హోం

3, డిసెంబర్ 2012, సోమవారం

జలదోపిడీయే హంద్రీ నీవా..!



హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వదిలితే అభ్యంతరమమేటి? హంద్రీనీవా ప్రాజెక్టు పొడుగునా మంత్రి రఘువీరాడ్డి పాదయాత్ర చేపట్టడం, దానికి అన్ని ప్రాంతాల నాయకులు, మంత్రులు హాజరవుతున్నారు గదా మరేమిటీ గందరగోళం?
-పిడమర్తి వీరేశం, ఓయూ క్యాంపస్, హైదరాబాద్
 హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కృష్ణానదిలో లభించే సర్‌ఫ్లస్ వాటర్స్ అంటే మిగులు జలాలను 40 శతకోటి ఘనపు అడుగుల మేరకు ఉపయోగించుకుంటూ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం,కడప, చిత్తూరు జిల్లాల్లోని 6,02,500ఎకరాల భూమికి సాగునీరందివ్వడమేకాక, 33లక్షల జనా భాకు తాగునీరు అందించే ఉద్దేశ్యంతో రూపొందించబడింది. ఇది ప్రధానంగా కాలువ స్కీం. ఈ కాలువను కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలో మల్యాల గ్రామ సమీపంలో హంద్రీ అనే ఉపనది నుంచి, చిత్తూరు జిల్లాలోని ‘నీవా’ ఉపనది వరకు తవ్వుతారు. కనుకనే దీనిపేరు ‘హంద్రీనీవా’ అయింది. శ్రీశైలం రిజర్వాయర్ జలాశయం వెనుకనుంచి (బ్యాక్‌వాటర్స్) 266.60 మీటర్లస్థాయి నుంచి ప్రధాన కాలువ మార్గంగా 9 లిఫ్ట్‌ల ద్వారా మొత్తం 203 మీట ర్ల ఎత్తుకు జలాలను అంచెంచెలుగా తరలిస్తూ, మార్గమధ్యంలో కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, గొల్లపల్లి చెర్లోపల్లి, అడవిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ఉపయోగించుకుంటూ మొత్తం 6 కిలో మీటర్లపాటు మూడు సొరంగ మార్గాలు కూడా ఉపయోగించుకుంటూ, 500 కిలోమీటర్ల దూరం ప్రయోణంచేసి నిర్ధారిత ఆయకట్టును సాగుచేసే పథకమిది. ప్రధాన కాలువ రెండు లక్షల 54 వేల ఎకరాలకు సాగునీరందివ్వగా, పేరూర్, ఆత్మకూరు, మడకశిర, పుంగనూరు, తంబళ్లపల్లి, నీవా, వాయల్వాడు బాంచి కాలువలు 3,48,500 ఎకరాలకు నీరందిస్తాయి. 
వెనుకబడిన,కరువు ప్రాంతాలకు నిలయమైన, రాయలసీమకు ఈ పథకం ప్రయోజనం కలిగిస్తుంది. ఈ బృహత్ ప్రణాళికను దశలవారీగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొదటిదశలో కర్నూలు, జల్లాలో 80 వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో లక్షా18వేల ఎకరాలకు నీరందిస్తారు. ఈ మొదటిదశ పనులను జలయజ్ఞంలో భాగంగా 2774కోట్ల ఖర్చుతో జీవో- 2ను 3-1-2007 నాడు పాలనాపరమైన ఆమోదం తెలపడంతో పనుల ను చకచక ముగించి, హడావిడిగా ప్రారంభోత్సవం జరిపించారు. ఇటీవలే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తన జీవితం ధన్యమైందని ఉప్పొంగిపోతూ హంద్రీనీవా ప్రాజెక్టులోకి నీరు వదిలారు. (ఆనీరు శ్రీశైలం జలాశయం నుంచి వదిలిన నికర జలాలు అని గమనించాలి) ఇంతవరకు బాగానే ఉన్నది. ఇంత అద్భుతమైన స్కీం మరొకటి లేదంటూ మంత్రి రఘువీరాడ్డి కాలువ పొడువునా కాలినడకన పయనిసూ,్త రోజుకో అధికార ప్రతిపక్ష నాయకుడిని తన యాత్రలో భాగస్వామిని చేస్తూ, చిలుకపలుకులు వల్లింపచేస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నారు.

సమస్య ఎక్కడ? అంటే.. హంద్రీనీవా స్కీం కృష్ణానదిలో వరదలు వచ్చినప్పుడు, నికర జలాలపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీరంది, మిగతా నీరు సమువూదంలోకి వృధాగా పోతున్నప్పుడు, ఆవృధాగా పోయే నీటిని ఒడిసిపట్టుకుని కరవు క్షేత్రాలకు తరలించాలి. మరి ఈసంవత్సరం వర్షాలులేవు. వచ్చిన నీటి ని పైరాష్ట్రాలు తమ జలాశయాలు నింపుకుని, మిగతా నీటిని మాత్రమే మన కు వదలడం జరిగింది. శ్రీశైలం,నాగార్జునసాగర్ జలాశయాలలో కనీస నీటి మట్టాలను కూడా‘మెయిన్‌టెయిన్’చేయలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాం. కృష్ణా డెల్టా రైతులు తమకు సకాలంలో నీరందివ్వలేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సాగర్ ఆయకట్టు దారులు డిసెంబర్ ఒకటిన పంటలు వేసుకోవడానికి చెరో 15 టీఎంసీలు తప్ప అధికంగా లేవనీ, కనుకవిధిగా ఆరుతడి పంటలను మాత్రం వేసుకోమని ప్రభుత్వమంటున్నది. జంటనగరాలకు, కృష్ణాబేసిన్‌లోని పట్టణాలకు, పల్లెలకు, తాగునీటి అవసరాలకు సరిపడా నీరందవ్వడమే కష్టమైన ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం శ్రీశైలం నీటిని నిలువ చేస్తూ, అటు విద్యుత్తు ఉత్పత్తి చేయకుండా, ఇటు సాగర్ ఆయకట్టుదారులకు నీరందివ్వకుండా రాయల సీమకు తరలిస్తున్నారు. తమ ఇష్టారాజ్యమన్నట్టు పోతిడ్డిపాడు గేట్లు తెరిచి కొంతనీరు, ఇప్పుడు హంద్రీనీవాకు మరికొంత నీరు వదలడంలో ఉద్దేశమేమిటో స్పష్టమవుతూనే ఉన్నది. కృష్ణా నికరజలాలపై హక్కు ఉన్న సాగర్ ఆయకట్టుదారుల(కుడి,ఎడమ కాలువలు)ది. కృష్ణా డెల్టా రైతుల గోడు పట్టించుకోకుండా, ఎలాంటి హక్కులేని తెలుగు గంగకు కానీ, హంద్రీనీవాకు గాని కృష్ణా జలాలను వదలడమంటే నీటి దొంగతనం తప్ప మరొకటి కాదు. సీఎం రాయలసీమ పక్షపాతి అనడానికి ఇంకేం రుజువు కావాలి? 

ఇక ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఏం చెప్పుతున్నాయో చూద్దాం. శ్రీశైలం జలాల నిర్వహణ కోసం ఇప్పటికీ చెలామణి అవుతున్న జీవో-69 జారీ చేసిం ది.15-6-1996 తదనంతరం జీవో-698(14-8-2005),జీవో-233 (19-12-2005), జీవో 3 (4-1-2006) విడుదలైనా,జీవో-69లోని నిర్వహణకు సంబంధించిన ప్రాధాన్యంగాని, నీటి మట్టాలతో ముడిపడి నీటి విడుదలపై ఉన్న ఆదేశాలను గాని మార్చలేదు. జీవో-69 విడుదలయ్యే నాటికి తెలుగుగంగ ప్రాజెక్టు మాత్రమే ఉన్నది. హంద్రీనీవా గానీ ఇంకా ఇతర ప్రాజెక్టులు-గాలేరు నగరి, వెలిగొండ, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు రూపుదిద్దుకోనందున వాటి ప్రసక్తిలేదు. కనుక తెలుగుగంగ లాగే హంద్రీనీవా, ఇంకా ఇతరప్రాజెక్టులు (పైన చెప్పినవి) అన్నీ మిగులు జలాల ఆధారంగానే నిర్మాణమైన, అవుతున్న ప్రాజెక్టులు. కాబట్టి ఆ ఆదేశాలే వీటికి వర్తిస్తాయి.జీవో- 69 లో పేర్కొన్న ముఖ్యమైన అంశమేమంటే శ్రీశైలం నీటిమట్టం 875 అడుగుల (266.70 మీటర్లు)కు ఎగువన ఉన్నప్పుడు ప్రాధాన్యతాపరంగా మద్రాసు తాగునీటి అవసరాలు, శ్రీశైలం విద్యుత్తు ఉత్పాదన, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అవసరాలు, శ్రీశైలం కుడిగట్టు కాలువ అవసరాలు, ఆతర్వాత తెలుగుగంగకు నీరు వదలాలని స్పష్టంగా ఉన్నది.శ్రీశైలం జలాశయంలో 885 అడుగులు పూర్తి జలస్థాయి కంటే 10అడుగుల కింద ఉన్నప్పుడు ఆరోప్రాధాన్యం తెలుగుగంగకు నీరు వదలాలన్నది ఆదేశం.ఇదే జీవోలో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 875 అడుగులకు దిగువన ఉన్నప్పుడు తెలుగుగంగకు నీరు వదలరాదన్నది ప్రభుత్వ ఆదేశం. ముందొచ్చిన తెలుగుగంగకే నీరు లేనప్పుడు కొత్తగా వెలిసిన హంద్రీనీవాకు నీరెక్కడిది? అంటే హక్కు లేకపోయినా హంద్రీనీవా ప్రాజెక్టుకు అక్రమంగా నీటిని ప్రభుత్వమే తరలించడం విడ్డూరం.అంటే ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలనే బుట్టదాఖలు చేసి ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నది. 


ఇక మిగులు జలాల విషయంలో మన రాష్ట్రానికున్న హక్కు ఏమిటి? దాన్ని మనంఎలా ఉపయోగించుకుంటున్నాం అన్న సంగతి కూడా అర్థం చేసుకోవా లి. బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చిన అవార్డు ప్రకారం మనరాష్ట్రానికి 811 టీఎంసీల నికర జలాలు లభ్యమయ్యాయి. వాటిని పూర్తిగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. నికర జలాలకు తోడు మిగులు జలాలపై సంపూర్ణమైన వినియోగపు స్వేచ్ఛను మనకు బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చింది. ఇది స్వేచ్ఛ మాత్ర మే అని, హక్కుకాదని అనేక సార్లు ట్రిబ్యూనల్ మనకు గుర్తుచేయడం గమనించదగ్గ విషయం. మనమేం చేయాలి? మనకు లభించిన స్వేచ్ఛను హక్కు అని భావిస్తూ, మన ప్రజలను కూడా భ్రమింప చేస్తూ కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించుకున్నాం. ఇందులో భాగంగా తెలంగాణలో మూడు, సీమాంవూధలో నాలుగు. రాష్ట్రంమొత్తంగా 227.50టీఎంసీల మిగులు జలాల వినియోగంతో ఏడు ప్రాజెక్టులను జలయజ్ఞ కార్యక్షికమంగా చేపట్టడమేగాక కొత్త ట్రిబ్యూనల్ ముందు కూడా ఈ ప్రాజెక్టులను అనుమతించవలసిందిగా అర్జీలు పెట్టాం. ఎలాంటి హక్కులేకుండా మిగులు జలాల వినియోగంతో చేపట్టిన ప్రాజెక్టులపైన తీవ్రమైన అభ్యంతరం వెలిబుచ్చడమే కాకుండా, వెంటనే ఈ అనధికార ప్రాజెక్టులను ఆపేయవలసిందిగా కర్ణాటక కొత్త ట్రిబ్యూనల్‌ను కోరింది.‘మేం ఎలాంటి హక్కు కోరం,మిగులు జలాల్లో ఎంత నీటినిస్తే దాన్నే వాడుకుంటాం. ఎలాంటి క్లెయిమ్స్ పెట్టం’అని అఫడివిట్ రాసిచ్చాకే మన ఈ ప్రాజెక్టులను కొత్త ట్రిబ్యూనల్ అనుమతించాలి. కొత్త బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ మిగులు జలాలను మూడు రాష్ట్రాలకు పంచి, ఒక ప్రాథమిక తీర్పును వెల్లడించింది. అయితే ఆ తీర్పును మనం అంగీకరించక పునఃసమీక్ష కోసం ట్రిబ్యూనల్‌ని అర్థించాం. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాం. ప్రాథమిక తీర్పులో ట్రిబ్యూనల్ 227.50 టీఎంసీల వినియోగంతో మనం చేపట్టిన ఏడు ప్రాజెక్టులలో దేన్నీ పూర్తిగా అనుమతించలేదు. గుడ్డిలో మెల్లఅన్నట్టు తెలుగుగంగకు మాత్రం 29కి బదులుగా 25 టీఎంసీల మిగులు జలాలను కేటాయించడం జరిగింది. అంటే హంద్రీనీవాకు ఎలాంటి పరిస్థితుల్లో కొత్త ట్రిబ్యూనల్ ఇటు నికర జలాలు, అటు మిగులు జలాలను కేటాయించజాలదన్నది స్పష్టం. మరి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ కాలువ నీరులేక వెల నీళ్లు వచ్చే అవకాశంలేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం నీటి కేటాయింపులేని కారణంగా ప్రాజెక్టును ఆమోదించలేదని తెలిసి కూడా హంద్రీనీవా ప్రాజెక్టును కట్టుకున్నాం. కనుక తెలిసికూడా కట్టుకున్నాక నీరు రాకపోతే వెల మరో ప్రత్యామ్నాయ మే ముంది? ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని, నికర జలాలపై హక్కు ఉన్న సాగర్ ఆయకట్టుదారులు, కృష్ణా డెల్టా రైతులు ఎంత గొడవ పెట్తున్నా పట్టించుకోకుండా ఎంతో కొంత నీరు హంద్రీకి వదలడం జరిగింది.


ప్రభుత్వానికి తెలుసు, తాము చేస్తున్నది అక్రమమని. తమ అనైతిక చర్య డెల్టా రైతాంగాన్ని సాగర్ రైతులను అన్యాయం చేయడ మే నని కూడా తెలుసు. కాని సీమ వాసులకు ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజలకు మేలుకలిగించే స్కీంను చూస్తూ చూస్తూ అలక్ష్యం చేయ డం ముఖ్యమంత్రి వల్ల కాలేదు. ఇప్పుడు జరుగుతున్న డ్రామా అంతా అదే. అయితే హంద్రీనీవా కట్తున్నప్పుడు గొడవపెట్టకుం డా, తీరా మొదటి దశపనులు పూర్తయి, నీరు వదిలాక అంటే ఏడెమిదేళ్ల తర్వాత ఈ హడావిడి ప్రకటనలు ఎందుకు గుప్పిస్తున్నారని మీరగడవచ్చు. మహామాంవూతికుడు వైఎస్‌ఆర్ అన్ని ప్రాంతాల వాళ్లను బుట్టలో వేసుకుని తన పనిని కానిచ్చుకుంటూ ముందుకు సాగాడు. మహబూబ్‌నగర్ వాళ్లకు భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, ఇచ్చాడు. నల్లగొండవాళ్లకు ఎస్‌ఎల్‌బీసీ (సొరంగం) ఇచ్చాడు. డెల్టావాళ్ళకు పులిచింతల సాంక్షన్ చేశాడు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయి. ఆహా ఓహో అన్నారు. అపర భగీరధుడు, మరోకాటన్ అని అభివర్ణించారు. అట్లాగే గోదావరిపైన పోలవరం, దుమ్ముగూడెం లిఫ్ట్ స్కీం, కంతనపల్లి, ప్రాణహిత చేవెళ్ల, ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజీ-2 వరద కాలువ, దేవాదుల అడిగిందే తడువుగా సాంక్షన్ చేయడంతో కాంగ్రెస్‌నాయకులు ముఖ్యంగా జీవన్‌డ్డి, చిన్నాడ్డి, ప్రతిపక్షనాయకులు యలమంచిలి శివాజీ అందరూ వైఎస్‌ఆర్‌ను పొగిడినవారే. మా లాంటి వాళ్లం మొదట్నుంచీ ఈ మెగా స్కీంల వెనుక జరుగుతున్న మోసం, కుట్రను, అస్మదీయులకు దోచిపెట్టే ప్రయత్నాన్ని ఖండించాం. పోతిడ్డిపాడు దుర్మార్గం. జీవో107 ద్వారా శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని పెంచడం, దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ లాంటి తెలంగాణను ముంచే అనేక కార్యక్షికమాల గురించి మనవాళ్లకు చెప్పినా నాయకుల్లో ఎలాంటి చలనం లేదు. మాలాంటి వాళ్ల ప్రోదల్భం మీద అప్పుడప్పుడు కొందరు మాతో గొంతు కలపడం తప్ప ఏనాడూ సీరియస్‌గా కృష్ణా, గోదావరి జలాలను అక్రమంగా రాయలసీమకు తరలించే ఈదుర్మార్గపు ప్రభుత్వ చర్యలను ఎదిరిం చలేదు. ఒక్కదివంగత పీజేఆర్ మాత్రం ధైర్యంగా పోతిడ్డిపాడు అక్రమాలపై శాసనసభలో వైఎస్‌ఆర్‌ను ఇబ్బందిపెట్టాడు. ఇప్పడనుకుంటే ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టున్నది మన ఏడుపు. సామాన్యు డి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. మనకు రోజూనాలుగు బిందెల నీళ్లువస్తాయని ప్రభుత్వం ప్రకటించిందనుకోండి, బాగా వరదలు వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు కూడా వదుల్తామని హమీ ఇచ్చిందనుకోండి మనమేం చేస్తాం? నాలుగు కాకపోతే మరో బిందె అదనంగా తెచ్చిపెట్టుకుని, వచ్చినప్పుడు అది నింపిపెట్టుకుంటాం.అదిమన సంస్కృతి.మన పక్కింటివాడికి నీటి కనెక్షన్ లేదు. వరదలు వచ్చినప్పుడు మీకు కూడా నీరిస్తాం అంటే మనతోపాటుగా అయిదు బిందెలు అతనూ సమకూర్చుకున్నాడు. ఇప్పుడు బిందెలు కొనుక్కున్నాను కాబట్టి మన నీళ్లు కట్ చేసైనా సరే వాడికివ్వాలని డిమాండ్ చేస్తూ జబర్దస్తీ చేస్తూ, సాధించుకుంటున్నాడు. అది పొరుగువాడి సంస్కృతి. ఇక ఈ పంచాయితీకి పరిష్కారం ఏమిటి? ప్రత్యేక రాష్ట్రమొస్తే ఎవడి నీళ్లు వాడికి వదిలేటట్టు రెగ్యులేటరీ ఏర్పాటు ఎట్లాగూ చేస్తారు.సమైక్య రాష్ట్రంలో కొనసాగితే తెలంగాణ వాడి పరిస్థితి అధోగతే. కోస్తాంధ్ర వాడికున్న ఆర్థిక సత్తా సీమవాడికున్న కండ బలం,ఈ తెలంగాణకు లేదు. పైగా ఐక్యత అన్నది మనవాళ్లలో మృగ్యం. కనుక ఆ మంచిరోజు వచ్చేదాక ఈ యాతన తప్పదు.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

(from  namaste telangana paper)



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి