తరతరాలుగా దోపిడీకి, పీడనకు గురౌతున్న దళితుల వికాసానికి, అభివృద్ధికి దృఢ సంకల్పంతో, సేవా భావంతో తన జీవితాంతం అలుపెరుగని పోరాటం జరిపిన ధీర వనిత ఈశ్వరీబాయి... తెలుగుతనానికి నిదర్శనం ఈశ్వరీబాయి కట్టూ, బొట్టూ. ఆమె జీవన శైలి మహిళలకు ఆదర్శం. ఆమె వాక్చాతుర్యం యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. ఆమె ఉపన్యాసాల పరంపర యువకులను, స్త్రీలను ఉత్తేజపరిచేవి.
కుల వివక్ష, దళితులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా అంకిత భావంతో ప్రతిఘటించిన ధీర నాయకురాలు శ్రీమతి ఈశ్వరీబాయి. సికింద్రాబాద్ వాసి నిజాం రైల్వేస్‌లో గూడ్స్ మాష్టారుగా పనిచేసే దళిత కుటుంబానికి చెందిన బలరామస్వామి, రాములమ్మ దంపతులకు ఈశ్వరీబాయి 1918, డిసెంబర్ 1న ఆమె జన్మించారు. కీ న్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈశ్వరీబాయికి 13వ ఏట పూనా నివాసి డా.జె. లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఆ దంపతుల ఏకైక సంతానం గీత. అనతికాలంలో భర్త మరణించటంతో పూనా నుంచి సికింద్రాబాద్‌లోని తండ్రి దగ్గరకు కుమార్తెతో సహా మకాం మార్చారు. స్త్రీ స్వయం ప్రతిపత్తి, స్వావలంబన భావాలుగల ఈశ్వరీబాయి పరోపకారిణి. పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా జీవితం ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖలో ఉద్యోగినిగా పనిచేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో 'గీతా విద్యాలయం' పాఠశాలను స్థాపించి ఆ ప్రాంతంలో స్త్రీలందరినీ చేరదీసి వారికి చేతివృత్తులలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేశారు.
నాటి సమాజంలో అంటరానితనం కారణంగా దళితులు పడుతున్న అవస్థలు ఈశ్వరీబాయిని కదిలించాయి. బాబాసాహెబ్ డా.అంబేద్కర్ ఉద్యమాలు, ప్రసంగాలు ఆమెను ప్రభావితం చేశాయి. విమోచన ఉద్యమాలవైపు అడుగులు వేయటం ప్రారంభించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పాలన నుంచి భారత ప్రభుత్వంలో కలుపుకున్న తరువాత 1951లో హైదరాబాద్-సికింద్రాబాద్ నగర పాలక సంస్థకు ప్రప్రథమంగా జరిగిన ఎన్నికలలో చిలకలగూడ (సీతాఫల్‌మండి) వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కార్మికులు, దళితులు, స్త్రీల శ్రేయస్సు కోసం ఈశ్వరీబాయి విశేషంగా కృషి చేశారు. అధికార పార్టీలో చేరాలని ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ప్రలోభాలకు లొంగక బాబాసాహెబ్ సిద్ధాంతాలు విడువక 'అఖిలభారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య'లో చేరి హైదరాబాద్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. బి. జగన్నాధం అధ్యక్షులుగా ఈశ్వరీబాయి ప్రధాన కార్యదర్శిగా అఖిలభారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలకు నాయకత్వం అందించారు.
1956, అక్టోబర్ 4న నాగపూర్‌లో బాబాసాహెబ్ డా.అంబేద్కర్ ధమ్మదీక్ష స్వీకార కార్యక్రమం ఏర్పాటుచేసి 5 లక్షల మంది అనుయాయులతో బౌద్ధమతం స్వీకరించారు. ఆ కార్యక్రమంలో ఈశ్వరీబాయి కీలకపాత్ర వహించారు. అనేకమంది అనుయాయులతో దీక్షను స్వీకరించారు. 1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈశ్వరీబాయి పోటీచేసి గెలుపొందారు. బాబాసాహెబ్ రాజకీయ వారసురాలన్న గుర్తింపే ఆమెను ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి దేవాదాయ శాఖ మంత్రి టి.ఎన్. సదాలక్ష్మిపై గె లిచేందుకు దోహదం చేసింది. తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం మొదలైన ప్రతిపక్ష నాయకుల సరసన ఆమె అదే హోదాను పొందారు. ఆ తరువాత జరిగిన 1972 శాసనసభ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి రెండవ సారి ఎన్నికయ్యారు.
మొదటి సారి శాసనసభలో ప్రతిపక్షనాయకురాలిగా అడుగిడిన ఈశ్వరీబాయి సభలో అనేక సమస్యలను ప్రస్తావించారు. చర్చల్లో చురుగ్గా పాల్గొని తన సలహాలను అందిచారు. సమసమాజ స్థాపన, రాజ్యసామ్యవాదం, కార్మికుల రక్షణ-భద్రత, కనీసవేతన చట్టం, భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి బంజరు భూమి పంపిణీ, అస్పృశ్యత నివారణ చట్టాన్ని పటిష్ఠంగా అమలుపరచాలని, అస్పృశ్యత పాటించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బలహీనవర్గాల కార్మికులకు ఇతర నిరుపేదలకు నిత్యావసర వస్తువులు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని, బౌద్ధమతం స్వీకరించిన అస్పృశ్యులకు ఎస్.సి. హోదా కల్పించాలని (1992లో నియో బౌద్ధులను ఎస్.సి.లుగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది), ఇంటర్‌మీడియేట్ వరకు స్త్రీలకు ఉచిత విద్య అందించాలని, వితంతువులకు పింఛనులు ఇవ్వాలని, పట్టణ ప్రాంతంలోని మురికివాడలలో నివసించే వారికి పక్కా గృహాలను నిర్మించి మంచినీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా అందించాలని, హైదరాబాద్‌లోని ముస్లిం మహిళలకు ఉచిత విద్య-ఉపాధి కల్పించాలని ప్రభుత్వంపై ఈశ్వరీబాయి ఒత్తిడి తెచ్చారు. అప్పటి ప్రభుత్వం ఈశ్వరీబాయిని ఆంధ్రప్రదేశ్ మహిళా-శిశు సంక్షేమ సంస్థకు అధ్యక్షురాలిగా నియమించింది.
ఆ హోదాలో రాష్ట్రమంతటా పర్యటించి స్త్రీలు, శిశువుల స్థితిగతులను వారి సమస్యలను తెలుసుకొని అనేక సంస్కరణలను ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ముఖ్యంగా మహిళా విద్యార్థులకు ఉచిత విద్య ఉండాలని, శిశు సంరక్షణకు మార్గదర్శకాలను సూచించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ (ఐ.సి.ఎస్.డబ్ల్యూ) హైదరాబాద్ చాప్టర్‌కు సభ్యురాలిగా సేవలందించారు. ఇండియన్ రెడ్ క్రాస్‌కు రాష్ట్ర సభ్యురాలిగా పనిచేశారు. సివిక్ రైట్ కమిటీ (సి.డబ్ల్యూ.సి.) స్థాపించి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఈశ్వరీబాయి ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి. భారతదేశంలోనే దళితుల ఏకైక నాయకురాలిగా ఎలాంటి సమస్య పరిష్కారానికైనా యాచించే విధానాలను విడనాడి న్యాయపరమైన హక్కు, పోరాటం ద్వారా సాధించాలన్న డా. అంబేద్కర్ సిద్ధాంతానికి ప్రతీకగా ఉండేది ఆమె వ్యవహార శైలి. పిడికిలి బిగించి గర్జించే స్వభావం ఆమెది. నిజాయితీగా చిత్తశుద్ధితో కుండబద్దలైనట్లు మాట్లాడటం ఆమె నైజం. ఎన్ని త్యాగాలనైనా భరించి స్త్రీ సమాజంలో స్వేచ్ఛా సమానత్వం సాధించాలన్నదే ఈశ్వరీబాయి ప్రబోధం. ఆమె సభలకు, సమావేశాలకు స్త్రీలు అధికంగా పాల్గొనేవారు. పురుషులు వ్యసనాలకు ముఖ్యంగా తాగుడుకు బానిసలు కాకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత స్త్రీలే వహించాలని అనేవారు.
1968లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని విద్యార్థులు, న్యాయవాదులు, 'తెలంగాణ ప్రజా సమితి' నేర్పాటు చేశారు. డా. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. సమితి కార్యనిర్వాహక సభ్యురాలిగా ఈశ్వరీబాయి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, విద్యుత్ లాంటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అనేక సభల్లో ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. దాంతో తెలంగాణ ప్రాంతంలో ఆమె పేరు ప్రఖ్యాతులు పెంపొందాయి. అగ్రకుల నాయకులు పదవులకు అమ్ముడుపోయినప్పటికీ ఈశ్వరీబాయి తెలంగాణ సమస్యలపై నిరంతరం నిస్వార్థమైన పోరాటం నిర్వహించారు.
తరతరాలుగా అంటరానితనం అంటగట్టబడి దోపిడీకి, పీడనకు గురౌతున్న దళితుల వికాసానికి, అభివృద్ధికి దృఢ సంకల్పంతో, సేవా భావంతో తన జీవితాంతం అలుపెరుగని పోరాటం జరిపిన ధీర వనిత. ప్రతిపక్ష నాయకురాలి హోదాలో 'ఫైర్‌బ్రాండ్ లేడీ లీడర్'గా ఖ్యాతి పొందారు. మహామహులైన ముఖ్యమంత్రుల చేత నీళ్ళు తాగించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (కె) జాతీయ అధ్యక్షురాలిగా దేశం నలుచెరుగుల అభిమానులను, శిష్యులను సంపాదించుకున్న నాయకురాలు.
కృష్ణా జిల్లా కంచికచర్లలో కోటేశు అనే దళిత యువకుడిని అగ్రవర్ణాలు సజీవంగా దహనం చేసిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈశ్వరీబాయి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ సంఘటనపై ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి క్షమాపణలు చెప్పారు. అయినా ఈశ్వరీబాయిలో ఆవేదన, ఆక్రోశం తగ్గలేదు. ఇం తలో నాటి వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మారెడ్డి వ్యంగ్యంగా ఎత్తిపొడిచే ధోరణిలో.. 'దొంగతనం చేస్తే ముద్దు పెట్టుకుంటారా...' అన్న మాటలు పూర్తికాకుండానే 'షటప్, ఇంకొక్కమాట మాట్లాడితే చెప్పుతో కొడతా జాగ్రత్త...' అంటూ చెప్పుచేతబూని మంత్రి వైపుకు దూసుకెళుతున్న ధీర సభ్యురాలిని 'అమ్మా శాంతించు... శాంతించు...' అంటూ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈశ్వరీబాయి ఆవేశానికి గాబరాగా అడ్డుకుంటూ క్షమించమని ప్రాధేయపడ్డారు.
తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్ట, నిగర్వి. సామాన్యుడికి సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉండే మనస్తత్వం ఆమెది. నిరాడంబర సంఘసేవకురాలుగా గుర్తింపు పొందారు. తెలుగుతనానికి నిదర్శనం ఈశ్వరీబాయి కట్టూ, బొట్టూ. ఆమె జీవన శైలి మహిళలకు ఆదర్శం. ఆమె వాక్చాతుర్యం యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. ఆమె ఉపన్యాసాల పరంపర యువకులను, స్త్రీలను ఉత్తేజపరుస్తాయి. అటువంటి ఈశ్వరీబాయి ఆకస్మాత్తుగా అస్వస్థతకు లోనై చికిత్స చేయించుకుంటూ 1991, ఫిబ్రవరి 24న తుదిశ్వాస వదిలారు. ఈశ్వరీబాయి ఆశయాలను ప్రస్తుతం ఆమె కుమార్తె గీతారెడ్డి సారధ్యంలో 'ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్' కొనసాగిస్తోంది. మహిళలకు వృత్తి విద్య శిక్షణ, పేదలకు వైద్య సదుపాయాలు కల్పించడం, మహిళలకు విద్యావకాశాలు కల్పించడం, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడటం తదితర లక్ష్యాలతో ఆ ట్రస్టు పనిచేస్తోంది. ఈశ్వరీబాయి జీవితం అందరికి మార్గదర్శకం. ఆమె కీర్తి అజరామరం.
- డా. జె. గీతారెడ్డి
రాష్ట్ర మంత్రివర్యులు
(from andra jyothi)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి