తాను తీసిన ఛాయచివూతాలు కొన్నింటిని ప్రదర్శించారు. కానీ, ఏడాది పొడవునా ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్బంలో అతడి కళను నలుగురు చూడవలసే ఉంది.

‘‘ఇలా వేల ఏళ్ల కిందటి చరివూతను, ఆనాడు జనించిన శిల్ప లావణ్యాన్ని, ఒకానొక ఆధ్యాత్మిక స్థితిలో దర్శిస్తున్నట్టు సందర్శించానని మధుగోపాల్ చెప్పారు. ‘‘ఇదీ అసలైన మేలుకొలుపు’’ అంటారాయన.’’
- కందుకూరి రమేష్ బాబు
మధుగోపాల్ మొబైల్: 93911 49981
from namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి