హోం

30, మే 2013, గురువారం

కారేక్కనున్న కాంగ్రెస్ నాయకులు..


జూన్ 2న టీఆర్‌ఎస్‌లో చేరుతాం: టీ కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్: టీకాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు సీనియర్ నేతలు ఎట్టకేలకు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి ఎంపీ వివేక్, నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంతోపాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత కె. కేశవరావులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు స్ఫష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకే ఆ పార్టీని వీడుతున్నట్లు వారు వెల్లడించారు. ఎంపీ వివేక్ ఇంట్లో భేటీ అయిన నేతలు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జూన్ 2న నిజాం కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహంచి వేలాది మంది ఉద్యమకారుల సమక్షంలో తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలుస్తామని కేకే చెప్పారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, వివేక్‌లతో పాటు మందా కుమారుడు, కేకే కుమారుడు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, నేతలను పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నామని, వారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఉద్యమనేత కేసీఆర్ అన్నారు. వీరి చేరికతో ఉద్యమానికి వెయ్యి ఏనుగుల బలమొచ్చిందన్నారు.

నేటితో డెడ్‌లైన్ ముగిసింది: కేకే 
తెలంగాణపై తేల్చాలని తాము కాంగ్రెస్ అధిష్ఠానానికి పెట్టిన డెడ్‌లైన్ నేటితో ముగిసిందని, అందుకే ఉద్యమపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు తెలిపారు. తెలంగాణ కోసం పదేళ్లు వేచి చాశామని, చేయాల్సిన ఉద్యమాలన్ని చేశామని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలతో మమేకమై ఉద్యమాన్ని కొనసాగిస్తుందని అందుకే ఉద్యమపార్టీతో కలిసి తెలంగాణ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నామని కేకే వ్యాఖ్యానించారు. ‘మా నిర్ణయం స్వార్థంతో తీసుకున్నది కాదు. మేం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికలతో ముడి పెట్టొద్దు. ఆంధ్రా మీడియా నాపై ఇష్టమొచ్చినట్టు రాయొద్దు’ అని కేకే విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ అధిష్టానానికి తాము ఇచ్చిన గడువు ఇవాళ సాయంత్రం వరకు ఉందని అంత వరకు వేచి చూస్తామని కేకే స్పష్టం చేశారు. సాయంత్రం వరకు కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తామని తెలిపారు. సాయంత్రంలోగా అధిష్టానం నుంచి నిర్ణయం వస్తుందని అనుకుంటున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నపై కేకే స్పందించారు. ఇన్నేళ్లుగా రాని నిర్ణయం సాయంత్రంలోగా వస్తుందని తాము అనుకోవడంలేదని ఆయన అన్నారు.

తెలంగాణ వాగ్దానాన్ని అధిష్ఠానం మరిచింది: మందా 
డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని 120 కోట్ల భారతీయుల సాక్షిగా పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందని కాంగ్రెస్ ఎంపీ మందా జగన్నాథం గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్ధానాన్ని అధిష్ఠానం మరిచిందని మందా ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇవ్వాలని అధిష్ఠానం అనేకసార్లు కోరామని తెలిపారు. అయినా కాంగ్రెస్‌పార్టీ పట్టించుకోలేదని ఆవేదనతో అన్నారు. తమ పార్టీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేక పోయిందని తెలిపారు. ఇచ్చిన మాట తప్పడమే కాంగ్రెస్ సిద్థాంతమా చెప్పాలని బొత్సను ప్రశ్నించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇవ్వని కాంగ్రెస్‌లో ఉండదలచుకోలేదని తెలిపారు. ‘మా పార్టీ తెలంగాణను ప్రకటిస్తుందనే ఆశలేదు. అందుకే మేం కాంగ్రెస్‌ను వదిలి ఉద్యమపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం’ అని వెల్లడించారు. జూన్ 2న నిజాం కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో తాము ఉద్యమపార్టీలో చేరుతున్నామని మందా ప్రకటించారు. స్వపక్షంలో ఉండి తెలంగాణ ఆకాంక్షను పార్లమెంట్ మెట్లపై కూర్చుండి పార్లమెంట్‌లో వెల్లడించామని తెలిపారు.

దళితులమైనందుకేనా మమ్మల్ని పట్టించుకోలేదు: మందా 
సొంత పార్టీ ఎంపీలమైన తాము తెలంగాణపై తేల్చాలని కోరుతూ పార్లమెంట్ మెట్లపై కూర్చుని నిరసన తెలిపినా అధిష్ఠానం పట్టించుకోలేదని మందా జగన్నాథం కాంగ్రెస్‌ను విమర్శించారు. తెల్లవార్లు తాము పార్లమెంట్ భవనం మెట్లపై కూర్చుని తెలంగాణ కోసం నిరసన తెలుపుతున్నా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అదే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ, అగ్రవర్ణ నేత కావూరి సాంబశివరావు తనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాను, రాహుల్‌ను బహిరంగంగా విమర్శించినపుడు, కాంగ్రెస్‌పార్టీన తిట్టినపుడు పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ ఇతర నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారని, అదే తాము దళితులమైనందుకేనా తమను పట్టించుకోలేదని మందా తీవ్రంగా దుయ్యబట్టారు. ముగ్గురు దళిత ఎంపీలు తెలంగాణ కోసం నిరసన తెలియజేస్తే పట్టించుకోరా? దళిత ఎంపీలను అవమానిస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. స్వపక్షంలో ఉండి ప్రజల ఆకాంక్షను పార్లమెంట్‌లో తెలియజేయడం చరిత్రలో ఎక్కడా లేదని విమర్శించారు.

తెలంగాణ సాధించే సమయం ఆసన్నమైంది: వివేక్ 
త్వరలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని కాంగ్రెస్ ఎంపీ వివేక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వెలువడగానే సీమాంధ్ర నేతలు ఒక్కటై రాజీనామాల డ్రామాలాడి తెలంగాణను అడ్డుకున్నారని వివేక్ విమర్శించారు. ఇవాళ మనమంతా ఒకటై తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించే అవకాశం చిక్కిందని తెలిపారు. ఉద్యమపార్టీలో చేరి తెలంగాణ కోసం పోరాడండి అని తమ కార్యకర్తలు చేసిన సూచన మేరకే తాము ఉద్యమపార్టీలో చేరుతున్నామని వివేక్ పేర్కొన్నారు. జూన్ 2న నిజామ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలోటీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ఆయన తెలిపారు.
ఉద్యమపార్టీలో చేరుతా: మర్రి జనార్దన్‌రెడ్డి
మహబూబ్‌నగర్: తెలంగాణలో టీడీపీ దుకాణకం ఖళీ అవుతోంది. ‘నేను తెలంగాణ బిడ్డను. అందుకే సీమాంధ్ర పార్టీని వీడాను’ అని టీడీపీకి రాజీనామా చేసిన మర్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు. తాను ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు ఇవాళ ప్రకటించారు. జూన్ 2న నిజాం కాలేజీ మైదానంలో జరుగబోయే బహిరంగ సభలో తాను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించారు. ఉద్యమపార్టీ ఆహ్వానం మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నది టీఆర్‌ఎస్ ఒక్కటే, టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి ఇప్పటి వరకు వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు.
                                                                  -from namaste telangana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి