హోం

17, మార్చి 2013, ఆదివారం

దక్కన్ దృశ్యమాలిక ‘మా ఊరు’


- తెలంగాణ పల్లె సంస్కృతిని ఆవిష్కరించిన బీ నర్సింగరావు డాక్యుమెంటరీ
- చిత్ర ప్రదర్శనలో వక్తల ప్రశంసలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (టీ మీడియా): ప్రముఖ దర్శకుడు బీ నర్సింగరావు దర్శకత్వంలో రూపొందిన ‘మా ఊరు’ డాక్యుమెంటరీ చిత్రం దక్కన్ పల్లెల వైభవాన్ని ఆవిష్కరించింది. హిమాయత్‌నగర్‌లోని ‘చంద్రం’ (ఆక్స్‌ఫర్ట్ గ్రామర్ స్కూల్) లో శనివారం సాయంత్రం డాక్యుమెంటరీని ప్రదర్శించారు. దక్కన్ పల్లెల ఆర్థిక మూలాలు, వృత్తి సమాజాలు, సంస్కృతిని రేపటి తరాలవారికి తెలియజేసేలా ప్రముఖ దర్శకులు బీ నర్సింగరావు స్వీయదర్శకత్వంలో రూపొందించిన 51 నిమిషాల నిడివిగల ‘మా ఊరు’ చిత్రం తెలంగాణ పల్లెలను, భారతీయ ఆత్మను ఆవిష్కరించింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ‘భారతదేశం.. అద్భుతమైన స్వయంపోషిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ’ అన్నారు. ఈ ‘మా ఊరు’ డాక్యుమెంటరీ చిత్రం మార్క్స్ వర్ణనను వర్ణాల్లో ఆవిష్కరించిందని ఈ చిత్రాన్ని తిలకించిన వారంతా ప్రశంసించారు.

దక్కన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనను తెలంగాణ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రముఖులు తిలకించారు. అనంతరం జర్నలిస్టు పాశం యాదగిరి ప్రసంగిస్తూ.. ఈ డాక్యుమెంటరీని చూస్తుంటే మా ఊరేనేమో అనిపించిందని.. నా చిన్ననాటి జీవితం కనిపించిందని అన్నారు. మన అభివృద్ధిని మనం సమీక్షించుకోవాలని ఈ చిత్రం సూచిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి సంఘం అధ్యక్షుడు బండారు భిక్షపతి మాట్లాడుతూ.. నిజాం కాలంనాడు గ్రామాల్లో వివిధ కుల వృత్తులకు రక్షణ ఉండేది.. నిజాం ఇచ్చిన మాన్యాలు ఉండేవని పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం మాన్యాలు ఇవ్వకపోగా, వాటిని లాగేసుకుందని విమర్శించారు. కవి దాసోజు కృష్ణమాచారి మాట్లాడుతూ..‘మా ఊరు’ ఎప్పుడో తీసినట్లుందని.. ఇటీవలే తీసిన డాక్యుమెంటరీ అని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. 

నేటి వ్యాపారాలు గ్రామీణ చేతి వృత్తుల్ని ఎలా శాసిస్తూ ధ్వంసం చేస్తున్నాయో ఈ డాక్యుమెంటరీ చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఇందులో శ్రామిక వర్గాల మధ్య ఉండే సంబంధాలు, ఊరుమ్మడి సంస్కృతి ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. అన్వర్ మాట్లాడు తూ. తెలంగాణ పల్లెకు చెరువు ప్రాణం అని అన్నారు సీమాంధ్ర ప్రభుత్వం ఈ చెరువులు, కుంటల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు నీటి వనరులు జీవ వైవిధ్యానికి నిలయాలని.. ఈ వైవిధ్యం ఇవాళ్టి గ్రామాల్లో కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగానే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనమైందని వివరించారు. వివిధ కులాల వారి వృత్తులన్నింటికీ కావాల్సిన వనరులన్నీ పల్లెల్లో ఉండేవని.. ఈ వనరుల నిర్వహణకు కాసు బ్రహ్మానందడ్డి కాలంలో తిలోదకాలిచ్చారని తెలిపారు. అప్పటినుంచి మన ఆర్థిక ప్రగతి మందగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

                                                                   -from NAMASTE TELANGANA

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి