హోం

15, మే 2013, బుధవారం

కురుమల కులదైవం బీరప్ప పండుగ-తెలంగాణా ప్రత్యేకం.




కురుమల కులదైవం బీరప్ప. ఆ దేవున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ గొర్రెల కాపర్ల వృత్తిగల కురుమ కులస్తులు జరిపించే అతిపెద్ద పండుగ బీరప్ప పండుగ. ఈ పండుగను ‘పెద్ద పండుగ’ అని కూడ అంటారు. రోజుల వారీగా ఎనిమిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ వివరాలు ‘బతుకమ్మ’కు ప్రత్యేకం.ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుండి జూన్ వరకు నాలుగు నెలల్లో ఈ పండుగను కురుమలు వారి వారి గ్రామాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగను శుక్రవారం నుండి శుక్రవారం వరకు అంటే ఎనిమిది రోజులు జరుపుకుంటారు. ఒకసారి పండుగ చేసుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాత వారి వీలును బట్టి జరుపుకుంటారు.ఈ పండుగలో ఊరి జనం అందరు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ పాల్గొంటారు. గొర్రెల కాపర్లు తమ గొర్రెల మందలు క్షేమంగా ఉండాలనే కాంక్షతో ఈ పండుగని నిర్వహిస్తారు. పండుగని నిర్వహించడానికి కురుమలలోనే ప్రత్యేకంగా పూజారులుంటారు. వారిని ‘బీర్‌నోల్లు’ అంటారు. వీళ్ళని ‘ఒగ్గు పూజారులు’ అని కూడా అంటారు. ఏ ఊరి వారైతే పండుగని నిర్వహించదలుస్తారో ముందుగా బీర్‌నోల్లని సంప్రదించి శుభ ముహూర్తాన్ని ఎంపిక చేసుకొని పండుగకు శ్రీకారం చుడతారు. రోజుల వారీగా ఈ పండుగ ఎలా జరుపుకుంటారో చూడండి.

శుక్రవారం తొలిరోజు:
కురుమలు ఈ రోజు గ్రామదేవత పోచమ్మను పూజిస్తూ ఇంటి నుండి బోనాలు చేస్తారు. పండుగ ప్రారంభమయ్యేది ఇలాగే. 

శనివారం
కురుమలు ఆ రోజు బీరప్ప గుడిలోని లింగాలను శుభ్రపరచి ఒక గొంగడిలో మూటగా కట్టి, రాత్రివేళ బీర్‌నోల్లకు తెలియకుండా గ్రామ సమీపంలోని బావులలోకాని, చెరువులలో కాని దాచి పెట్టి వస్తారు.

ఆదివారం
ఉదయం బీర్‌నోల్లు ప్రత్యేక వేషాలు ధరించుకొని గత రాత్రి కురుమలు దాచిపెట్టిన లింగాలను వెతకడానికి బయలుదేరుతారు. డోల్లు, తాళాల వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్తారు. మధ్య మధ్యలో కత్తిసాము, కర్రసాము లాంటి విద్యలు ప్రదర్శిస్తూ ప్రజలని ఆనందింపజేస్తారు. లింగాలను వెతకడానికి తీవ్ర ప్రయత్నం చేసి ఎలాగైనా కనుగొంటారు. ఆ లింగాలను తెచ్చేముందు గంగపూజ చేసి, గుడి వద్దకు తెస్తారు. ఇక రాత్రయ్యాక ప్రతి ఇంటి నుండి దేవుని ‘పెళ్ళి బోనాలు’ చేస్తారు. రాత్రి బోనాల ఊరేగింపు డోలు వాయిద్యాలతో బీర్‌నోల్ల కత్తి, కర్ర సాముల సాహస కృత్యాలతో గుడి వరకు సాగుతుంది. ఆ రాత్రి బీరప్ప కథ చెబుతారు. రాత్రంతా కథ చెబుతూనే ఉంటారు.

సోమవారం
పండుగలో ఇది అతి ముఖ్యమైన రోజు. బీరప్ప - కామరాతిల’ కళ్యాణం జరుగుతుంది. ఉదయం నుండి కథ చెబుతూనే ఉంటారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన కథ సోమవారం దేవుని పెళ్ళి జరిగే వరకూ చెబుతూనే ఉంటారు. దేవుని పెళ్ళి రోజు కురుమలు వారి బంధువులు సమీప గ్రామాల ప్రజలు, ఆ గ్రామ ప్రజలు, నాయకులు కులాల కతీతంగా పాల్గొని కళ్యాణ కార్యక్షికమాన్ని వీక్షిస్తారు. అనంతరం గావు పడుతారు. పెళ్ళి అనంతరం కురుమలు ఒడి బియ్యం పోసుకుంటారు. ఆ రోజు రాత్రి విందు, వినోదాలతో కురుమ వాడలు కళకళలాడుతాయి.

మంగళవారం
ఉదయం గ్రామ రచ్చబండ వద్ద లేదా గుడి ముందు అదీ కాకపోతే ప్రజలకు అనుకూలంగా ఉన్న చోట ‘బీరనోల్లు’ కాశీ రామక్క కథ చెబుతారు. అదే కథలో మధ్య మధ్య జనాల వినోదం కొరకు ‘జోగు వేషాలు’ వస్తాయి. సాయంత్రం ‘రేణుకా ఎల్లమ్మ’ వేషం రాగానే ప్రజలందరు భక్తిశ్రద్ధలతో వీక్షిస్తారు. బీర్‌నోల్లలోని పురుషులే మహిళా దేవతల పాత్రలు ధరిస్తారు. సాయంత్రం ఎల్లమ్మ పాత్రధారుడు ప్రతి కురుమ ఇంటిని సందర్శిస్తాడు.

బుధవారం
బీరప్ప దేవుడు తన ప్రియురాలు కామరాతిని తన వద్దకు తీసుకురావడానికి రకరకాల గారడీ వేషాలు వేసి విజయం సాధిస్తాడు. ఆ సంఘటనను పురస్కరించుకొని బుధవారం రోజున గ్రామ రచ్చబండ దగ్గర గారడీ వేషం కథ చెబుతారు. గారడీ వేష పాత్రధారుడు చేసే విన్యాసాల ముందు మెజీషియన్‌ల ఇంద్రజాల విద్య తక్కువగానే కనిపిస్తుంది. మామిడిటెంకను నాటి నిమిషాల వ్యవధిలోనే మొక్కగా మారుస్తాడు. గంట సమయంలోపే దానిని చెట్టుగా మార్చి, దానికి మామిడికాయలు సృష్టిస్తాడు. ఆ మామిడి కాయలను కోసి వాటి ముక్కలను కురుమలచే తినిపింపచేస్తాడు. అబ్బురపరిచే ఇలాంటి విన్యాసాలు ఎన్నో పలువురిని ఆకట్టుకుంటాయి.
రాత్రి నాగ భోనాలు చేస్తారు. బోనాల ఊరేగింపు ఘనంగా సాగుతుంది. ఈసారి బీరప్ప, కామరాతి, మహంకాళి, బోగన్న వేషాలుంటాయి. బోగన్నను చూస్తే చిన్నపిల్లలు భయపడి తల్లిచాటు దాక్కుంటారు. రాత్రి బోనాల ఊరేగింపు గ్రామ రచ్చబండ దగ్గరకు రాగానే మల్లన్న కథ, సమితుల వాదం కథ చెబుతారు. ఆ కథ చెబుతున్నంత వరకు మహిళలు బోనాలు ఎత్తుకునే ఉంటారు. తెల్లవారు సమయానికి బోనాలు గుడికి చేరుకుంటాయి.

గురువారం
దేవుని నాగ కార్యక్షికమం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు కథ చెబుతూనే ఉంటారు. కంప్యూటర్ యుగంలో కూడ కథలు వినడానికి వచ్చే జనం ఆసక్తిని గమనిస్తే జానపద గాథలకున్న గొప్పతనం తెలుస్తుంది. సాయంత్రం అక్క మహంకాళి దేవత అలకవహిస్తే ఆ దేవతను తిరిగి తీసుకురావడానికి బీరప్ప వేషధారి ఆలాపన జనాలకు భావోద్వేగాన్ని కలుగజేస్తుంది. జనాలు కన్నీటి పర్యంతమవుతారు. అక్క మహంకాళి దేవత పాదాలు నేలకి తాకకుండా ఆమె నడిచినంత స్థలంలోను బట్టలు పరుచుకుంటూ స్వాగతం పలుకుతారు. ఈ రోజుతో దాదాపుగా పండుగ కార్యక్రమాలు ముగింపుకు వస్తాయి. 

శుక్రవారం
ఇది పండుగలో చివరిరోజు. కురుమలు గుడి ప్రాంగణంలో కాని, కొద్ది దూరంలో గాని వన భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. వారం రోజుల పాటు జరిగిన పండుగ మధురానుభూతులు మననం చేసుకుంటారు. కార్యక్షికమాన్ని నిర్వహించిన పూజారుల (బీరనోల్లు)కు వీడ్కోలు చెబుతూ గ్రామ పొలిమేర దాటేవరకు వారిని సాగనంపడంతో పెద్దపండుగ పూర్తవుతుంది. అమాయకత్వానికి, నిజాయితీకి మారు పేరయిన కురుమలు జరిపే ఈ పెద్ద పండుగకు ప్రజలందరు సహాయ సహకారాలు అందిస్తారు.రాత్రి బోనాల ఊరేగింపు గ్రామ రచ్చబండ దగ్గరకు రాగానే మల్లన్న కథ, సమితుల వాదం కథ చెబుతారు. ఆ కథ చెబుతున్నంత వరకు మహిళలు బోనాలు ఎత్తుకునే ఉంటారు.
           - భైతి దుర్గయ్య, రామునిపట్ల, చిన్నకోడూర్, మెదక్. 99590 07914.
                                                                               -from bathukamma.

2 కామెంట్‌లు:

  1. నేటి కంప్యూటరీ యుగంలో కూడా ఈ పండగ నిర్వహిస్తున్నారా? గతాన్ని నేటి తరంముందు ఆవిష్కరించటమే "నవనవోన్మేషము" అద్భుతం!
    కవిచంద్ర, సాహితీ రత్న,
    మద్దా సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  2. నేటి కంప్యూటరీ యుగంలో కూడా ఈ పండగ నిర్వహిస్తున్నారా? గతాన్ని నేటి తరంముందు ఆవిష్కరించటమే "నవనవోన్మేషము" అద్భుతం!
    కవిచంద్ర, సాహితీ రత్న,
    మద్దా సత్యనారాయణ

    రిప్లయితొలగించండి