హోం

16, డిసెంబర్ 2012, ఆదివారం

తెలంగాణ కోసం.. ఇజ్జతుంటే ఒకే జెండా !


జగమెరిగిన కళాకారుడిని ఇక్కడ పరిచయం చేయడం చంద్రుడిని అద్దంలో చూపించడం లాంటిదే!
యూట్యూబ్, ఫేస్‌బుక్‌లే ఉచ్వాసనిశ్వాసలుగా ఉన్న ఈ తరానికి ఒగ్గుకథకే ఓనమాలు నేర్పిన గొప్ప కళాకారుడు చుక్క సత్తయ్యను చూపించాలంటే ఈ శీర్షికను అద్దంగా మార్చుకోక తప్ప ఆయన శ్వాస యూట్యూబ్‌కి చిక్కలేదు... ఆయన ఉనికిని ఫేస్‌బుక్ పేజ్ ట్రేస్ చేయలేదు..
అందుకే చుక్క సత్తయ్య అద్దంలాంటి మనసుకు ఈ వారం లోపలి మనిషి ప్రతిబింబంగా మారింది!
చౌదరపల్లి సత్తయ్య మెరుపు అభినయానికి ముచ్చటపడ్డ ఓ పెద్దమనిషి ఆయనను ‘చుక్క సత్తయ్య’గా మార్చేశాడు! ప్రతిభను ఇంటిపేరుగా నిలుపుకున్న అతికొద్దిమందిలో ఈ అద్భుత కళాకారుడు ముందుంటాడు! 


నాకు ఊహ తెలిసేనాటికే మా నాన్న(ఆగయ్య) చనిపోయిండు. అయినా మా అమ్మ(సాయమ్మ) మమ్మల్ని దొరలను సాదినట్టు సాదింది. నాకు ఓ అన్న ఉండె. మాది వ్యవసాయ కుటుంబం. మూడువందల గొర్రెలు, వంద మేకలుండె. నాకు ఐదేండ్లప్పటి నుంచే పశువులను కాయడానికి వెళ్లేవాడిని. పైసలున్నా జీతగాళ్లు దొరకక మమ్మల్ని పశువుల కాడికి పంపిడ్రు. ఆ తర్వాత ఓ యేడాది కళ్లెం (మాణిక్యపురానికి కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామం) నిజాం సర్కారు బడికి పంపిండ్రు. ఒంట్లు, ఓనమాలు నేర్చుకున్న. అప్పుడే ఇక్కడ స్వతంత్య్ర పోరాటం ఉధృతమైంది. పెద్ద పెద్ద వాళ్ళంతా జెండాలు పట్టుకుని సత్యాక్షిగహంలో తిరుగుతున్నారు. మాకు పేలాల ముద్ద కొనిస్తే అది తీసుకుని ఓ చేత్తో జెండా పట్టుకుని వాళ్ల తిరిగినం. పిల్లలం కదా... క్విట్ ఇండియా అనరాకపోయేది. గాంధీ మహాత్ముడికి జై అంటూ తిరిగే వాళ్లం. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది.. నాకు పెళ్లయింది. ఆ తర్వాత ఎనిమిది నెలలకు ఇక్కడ కమ్యూనిస్ట్ పోరాటం మొదలైంది. అప్పుడు నాకు పదహారేండ్లుండొచ్చు. కమ్యూనిస్టులకు పాలు, పొగాకుచుట్టలు, చార్మినార్ సిగట్లు తీస్కపోయి ఇచ్చేటోడిని. వాటికి పైసలిచ్చేటోళ్లు. పోలీస్ యాక్షన్ అప్పుడు జనగాంలో దోపిడైంది. నేను కూడా వెళ్లిన. రెండు మంకీ టోపీలు, రెండు చిన్న చిన్న స్వెట్టర్లు, జంగంబజార్ చెప్పుల జోళ్లు దొరికినయ్. ఇవన్నీ అయినాంక ఒకదిక్కు వ్యవసాయం పనిచేసుకుంట ఇంకోదిక్కు బొంబై నారాయణ అనే వ్యక్తి దగ్గర ఎంతోకొంత చదువు నేర్చుకున్న. 
jaipalసారంగధర..
తీగరాజు పల్లె (వరంగల్ జిల్లా)నుంచి యాదగిరి అనే సార్ వచ్చిండు మా ఊరికి (వరంగల్ జిల్లా, లింగాల ఘణపురం మండలం, మాణిక్యపురం). ఆయన దగ్గర నరసింహ శతకం నేర్చుకున్న. దాని మహత్యం చాలా గొప్పది. అందులోని యాభై పద్యాలు ఇప్పటికీ నోటికొస్తయ్. జ్ఞానబోధ, జొన్న ఎల్లయ్య రాసిన గురుబోధను కూడా ఆ పంతులుతో చెప్పించుకున్న. ఆ టైమ్‌లోనే మా ఊళ్లో చిరుతల రామాయణం నాటకం రిహార్సల్స్ అయితున్నయ్. హనుమంతుడి పాత్రకు ఎవరూ సూట్ అయితలేరు. ‘ఈ పిలగాడైతే మంచిగుంటడ’ని నన్ను పిలిచి వేయమన్నరు. ఆ పాత్రకోసం నాకు నేనే ట్రైన్ చేసుకున్న. మంచి పేరొచ్చింది. ఇగదాని తర్వాత నేనే పంతులునైన. శ్రీకృష్ణరాయబారం నాటకం వేద్దామని అందరికీ నేర్పి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మాలోమాకే కొట్లాటలైనయ్. అంతకుముందు పంతులుకేమో సేరు బియ్యం, నెలకు రూపాయి ఇచ్చేటోళ్లు. నాకేమీ ఇయ్యమన్నరు. ఏమీ ఇయ్యనిదానికి ఎందుకింత కష్టపడుడు అని ఆపేసిన. ఎన్టీరామారావు పౌరాణిక సినిమాలన్నీ చూసేవాడిని.

సారంగధర సినిమా అంటే చాలా ఇష్టం. మోటకొ నిద్ర ఆపుకోవడానికి సారంగధర సినిమాలోని ప్రతి డైలాగుని గుర్తు తెచ్చుకుని ప్రాక్టీస్ చేస్తుంటి. అప్పుడే మా ఊళ్లో ఓ కుర్మాయన, చాకలాయిన కలిసి సారంగధర కథ చెప్తున్నరు. వాళ్లకు చెప్పస్తలేదు. ఓ గొల్లాయిన ‘బిడ్డా నీకు బాగా ప్రాక్టీస్ ఉంది కదా... నువ్ చెప్పు’ అన్నడు. చెప్పేసిన నవరసాలు పలికిస్తూ! మూడు రూపాయలు ఇచ్చిండ్రు. 25 మంది కలిసి నెలరోజు ఆడితే బారాణ వచ్చేది. నేనొక్కడినే ఒక్కరోజు కథ చెప్తే మూడు రూపాయలు ఇచ్చిండ్రు.. ఇదేదో మంచిగుంది అనుకున్న. చిన్న భిక్షపతి, కడగంజి భిక్షపతి, చాకలి చంద్రయ్య.. వీళ్లను పట్టుకున్న. డోలు చేయించిన. ఇగ ఒగ్గు కథలు చెప్పుడు మొదలుపెట్టిన. ఎర్రగొల్ల లక్కమ్మ కథ, లక్కగుర్రం చంద్రావతి, కీలుగుర్రం దేశపతిరాజు కథలు, బీరప్ప కథ, మల్లన్న కథ, ఎల్లమ్మ కథ అన్నీ చెప్తుంటిని. బజార్లలో చెప్పుడు కూడా మొదలుపెట్టిన. 
abdulరాత్రి కథ...పొద్దున పొలం
మా అన్న మా ఊర్లో పెద్ద మనిషి. పంచాయితీలు చెప్పేటోడు. ఆయనలేంది ఏ పంచాయితీ జరిగేది కాదు. అసుంటాయనకు నేను బజార్ల కథ చెప్పుడు నచ్చకపోయేది. నా ఇజ్జత్‌దీస్తున్నవని కోపం చేస్తుండే. కథ చెప్పద్దనేది. పగటి పూటైతే ఆయనకు తెలుస్తదని రాత్రికి పోయి చెప్పేటోడిని. రాత్రి కథ చెప్పి వచ్చి పొద్దున పొలం పనులు చూసుకునేటోడిని. పెంబర్తి లాంటి చోట కథకు పదిరూపాయలు ఇచ్చేటోళ్లు. చుట్టుపక్కల ఊళ్లల్లో నా పేరు అందరికీ తెలిసిపోయింది. ఇగ జనగాంలో చెప్పుడు స్టార్ట్ చేసిన. అప్పటికే అది పెద్ద పట్టణం. కథకు పన్నెండు రూపాయలు ధర పెట్టిన. జనగాం నుంచి మాఊరు ఏడుకిలోమీటర్లు. రాత్రంతా కథ చెప్పి తెల్లవారు జాము నాలుగు గంటలకు బయలుదేరి మాఊరికి వస్తుంటి. నిద్ర ఉండకపోయేది. అట్లా గడిచిపోతున్నప్పుడే మా పశువులు పక్కవాళ్ల చేన్లలో పడి చేన్లు పాడుచేస్తున్నయని వాళ్లు పెద్ద గొడవ చేసిండ్రు. విసుగొచ్చింది. 

బండి కట్టుకుని గుట్టకు పోయి రాయంత పెకిలించి తెచ్చిన. ఓ మనిషిని పట్టుకుని ఒక్కడినే పొద్దుందాక, తెల్లందాక... బాయి చుట్టూ రాళ్లదొడ్డి పెట్టిన. అందుకే ఇప్పుడు వెన్ను బొక్కలన్నీ అరిగి ఇరవై నాలుగ్గంటలూ నొప్పి పెడ్తయి. ఇట్లా పొలం పని, అటు కథ... ఇవన్నీ తెలిసిన మా అన్న యాష్టకొచ్చి ఇగ చెప్తే వినడని ఊరుకున్నడు. నేను జనగాంలో కథ చెప్తున్నప్పుడే మా అమ్మ కాలు ఫ్రాక్చర్ అయింది. ఇటు వ్యవసాయం కుంటు పడింది. అటు నా కథా అంతగా నడవ జీతగాళ్ల జీతానికి కూడా పైసపూల్లని కాలమొచ్చింది. అమ్మను జనగాం హాస్పిటల్లో చూపిస్తే హన్మకొండ తీస్కపొమ్మన్నరు. అంతదూరం.. ఎవరు తీస్కపోవాల.. అక్కడ ఓ మున్నూరు కాపువాళ్లది ఓ హొటల్ ఉండే. నేను వాళ్ల హోటల్ ముందు కథ చెప్తే వాళ్లకు గిరాకీ బాగా వచ్చేది. ఆ అమ్మ..‘నువ్ పోతే హోటల్ గిరాకి దెబ్బతింటది. మీ అమ్మను మా ఇంట్లో ఉంచుకుని వైద్యం చేయిస్తా. నువ్ ఎప్పటిలాగే మా హోటల్ ముందు కథ చెప్పు’ అన్నది. అన్నట్లుగానే నెల రోజులు వాళ్లింట్లో పెట్టుకుని చూసుకుంది. అమ్మ మంచిగై ఇంటికొచ్చింది. కానీ.. తిండికెట్లా? అటు కాలం లేకపాయే ఇటు కథలు నడవకపాయే! ఆలోచించిన. నాలుగు తులాల బంగారం అమ్మి ఇంట్లకి కావల్సిన గ్రాసం అంతా కొన్న. కొని పైసలు కూడా ఇచ్చి ఇద్దరు మనుషులను తీసుకుని హైదరాబాద్ బయలుదేరిన.

వేషం మార్చడమే....
చిక్కడపల్లిలో నక్కీర్త నరసింహ అని మా చుట్టం ఉంటుండే. ఆయన వాళ్లింటికి తీస్కపోయి భోజనం పెట్టి రాత్రి కథ చెప్పిచ్చిండు. ఎవ్వరూ రాలే. పట్నపోల్లు ఆడేషాలుగీడేషాలు కట్టి జోర్‌దార్ ఆడిరాయే.. నేను వట్టిగా జెప్పే కథకెవరొస్తరు? ‘ఇట్లయితే ఎట్లరా.. పట్నంల నువ్ బతుకుడు కష్టమే ఉన్నట్టున్నది. పొద్దున పెట్టు చూద్దాం’ అని తెల్లారి ఓ గోడ నీడకు పెట్టిచ్చిండు నక్కీర్త నరసింహా. మొదలుపెట్టి నాలుగ్గంటలైనా ఎవ్వరు రాలే. అయినా చెప్తునే ఉన్న. మెల్లంగ మెల్లంగ ఒక్కలొక్కలే వచ్చుడు షురువై యాభై మందిదాకా జమైండ్రు. రోడ్డు మీద రిక్షలన్నీ ఆగిపోయినై. పోచమ్మ అని అక్కడ పాలమ్మెటామె కూడా చూసింది. ‘తమ్మీ నేను నలభై కథలు పట్టిస్తా నీకు, ఇక్కడ్నే చెప్పాలె’ అన్నది. ఓ కథ చెప్పిచ్చింది కూడా 25 రూపాయలకు. 

అప్పటి నుంచి నా కథలకు సబ్జి మండినుంచి జనాలు వచ్చుడుపెట్టిండ్రు. ‘పప్లూటూరు నుంచి ఒకాయనొచ్చిండు.. యాక్షన్ చేసుకుంట కథ బాగా చెప్తుండు’అని నా పేరు అన్నిచోట్లకు పాకిపోయింది. కథ మీదనే అక్కడిదక్కడ్నే వేషం మారుస్తుంటి. అదే నా ప్రత్యేకత. అట్లా చిక్కడపల్లి, కోరంటి, నల్లకుంట, సీతాఫల్ మండి, చిలకలగూడ ఇట్లా అన్నిచోట్లకు పోయి బాగానే చెప్పిన. కానీ కథలన్నీ పలుచగైనయ్. ఏం చేయాలి? అప్పుడే... మా ఊరినుంచి డబిల్‌పురకొచ్చి ఉంటున్న గొల్లాయన కలిసిండు. ‘మా దగ్గరకొచ్చి చెబ్దువురా’ అని పిలిచిండు. డబిల్‌పురలో చెప్పాలంటే కష్టం. ముస్లిమ్స్ ఎక్కువుంటరు. కొట్లాటలు బాగా అయితయ్. అయినా పోయినం. ఓ కథ చెప్పినం. అక్కడ చాకలి జంగయ్య, బాలమ్మ అనేటోళ్లది రోడ్డు మీదనే ఇస్త్రీ షాప్. వాళ్లే అందరినీ పిలుచుకొచ్చేది. ఆ రోడ్డుమీదనే కథ చెప్పుడు మొదలుపెట్టిన. కథకు నలభై రూపాయలు పెట్టిన.

డబిల్‌పుర దర్వాజ దగ్గర అట్లా ఆ రోడ్డు మీదనే నాలుగేండ్లు కథ చెప్పిన. ఆడ్నే ఎస్పీ (పోలీస్ ఆఫీసర్) ఉంటుండే. ఒకరోజు ఆయన వాకిట్ల కథ. ఇదివరకు కథ చెప్పేటోళ్లనిద్దరుముగ్గురిని కొట్టిండట ఆయన. రోజూ మా గొల్లోల్లే కథ చెప్పిస్తున్నరు. మధ్యాహ్నం ఎందుకనో వచ్చిండు డగ్ డగ్ మని బుల్లె ఆయనను చూడంగానే జనం అంత ఉరుకుతున్నరు కొడ్తడని. ఎట్ల కొడ్తడో చూస్త అని నేను కథ చెప్తనే ఉన్న. గుడ్లు తీసుకుంటా మంచి వాదం మీదున్న. ఎస్పీ చూసిండు కానీ ఏమన్లే. ఇంట్లకు పోయి బంగ్లా ఎక్కి రెండుగంటలు ఎండల నిలవడి చూసిండు. కథ అయిపోయినంక మా గొల్లోల్లవాకిట్లో అందరం కలిసి చిల్లర పైసలను పంచుకుంటున్నం.. నాలుగు పాన్‌లు, నాలుగు చాయ్‌లు తీసుకుని వచ్చిండు ఎస్పీసాబ్. ‘పంతులూ.. ఇవి తీస్కుంటవా?’ అన్నడు. తీస్కోమ్మన్నది గొల్లామె. తీస్కోని తాగినం. ‘ఏ ఊరు మీది’ అని అడిగిండు. చెప్పిన. ‘ఏమేం కథలు చెప్తవ్’ అన్నడు. ‘ఎల్లమ్మ, మల్లన్న లాంటి కథలన్నీ చెప్తా’ అన్న. ‘అట్లనా! ఏదీ రేపటి కథేందోఒకసారి చెప్పు’ అన్నడు. చెప్పిన. ‘ఛలో ఖర్చు నాదే. చెప్పు’ అన్నడు. చెప్పిన. అప్పటినుంచి నన్ను ఆయన అందరికీ తన బావమరిదని పరిచయం చేస్తుండె!

నాలుగేళ్ల తర్వాత..
వరంగల్‌లో అఖిలభారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నయి. అప్పటి కలెక్టర్ బాల్‌రాజ్ యాదవ్. చొక్కారావు మంత్రి. ఆ ఉత్సవాల్లో ఒగ్గుకథ కావాలే, ఎవరు బాగా చెప్తరని ఆరా తీసిండ్రు. అంతా తిరిగిండ్రు. ఎవరూ నచ్చలేదు. నా గురించి తెలిసి పిలిచిండ్రు. వరంగల్‌లో పది నిమిషాలు ఒగ్గుకథ చెప్పాలె. ‘రానుపోనూ చార్జీలు అన్నీకలిపి నలభై రూపాయలిస్తం’ అన్నరు. ఒప్పుకున్న కానీ లోపల వణుకుడు స్టార్ట్ అయింది. లక్షమందిలో చెప్పాలె. వేషంగీషం కట్టనీయలే. సాయంత్రం నాలుగున్నరప్పుడు నావంతు వచ్చింది. కథ మొదలుపెట్టిన. పది నిమిషాలన్నది గంటన్నరైంది. నలభై రూపాయలన్నోళ్లు నాలుగువందలిచ్చిండ్రు. ఎవరికోసమో తెచ్చిన దండను నాకు వేసి సన్మానం చేసిండ్రు. బీరప్పకథ చెప్పిన. దాన్నుంచే ఢిల్లీలో అవకాశం వచ్చింది. అక్కడా నా కథ అందరికీ నచ్చింది. ఇచ్చింది తీసుకున్నం. తర్వాత యేడు కూడా ఢిల్లీకి పంపిండ్రు నన్ను. 

నా కలలోనే ఉన్నావ్..
ఎమ్జన్సీ టైమ్‌లో ‘ఇందిరాగాంధీ ప్రభుత్వ పథకాలను ఒగ్గు కథ ద్వారా ప్రజలకు తెలియజేయాల్నట చెప్తవా’ అని ఓ మనిషి వచ్చిండు. ఒప్పుకోనైతే ఒప్పుకున్న కానీ ఎట్ల చెప్పాలె? పథకాల గురించి రాసియ్యమని ఎవరిని అడిగినా మాకు రాయొస్తలేదనే చెప్పవట్టిరి. లాభంలేదని.. 20 సూత్రాల పథకం వివరాలను చూసుకుంట ఒగ్గుకథ స్టయిల్లో నేను రాసుకున్న. ఊరూరు తిరిగి పాడిన. బాగా పాపులర్ అయింది. పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ రాజన్ సిన్హాకు నా కథ బాగా నచ్చింది. తెల్లవారి నన్ను హైదరాబాద్ పిలిపించింది. ‘నీ కథ బాగా నచ్చింది. ఉత్సాహమనిపించింది. రాత్రంతా నువ్ నా కలలోనే ఉన్నావ్’ అన్నది. వంద రూపాయలు నా చేతిలో పెడ్తూ ‘నీకు వెయ్యి ప్రోగ్రామ్‌లిస్తున్నా’ అని చెప్పింది. అట్లా ప్రభుత్వ పథకాలన్నీ ఒగ్గు కథకింద మార్చేసిన. 

ఇవన్నీ చూసినాక గప్పుడు మా అన్న నన్ను మెచ్చుకున్నడు. అంతకుముందు మాట్లాడని మా బావమరుదులు కూడా బావా అని దగ్గరకొచ్చి కాళ్లు మొక్కిండ్రు. అది పక్కనపెడితే... కుటుంబ నియంవూతణ గురించి చెప్తున్నప్పుడు ఒకసారి లంబడోళ్లు రాత్రంతా చెట్టుకు కట్టేసిండ్రు. ఇటు ఇట్లుంటే... అటు ఒగ్గు వాళ్లు నామీద అటాక్‌చేసిండ్రు. ‘నువ్వు ఉట్టి కుర్మాయనవు.. ఒగ్గు పూజారివి కాదు. ఒగ్గుకథ ఎట్ల చెప్తవ్? చెప్పద్ద’ంటు! నా చేతిలో లింగం పెట్టి ‘ఒగ్గు కథ చెప్పడం మానేస్తాన’ని ప్రమాణం చేయించాలని చూసిండ్రు. మా అమ్మ అడ్డుపడ్డది. చివరకు కుర్మిళ్లల్లో నేను భోజనం చేయకూడదని తీర్మానించిండ్రు. అట్లా ఒకరకంగా నన్ను కుల బహిష్కరణ చేసిండ్రు. నాటి నుంచి నేటి దాకా నేను ఏ ఊరు వెళ్లినా... ఎక్కడ కథ చెప్పినా.. కుర్మిళ్లల్లో భోజనం చేయలేదు, చేయను. ఆఖరికి ఫంక్షన్లయినా తినను. 

అద్దతులం మింగిండ్రు
ఊర్లో అట్లుంటే.. పట్నంలో కూడా ఓ యాభైమంది ఒగ్గు కథ పూజారులు నాకు అడ్డంపడ్డరు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పోటీలు అవుతుంటే వీళ్లూ పోటీకొచ్చిండ్రు. జమున, జగ్గయ్య ముఖ్య అథితులు. ఆ యాభైమందిలో ఇరవై మంది ఇరవై వేషాలు కట్టిండ్రు. నేను ఒక్కడినే ఒక్క వేషం. అయినా.. వెరవలేదు. బీరప్ప కథ చెప్పిన. అంతా మైమరిచిండ్రు. వాళ్ల ప్రదర్శన తేలిపోయింది. అందులో డోలు కొట్టేటాయన వచ్చి ‘అన్నా తప్పయింది క్షమించు’ అని కాళ్లు పట్టుకున్నడు. ఇదైనాంక ఊళ్లో నా దగ్గర విద్య నేర్చుకున్న నా శిష్యులూ నా మీద అటాక్ చేసిండ్రు. ఎవరేం చేసినా వెనకనుంచే. ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం ఒక్కళ్లకు లేదు. దేవుడు నాకు తోడున్నాడు. నా నిజాయితీ, చిత్తశుద్దే నన్ను నిలబెట్టింది. ఇందిరాగాంధీనే చేతిలో చేయి వేసి మెచ్చుకుంది. ఐదుతులాల బంగారం శాంక్షన్ చేసింది. సంగీత అకాడమీవాళ్లు అద్దతులం మింగి నాలుగున్నర తులాలతో బంగారు కంకణం చేయించి తొడిగిండ్రు. ‘జానపద కళామూరి’్త అనే బిరుదు ఇచ్చిండ్రు. 

కేంద్ర సాహిత్య, సంగీత అకాడమీ, కళారత్న హంస అవార్డ్, కళాసాగర్ అవార్డు, డాక్టరేట్‌లాంటివి వెయ్యిదాకా సన్మానాలు అందుకున్న. నన్ను సన్మానించని ముఖ్యమంత్రి లేడు. చాలా దేశాలు, రాష్ట్రాలు తిరిగిన. ఇప్పటిదాకా 15వేల ప్రోగ్రామ్‌లు చేసినట్టు లెక్కదీసిండ్రు. ఎన్ని చేసినా అత్యాశకు పోలేదు. ఇచ్చినంత తీసుకున్న. ఏనాడూ ఎవరినీ పీడించలేదు. అదే నన్ను ఇంతవాడిని చేసింది. తెలుగు యూనివర్శిటీలో ఒగ్గుకథ బోధకుడిగా 19ఏళ్లు పనిచేసిన. కళాకారులకు నాతోనే ఫించన్లు పుట్టినయ్. గద్దర్‌కీ నేనంటే గౌరవమే. నేను కథ చెప్తున్నప్పుడు గద్దర్ చిన్నపిల్లగాడు. అట్ల నిలబడి చూసేటోడు.

పక్కలో పాములాంటోడు...
చంద్రబాబునాయుడు, రాజశేఖర్‌డ్డి సిపారసు చేసినా వరంగల్ ఎంపీలు బలపర్చందే పద్మశ్రీ రాదట. ఎవరు బలపరుస్తారు? వాళ్లకంత టైమేడిది? తెలంగాణకోసమే జెండాలు పక్కనపెట్టి ఒక్కటయితలేరు. ఇగ నా సంగతేం పట్టిచ్చుకుంటరు? 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నం. అప్పుడు చెన్నాడ్డి మోసం చేసిండు. ఇప్పుడు మన ఎమ్మేల్యేలు, ఎంపీలు అందరూ దొంగలే. పార్టీ పరంగా ఎవరి సిద్ధాంతాలు వాళ్లకుండనీ..కానీ తెలంగాణ వచ్చేదాకా వాటిని పక్కనపెట్టి కొట్లాడ్తలేందుకు? కేసీఆర్‌ని తిడ్తున్నోళ్లు సపరేట్‌పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఎందుకో కొట్లాడరు? దమ్ముంటే కేసీఆర్‌లాగా ఒక్క సభ పెట్టుండ్రి చూద్దాం. ఒక్క కేసీఆర్ మీద పదకొండుతీర్ల విమర్శలు. పక్కల పొంటి నక్కప్లూక్క అదేమి ఒర్రుడు? తెలంగాణ అంటే ఇజ్జత్ ఉన్నోళ్లయితే అందరూ ఒకటే జెండా పట్టుండ్రి. నాలుగు కట్టెలు ఒక్కదగ్గరకడితే మోపైతది. దాన్ని ఎవరూ విరువలేరు.

మనమంతా ఒక్కటైతే వాళ్లే మూటాముళ్లె సర్దుకుంటరు. ‘తెలంగాణకు నేను వ్యతిరేకిని కాను’ అని చంద్రబాబు అంటున్నడు మరి...‘తెలంగాణ కోసం నిరహారదీక్ష చేస్తాన’ని ఎందుకో అనడు. చంద్రబాబు నాకు మంచోడే కావచ్చు, కళాకారుడిగా నాకు గౌరవం ఇచ్చుండొచ్చు కానీ ఆయన తెలంగాణకు పక్కలో పాములాంటోడు. చేదు బుడమకాయ. అసుంటోడికి మోత్కుపల్లి, కడియం శ్రీహరి, దయాకర్‌రావులు వంత పాడుతున్నరు. దమ్ముంటే పార్టీని మెయిన్‌టైన్ చేసుకుంటు పార్టీ అధ్యక్షపదవి చేపట్టండి. శరమున్నోళ్లయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అని పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడుండి. ఇట్లాంటోళ్లకు చంద్రశేఖర్‌రావును విమర్శించే హక్కుందా? అటు ఆ మాట ఇటు ఈ మాట మాట్లాడేటోడా మీకు నాయకుడు? ఇసుంటోళ్లు ఓట్ల కోసం వస్తే చెట్టుకు కట్టేయాల. పదవికోసం, పైసల కోసం లత్కోర్ వేషాలేస్తున్నరు. మన తల్లిని సిగవట్టి ఆడిస్తుంటే నువ్ వాడి కాళ్లు ఒత్తుతావ్? ఇదేనా మీ చదువు? ముట్టక భూమి లేదు... పెట్టక కీర్తి రాదు.. తిట్టక వాదు లేదు... వెరిపింపకెన్నక బుద్ధిరాదు.. పట్టపు రాజుకైన తగు పుత్రుడు లేక ముక్తి లేదు అని చెప్పిండ్రు! 

సంతోషం..బాధ
నాతో ఒగ్గు కథ ప్రాచుర్యం పొందడం ఎంత సంతోషాన్నిచ్చిందో.. మా ఒగ్గు పూజారులే నామీద అటాక్ చేయడం అంత బాధించింది. ఆశ పెట్టుకున్నవాళ్లంతా నాశనమవడమే! నేనెప్పుడూ దేనికీ ఆశపడలేదు. ఎవరిమీదా రూపాయికి ఆధారపడలేదు. ఎవరినీ చూసి ఈర్ష్య పడలేదు. పగవాడినైనా కావలించుకున్న. ఒగ్గుకథకు మా గురువులు కులంలో ప్రాచుర్యం కలిపిస్తే నేను దేశమంతా కల్పించిన. ఈ విషయాన్ని గర్వంగా చెప్తా. నేను నేర్చుకున్నది నాతోనే అంతం కావద్దని ఇప్పటి పిల్లలకు నేర్పించాలనుకుంటా. కానీ ఎవళ్లకు అంత ఓపికలేదు, ఇంట్రస్ట్ లేదు. రమ్మన్నా రారు. విద్య వచ్చిన కొంతమంది తాగుడుకి బానిసలవుతున్నారు. వృత్తి మీద భక్తి లేకుంటే అది రాణించదు.

గోచీ ఊడేటట్టు
గండిపేటలో ఒకసారి ఎన్టీరామారావు బర్త్‌డే అయితుంది.. ఆ మీటింగ్‌కి కల్చర్ డిపార్ట్‌మెంట్ నుంచి సైదులు నాకు ఆహ్వానం పంపిండు. కానీ సెక్యూరిటీ లోపలకు పోనియ్యలేదు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఒకాయన చూసి సెక్యూరిటీ వాళ్లకు చెప్తే లోపలికైతే పంపిండ్రు కానీ ఎన్టీరామారావు పీఏ నాకు అక్కడ ప్రోగ్రామ్ లేదన్నడు. ఇంత దూరం వచ్చి ఏంచేయాలని బాధపడ్డ. ఉండడానికి రూమ్ ఇచ్చిండ్రు. భోజనం పెట్టిండ్రు కానీ నాకు తినబుద్ధికాలేదు. సాయంత్రం ఫంక్షన్ మొదలైంది. ఏమైతే అదయిందని కాళ్ల గజ్టెలుకట్టుకుని తయారైన. ఎవరో పిల్లలు బుర్రకథ చెప్తున్నప్పుడు ఒక్కసారి ఎన్టీరామారావు నన్ను చూసిండు. ఒక్క ఐదు నిమిషాలు టైమ్ ఇయ్యుండ్రి సర్ అని సైగ చేసిన. రమ్మన్నడు. పోయిన. గంగను ప్రార్థించేటప్పుడు ఆయనేమంత చూడలేదు కానీ ‘తెలుగు దేశం మనదే సోదరుడా... మాయన్నల్లారా.. శ్యామలమైన రాజ్యం మనదమ్మా’ అని ఒక్కపారిగా ఎత్తుకోంగానే నన్ను చూసిండు. ఇగ ఎన్టీరామారావు సహా అందరూ లేచి ఎగురుడే ఎగురుడు. వసంత నాగేశ్వరరావుదైతే గోచే ఊడిపోయింది. ఎగిరి ఎగిరి ఎన్టీరామారావు వచ్చి నన్ను పట్టుకున్నడు. ‘సాయంత్రం మా ఫ్యామిలీ వస్తది మళ్లీ పాడాలి’ అన్నాడు. ఐదువేల రూపాయలు బహుమానం ఇచ్చిండు.

(from namaste telangana) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి