హోం

12, జూన్ 2013, బుధవారం

స్మిత..జన హిత..

        

ఐఏఎస్-2001 బ్యాచ్‌కు చెందిన స్మితా సబర్వాల్, 2011 ఏప్రిల్ 18న కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆమె, జిల్లాపై తనదైన ముద్ర వేశారు. ‘అమ్మలాలన’, ‘మార్పు’ పథకాల అమలులో రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా నిలిపారు. వసతి గృహాల్లో విద్యాప్రమాణాల పెంపునకు ‘స్కైప్’ విధానం ప్రవేశపెట్టి, విద్యార్థులకు చేరువయ్యారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘అమ్మలాలన’ ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల పెంపు కోసం విశేష కృషి చేశారు. గురుకులాల్లో, వసతి గృహాల్లో ‘స్కైప్’ విధానం ప్రవేశపెట్టి విద్యాప్రమాణాల పెంపుకోసం పాటుపడ్డారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా కృషి చేస్తూ విద్యార్థులకు చేరువయ్యారు. ‘మార్పు’ పథకాన్ని వివిధ శాఖలకు అనుసంధానం చేస్తూ అమలులో జిల్లాను ముందుంచారు. 

              ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనూ ‘స్కైప్ వీడియో కాలింగ్ సిస్టమ్’ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపడేందుకు కృషి చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నందుకు గాను 2012-13కు రెండు బంగారు పతకాలను సైతం స్మితా అందుకున్నారు. ‘20 సూత్రాల పథకం’ అమలులో 2011-12కు గాను జిల్లాను నంబర్‌వన్ స్థానంలో నిలిపి, సీఎం నుంచి అవార్డు అందుకున్నారు. అమ్మలాలన, ప్రజావాణి కార్యక్రమాల అమలులో, నిర్మల్ భారత్ అభియాన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి, కొనుగోళ్లలోనూ వరుసగా రెండేళ్లు జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. జనరిక్ మందులను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు మహిళా సమాఖ్య ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో జనరిక్ మందుల షాపును ప్రారంభించారు.

                అవినీతి దరిచేరకుండా కఠినంగా వ్యవహరించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే ఒకేసారి 40 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. 15 మంది జిల్లా స్థాయి అధికారులనూ బదిలీ చేయడంతో పాటు పలువురిని మాతృ సంస్థలకు పంపించారు. గ్రామాల్లో అందుబాటులో ఉండని వైద్యులపై, రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కొరడా ఝులిపించారు. బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెల నుంచే స్మితా సబర్వాల్ బదిలీ అవుతారన్న ప్రచారం జరిగింది. ఆమె హైదరాబాద్ లోని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(NHRM) డైరెక్టర్ గా నియమించబడ్డారు .                                                   -from namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి