హోం

13, మార్చి 2013, బుధవారం

‘కొండల్లో ఉన్న మల్లన్నా!



కోటి దండాలు నీకన్నా!’ 
ఆదిలాబాదు జిల్లా జైపూర్ మండలంలో పవిత్ర గోదావరి తీరాన పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో కొండపై వెలసిన దేవుడు వేలాల మల్లన్న. భక్తులకు కొంగు బంగారంగా కొలువైన సాంబశివున్ని శివరాత్రి నాడు పిల్లాపాపలతో దర్శించి తరిస్తారు భక్తులు. ‘కొండల్లో ఉన్న మల్లన్నా! కోటి దండాలు నీకన్నా!’ అంటూ వేలవేల భక్తులు వివిధ ప్రాంతాల నుండి కార్తీకమాసం, మాఘమాసం శివరాతిరికి వారం, పది రోజుల ముందు నుండే వచ్చి చేరుతారు. ‘గుట్ట, గుట్టా ఎక్కి నీ తానకు వచ్చాం...’ అని విన్నవించు కుంటారా పరమశివునికి.

పవిత్ర గోదావరి స్నానాలు చేసి శుచిగా, రుచిగా వండిన బోనాన్ని తలమీద పెట్టుకొని వడివడిగా పిల్లాపాపలతో భక్తజనం వెళ్తుంటే, మల్లన్న గుట్టకే కొత్తకాంతి వచ్చినట్లు, వేలాలగుట్టకే వెలుగు వచ్చినట్టుంటది. మహాశివరాత్రి రోజు పంటచేల పనులయ్యాక, చలిపోయి నును వెచ్చటి సూర్యకాంతుల వేడితో గొడ్డు గోదను, పాడిపంటలను, పిల్లాపాపలను శివశక్తి రూపుడైన పార్వతీనాథుడే కాపాడాలని పరవశించి పాటలు పాడతారు. కేవలం తమ కుటుంబమే కాక బంధుమివూతులందరూ బండ్లమీద బయలుదేరుతారు. రెండు మూడు రోజులకు సరిపడ పక్కబట్టలు, ఆహారధాన్యాలు, ఎడ్లకు గడ్డి బండ్లలో తెచ్చుకుంటారు. భుజాల మీద, చంకలనెత్తుకున్న పిల్లలు సద్ది తినో, చలిలో నిద్ర పోకుండాచెట్టు, పుట్టను చూపుతూ, దేవుని మహిమలు తెలుపుతూ, నడిచే శ్రమను మరిచిపోతూ పాటలు పాడతారు.

‘చుట్టు పక్కల చూడరా! సూడ సక్కంగ ఉండురా
మన పాడిపంటలను శివుడే రక్షించురా!
మన పిల్లా పాపలను ఆడే కాపాడురా!
దేవుడంటే దేవుడే మల్లన్న దేవుడు
మహిమపూన్నో చూపించే మల్లన్న సామిరా!’
అని కైలాస పర్వతానికి వెళ్ళినంత సంబరపడతారు.
ఒక ప్రాంతంలో జాతర జరుగుతున్నదంటే చిన్నా, చితుక వ్యాపారులకెంతో ఆనందం. వివిధ కళాకారులకు కళలను ప్రదర్శించుకునే అవకాశం. డెక్కలాళ్ళు, బొమ్మరాళ్ళు, పగటి వేషాల వాళ్ళు పాములను మెళ్ళో వేసుకునేవాళ్ళు, పామును బుట్టలో పెట్టుకొని పైసలు అడుక్కునేటోళ్ళు, బుడబుక్కల వాళ్ళు ఒకరేమిటి అందరూ అక్కడికి చేరుతారు. ఆడి, పాడి ప్రజలను ఆనంద పరుస్తారు. దొమ్మరోళ్ళు పిల్లల చేత పిల్లి మొగ్గలు వేయిస్తారు. గడెక్కిస్తారు, గంతులేయిస్తారు. ఆ వింత చూస్తూ కొరడాతో కొట్టుకుంటూ రక్తం ఒళ్ళంతా కారుతున్న పంబాల వాళ్ళు బూరమీసాలతో, వింత తలకట్టుతో భయంకరంగా కన్పిస్తారు. ఇంట్లో ఎప్పుడూ అల్లరి చేసేవాళ్ళకు, దారి వెంట వేధిస్తున్న పిల్లలను ఇట్లే అల్లరి చేస్తే- వాళ్ళకిచ్చి వెళ్ళిపోతామని భయపెడ్తారు. అంతేకాక, వాళ్ళతో...
‘అమ్మా! నన్ను దొమ్మరోళ్ళ కియ్యకే,
గడెక్కుమంటరే, గంతుపూయ్యి మంటరే.
అమ్మా! నన్ను దొమ్మరోళ్ళ కియ్యకే’...
అని పరాచికాలు చేస్తూ పరుగెత్తిస్తరు.

ఎలా వెళ్ళాలి?
కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుండి ఇందారం మీదుగా వెళ్ళవచ్చు. సుందిళ్ళ గుట్టలో యోగ నరసింహస్వామి ఎదురుగా వేలాలగుట్టలో మల్లన్నస్వామి దర్శనమిస్తాడు.ఈ రెండు ప్రాంతాల మధ్య అయిదారు కిలోమీటర్ల దూరమే.
కరీంనగర్ జిల్లా మంథని నుండి పవిత్ర గోదావరి మీదుగా కూడా వెళ్ళవచ్చు. అయితే, ప్రజలు ప్రభుత్వాన్ని అడిగి అడిగి విసిగి వేసారి తామే రోడ్డు వేసుకున్నారు. ఇక్కడకు మంథని నుంచి వాహనాలన్నీ వెళ్ళే సౌకర్యం ఉంది.

mallanna2స్థల పురాణం
వేలనామాలున్న వాడు, వేలాలలో కొలువైన పరమశివుని గురించిన అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.
దేవ దానవులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా పాలకడలిని చిలుకుతుండగా అపురూపమైన అనేక వస్తువులు పైకి వచ్చాయి. కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, చింతామణి మొదలైన వాటిని చూసి దేవేంవూదుడు తన పాలుగా తీసుకున్నాడు. అమృతానికి ముందు హాలాహలం వచ్చింది. దాని పొగలు, సెగలు చూసిన దేవదానవులంతా భయపడ్డారు. హాలాహలం తీస్తేనే అమృతం లభిస్తది. కాని, ఎవరు దాని ఛాయలకు వెళ్ళేది? భోళాశంకరుడది గ్రహిస్తాడు. పదిమందికి ఉపయోగించే పనిచేస్తున్నప్పుడు తన ప్రాణానికేమైనా సరేనని తలచి, హాలాహలం తాగి కంఠంలో నిక్షిప్తపరుచుకుని గరళకంఠుడయ్యడు. ఎప్పుడైతే విషాన్ని గ్రహించాడో ఆ వెంటనే ఆయన చెవి, ముక్కు, గొంతు దెబ్బ తిన్నవి. ‘మల్లన్నకు చెవుడు వచ్చింది.

అమ్మ అర్థరాత్రి ఏమి గుసగుసలాడినా వినిపించని పరిస్థితి.’ పరమశివుని చూసి అమ్మ పరాచికంగా పకపక నవ్వింది. శివునికి కోపం వచ్చింది. ఉదయాన్నే లేచి ఊరి వెలుపలి కొండెక్కి కూచున్నాడు. ధ్యానం చెయ్యాలని తలపోసాడు. గుట్టెక్కుతుంటే నాగులు గునగున వచ్చి కంఠాభరణాలయ్యాయి. విషానికి విషమే విరుగుడని దీనివల్లే ఆదిదంపతుల కంతః కలహం మొదలైందని తలచి, కోరలతో విషాన్ని పీల్చసాగాయి. ఇదే అదనని గంగమ్మ స్వామి శిఖలో చేరింది. సుధాకరుడు చంద్రుడు తన కత్యంత దూరంలో ఉండే శివుడు కొండపైకి రావటంతో తనకు దగ్గరైనాడని సంతోషించాడు. నందికేశ్వరుడు రాయభారాన్ని అమ్మ పంపంగా వెళ్ళాడు. ‘ప్రణయ కలహాల్లో పరాచిక మాడితే తప్పా! క్షమించి కిందికి రమ్మని’ వేడుకున్నాడు. ఏడాది కొక్కనాడైనా దర్శనమివ్వమని బతిమాలాడు. అందుకే, మేళతాళాలతో, దీపాలు దివిటీలతో ఉత్సవ విగ్రహాలకు వేలాల గుట్టకింద వైభవంగా కల్యాణం చేస్తారు భక్తులు.
                                                                                              
-డా॥ ఆర్.కమల, 98491 55756
                                                                                                                       -from BATHUKAMMA

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి