హోం

25, జూన్ 2013, మంగళవారం

సౌత్ సూడాన్ విముక్తి పోరాటం..

               
(పై ఫోటో 1993లో కెవిన్ కార్టర్ అనే ఫోటోగ్రాఫర్ తీసారు, ఈ ఫొటోగ్రాఫ్ ద్వారా సౌత్ సూడాన్ పరీస్థితులు ప్రపంచానికి తెలిసాయి, తిండి లేక బొక్కలు తేలి కడు దీన స్థితుల్లో ఉన్న "ఆ పిల్లవాడు చనిపోతే తిందామని ఎదురుచూస్తున్న రాబంధు"ను ఫోటోలో చూడవచ్చు, ఈ ఫోటో కు పులేజ్టర్ అవార్డు వచ్చింది, కాని సూడాన్ లోని అంతర్యుద్దం కారణం గా అక్కడ నెలకొన్న కడు  దైన్య పరిస్థితులకు చలించిపోయిన ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ తీవ్ర మానసిక వేధనతో 1994లో మరణించాడు.)
                  మృత్యువుకు ఆకలి వేసింది అది సౌత్ సూడాన్ పై విరుచుకుపడింది, రక్తం తాగే నరరూప రాక్షసుల రూపంలో, అంతర్యుద్దం మిగిల్చిన నెత్తుటి ధారల రూపంలో, తాగడానికి గుక్కెడు నీరు లేక, తినడానికి పట్టెడు తిండి లేక,  ఆకలితో డొక్క లెండుక పోయిన, దాహంతో గొంతెండుకపోయిన అభాగ్యులు జీవణ సంద్యకు చేరుకుంటూ పెట్టె ఆక్రందనల రూపంలో, పాలు లేక, పాలు రాక ఆకలితో గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ఉదయించిన గంటల్లోనే అస్తమిస్తున్న పసిపిల్లల రూపంలో, ఎటు చూసినా దైన్యం, ఎటు చూసినా నైరాశ్యం, చీకట్లు తప్ప వెలుగులు చూడని బతుకులు, కటిక చీకటిలో భయంతో బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లబుచ్చుతున్న జనం. కారు, జీబు ఏ వాహనం వచ్చినా గుండెల్లో గుబులు, ఇళ్ళల్లోకి పరుగులు, రాక్షసులు వచ్చారేమోనని, తమ మాన, ప్రాణాలను కబలిస్తారని. జన్జావిడ్ల అకృత్యాలకు శవాల దిబ్బగా మారిన ఆ ప్రాంతం నీరు, సారవంతమైన భూమి లేని ఎడారి ప్రా0తం కాదు, ఖనిజాలు లేని గొడ్డు నేల కూడా కాదు, అన్ని ఉన్నా అక్కడివారికి అందని వైనం, పాలకుల వివక్ష ఆ ప్రాంతానికి శాపంగా మారింది.  ప్రపంచ విముక్తి పోరాటాల్లో 7 దశాబ్దాల కాలం జరిగి అత్యంత రక్త సిక్తం గా ముగిసిన ఆఫ్రికా ఖండపు సరికొత్త దేశం సౌత్ సూడాన్ విముక్తి పోరాట చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.

                       సూడాన్ ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద దేశం, ఈ దేశం లో 597 ఆదిమ తెగలు, 400 బాషలు ఉన్నాయి, ఇక్కడి తెగలలో అత్యదికులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు, బ్రిటిష్ పాలనలో ఉన్న రోజుల్లో ఈ దేశాన్ని విభజించు పాలించు అనే దోరణిలో వాళ్ళు పాలన సాగించారు, దక్షిణ సూడాన్ ప్రాంతం లో క్రైస్తవ మతం ప్రవేశపెట్టి ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడడం ప్రారంభించారు, నిజానికి సూడాన్ 1956 లో స్వాతంత్ర్యం పొందింది, అయినా దక్షిణ సూడాన్ వాళ్ళు తమకు స్వాతంత్ర్యం వచ్చిందని భావించలేదు, ఎందుకంటే సూడాన్ మొత్తం ఒక జాతి అనే భావన వారికి లేదు,  సూడాన్లో అత్యదికులు అరబ్బులు ఉంటారు, స్వాతంత్ర్యానంతరం వచ్చిన పాలకులు కుడా వారిమధ్య ఏర్పడ్డ ఆ అగాదాన్ని పూడ్చడానికి ప్రయత్నించలేదు సరికదా దానిని మరింత పెంచారు, దక్షిణ ప్రాంతం వారిని పట్టించుకోవడమే మానేశారు, ఫలితంగా ఆకలి చావులు, తీవ్రమైన కరువు,చివరికి అంతర్యుద్దం,  తమకు స్వేచ్చ కావాలంటూ 17 ఏళ్ళు జరిపిన ఈ పోరాటంలో 5 లక్షల మంది మరణించారు, ఈ పరిణామం ప్రపంచ దేశాల దృష్టి సుడాన్ పై పడేలా చేసింది, 1973లో సుడాన్ ప్రభుత్వం దక్షిణ సూడాన్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామనే హామీ ఇవ్వడం ద్వారా అంతర్యుద్ధం ముగిసింది, కాని పరిస్థితులలో మాత్రం మార్పు రాలేదు, ఒప్పందాలన్నింటిని తుంగలో తొక్కిన ప్రభుత్వం, కొంతమంది అరబ్బులను చేరదీసి జన్జావిడ్ ల పేరుతో దక్షిణ సూడాన్ వాసులపై దాడులు చేయించింది.  అసలే తిండి, నీరు లేక ఆకలితో అల్లాడుతున్న బక్క జీవులపై జన్జావిడ్ సబ్యులు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు, గ్రామాల్లోకి వస్తూనే కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చిపారెయ్యడం, ఆడవారిపై అత్యాచారాలు చెయ్యడం, చిన్నపిల్లలను నిర్దాక్షిణ్యం గా చంపివేయ్యడం, ప్రజలను ఇళ్ళల్లో పెట్టి సజీవ దహనాలు చెయ్యడం, జన్జావిట్ సభ్యులు గ్రామం లోకి వచ్చారంటే నిముషాలలో ఆ గ్రామం శవాల దిబ్బగా మారిపోవాల్సిందే,ఈ పరిణామాలతో 1983లో మరోసారి అంతర్యుద్దం మొదలయ్యింది. 

                    1989 లో సైనిక చర్య ద్వారా అదికారాన్ని చేజిక్కించుకున్న అల్ బషీర్ మరింత అరాచక పాలనను కొనసాగించాడు, సూడాన్ను ఏక పార్టీ ఇస్లామిక్ దేశంగా మార్చివేశాడు, మానవత్వ విలువలను మంట గలిపాడు, నిజానికి దక్షిణ సూడాన్ లోనే నైలు నది ఉన్నది కాని వాళ్లకు తాగడానికి నీళ్ళు లేవు, పంటలు లేవు, ఎటు చూసినా ఎడారిని తలపిస్తుంది, నీళ్ళను మొత్తంగా ఉత్తర సుడాన్ తన అవసరాలకు మల్లిన్చుకోవడంతో దక్షిన ప్రాంతానికి తాగడానికి గుక్కెడు నీళ్ళు లేని పరిస్థితులు దాపురించాయి, తినడానికి తిండి లేక బొక్కలు బయటకు తేలి బతికున్న కళేబరాల్లా అత్యంత దీన స్థితిలో బతుకులు వెల్లదీసారు, తాగడానికి నీరు దొరకని ఆ ప్రాంతంలో రక్తం ఏరులై పారింది, జన్జావిడ్ సబ్యుల అరాచకాలు బషీర్ పాలనలో మరింత పెరిగాయి, నిజానికి సూడాన్ దక్షిణ ప్రాంతంలో నీరు, సారవంతమైన భూములు, ఆయిల్, రబ్బర్, సహజ వాయు నిక్షేపాలకు అంతులేదు, అయినా చుక్క నీరు రాదూ, పంటలు పండవు, ఎటు చూసినా ఎడారే. ఖనిజాలు లభించేది ఇక్కడ, కాని వాటిని తరలించుకుని పోయి పరిశ్రమలు పెట్టేది అక్కడ, ఈ వివక్షను ఎదుర్కోవడానికి దక్షిణ సుడాన్ ప్రజలు "సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ" అనే దళాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వీరు సూడాన్ సైన్యం తోను, జన్జావాట్ సబ్యులతోను పోరాటాలు చేసారు ఈ పోరాటంలో అనేక మంది సాదారణ ప్రజలు అసువులుబాసారు. అదే సమయంలో అమెరికాలోని ట్విన్ టవర్స్ ను  తీవ్రవాదులు కుల్చివేసారు, ఒసామా బిన్ లాడెన్ సుడాన్లో దాక్కున్నాడని సమాచారం తెలియడంతో అమెరిక ఆగ్రహించింది, సౌత్ సూడాన్ లోని పోరాటాలను గమనించి అక్కడి సుడాన్ పీపుల్ లిబరషణ్ ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు, డబ్బును అందించింది. ఈ పరిణామంతో సుడాన్ చిక్కుల్లో పడ్డది, బషీర్ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టినా అవి సత్ ఫలితాలను ఇవ్వలేదు. సౌత్ సూడాన్ ప్రజలు గెరిల్ల పోరాటాల ద్వారా జన్జావిడ్ సబ్యులను మట్టుపెట్టడం ప్రారంబించారు. 2005 వరకు కొనసాగిన ఈ అంతర్ యుద్ధంలో 20 లక్షల మంది మరణించగా, మరో 40 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 2005 సమగ్ర శాంతి ఒప్పందం ద్వారా 6 ఏళ్ళ పాటు సౌత్ సుడాన్ కు ప్రత్యేక ప్రభుత్వం ఏర్పాటుతో పాటు, ఆరేళ్ళ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు అద్యక్షుడు బషీర్ ఒప్పుకున్నాడు. 6 ఏళ్ళ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణలో 98.9% మంది ప్రజలు తమకు స్వేచ్చ కావాలని, సౌత్ సుడాన్ ప్రత్యేక దేశం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా జూలై 9, 2011 న సౌత్ సుడాన్ స్వాతంత్ర్య దేశంగా అవతరించింది. సల్వా కీర్ మయర్దిట్ స్వతంత్ర దక్షిణ సూడాన్ కు మొదటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 

                       సౌత్ సూడాన్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, ముందుగా ప్రజలకు తిండి, విద్యనూ అందించాలి. దేశంలో ఉన్న ఆయిల్, గ్యాస్, రబ్బర్ యొక్క పరిశ్రమలన్నీ నార్త్ సుడాన్ లోనే ఉండడంతో కొంత కాలం ఆ దేశంపై ఆధారపడవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు నార్త్ సుడాన్ వాసుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి, నీరు, సహజ వాయువులు, ఆయిల్ అన్ని సౌత్ సుడాన్ లోనే  ఉండడంతో తమ భవితవ్యంపై వారు బెంగ పడుతున్నారు. మొత్తానికి 70 ఏళ్ళ పాటు సాగిన సుదీర్గ పోరాటం లక్షలాది మంది నెత్తుటి తర్పణంతో ముగిసింది, నేడు సౌత్ సూడాన్ ప్రపంచం పటంలో స్వాతంత్ర దేశంగా కొనసాగుతుంది. 

                               అన్నార్థులు అనాధలుండని
                               ఆ నవయుగమదెంత దూరం
                               కరువంటూ కాటకమంటూ 
                               కనిపించని కాలాలేపుడో 
                               పసిపాపల నిదుర కనులలో 
                               మురిసిన భవితవ్యం ఏదో 
                               గాయ పడిన కవి గుండెలలో
                               రాయబడని కావ్యాలెన్నో...  


(ప్రపంచంలో  ఎన్నో ప్రాంతాలు పాలకుల వివక్షకు గురయ్యి, సహజ వనరుల దోపిడీకి గురయ్యి తమ ఉనికి కోసం పోరాడుతూ విజయాన్ని సాధించాయి అలంటి పోరాటాలలో సౌత్ సుడాన్ పోరాటం ఒకటి. వివక్షకు, దోపిడీకి వ్యతిరేఖంగా జరిగిన ఇలాంటి పోరాట చరిత్రలు తెలుసుకోవడం ఎంతైనా అవసరమని  భావించి ఈ పోస్ట్ చేసాను..)

జన్జావిడ్ - ఒంటెలు గుర్రాలను మేపుతూ ఎడారులలో జీవించే అరబ్బుల సమూహం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి