హోం

29, మే 2013, బుధవారం

జూన్ 14న ఛలో అసెంబ్లీ..!


ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇప్పటికే పలు కార్యక్రమాలతో దూసుకెళ్తున్న జేఏసీ ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూన్ 14న ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపడుతున్నట్లు టీ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. టీఎన్జీవో భవన్‌లో టీ జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. లక్షలాదిగా హైదరాబాద్‌కు తరలిరావాలని తెలంగాణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జూన్ 1 నుంచి ‘ఛలో అసెంబ్లీ’ కోసం తెలంగాణవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపడుతామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీపై ఒత్తిడి తెచ్చేలా ప్రచారం ఉంటుందన్నారు. ప్రతి తెలంగాణవాది ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. 

సీమాంధ్ర పార్టీలకు దిమ్మ తిరిగేలా ఛలో అసెంబ్లీ నిర్వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణపై ప్రతిసారి వలస పాలకులు మోసం చేస్తున్నారని తెలిపారు. పాలకులు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ఛలో అసెంబ్లీ కార్యక్రమం అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు తెలంగాణ ప్రజలకు ఉందని పేర్కొన్నారు. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు. తాము శాంతియుతంగానే ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతామని తెలిపారు. టీఎన్జీవో భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీలో భాగస్వామ్యులైనటువంటి ఇతర సంఘాల నేతలు హాజరయ్యారు. సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి అనే అంశంపై చర్చించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి