నిండు గర్బిని 9 నెలలు నిండాయి, తోటి కోడలికి బిడ్డ పుట్టింది, నెలలు నిండినా ఈమెకు బిడ్డ పుట్టలేదు, నరక యాతన అనుభవిస్తుంది, ఆసుపత్రి సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందలేదు, ఆదుకోవడానికి అన్న వచ్చాడు, ఆమె యాతనను తొలగించే ప్రయత్నం చేసాడు మంత్రసానిని పిలిపించాడు, కాని ఆ ఇంటిపెద్ద-1 అందుకు ఒప్పుకోలేదు, అన్నను కొట్టి పంపించాడు, ఎంతో కష్టం మీద తోటికోడలు బిడ్డను కన్న సంవత్సరానికి ఆమె బిడ్డను కన్నది, ఇంటిపెద్ద-1 బిడ్డను ఆమెకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, నిర్దాక్షిణ్యంగా ఆమెను, ఆమె అన్నను చంపాలని ప్రయత్నించాడు, కాని ఆమె చావలేదు పారిపోయింది, మల్లి వచ్చి తన బిడ్డను తాను తీసుకపోగలననే గట్టి నమ్మకంతో వెళ్ళింది, ముక్కు పచ్చలారని 8 ఏళ్ళు ఆ పసిబిడ్డ కు పెళ్లి చేసాడు ఆ ఇంటి పెద్ద-1, హైదరాబాద్లో కాపురం పెట్టారు, కొన్నాళ్ళకు ఆ ఇంటి పెద్ద-1 మరణించాడు, ఒకడు పోయాడు అనుకుంటే ఇంకొకడు దాపరించాడు, ఈ కుటుంబంలో కూడా ఓ కుటుంబ పెద్ద-2, అత్త, ఆడబిడ్డ తయారయ్యారు ఆమెను కాల్చుకు తినడానికి. ఆమె తల్లి కొంతకాలానికి మల్లి వచ్చింది, తీవ్రంగా గొడవపడింది, కాని కుటుంబ పెద్ద-2 ఏమి మాట్లాడలేదు, రెండేళ్ళ తర్వాత ఆమె భర్త కుడా విడిపోవడానికి సిద్దపడ్డాడు కాని అప్పుడూ ఆ కుటుంబపెద్ద-2 ఒప్పుకోలేదు, ఏదో ఒకటి సర్దిచెప్పి కలిసి ఉండటానికి ఒప్పించాడు. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత ఆమె కష్టాలకు అంతులేదు, ఉద్యోగం చెయ్యమని ఒత్తిడి తెచ్చాడు ఆ భర్త, ఒక ఉద్యోగంలో చేరింది, జీతం డబ్బు తెచ్చి భర్తకు ఇవ్వాలి, ఆమె సంపాదన మీదనే కుటుంబమంత బతికి బట్టకట్టాలి, కాని ఆమె సంపాదనే ఆమెకు ఇవ్వరు, మొత్తం వాళ్ళే ఖర్చు చేసుకుంటారు, భర్త సంపాదన అతని వ్యసనాలకే సరిపోదు, తాగి ఇంటికి వచ్చి ఆమెను గొడ్డును బాదినట్టు బాదుతాడు, బూతులు తిడతాడు, గర్భం వస్తే (కొన్నినెలలపాటు సంపాదన ఉండదని) ఆమెకు గర్భం వచ్చినప్పుడల్లా గర్భ స్రావం చేయించడం మొదలు పెట్టారు, అన్ని బరించింది, సహించింది, మధ్యమధ్యలో అప్పుడప్పుడు తల్లి వచ్చి చూసి వెళ్తుండేది, దుబాయ్ లో ఉన్న తండ్రి తిరిగి వచ్చాడు, తండ్రి తనతండ్రి(కుటుంబ పెద్ద-1) చేసిన గోరాన్ని విని తట్టుకోలేకపోయాడు, బిడ్డను కాపాడుకోవడానికి కదిలాడు, ఆయనతో పాటు కుటుంబమంతా కదిలింది.
ఇది గమనించిన ఆ కుటుంబ పెద్ద-2 రాజీకి వచ్చాడు, ఇకపై సొంత కూతురిలా చూసుకుంటామని, ఈసారి గర్భ స్రావం చేయించమని హామీ ఇచ్చాడు, కాని వారి వేదింపులు ఆగలేదు, చివరికి ఆ తండ్రి తన కూతురికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు, కుటుంబ పెద్ద-2 కదిలాడు ఆమెకు విడాకులు ఇప్పిస్తానని ఊరందరిముందు ఒప్పుకున్నాడు, కాని ఆమె అత్త, ఆడపడుచు, ఇతర కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు, ఆమె ఇంటి నుండి వెళ్ళిపోతే ఖర్చులకు చిల్లి గవ్వ కూడా ఉండదని వాళ్లకు తెలుసు, ఆమెను ఎలాగైనా వెళ్ళకుండా ఆపాలని ప్రయత్నించారు, కుటుంబ పెద్దను బ్లాక్ మెయిల్ చేసారు, కుటుంబ పెద్ద వెనక్కి తగ్గాడు, ఆమె బతుకు మారలేదు, అప్పటినుండి ఆమె తల్లి, తండ్రి పోరాడుతూనే ఉన్నారు, కాని ఆ కుటుంబ పెద్ద-2 మాత్రం మీ కూతురును ఇప్పుడు పంపిస్తాను, అప్పుడు పంపిస్తాను అంటూ గడువులు పెడుతున్నదే తప్ప ఆమెకు విముక్తి కల్పించడం లేదు,ఆమె తల్లి విముక్తికి పాటు పడిన ఆమె మేన మామలు ఒకరు ఆమె వైపు నిలిస్తే ఇంకొకరు ఆమెను పట్టించుకోవడం మానేశారు, ఇప్పుడామెకు కొత్త మిత్రుడు పుట్టుకోచ్చాడు అతను గతంలో ఎంతో మంది అతివలకు మేలు చేసినవాడు, అతను కుడా మేలు చేస్తానని అంటున్నాడు, కాని అతనికి ఎన్నో పనులు ఉన్నాయి, అందులో ఇది ఒకటి మాత్రమె. తల్లి, తండ్రులు మాత్రం ఆమెకు విముక్తి కల్పించాలని అదే పనిగా పెట్టుకొని పోరాడుతూనే ఉన్నారు.
కార్పోరేషన్ ఎన్నికలు వచ్చాయి, కుటుంబ పెద్ద-2 నిలబడుతున్నాడు, అత్త, ఆడపడుచు, భర్త అందరు ప్రచారం కోసం ఊరంతా తిరుగుతున్నారు, ఇంటిపెద్ద-2కు వ్యతిరేఖంగా ఆమె తండ్రి పోటీ చేస్తున్నాడు, ఆమె తన తండ్రి, తల్లి సాయంతో గృహ హింసా చట్టం కింద భర్త, అత్త, ఆడపడుచు, కుటుంబ పెద్ద-2ల మీద కేసు పెడదామని అనుకుంటుంది, అలా జరిగితే ఎన్నికల నాటికి కుటుంబమంత జైల్లో కూర్చుంటుంది, ఎన్నికలలో డిపాసిట్ కుడా రాదని గమనించిన ఆమే భర్త, అత్త లు ఆమె పై విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు, ఎలాగైనా ఆమెను కేసు వెయ్యకుండా చూడడమే కాకుండా, ఆమెను తన తండ్రికే వ్యతిరేఖంగా ప్రచారం చేసేలా మార్చాలని పథకం వేసారు, ఎన్నడు పట్టించుకోని ఆ కుటుంబ పెద్ద-2 ఆమెకు బంగారు హారం చేయిస్తున్నాడట..? ఎన్నడు మాట్లాడని ఆడబిడ్డ తండ్రి డైరెక్షన్లో ఆమె ను మంచి చేసుకోవాలని చూస్తుంది, ఇప్పుడు ఆమె అవసరం ఆ కుటుంబం మొత్తానికి కలిగింది, కాని నిజంగా తన కోసం, తన విముక్తి కోసం పోరాడుతున్న తన తల్లి, తండ్రుల వైపే ఆమె నిలిచింది, వారి మార్గనిర్దేశనం లో నడుస్తుంది, త్వరలోనే ఆమెకు విముక్తి లబిస్తుంది అని ఆశిద్దాం, మరి మీ ఓటు ఎవరికీ ఆమెను మొదటినుండి విముక్తి చెయ్యాలని చుసిన ఆమె తల్లి, తండ్రులకా..? లేక ఆమెను చిత్ర హింసలు పెట్టిన ఆమె అత్తా, ఆడపడుచులకా..? తమ స్వార్ధం కోసం ఆమెను ఉపయోగించుకునే కుటుంబ పెద్దకా..?
( కుటుంబ పెద్ద-1,2- కాంగ్రెస్ అధిష్టానం, భర్త-సీమంద్ర, అత్త-టి డి పీ, ఆడపడుచు-టీ కాంగ్రెస్, తల్లి- తెలంగాణా ఉద్యమం, తండ్రి- టి అర్ ఎస్, మిత్రుడు- బి జె పీ, అన్న తర్వాత మామలు- కమూనిస్ట్ పార్టిలు, ఆమె- తెలంగాణ. బంగారు హారం- ప్యాకేజి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి