హోం

14, డిసెంబర్ 2012, శుక్రవారం

శిధిలాలపై ఉత్సవాలు..


- అద్భుతవారసత్వం మట్టిపొరల్లోకి..
- కూలుతున్న కాకతీయులనాటి కట్టడాలు
- ఉత్సవాలు సరే శిథిలాల మాటేమిటి...!!
- దీపమైనా వెలుగని ఆనాటి ఆలయాలేన్నో..
- నత్తనడకన ఆలయాల పునరుద్ధరణ పథకం

ములుగు, డిసెంబర్13 టీమీడియా: దక్షణ భారతదేశానికే తలమానికగా ఉన్న ఓరుగల్లు కాకతీయుల సామ్రాజ్యంలోని కాకతీయుల కట్టడాలు నేడు శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాకతీయుల ఉత్సవాల తెలంగాణ ఉద్యమ శక్తుల ఒత్తిడి మేరకు కొంతలో కొంత ఉత్సవాలు నిర్వహించడానికి ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచాన్ని అబ్బురపరిచే శిల్ప కళా సంపద వైభవంతో, అద్భుత కట్టడాలతో ఒకప్పుడు తులతూగిన ఈ ప్రాంతంలోని ఆలయాలు ఇప్పుడు శిథిలమై దర్శనమిస్తున్నాయి. ఈ దుస్థితికి కారణం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని స్పష్టమవుతుంది. అడవులు, గుట్టలు, కొండలు, వాగులు ఎక్కడ చూసిన కాకతీయుల కళావైభవం కట్టడాలు వెలుగులోకి వస్తున్నాయి. వెలుగు చూడని వాటి సంగతి అటుంచితే. వెలుగులో ఉన్న ఆలయాలను పీకి పందిరేసి దశాబ్దాలు గుడుస్తున్న పునఃనిర్మించని దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నది.

తెలంగాణ ఉద్యమం ఒత్తిడి మేరకుఎట్టకేలకు కాకతీయ ఉత్సవాల నిర్వాహణకు ముందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమవుతుందనే విమర్శలు వినవస్తున్నాయి. కాకతీయుల కళాప్రభా, చారితిక కట్టడాలు శిథిలావస్థలో, ముండ్లపొదళ్లో, అడవి గుట్టల్లో ఎన్నో లెక్కలేనన్ని ఆలయాలు కట్టడాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి కట్టడాలకే ఈ ప్రభుత్వం కూల్చి కుదర కట్టలేకపోతుంది. కూల్చిన వాటిని ఎప్పుడు కుదుర కడుతారని తెలంగాణ వాదులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఉత్సవాల పేరుతో ప్రచార ఆర్భాటాలకు పెద్ద పీఠ వేస్తున్న ప్రభుత్వం కాలగర్భంలో కలిసిపోతున్న కాకతీయుల కళా వైభవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఆలయాలు పునరుద్దరణ ప్రణాళిక-1 నత్తనడకన సాగుతుండటంతో శిథిలావస్థలో ఉన్న ఎన్నో ఆలయాలు పునరుద్దరణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందగా తయారైంది. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల అలసత్వంతో పాటు ప్రాంతీయ వివక్ష కారణంగా జిల్లాలోని అనేక ఆలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని పునఃనిర్మిస్తామని పునరుద్దరణ పనుల కింద కేటాయించిన నిధులు బొక్కసంలోనే ముక్కిపోతున్నాయి.

అయితే శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్దరణ ప్రణాళికపై కాకతీయ ఉత్సవాలలో ప్రభుత్వ వైఖరి ఏమిటి అనేది స్పష్టం చేయాలనే డిమాండ్ వినవస్తుంది. ప్రణాళిక బద్దంగా పురావస్థు శాఖ అధికారులు ఆలయాలను పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ఆలయాలను పునరుద్దరిస్తామని పురావస్థు శాఖ కార్యకలాపాలను ప్రారంభించింది. కోటగుళ్ళు మొదలుకొని ఎరుకల నాంచారమ్మ గుడి, కటాక్షాపురం కోటగుళ్ళు, రామప్ప పరివాహక దేవాలయాలు, గోవిందరావుపేట మండలం బుస్సాపురంలోని పురాతన ఆలయం లాంటి అనేక దేవాలయాల పునరుద్దరణ చేపట్టడానికి పురావస్థు శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయాలను విప్పి అనేక చోట్ల కుప్ప పెట్టింది. దీంతో రాతి శిలలు, శిల్పాలు, ఏనుగు విగ్రహాలు, నందీ విగ్రహాలు, చివరికి శివలింగాలు సైతం అపహరణకు గురవుతున్నాయి. వెంకటాపురం మండలం పెద్దాపురంలోని పురాతన ఆలయం నామరూపాలు లేకుండా పోవడానికి సిద్ధమైంది. ఆలయం ముందు శివలింగం గ్రామస్తుల పశువుల పాకల మధ్య ఉండిపోయింది. నందీశ్వరుడు సైతం ఆనిగపు తీగల కింద దాక్కొవాల్సిన పరిస్థితి. అదేవిధంగా రామాంజాపురం శివారులోని పంచకూట ఆలయమైన ఎరుకల నాంచారమ్మ దేవాలయాన్ని గత దశబ్ధం క్రితం పొలాల మధ్యలో ఉన్న ఆలయాన్ని రోడ్డు వైపు పునరుద్దరిస్తామనే పేరుతో గుడిని కూల్చి శిల్పాలను ఇతర రాతి కట్టడాలను వెల్తుర్లపల్లి బస్టాండ్ సమీపంలో గల మైదానంలో వేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ ఆలయ పునరుద్దరణ పనులు ఈసం కూడా ముందుకు సాగలేదనే విమర్శలు ఉన్నాయి.

కటాక్షాపురం కోటగుళ్ళు 
త్రికూట ఆలయంగా ప్రసిద్ది చెందిన ఆత్మకూర్ మండలంలోని కటాక్షాపురం కోటగుళ్ళ ఆలయం శిథిలావస్థలో ఉంది. గర్భగుడిలో శివ లింగం పూజలు నోచుకోక కనిపిస్తుంది. 25-02-2009లో ఈ ఆలయాన్ని పునరుద్దరించడానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఇప్పటి వరకు ఒక్క బండరాయిని కూడా కదిలించిన పాపాన పోలేదు. దీంతో ఆలయం రోజు రోజుకు కుంగిపోతుందని గ్రామస్తులు తెలిపారు.

జాకారం శివాలయం 
ములుగు మండలంలోని జాకారం శివారులో ఒకప్పుడు అద్భుత శివాలయం నిత్యం దూప, దీప నైవేద్యాలతో వెలుగొందేది. రెండు దశబ్దాల క్రితం పురావస్తు శాఖ అధికారులు ఈ ఆలయాన్ని పునరుద్దరించడానికి విప్పి కుప్ప పెట్టారు. ఇప్పటి వరకు తిరిగి పునఃనిర్మించలేదు. దీంతో ఆలయానికి సంబంధించిన రాతి శిల్పాలు, ఏనుగులు, శివలింగాలను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోతున్నారు.

గణపురం కోటగుళ్ళు 
గణపేశ్వరాలయంగా ప్రసిద్ది చెందిన గణపురం కోటగళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రామప్ప ఆలయం కంటే అద్భుత శిల్ప కళలతో రాణి రుద్రమదేవి ఇష్టపడి జగకేసరి శిల్పాలను చెక్కించుకొని ఏర్పాటు చేసిన కోటగుళ్ళ పరిస్థితి దయనీయంగా తయారైంది. కోటగుళ్ళ పునరుద్దరణ కోసం పురావస్తు శాఖ పనులు ప్రారంభించిన అవి ముందుకు సాగడం లేదు.

ఎరుకల నాంచారమ్మ గుడి 
వెంకటాపురం మండలం రామాంజాపురం శివారులో ఒకప్పుడు దూప, దీప, నైవేద్యాలతో పచ్చని పంట పొలాల మధ్య నిత్యం భక్తులకు దర్శనమించే పంచకూటమి ఆలయాన్ని పురావస్తుశాఖ అధికారులు తొలగించి నూతనంగా రోడ్డు వైపు పునఃనిర్మిస్తామని ఇప్పటి రెండు దశాబ్దాలు గడుస్తున్న ఆ ఆలయ శిథిలాలు వెల్తుర్లపల్లి సమీపంలో శవాలుగా దర్శనమిస్తున్నాయి. ఇదే మండలం పెద్దాపురంలో పురాతన ఆలయం పూర్తిగా శిథిలమైంది. ఇక్కడ శివలింగం పశువుల పాక మధ్య బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తుండగా శివునికే నమ్మిన భుట్టు అయిన నందీ ఆనిగపు తీగల మధ్య చిక్కుకొని దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా రామప్ప పరివాహక ఆలయాల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది.

బుస్సాపురం వైష్ణవ ఆలయం 
గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సమీపంలో బుస్సాపురం గ్రామం వద్ద కాకతీయులు నిర్మించిన వైష్ణవ ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఇక్కడి అద్భుత శిల్ప సంపద కాకతీయుల పాలన దక్షతకు నిదర్శనంగా నిలుస్తుంది. అతి పెద్ద లక్నవరం చెరువును నిర్మించిన కాకతీయులు అదే క్రమంలో అద్భుతమైన వైష్ణవ ఆలయాన్ని ఎక్కడ లేని విధంగా నిర్మించారు. ఈ ఆలయం ఇవాల కూలిపోయే దశకు చేరుకొని ఉంది. ఈ ఆలయాన్ని పునరుద్దరించడానికి ఆనాటి జిల్లా కలెక్టర్ శాలినిమిశ్రా హయంలో పనులు చేపట్టిన పురావస్తు శాఖ ఇప్పటి వరకు అటు వైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైన కాకతీయ ఉత్సవాల సంబరాలలో మునిగి తేలుతున్న అధికారులు శిథిలాలపై ఉత్సవాలు నిర్వహిస్తారా అని ఈ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు.
(from namaste telangana)

1 కామెంట్‌: