హోం

19, మార్చి 2013, మంగళవారం

జయరాజు ఇన్నర్ వ్యూ..

           
                          
                           ఆయన పాటకు ప్రకృతి పలవరిస్తుంది. గజ్జెకట్టి గంతేస్తే జనం పిడికిళ్లు బిగించి జత కూడుతరు. పీడిత, తాడిత ప్రజలకు ఆయన పాట కోయిల కూతయితే, సింగరేణి గని కార్మికులకు సైరన్ మోత. ఆయన ప్రజల పాటైనందుకు అధికార బలం ఆయన గొంతు నులిమే ప్రయత్నమూ చేసింది. అయినా, అనునిత్యం నిర్భందాల్లోంచే ఆయన పల్లవై ప్రతిధ్వనించిండు. ‘వానమ్మ, వానమ్మ వానమ్మా... ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ’ అంటూ ఎండిన గోదావరిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నడు. విప్లవమైనా, తెలంగాణ ఉద్యమమైనా, సామాజిక పోరాటమైనా దేనికైనా ‘పాటే ప్రాణం’ అంటున్న మానుకోట ముద్దుబిడ్డతో ‘జయరాజు’తో ఈ వారం ఫటాఫట్. 
మీరు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం?
పాట రాసిన ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకుంటా.
పూర్తి పేరు?
గొడిశాల జయరాజు.
పుట్టింది ఏ వూరు?
మహబూబాబాద్, వరంగల్ జిల్లా.
కుటుంబం? 
భార్య మంగతాయి, కుమారులు సాదన్, నిషాంత్.
తల్లిదంవూడులు?
తండ్రి కిష్టయ్య, తల్లి చెన్నమ్మ (వ్యవసాయ కూలీలు), సాదుకున్న తల్లి అచ్చెమ్మ.
చదువు?
ఎల్.ఎల్.బీ., (పూర్తి చేయలేదు).
మీరు ఏ వయస్సు నుంచి పాటలు రాస్తున్నారు?
నేను ఐ.టీ.ఐ. చేస్తున్న సమయంలో నా మిత్రుడు చేరాలును కొంతమంది చంపేశారు. అతని మీదే మొదటి పాట రాశా.
ఆ పాట కొంచెం వినిపిస్తారా?
‘నీ పాట విన్న వీర ప్రజలు నీ పాటడుగుతున్నరు.’
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం? 
హైదరాబాద్ సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఫిట్టర్.
రాయడమేనా లేక పాడుతారా? 
పాడడం చేశాకే రాయడం నేర్చుకున్నా.
ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు?
ఐదు వందలకు పైగానే.
సినిమాలకు ఏమన్న రాశారా?
15 సినిమాలకు రాశా. ‘దండోరా’లో ‘ఓ కొండల్లో కోయిలా పాటలు పాడాలి’, ‘అడవిలో అన్న’లో ‘వందనాలమ్మా నీకు’ పాటలు జనాదరణ పొందాయి.
ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమన్న తీశారా? కొన్ని పేర్లు చెప్పండి?
‘వందనాలమ్మా’, ‘భారత మార్క్స్ అంబేద్కర్’, ‘బుద్ధం శరణం గచ్ఛామీ’, ‘వసంత గీతం’, ‘ఎర్ర మందారాలు’,‘ఎర్ర మేఘాలు’.
మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట?
‘వానమ్మ వానమ్మ వానమ్మా.. ఒకసారన్న వచ్చిపోయే వానమ్మా’
ఆ పాట రాయాలని ఎందుకనిపించింది?
‘కాళ్ళల్ల గోదావరి, కళ్లల్లో కృష్ణ ఉన్నా గుండెల్లో దాహం తీరని తెలంగాణను చూసి’.
తెలంగాణ ఉద్యమంలో పాటకున్న ప్రాధాన్యం?
ఉద్యమ తూటాలుగా మలచగలిగే శక్తిని పాట ఇచ్చింది.
జానపద పాటలంటే ఇష్టమా? మెలోడీనా?
హృదయానికి తగిలే ప్రతీ పాట ఇష్టమే.
రచయితగా మీకు స్ఫూర్తి ఎవరు?
గద్దర్.
ఎక్కువగా ఎలాంటి పాటలు రాస్తుంటారు? 
మమతలు, మమకారాలు, ప్రకృతి సౌందర్యం, మానవీయ కోణం కలిగిన పాటలు.
మీకు నచ్చిన గాయకుడు, రచయిత?
గాయకుడు జేసుదాసు, రచయిత దాశరథి.
మీ పాట కాకుండా మీకు ఇష్టమైన పాట?
ఆత్రేయ రాసిన ‘మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే...’
పాటలు కాకుండా ఇంకేం చేస్తారు?
ప్రకృతి వనరులు ప్రజలకు దక్కడం కోసం పాటను ఆయుధంగా చేసుకుని బుద్దిజాన్ని ప్రచారం చేస్తున్నా.
లాంటి సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
జానపద సంగీతం.
విప్లవ పంథా నుండి తెలంగాణ ఉద్యమం వైపు మర్లడానికి కారణం?
ప్రతి ప్రగతిశీల ఉద్యమంలోనూ నా భాగస్వామ్యం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నీ తడుముకుంటూ వెళ్తున్న.
విప్లవ సాహిత్యాన్ని రాసిన మీరు ఇప్పుడు ఎలాంటి పాటలు రాస్తున్నారు?
అప్పుడూ ఉద్యమ పాటలే రాశా. ఇప్పుడూ అవే రాస్తున్నా.
తెలంగాణ సాహిత్యానికి, విప్లవ సాహిత్యానికి సారూప్యత ఉందా?
తెలంగాణ ఉద్యమం విశాలమైన ప్రజాస్వామ్య ఉద్యమం. విప్లవోద్యమం వర్గ దృక్పథంతో కూడిన ఉద్యమం. కనుక సాహిత్యంలో కొంత తేడా ఉంటుంది.
మీలో మీకు నచ్చే విషయం?
నన్ను నేను ప్రేమించుకుంటూనే తోటి వారిని ప్రేమించడం.
తెలంగాణలో మీకు ఇష్టమైన ప్రాంతం?
పాపికొండలు.
దేవుణ్ని నమ్ముతారా?
‘ప్రకృతే పరమాత్మ’ అని నమ్ముతాను.
మీ జీవితంలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు?
నా జీవిత భాగస్వామిని.
మిమ్మల్ని మీ ఊరివాళ్ళు ఎలా చూస్తారు?
ప్రపంచం గుర్తించాకే ఊరు గుర్తిస్తుంది. ఇప్పుడైతే నన్ను ఉన్నతంగా చూస్తారు.
మీ కిష్టమైన స్పోర్ట్స్ ?
వాలీబాల్.
కోపం వస్తే ఏం చేస్తరు?
దిగమింగుకుంటా.
మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వాళ్లు?
ప్రజాకవి ‘శక్తి’.
ఏ సందర్బంలో పాటలు రాస్తారు?
సమాజంలో జరిగే ప్రతి దానికి స్పందించి రాస్తా.
తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు?
పుస్తకాలు చదువుతా.
ఎలాంటి బుక్స్ చదువుతారు?
ప్రగతిశీల సాహిత్యం, తాత్విక, ప్రకృతి సంబంధ పుస్తకాలు.
మిమ్మల్ని మీరు తిట్టుకున్న సందర్భం?
నన్ను భాగా ప్రేమించే వాళ్ళే నన్ను అర్థం చేసుకోకుండా నాకు దూరమవుతున్నపుడు.
ఎవరిమీద మీరు ఎక్కువగా ఆధారపడతరు?
నా భార్యపైన.
మాపాఠకుల కోసం ఇంకేమైనా చెప్తరా?ప్రకృతిని విధ్వంసం చేస్తూ ‘అభివృద్ధి’ అనుకుంటున్నారు. కానీ, దానివల్ల మానవ సమాజమే విధ్వంసం అవుతోంది. భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు దొరకని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే, ఏ అభివృద్ధి అయినా ప్రకృతికి లోబడే జరగాలి. కుల, వర్గ రహిత, స్త్రీ వివక్ష లేని సమాజమూరావాలి.     - from bathukamma

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి