హోం

8, జనవరి 2012, ఆదివారం

1969 - తెలంగాణా నెత్తుటి పోరాటం..



             ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 [ఫిబ్రవరి 20] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. అయితే  ఈ తంతును మొత్తం కొంతమంది హడావిడిగా చేసేసారు, తెలంగాణా ప్రాంతంలోని అధిక ప్రజలు విలీనానికి ఒప్పుకోలేదు,  తాము విద్యాపరంగా ఆంద్ర కంటే వెనక బడి ఉన్నందున ఉద్యోగాలన్నీ ఆంధ్రా వాళ్ళే తన్నుకు పోతారని ఇక్కడి ప్రజలు భావించారు, అదేవిధంగా తమ వనరులు సైతం విద్యాధికులైన ఆంధ్రుల చేతుల్లోకి వెళ్తాయని భయపడ్డారు, ఇదే విషయాన్నీ మొదటి ఎస్ ఆర్ సి కూడా చెప్పింది, అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఆంద్ర నాయకుల ఒత్తిడికి లొంగి హైదరాబాద్ ను ఆంధ్రలో విలీనం చేసారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
                               ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు, అప్పటికే అనేకమంది ఆంద్ర వాళ్ళు నకిలీ నివాస పాత్రలతో తెలంగాణా కు రావాల్సిన ఉద్యోగాల్లో చేరిపోయారు, అంతే కాకుండా విద్య విషయంలో తక్కువ శాతం విధ్యవంతులున్న తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాని ప్రభుత్వం సీట్లన్నీ ఆంద్ర వారికి కేటాయించడం, ఆంద్ర వారు తెలంగాణా కు వచ్చి దొరల భూముల్ని తక్కువ ధరలకు కొని వ్యవసాయం చెయ్యడం (దొరల భూములలో కామునిస్ట్లులు(అన్నలు) జండాలు పాతి వారి దోపిడిని అడ్డుకుంటున్న కాలం అది. వేల ఎకరాల్లో ఉన్న దొరల భూముల్ని పేదలకు పంపిణి చెయ్యాలని అన్నలు ప్రయత్నించారు, అలాంటి సమయంలో అనేక మంది దొరలూ, జమీన్ దార్ల పై వారు దాడులు చేసారు, దీనితో విధిలేక వారు హైదరాబాద్ కు పారిపోయారు, దొరవారి భూముల్ని కొనడానికి ఎవరు సాహసించేవారు కాదు, ఎందుకంటే అన్నలు తమపై దాడి చేస్తారనే భయం, కాని ఆంద్ర వారు చాల మంది అతి తక్కువ ధరలకు, {ఎంతో కాలం గా వెట్టి చేస్తున్న అక్కడి ప్రజలకు దక్కాల్సిన భూముల్ని} కొని వ్యవసాయం చేయసాగారు ) ఇక్కడి ప్రజలకు అది మింగుడు పడలేదు.


                             1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి కుట్రలతో రాజకీయంగా స్థిరపడ్డారు. తెలంగాణ నేతలను తొక్కేసారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆంద్ర వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ముల్కీ నిబంధనలకు పాతరేసారు. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరసనకు దిగాడు. దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.
ఉద్యమ ప్రారంభం:



తెలంగాణా ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969 జనవరి 9న ఖమ్మం పట్టణంలో ఒక విద్యార్ధి నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో జరిగిన విద్యార్ధుల సమావేశంలో తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు.


అయితే, జనవరి 13 న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్ధులలోని ఒక వర్గం "తెలంగాణా విద్యార్ధుల కార్యాచరణ సమితి" గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. అదే రోజున పురప్రముఖులు కొందరు "తెలంగాణా పరిరక్షణల కమిటీ" ని ఏర్పాటు చేసారు.

జనవరి 18 న విద్యార్ధుల్లోని రెండు వర్గాలు (తెలంగాణా రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణా కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ సమయంలో పోలీసులు విచక్షణ రహితంగా విద్యార్థులపై కాల్పులు జరిపారు, అనేక మంది విద్యార్థులు అమరులయ్యారు. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి.
ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి వచ్చింది.


తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపించాలి.
పెద్దమనుషుల ఒప్పందంలోని తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలి.
అయితే ప్రత్యేక తెలంగాణా వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు.

అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణా రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీనుండి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్ధి తన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణా రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది; ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది.


మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము యొక్క రెండవ దశను ప్రారంభించిన ఉద్యమకర్త కాళోజీ నారాయణరావు.


జనవరి 24 న సదాశివపేటలో జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చనిపోయాడు. జనవరి 27న రంగాచార్యులు అనే ఒక ఆంధ్ర ప్రాంతపు ఉద్యోగిని నల్గొండ పట్టణంలో పెట్రోలు పోసి తగలబెట్టారు. జనవరి 28న వరంగల్లులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేసారు. క్రమేణా ఆందోళనలో హింసాత్మక చర్యలు పెరగసాగాయి. ఆంధ్రప్రాంతపు వారి ఆస్తులు తగలబెట్టడం విస్తృతంగా జరిగాయి. తెలంగాణాలోని అనేక పట్టణాల్లోను సైన్యం కవాతు జరిపింది. . ఫిబ్రవరి 25న తాండూరు లో హింసాత్మక ఘటనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు.
తెలంగాణా ప్రజాసమితి:
1969 ఫిబ్రవరి 28 న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే దీని ధ్యేయం. మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణా బందును జరిపింది.

ఉద్యమాన్ని రాజకీయం చేసిన కాంగ్రేసు పార్టీ నాయకుడు మర్రి చెన్నారెడ్డి,
మార్చి 29 న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణా కాంగ్రెసు సమితిని ఏర్పాటు చేసాడు. ఏప్రిల్ 21 న మర్రి చెన్నారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణాను సమర్ధిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేసాడు. మే 1  మేడే నాడు తెలంగాణా కోర్కెల దినంగా జరపాలని తెలంగాణా ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. మే 15 న కె.వి.రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రవేశం చేసాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయులు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్ధి నాయకులు పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఏర్పాటు చేసారు. విద్యార్థి నాయకుడు శ్రీధరరెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి ప్రత్యర్ధులైన కొందరు రాజకీయ నాయకులు దీనికి మద్దతు పలికారు. వందేమాతరం రామచంద్రరావు, బద్రివిశాల్ పిట్టి వీరిలో ఉన్నారు.1969 జూన్ మొదటి వారం ఉద్యమానికి అత్యంత హింసాత్మకమైన కాలం. సమ్మెలు, బందులు, దాడులు, లాఠీచార్జిలు, పోలీసుకాల్పులు, కర్ఫ్యూలు మొదలైన వాటితో హైదరాబాదు అట్టుడికిపోయింది. విద్యార్ధులతోపాటు, కార్మికులు, ఉద్యోగులు కూడా సమ్మెలు చేసారు. జూన్ 10 నుండి తెలంగాణా ప్రాంత ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. అప్పటికి అనేక మంది విద్యార్థులు అమరులయ్యారు, రోజు పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు నేల రాలుతున్న విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గలేదు, ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది, 359 మంది విద్యార్థులు అసువులు బాయడంతో ఒక్కసారిగా కేంద్రం ఉలిక్కి పడింది, హుటాహుటిన ప్రధాని ఇందిరా గాంధీ హైదరాబాద్ కు చేరుకొని పరిస్థితిని సమీక్షించింది,1969 జూన్ 24 న తెలంగాణా నాయకులు ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూన్ 25న హైదరాబాదులో సమ్మె జరిగింది. ఆ రాత్రి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, రాజమండ్రికి తరలించారు.జూన్ 27 న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామాచేసాడు. కానీ ఆయన తన రాజీనామా లేఖను గవర్నరుకు కాక, కాంగ్రెసు అధ్యక్షుడు నిజలింగప్పకు పంపించాడు. దానిని ఆయన తిరస్కరించాడు.1969 ఆగష్టు 18 న లోక్‌సభలో తెలంగాణా ప్రాంత ప్రతినిధులు జి.వెంకటస్వామి, జి.ఎస్.మేల్కోటేలు ప్రత్యేక తెలంగాణా గురించి తమ వాదనను వినిపించారు. ఆగష్టు 24న కొందరిని, 28న మరికొందరిని ప్రభుత్వం రాజమండ్రి జైలు నుండి విడుదల చేసింది.
విద్యార్ధులు ఆందోళన మాని చదువులకు మళ్ళాలని తెలంగాణా ప్రజా సమితి సెప్టెంబర్ 23న ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఆ ప్రకటనపై చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకం చేసారు. అప్పుడు హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి వి.వి.గిరికి చెన్నారెడ్డి స్వయంగా ఈ విషయం తెలిపాడు. దీనితో విద్యార్ధులలో అయోమయం నెలకొంది. నాయకత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేంద్ర నాయకత్వపు సాచివేత ధోరణి దృష్ట్యా, విద్యార్థులు చదువులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున్ సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. సెప్టెంబర్ 25 న తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా రాష్ట్రపతిని కలిసి, తెలంగాణాను ఏర్పాటు చెయ్యాలని కోరాడు. 1969 సెప్టెంబర్ 22న కొండా లక్ష్మణ్ బాపూజీ "ముఖ్యమంత్రిని మారిస్తే ఉద్యమం వాయిదా పడవచ్చు" అని అన్నాడు.విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటన పలు విమర్శలకు గురైంది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. 9 నెలలుగా చేసిన పోరాటం కొరగాకుండా పోతుందని విమర్శలు వచ్చాయి. తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు, వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. 1969 సెప్టెంబర్ 29 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా నాయకులను విడివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి.
అక్టోబర్ 10 నుండి తెలంగాణా అంతటా, చెన్నారెడ్డి పిలుపుమేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్ళలోపు విద్యార్ధులు పాల్గొనరాదని నిబంధన పెట్టారు. ఆ రోజునుండి మల్లికార్జున్ నిరాహారదీక్ష మొదలు పెట్టాడు. నవంబర్ 3 వరకు కొనసాగిన ఈ దీక్ష పోలీసులు ఆయనను అరెస్టు చేసి, ఆసుపత్రిలో చేర్చడంతో ముగిసింది.
1969 నవంబర్ 26 చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు. మరుసటిరోజు మరో ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లూ, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. డిసెంబర్ 6న తెలంగాణా ప్రజాసమితి నాయకులు టి.ఎన్.సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రక టనలో చెన్నారెడ్డిని ప్రజాసమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగిలిన నాయకులెవరూ వీరికి మద్దతు నివ్వలేదు.

1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాలేదు. 1971 సెప్టెంబర్ 24 న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేసాడు.ఈ పార్టీ ని రద్దు చెయ్యడం వెనకాల పెద్ద కుట్రే ఉందని యిట్టె అర్థం అవుతుంది, పార్టీ రధ్ధయ్యాక, గవర్నర్ పదవి చేపట్టాడు మర్రి చెన్న రెడ్డి, ఆ తర్వాతి కాలం లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కూడా అయ్యారు, అందుకే మొదటి తెలంగాణా ఉద్యమంలో ఉద్యమ ద్రోహిగా మిగిలి పోయాడు మర్రి చెన్నారెడ్డి.


        ఉద్యమం ఉదృతంగా సాగుతున్న రోజుల్లో కరీం నగర్ లోని ఇందిరా చౌక్ వద్ద రోజుకు ఒక కులంవారు తమ నిరసనను నిరాహార ధీక్షల రూపంలో కేంద్రానికి తెలియజేసారు, ఇక్కడ జరిగిన ఉద్యమాన్ని BBC ఛానల్ తమ ప్రతినిధిని పంపి కవర్ చేసింది.
               ఉద్యమం లో వీరోచితంగా పోరాడిన విద్యార్థుల్లో 369 మంది వీర మరణం పొందారు, ఆంద్ర పాలకుల తుపాకి తూటాలకు నేలకొరిగారు.
     అనేక మంది ఉద్యోగ నాయకులు తమ ఉద్యోగాలను కోల్పోయారు, రాజకీయ నాయకుల గారడిలో ప్రజల ఆకాంక్ష ఆవిరై పోయింది, ఆ శూన్యంలో ఏర్పడిన అంధకారం, నిరాశ, నిస్పృహల్లో ప్రజలు మల్లి తెలంగాణా ఉద్యమం యొక్క ఊసే ఎత్తలేదు, తెలంగాణా ప్రజలపై దోపిడి అధికమయ్యింది. ఆర్థికంగా   ఆంధ్రా వాళ్ళు బలవంతులయ్యారు, తెలంగాణా నాయకులను గుప్పిట్లో పెట్టుకున్నారు, ఎన్టిఆర్ వచ్చాక ఈ దోపిడి అధికమయ్యింది, తెలంగాణా అనే పదం పోయి తెలుగు వారి ఆత్మ గౌరవం తెరమీదికి వచ్చింది, తెలంగాణా సంస్కృతి, చరిత్రలపై ఎదేచ్చగా దాడి జరిగింది, చంద్రబాబు వచ్చాక తెలంగాణా అనే పదాన్నే నిషేధించాడు, మొత్తంగా తెలంగాణా లో ప్రతిరంగంవారు ఆంద్ర వారి వేధింపులకు గురి అయ్యారు, ఎందుకంటే ఉన్నతుద్యోగులు వాళ్ళు, కిందిస్థాయి ఉద్యోగులు తెలంగాణా వాళ్ళు, బొగ్గు తీసేవాళ్ళు తెలంగాణా వాళ్ళు, ఎ సి గదుల్లో వాళ్ళు, ఇవన్ని బరించి సహించారు తెలంగాణా ప్రజలు, తమ కళ్ళ ముందే తమ సంపదను ఆంద్ర వాళ్ళు దోచుకేల్తుంటే మౌనంగా చూస్తూ ఊరుకున్నారు, మల్లి తెలంగాణా ఉద్యమం వచ్చింది, చావో రేవో అంటున్నారు. ఈ పోరాటం సఫలం కావలి, తెలంగాణా సాధించుకోవాలి, మొద్దు నిద్దుర నటిస్తున్న కేంద్రానికి జ్ఞానోదయం కావలి, తెలంగాణా ప్రజలంతా ఇదే చైతన్యతో ఒక్క తాటి పైనే ఉండాలి, అదే తెలంగాణా ప్రజలకు శ్రీ రామ రక్ష... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి