హోం

26, మార్చి 2013, మంగళవారం

25, మార్చి 2013, సోమవారం

వానా కాలపు వినోదం ..


                     మరో నాటకానికి తెరలేస్తుంది, ఇందిరా గాంధీ మార్గంలో సోనియా గాంధీ పయనించడానికి సిద్దం అవుతుంది, మరో సారి తెలంగాణా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి నయవంచన అనే పాత ఫార్ములానే వాడబోతుంది, గతంలో మర్రి చెన్నారెడ్డి పావులా మారితే ఇప్పుడు జైపాల్ రెడ్డి పావులా మారబోతున్నాడు.
                    తెలంగాణా ఉద్యమం పతాక స్థాయిలో లేవడానికి, లేచిన ఉద్యమాన్ని అదుపులో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు, జగన్ ను అదుపులో పెట్టాలని తెలంగాణా కు అనుకూల వాతావరణం సృష్టించడం, కె సి అర్ కు ఇమేజ్ పోతుందని జె ఎ సి బలపడేలా చెయ్యడం కాంగ్రెస్ కనుసన్నల్లో జరుగుతున్న పరిణామాలను నిశితం గా గమనిస్తే తనకు లాభం కలగక పోయిన పరవాలేదు, కాని పక్కవాడు బాగుపడకూడదు అనేది కాంగ్రెస్ పాలసీ, కోదండ రామ్ ను ఇతర జె ఎ సి సభ్యులను అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా రెండు రోజుల పాటు జైలు లో పెట్టి సడక్ బంద్ క్రెడిట్ కె సి అర్ కు వెళ్ళకుండా కట్టడి చేసింది కేంద్రం, జె ఎ సి బలపడుతుండడం కూడా కాంగ్రెస్ కు మింగుడుపడక ఇప్పుడు కొత్త డ్రామాకు తెర తీచింది.
                  ఇన్ని రోజులు హాయిగా పదవులు అనుభవించిన జైపాల్ రెడ్డి , జానా రెడ్డి లు కొత్త వేదికను ఎర్పరుస్థారట ..? ఇది ఇతర ఉద్యమ పార్టీలను జె ఎ సి ను కాతరు చెయ్యకుండా స్వతంత్ర నిర్ణయాలతో ఉద్యమాన్ని వేడెక్కిస్తారట..? అయితే జైపాల్ రెడ్డి ఇప్పుడే రాజీనామా చెయ్యడట అది మార్చ్ చివరివారంలో చేస్తారట..? ఎందుకో తెలుసా... సార్వత్రిక ఎన్నికల సమయం సంవత్సరం కన్నా తక్కువగా ఉంటె అప్పుడు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావు, ఆ స్థానాలకు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే ఓటింగ్ నిర్వహిస్తారు, కావున జైపాల్ రెడ్డి వానాకాలం లో రాజీనామా చేసి కొత్త పార్టీ ప్రకటించగానే కాంగ్రెస్ వారి డ్రామాలు మొదలవుతాయి, ఒక్కొక్కరుగా మన కాంగ్రెస్ ఎం పీ లు, ఎం ఎల్ ఎ లు అంత క్యు కట్టి మరి రాజీనామా చేస్తారు, ఆమోదించమని స్పీకర్ పై ఒత్తిడి తెస్తారు, రాజీనామా ఆమోదించినా ఉపఎన్నికలు రావు, ప్రభుత్వము పడిపోదు, ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వంగా సార్వత్రిక ఎన్నికల వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి.
                         ఇక ఉద్యమాన్ని అణచివేయ్యాలంటే జైళ్ళు నింపితే కుదరదని వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కుటిల కాంగ్రెస్ కు తెలుసు, ఉద్యమాన్ని అణచాలంటే ఉద్యమ కారులు జై తెలంగాణా అంటే ద్రోహులు జై జై తెలంగాణా అంటారు, ఉద్యమాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు, వారి ప్రయోజనం పూర్తికాగానే ఉద్యమాన్ని గాలికి వదిలి వెళ్ళిపోతారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇదే విధానాన్ని ఫాలో కావాలనుకుంటున్నారు, గతం నేర్పిన పాటలను మరో సారి సోనియా నిర్దేశనంలో జైపాల్ నాయకత్వాన  నయవంచనకు ఊపిర్లుదనున్నారు. ఇప్పటికి ఇంకా ఎం నిర్ణయం తీసుకోలేదని చెప్పిన, మీడియా సృష్టి అని ఖండించిన వానాకాలం లో  మరో వినోదం చోటుచేసుకోవడం ఖాయం, నూతన వేదిక రావడం అనివార్యం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, రాహుల్ గాంధీ ప్రధాని పీటం ఎక్కడానికి మన నాయకులు చేస్తున్న ఆత్మవంచన క్రతువు, కావున తస్మాత్ జాగ్రత్త ..!

                                          

23, మార్చి 2013, శనివారం

రగులుతున్నది తెలంగానము..


సహకార ఎన్నికలలో గెలిచినా సంబరం ఎంతో కాలం నిలవలేదు, నాలుగు రోజులకే వచ్చిన ఎం ఎల్ సి ఎన్నికలలో స్వామి గౌడ్ ని, పాతూరి సుధాకర్ రెడ్డి ని గెలిపించుకుంటాం అని ప్రకటించి, భారి మెజారిటీ తో టి అర్ ఎస్ ఆ స్థానాలను గెలుచుకోవడం సి ఎం కిరణ్ కు నచ్చడం లేదు, ఎలాగైనా టి అర్ ఎస్ హవా తెలంగాణాలో తగ్గిపోయిందని తన సంక్షేమ పతకాలవైపే ప్రజలున్నారని నిరూపించుకోవాలనుకుంటున్న సి ఎం కు సహకార ఎన్నికలు వరంగా వచ్చాయి, 2009 తర్వాత ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ఈ ఎన్నికలకు ఎప్పుడు లేని ప్రాధాన్యం లభించింది, ఈ ఎన్నికలలో ఎప్పటినుండో పదవి కోసం ఎదురుచూస్తున్న మాజీ నాయకులంతా పోటిపడి డబ్బు విపరీతంగా పంచారు, ఒక్కో స్థానంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే ఉండడం విశేషం, మొత్తానికి కాంగ్రెస్ గుర్తు లేకుండా ఉన్న ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది, సి ఎం తన సత్తా చాటాడని, గ్రామ స్థాయిలో పట్టు సాధించాడని అనుకుంటున్న సమయంలో ఎం ఎల్ సి ఎన్నికలలో టి అర్ ఎస్ విజయ భావుటా ఎగరవేయ్యడం సి ఎం కు మింగుడుపడలేదు. 
                                  అంతే కాకుండా ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోమని చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకున్న కిరణ్, టి అర్ ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, అన్ని పార్టీలను కలుపుకొని చర్చకు తేవడం కూడా ఆయనకు టి అర్ ఎస్ పై ఆగ్రహాన్ని తెప్పించాయి, అవిశ్వాస తీర్మాన చర్చ సమయంలో కిరణ్ హరీష్ రావు పై తీవ్రంగా విరుచుకుపడ్డారు, ఒకానొక సందర్భంలో తెలంగాణా కు ఒక్కపైసా కూడా ఇవ్వనని పొగరుగా మాట్లాడాడు, అంతె కాకుండా నేను ఇక్కడే పుట్టాను అంటూనే మా చిత్తూరు అంటూ తన సంకుంచిత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు, తెలంగాణా కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అనడం పట్ల తెలంగాణా వాదులు తీవ్ర ఆగ్రహం చెందారు, మేమేమి మీ బాబుగాడి సొమ్ము అడుగుతున్నామ మా ప్రాంతం నుండే 70% ఆదాయం వస్తుంది, మాది మాకు ఇవ్వడానికి ని అభ్యంతరం ఏమిటి అని కొంతమంది సభ్యులు సి ఎం ని నిలదీసారు, సి ఎం పూర్తిగా తెలంగాణా వ్యతిరేఖి అని తెలంగాణావాదులు మండి పడుతున్న సమయంలో సి ఎం మరోసారి తన సీమంద్ర బుద్ది ని బయటపెట్టుకున్నాడు, గతం లో విద్యార్థులపై కేసులు పెట్టి నెలలపాటు జైలు లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యమ నాయకత్వాన్ని దెబ్బతీయాలని భావిస్తుంది. 
                                     మార్చ్ 21 న కర్నూల్-బెంగుళూర్ జాతీయ రహదారిని దిగ్బందించాలని జె ఎ సి పిలుపునిచ్చింది, అయితే దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, పైగా ఉద్యమాన్ని పోలీస్ బలగాలతో అణచివేయ్యలని భావించారు, సడక్ బంద్ కు వారం ముందు నుండే పాలమూరు నాయకులను బై0డోవర్ చెయ్యడం ప్రారంభించారు, చివరికి ఉద్యమ నాయకులను, ఎం ఎల్ ఎ లను కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోలీసులు, అయితే మధ్యానం అరెస్ట్ ఐన నాయకులను సాధారణం గా సాయంత్రం వదిలి పెట్టడం సాధారణమే, ఇప్పుడు కూడా అంతే  అనుకున్నారు పోలీసులు కాని హైదరాబాద్ నుండి వచ్చిన ఫోన్ తో పోలీస్ లు నాయకులపై కేసులు పెట్టి కోర్ట్ కు తరలించారు, అయితే ఈ ఫోన్ సి ఎం నుండి వచ్చిందా..? లేదా అనేది తెలియరాలేదు, ప్రొ. కోదండ రామ్, టి జి ఓ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, ఎం ఎల్ ఎ లు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు లకు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది, అరెస్ట్ ల ద్వారా ఉద్యమాన్ని అణచివెయ్యలని, ఉద్యమ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారిని ఇబ్బందులకు గురిచేయ్యడం ద్వారా దెబ్బకొట్టాలని కిరణ్ చూస్తున్నాడు. 
                            ఉద్యమ నాయకుల అరెస్ట్ తో తెలంగాణా రగిలి పోతుంది, చట్టం తన పని తాను చేసుకు పోతుంది అంటూ సబిత అసెంబ్లీ లో ఇచ్చిన వివరణ కు ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు, ఉద్యమ నాయకులపై పెట్టిన కెసులు ఎత్తివేసి వెంటనే విడుదల చెయ్యాలని వారు డిమాండ్ చేసారు, కోదండ రామ్, శ్రీనివాస్ గౌడ్ లు ప్రభుత్వ ఉద్యోగులు కావడం వళ్ళ వారు 48 గంటలు ఎ కారణం చేతను జైలు లో ఉండరాదు, అల ఉన్నట్లయితే వారిని సస్పెండ్ చేస్తారు, కావున ఇలా కూడా వారిని ఇబ్బందుల పాలు చెయ్యాలని ప్రభుత్వం బావిస్తుంది. 
                          ఆంద్ర అనుకూల సర్కార్ జె ఎ సి నాయకులను ఇబ్బందుల పాలు చేసి తెలంగాణా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి భవిష్యత్తులో జె ఎ సి తలపెట్టిన విజయవాడ రహదారి దిగ్బందాన్ని అడ్డుకోవాలని చూస్తుంది, కాని ప్రభుత్వం ఎంత నిర్భందాన్ని విధిస్తే అంత తీవ్రంగా ఉద్యమం ఎగసిపడుతుందనే విషయం ఈ ప్రజా కంటక సర్కారుకు తెలియకపోవచ్చు, ఇప్పుడు ఎంతగా ఉద్యమ నాయకత్వాన్ని వేధిస్తే తెలంగాణా ప్రజలతో ఈ సర్కారుకు దూరం కూడా అంతగా పెరుగుతూ పోతుంది, విజయవాడ రహదారి దిగ్బండం రోజున వచ్చే జన సునామి లో కిరణ్ సర్కార్ కొట్టుకుపోతుంది... 

21, మార్చి 2013, గురువారం

తెలంగాణా పూర్ణకుంభం..


పూర్ణ కుంభం: సుసంపన్నత కు, సౌభాగ్యానికి దివ్యమైన ప్రతీక.పూర్ణకుంభ స్వాగతం అంటేనే పరిపూర్ణ వైభవానికి ప్రతీక, హైందవ ఆచారం ప్రకారం ప్రతి దేవతారధన కలశ పూజ తోనే మొదలవుతుంది, కలశం అన్నా పూర్ణ కుంభమే, ఇది ప్రధానంగా బౌద్ధమత ఆచారంగా చెప్తారు, ఇందుకు నిట్టనిలువు నిదర్శనం తెలంగాణాలో ప్రసిద్ధమైన బౌద్ధ భూమి నాగార్జున కొండలో శతాబ్దాల కిందటే తొట్టతొలుత వెలుగుచూసిన ప్రతిమాత్మక పూర్ణ కుంభాన్ని పేర్కొంటారు. 
              అపురూపమైన బౌద్ధ పూర్ణ కుంభం తో పాటు అలనాటి శిల్ప కళాకండాలను నాగార్జున కొండలో మనం చూస్తాం, ప్రసన్నవదనం తో నిల్చున్న బుద్ధ విగ్రహం, భోధి వృక్షం కింద ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధ భగవానుని దృశ్య ప్రతిమల్ని దర్శించడం ఒక దివ్యానుభవం.

                                    ఇంతకి ఈ పూర్ణ కుంభ ప్రశస్తి ఏమిటి ? గుండ్రని ఇత్తడి లేదా రాగి చెంబుని సాధారణంగా కలశంగా వాడుతారు, ఇందులో నిల్లు కాని బియ్యం లేదా గోధుమలు వంటి ధాన్యాలను పోసి, పైన ఒక కొబ్బరికాయను తమలపాకులపై కుర్చోబెడతారు, గంధం, పసుపు, కుంకుమ, కంకనాలతో కలశాన్ని అలంకరిస్తారు, కలశానికి జీవనదుల సాక్షిగా పూజలు చేస్తారు, ఇందులోని జాలం లేదా ధాన్యం శుద్ధ శక్తి కలవిగా భావిస్తారు. 
      రాష్ట్ర చిహ్నంగా ఉన్న పూర్ణకుంభం గుంటూరు జిల్లాలోని అమరావతి నుండి తీసుకున్నట్లుగా ఆంద్ర వాళ్ళు చెప్పుకుంటున్నారు, కాని అమరావతి కంటే పూర్వకాలానికి చెందిన పూర్ణ కుంభం మన తెలంగాణా లోనే కొలువై ఉంది.
                                

సడక్‌బంద్ గ్రాండ్ సక్సెస్


టీజేఏసీ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అరెస్టులు, బైండోవర్‌లు, పోలీసుల, ప్రభుత్వ బెదిరింపులను ఖాతరు చేయకుండా జనం రోడ్డెక్కారు. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎక్కడికక్కడే వందలాదిగా జనం తరలి వచ్చిన జనం ఎవరి పద్దతిలో వారు నిరసన తెలపారు. జైతెలంగాణ నినాదాలతో హైవే మారుమోగింది. షాద్‌నగర్ వద్ద యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు భారీ సంఖ్యలో సడక్ బంద్‌లో పాల్గొన్నారు. 


పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు కర్నూలు హైవేపై ఒక్క వాహనం కూడా తిరగలేదు. కొత్త కోట వద్ద రైతులు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. హైవే పోడవునా వందల సంఖ్యలో పోలీసులు మొహరించి ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా తెగించి తెలంగాణవాదులు దూసుకుపోయారు. ఇక అలంపూర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆద్వర్యంలో వందలా మంది కార్యకర్తలు రోడ్డెక్కారు. దాదాపు గంటసేపు రహదారిని దిగ్బందించారు. పోలీసులు ఈటెలను బలవంతంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
Sadak Bandhఉద్యమకారులు సహనం కోల్పోయి దాదాపు 50 వాహనాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులు తెగింపును చూసి తట్టుకోలేక పోయిన పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు. టీఆర్‌ఎస్, జేఏసీ నేతలతో పాటు విద్యార్థులు, న్యాయవాదులతో పాటు వేలాది మంది తెలంగాణవాదులను అరెస్టు చేసి పోలీస్టేషన్లకు తరలించారు. శంషాబాద్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, పొలీట్‌బ్యూరో సభ్యులు డాయశవణ్, నాయిని, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. షాద్‌నగర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 
Sadak Bandhఅలంపూర్ వద్ద జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో పాటు రోడ్డుపై శాంతియుతంగానిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అయినా సర్కారు నిర్బంధాన్ని లెక్క చేయకుండా తెలంగాణవాదులు హైవేపై నిరసనలను కొనసాగించారు. మొత్తంగా ఏడో నెంబర్ (కొత్త నెంబర్ 44)జాతీయ రహదారి బంద్‌తో హైదరాబాద్‌నుంచి రాయలసీమ, కర్నాటకకు రాకపోకలు బందయ్యాయి. సర్కారు పోలీసుల సహాయంతో ఉక్కుపాదం మోపినా బెదరకుండా మహిళలు జంగ్ సైరన్ మోగించారు.        -from namaste telangana

19, మార్చి 2013, మంగళవారం

జయరాజు ఇన్నర్ వ్యూ..

           
                          
                           ఆయన పాటకు ప్రకృతి పలవరిస్తుంది. గజ్జెకట్టి గంతేస్తే జనం పిడికిళ్లు బిగించి జత కూడుతరు. పీడిత, తాడిత ప్రజలకు ఆయన పాట కోయిల కూతయితే, సింగరేణి గని కార్మికులకు సైరన్ మోత. ఆయన ప్రజల పాటైనందుకు అధికార బలం ఆయన గొంతు నులిమే ప్రయత్నమూ చేసింది. అయినా, అనునిత్యం నిర్భందాల్లోంచే ఆయన పల్లవై ప్రతిధ్వనించిండు. ‘వానమ్మ, వానమ్మ వానమ్మా... ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ’ అంటూ ఎండిన గోదావరిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నడు. విప్లవమైనా, తెలంగాణ ఉద్యమమైనా, సామాజిక పోరాటమైనా దేనికైనా ‘పాటే ప్రాణం’ అంటున్న మానుకోట ముద్దుబిడ్డతో ‘జయరాజు’తో ఈ వారం ఫటాఫట్. 
మీరు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం?
పాట రాసిన ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకుంటా.
పూర్తి పేరు?
గొడిశాల జయరాజు.
పుట్టింది ఏ వూరు?
మహబూబాబాద్, వరంగల్ జిల్లా.
కుటుంబం? 
భార్య మంగతాయి, కుమారులు సాదన్, నిషాంత్.
తల్లిదంవూడులు?
తండ్రి కిష్టయ్య, తల్లి చెన్నమ్మ (వ్యవసాయ కూలీలు), సాదుకున్న తల్లి అచ్చెమ్మ.
చదువు?
ఎల్.ఎల్.బీ., (పూర్తి చేయలేదు).
మీరు ఏ వయస్సు నుంచి పాటలు రాస్తున్నారు?
నేను ఐ.టీ.ఐ. చేస్తున్న సమయంలో నా మిత్రుడు చేరాలును కొంతమంది చంపేశారు. అతని మీదే మొదటి పాట రాశా.
ఆ పాట కొంచెం వినిపిస్తారా?
‘నీ పాట విన్న వీర ప్రజలు నీ పాటడుగుతున్నరు.’
ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం? 
హైదరాబాద్ సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఫిట్టర్.
రాయడమేనా లేక పాడుతారా? 
పాడడం చేశాకే రాయడం నేర్చుకున్నా.
ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు?
ఐదు వందలకు పైగానే.
సినిమాలకు ఏమన్న రాశారా?
15 సినిమాలకు రాశా. ‘దండోరా’లో ‘ఓ కొండల్లో కోయిలా పాటలు పాడాలి’, ‘అడవిలో అన్న’లో ‘వందనాలమ్మా నీకు’ పాటలు జనాదరణ పొందాయి.
ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమన్న తీశారా? కొన్ని పేర్లు చెప్పండి?
‘వందనాలమ్మా’, ‘భారత మార్క్స్ అంబేద్కర్’, ‘బుద్ధం శరణం గచ్ఛామీ’, ‘వసంత గీతం’, ‘ఎర్ర మందారాలు’,‘ఎర్ర మేఘాలు’.
మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట?
‘వానమ్మ వానమ్మ వానమ్మా.. ఒకసారన్న వచ్చిపోయే వానమ్మా’
ఆ పాట రాయాలని ఎందుకనిపించింది?
‘కాళ్ళల్ల గోదావరి, కళ్లల్లో కృష్ణ ఉన్నా గుండెల్లో దాహం తీరని తెలంగాణను చూసి’.
తెలంగాణ ఉద్యమంలో పాటకున్న ప్రాధాన్యం?
ఉద్యమ తూటాలుగా మలచగలిగే శక్తిని పాట ఇచ్చింది.
జానపద పాటలంటే ఇష్టమా? మెలోడీనా?
హృదయానికి తగిలే ప్రతీ పాట ఇష్టమే.
రచయితగా మీకు స్ఫూర్తి ఎవరు?
గద్దర్.
ఎక్కువగా ఎలాంటి పాటలు రాస్తుంటారు? 
మమతలు, మమకారాలు, ప్రకృతి సౌందర్యం, మానవీయ కోణం కలిగిన పాటలు.
మీకు నచ్చిన గాయకుడు, రచయిత?
గాయకుడు జేసుదాసు, రచయిత దాశరథి.
మీ పాట కాకుండా మీకు ఇష్టమైన పాట?
ఆత్రేయ రాసిన ‘మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే...’
పాటలు కాకుండా ఇంకేం చేస్తారు?
ప్రకృతి వనరులు ప్రజలకు దక్కడం కోసం పాటను ఆయుధంగా చేసుకుని బుద్దిజాన్ని ప్రచారం చేస్తున్నా.
లాంటి సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
జానపద సంగీతం.
విప్లవ పంథా నుండి తెలంగాణ ఉద్యమం వైపు మర్లడానికి కారణం?
ప్రతి ప్రగతిశీల ఉద్యమంలోనూ నా భాగస్వామ్యం ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నీ తడుముకుంటూ వెళ్తున్న.
విప్లవ సాహిత్యాన్ని రాసిన మీరు ఇప్పుడు ఎలాంటి పాటలు రాస్తున్నారు?
అప్పుడూ ఉద్యమ పాటలే రాశా. ఇప్పుడూ అవే రాస్తున్నా.
తెలంగాణ సాహిత్యానికి, విప్లవ సాహిత్యానికి సారూప్యత ఉందా?
తెలంగాణ ఉద్యమం విశాలమైన ప్రజాస్వామ్య ఉద్యమం. విప్లవోద్యమం వర్గ దృక్పథంతో కూడిన ఉద్యమం. కనుక సాహిత్యంలో కొంత తేడా ఉంటుంది.
మీలో మీకు నచ్చే విషయం?
నన్ను నేను ప్రేమించుకుంటూనే తోటి వారిని ప్రేమించడం.
తెలంగాణలో మీకు ఇష్టమైన ప్రాంతం?
పాపికొండలు.
దేవుణ్ని నమ్ముతారా?
‘ప్రకృతే పరమాత్మ’ అని నమ్ముతాను.
మీ జీవితంలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు?
నా జీవిత భాగస్వామిని.
మిమ్మల్ని మీ ఊరివాళ్ళు ఎలా చూస్తారు?
ప్రపంచం గుర్తించాకే ఊరు గుర్తిస్తుంది. ఇప్పుడైతే నన్ను ఉన్నతంగా చూస్తారు.
మీ కిష్టమైన స్పోర్ట్స్ ?
వాలీబాల్.
కోపం వస్తే ఏం చేస్తరు?
దిగమింగుకుంటా.
మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వాళ్లు?
ప్రజాకవి ‘శక్తి’.
ఏ సందర్బంలో పాటలు రాస్తారు?
సమాజంలో జరిగే ప్రతి దానికి స్పందించి రాస్తా.
తీరిక సమయాల్లో ఏం చేస్తుంటారు?
పుస్తకాలు చదువుతా.
ఎలాంటి బుక్స్ చదువుతారు?
ప్రగతిశీల సాహిత్యం, తాత్విక, ప్రకృతి సంబంధ పుస్తకాలు.
మిమ్మల్ని మీరు తిట్టుకున్న సందర్భం?
నన్ను భాగా ప్రేమించే వాళ్ళే నన్ను అర్థం చేసుకోకుండా నాకు దూరమవుతున్నపుడు.
ఎవరిమీద మీరు ఎక్కువగా ఆధారపడతరు?
నా భార్యపైన.
మాపాఠకుల కోసం ఇంకేమైనా చెప్తరా?ప్రకృతిని విధ్వంసం చేస్తూ ‘అభివృద్ధి’ అనుకుంటున్నారు. కానీ, దానివల్ల మానవ సమాజమే విధ్వంసం అవుతోంది. భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు దొరకని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే, ఏ అభివృద్ధి అయినా ప్రకృతికి లోబడే జరగాలి. కుల, వర్గ రహిత, స్త్రీ వివక్ష లేని సమాజమూరావాలి.     - from bathukamma

17, మార్చి 2013, ఆదివారం

దక్కన్ దృశ్యమాలిక ‘మా ఊరు’


- తెలంగాణ పల్లె సంస్కృతిని ఆవిష్కరించిన బీ నర్సింగరావు డాక్యుమెంటరీ
- చిత్ర ప్రదర్శనలో వక్తల ప్రశంసలు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (టీ మీడియా): ప్రముఖ దర్శకుడు బీ నర్సింగరావు దర్శకత్వంలో రూపొందిన ‘మా ఊరు’ డాక్యుమెంటరీ చిత్రం దక్కన్ పల్లెల వైభవాన్ని ఆవిష్కరించింది. హిమాయత్‌నగర్‌లోని ‘చంద్రం’ (ఆక్స్‌ఫర్ట్ గ్రామర్ స్కూల్) లో శనివారం సాయంత్రం డాక్యుమెంటరీని ప్రదర్శించారు. దక్కన్ పల్లెల ఆర్థిక మూలాలు, వృత్తి సమాజాలు, సంస్కృతిని రేపటి తరాలవారికి తెలియజేసేలా ప్రముఖ దర్శకులు బీ నర్సింగరావు స్వీయదర్శకత్వంలో రూపొందించిన 51 నిమిషాల నిడివిగల ‘మా ఊరు’ చిత్రం తెలంగాణ పల్లెలను, భారతీయ ఆత్మను ఆవిష్కరించింది. కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ‘భారతదేశం.. అద్భుతమైన స్వయంపోషిత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ’ అన్నారు. ఈ ‘మా ఊరు’ డాక్యుమెంటరీ చిత్రం మార్క్స్ వర్ణనను వర్ణాల్లో ఆవిష్కరించిందని ఈ చిత్రాన్ని తిలకించిన వారంతా ప్రశంసించారు.

దక్కన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనను తెలంగాణ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రముఖులు తిలకించారు. అనంతరం జర్నలిస్టు పాశం యాదగిరి ప్రసంగిస్తూ.. ఈ డాక్యుమెంటరీని చూస్తుంటే మా ఊరేనేమో అనిపించిందని.. నా చిన్ననాటి జీవితం కనిపించిందని అన్నారు. మన అభివృద్ధిని మనం సమీక్షించుకోవాలని ఈ చిత్రం సూచిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి సంఘం అధ్యక్షుడు బండారు భిక్షపతి మాట్లాడుతూ.. నిజాం కాలంనాడు గ్రామాల్లో వివిధ కుల వృత్తులకు రక్షణ ఉండేది.. నిజాం ఇచ్చిన మాన్యాలు ఉండేవని పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం మాన్యాలు ఇవ్వకపోగా, వాటిని లాగేసుకుందని విమర్శించారు. కవి దాసోజు కృష్ణమాచారి మాట్లాడుతూ..‘మా ఊరు’ ఎప్పుడో తీసినట్లుందని.. ఇటీవలే తీసిన డాక్యుమెంటరీ అని తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. 

నేటి వ్యాపారాలు గ్రామీణ చేతి వృత్తుల్ని ఎలా శాసిస్తూ ధ్వంసం చేస్తున్నాయో ఈ డాక్యుమెంటరీ చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఇందులో శ్రామిక వర్గాల మధ్య ఉండే సంబంధాలు, ఊరుమ్మడి సంస్కృతి ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. అన్వర్ మాట్లాడు తూ. తెలంగాణ పల్లెకు చెరువు ప్రాణం అని అన్నారు సీమాంధ్ర ప్రభుత్వం ఈ చెరువులు, కుంటల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు నీటి వనరులు జీవ వైవిధ్యానికి నిలయాలని.. ఈ వైవిధ్యం ఇవాళ్టి గ్రామాల్లో కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగానే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనమైందని వివరించారు. వివిధ కులాల వారి వృత్తులన్నింటికీ కావాల్సిన వనరులన్నీ పల్లెల్లో ఉండేవని.. ఈ వనరుల నిర్వహణకు కాసు బ్రహ్మానందడ్డి కాలంలో తిలోదకాలిచ్చారని తెలిపారు. అప్పటినుంచి మన ఆర్థిక ప్రగతి మందగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

                                                                   -from NAMASTE TELANGANA

14, మార్చి 2013, గురువారం

‘వరుడా!’ ఏమి నీ కోరిక?


FROM www.satishchandar.com

అవునూ, కాదూ- మధ్యకూడా అనేక సమాధానాలుంటాయి.
అనుమానం వుంటే, ఒక్క సారి ‘అఖిల పక్షం’ పెట్టి చూడవచ్చు.
రాజకీయం మొత్తం- ఈ రెండూ కాకుండా, రెంటికి మధ్యే ఇరుక్కుని వుంటుందని తేలిపోయింది.
తెలంగాణా కావాలా? అంటే, అవునూ అని చెప్పిందెవరూ?
ప్రశ్న అడిగిన పెద్దమనిషినే- ‘మా సంగతి సరే, మరి నువ్వేమంటావ్‌?’ అని పీక పట్టుకున్నారు.
‘అ…అ…అవుదు’ అని కాస్సేపూ, ‘కా… కా…కావును’ అని కాస్సేపూ అని అన్నారు.( అచ్చుతప్పు అనుకోకండి. ఇవో రకం సంధి. గుణసంధి గురించి వినే వుంటారు. ఇది ‘దుర్గుణ సంధి’ అన్నమాట. కేవల రాజకీయ వ్యాకరణంలోనే వుంటుంది. ‘అవును+కాదు=అవుదు’, ‘కాను+అవుదు=కా వుదు’.)
అడిగే వారు దూరటానికి పనికి వచ్చిన సందులు(సంధులు), చెప్పేవారికి పనికి రావా?
తెలంగాణ కావాలని తెగేసి చెప్పిన పార్టీ లు రెండే రెండు. అందులో ఒకటి తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణ పేరు పెట్టుకున్న పార్టీ. సీమాంధ్ర వోటర్లతో ఎలాంటి పనిలేని పార్టీ. ఇంకొకటి పేరుకు జాతీయ పార్టీయే కానీ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి సంబంధించినంత వరకూ ఎందుకో (ఒక్కరూ, లేక ఇద్దరూ- అంటూ) కుటుంబ నియంత్రణ పాటిస్తూ వస్తోంది. ఈ సంఖ్య పెంచుకోవటానికి తెలంగాణ ప్రాంతం ఒక్కటి చాలు అని, సీమాంధ్ర మీద ఆశలు వదలుకుంది.
అందుచేత ‘తెలంగాణ కావాల’ని కుండేమిటి, టాంకర్లు బద్దలు కొట్టి చెప్పమన్నా చెప్పేస్తారు.
మిగిలినవాళ్ళే అవునూ, కాదూ మధ్య- అనేకానేక సమాధానాలు సృజనాత్మకంగా కనిపెట్టారు.
ఇక్కడ ప్రశ్నే అసలు ప్రశ్న కాదు. మనలో మనమాట. ముఖమాటం లేకుండా అడగాలంటే ‘హైదరాబాద్‌ కావాలా?’ అని. గొడవంటే హైదరాబాద్‌ గురించే కదా?
ఇక్కడే ‘పుట్టాం’ కాబట్టి, హైదరాబాద్‌ తమదేనని తెలంగాణ వాసులూ, ఇక్కడే (పెట్టుబడులు) ‘పెట్టాం’ కాబట్టి హైదరాబాద్‌ తమదేనని సీమాంధ్ర వాసులూ అనుకోబట్టే, జగడానికి పీట ముడి పడింది.
వెనకటికి ఓ పేద పండితుడి కూతుర్ని అరడజను మంది సైనికోద్యోగులు ప్రేమించారు.
అసలు కూతురికి పెళ్ళి చెయ్యగలనా- అని ఇన్నాళ్ళూ భయపడి చచ్చిన పేద పండితుడికి భయం ఆరింతలయింది.
వారిలో ఏ ఒక్కడి కిచ్చి పెళ్ళి చేసినా, మిగిలిన అయిదుగురు ‘పండితుడి తల నాక్కావాలీ, అంటే నాక్కావాలీ’ అని కొట్టుకుంటారు. ఎలా చూసినా తెగేది పండితుడి తలేనని తేలిపోయింది.
తల తీయించుకోవటమే తప్పదనుకుంటే, ఈ సైనికోద్యోగులతో ఎందుకు తీయించుకోవాలీ, నేరుగా మహారాజు గారితోనే తీయించుకుంటే బాగుంటుంది కదా, అదే పండితుడి తలలో మెరుపు లాంటి ఆలోచన పుట్టింది.
ఇంకేముంది? తర్వాత రాజుగారి కోర్టు సీను.
పండితుడూ, పండితుడి కూతురూ ఒక వైపూ, ఆరుగురు సైనికోద్యోగులూ మరో వైపు.
ఎంతో విద్వత్తూ, సంస్కృతీ వున్న పండితుణ్ణి వదిలేసి, రాజు సైతం పండితుడి కూతురి వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఆమె సౌందర్య సంపద ఆలాంటిది!!
‘వామ్మో! ఆరుగురే అనుకుంటే ఏడవవాడు తోడయ్యాడా?’ అని పండితుడు వణికి పోయాడు.
రాజుగారు తేరుకుని, గొంతు సవరించుకుని సైనికోద్యోగుల వైపు కోపంతో కాదు, ఈర్ష్యతో కాగి పోతూ చూశాడు.
‘అర్థమయినది..! సమరములేని చోట సరసమే పుట్టును. సైనికులున్నది సరసమాడుటకు కాదు. మీరిలా బాధ్యతలను మరవ బట్టే, జనులకు భద్రతలేకుండా పోయినది. భీమ సేనులు కొడితే కాదు, ‘దోమ’ సేనులు కుట్టినా రోగులు చనిపోతున్నారు. పురుగు మందు తినకుండా రైతులు చనిపోతున్నారు. అయినా నేను ప్రేమకు వ్యతిరేకిని కాను. మీకు ప్రేమ పరీక్ష పెడుతున్నాను. కానీ, ( అని పండితుడి కూతురి వైపు వోర కంటి చూసి,) ఈ పరీక్షలో నేను కూడా పాల్గొంటున్నాను.’ అన్నారు.
‘ ఈ సౌందర్యవతి తో పాటు, పేద పండితుణ్ణి కూడా యావజ్జీవమూ పోషించగలగటానికి సిధ్దమేనా?’ మహారాజు అడిగాడు.
‘మహారాజా! ఎందులయినా మీ తర్వాతే మేము. స్వయంవరంలో మీరూ వున్నారు కాబట్టి మీరే సెలవివ్వండి.’
రాజు తన బిగించిన ఉచ్చులో తానే పడ్డాడు.
‘పండితుడి లేని సుందరే మేలు కానీ, పండితుడి నుంచి సుందరిని వేరు చేయగలమా?’ అన్నాడు రాజు.
అంతే ఇక చూసుకోండి ఆరుగురు సైనికోద్యోగులకూ సమాధానాలు అలవోకగా వచ్చాయి.
‘పండితుడి లేని సుందరి’ అని ఒకడూ, ‘పండిత పుత్రిక సుందరి’ , ‘పండితుణ్ణి వదలుకున్న సుందరి’, ‘పండితుడు వద్దనుకున్న సుందరి’ ‘పండితుణ్ణి ఎదరించిన సుందరి’ ఇలా అయిదుగురూ చెప్పాక, ఆరవ వాడికి ఎందుకో పరిష్కారం దిశగా ఆలోచించాలని పించింది.
‘రాజా! తమరు పండిత పోషకులు కాబట్టి, పండితుణ్ణి మీరే తీసుకుని, సుందరిని మాలో ఎవరో ఒకరికి ఇవ్వండి.’ అన్నాడు.
అంతే రాజుగారు కోపంతో చప్పట్లు కొట్టారు. దీపాలు ఆరిపోయాయి. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ చప్పట్లు కొట్టాయి. దీపాలు వెలిగాయి.
సుందరి మాయం. పండితుడే వున్నాడు.
‘మిగిలింది పండితుడే కాబట్టి. ఆయన్ని మనమందరమూ పోషిద్దాం’ అని రాజుగారు తీర్పు చెప్పారు.
ఈ సుందరే హైదరాబాద్‌! పండితుడెవరో కాదు. పేదరికంలో వుండిపోయిన గ్రామీణ తెలంగాణ!!
-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి 30 డిశంబరు 2012 వ తేదీ సంచికలో ప్రచురితం)

13, మార్చి 2013, బుధవారం

‘కొండల్లో ఉన్న మల్లన్నా!



కోటి దండాలు నీకన్నా!’ 
ఆదిలాబాదు జిల్లా జైపూర్ మండలంలో పవిత్ర గోదావరి తీరాన పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో కొండపై వెలసిన దేవుడు వేలాల మల్లన్న. భక్తులకు కొంగు బంగారంగా కొలువైన సాంబశివున్ని శివరాత్రి నాడు పిల్లాపాపలతో దర్శించి తరిస్తారు భక్తులు. ‘కొండల్లో ఉన్న మల్లన్నా! కోటి దండాలు నీకన్నా!’ అంటూ వేలవేల భక్తులు వివిధ ప్రాంతాల నుండి కార్తీకమాసం, మాఘమాసం శివరాతిరికి వారం, పది రోజుల ముందు నుండే వచ్చి చేరుతారు. ‘గుట్ట, గుట్టా ఎక్కి నీ తానకు వచ్చాం...’ అని విన్నవించు కుంటారా పరమశివునికి.

పవిత్ర గోదావరి స్నానాలు చేసి శుచిగా, రుచిగా వండిన బోనాన్ని తలమీద పెట్టుకొని వడివడిగా పిల్లాపాపలతో భక్తజనం వెళ్తుంటే, మల్లన్న గుట్టకే కొత్తకాంతి వచ్చినట్లు, వేలాలగుట్టకే వెలుగు వచ్చినట్టుంటది. మహాశివరాత్రి రోజు పంటచేల పనులయ్యాక, చలిపోయి నును వెచ్చటి సూర్యకాంతుల వేడితో గొడ్డు గోదను, పాడిపంటలను, పిల్లాపాపలను శివశక్తి రూపుడైన పార్వతీనాథుడే కాపాడాలని పరవశించి పాటలు పాడతారు. కేవలం తమ కుటుంబమే కాక బంధుమివూతులందరూ బండ్లమీద బయలుదేరుతారు. రెండు మూడు రోజులకు సరిపడ పక్కబట్టలు, ఆహారధాన్యాలు, ఎడ్లకు గడ్డి బండ్లలో తెచ్చుకుంటారు. భుజాల మీద, చంకలనెత్తుకున్న పిల్లలు సద్ది తినో, చలిలో నిద్ర పోకుండాచెట్టు, పుట్టను చూపుతూ, దేవుని మహిమలు తెలుపుతూ, నడిచే శ్రమను మరిచిపోతూ పాటలు పాడతారు.

‘చుట్టు పక్కల చూడరా! సూడ సక్కంగ ఉండురా
మన పాడిపంటలను శివుడే రక్షించురా!
మన పిల్లా పాపలను ఆడే కాపాడురా!
దేవుడంటే దేవుడే మల్లన్న దేవుడు
మహిమపూన్నో చూపించే మల్లన్న సామిరా!’
అని కైలాస పర్వతానికి వెళ్ళినంత సంబరపడతారు.
ఒక ప్రాంతంలో జాతర జరుగుతున్నదంటే చిన్నా, చితుక వ్యాపారులకెంతో ఆనందం. వివిధ కళాకారులకు కళలను ప్రదర్శించుకునే అవకాశం. డెక్కలాళ్ళు, బొమ్మరాళ్ళు, పగటి వేషాల వాళ్ళు పాములను మెళ్ళో వేసుకునేవాళ్ళు, పామును బుట్టలో పెట్టుకొని పైసలు అడుక్కునేటోళ్ళు, బుడబుక్కల వాళ్ళు ఒకరేమిటి అందరూ అక్కడికి చేరుతారు. ఆడి, పాడి ప్రజలను ఆనంద పరుస్తారు. దొమ్మరోళ్ళు పిల్లల చేత పిల్లి మొగ్గలు వేయిస్తారు. గడెక్కిస్తారు, గంతులేయిస్తారు. ఆ వింత చూస్తూ కొరడాతో కొట్టుకుంటూ రక్తం ఒళ్ళంతా కారుతున్న పంబాల వాళ్ళు బూరమీసాలతో, వింత తలకట్టుతో భయంకరంగా కన్పిస్తారు. ఇంట్లో ఎప్పుడూ అల్లరి చేసేవాళ్ళకు, దారి వెంట వేధిస్తున్న పిల్లలను ఇట్లే అల్లరి చేస్తే- వాళ్ళకిచ్చి వెళ్ళిపోతామని భయపెడ్తారు. అంతేకాక, వాళ్ళతో...
‘అమ్మా! నన్ను దొమ్మరోళ్ళ కియ్యకే,
గడెక్కుమంటరే, గంతుపూయ్యి మంటరే.
అమ్మా! నన్ను దొమ్మరోళ్ళ కియ్యకే’...
అని పరాచికాలు చేస్తూ పరుగెత్తిస్తరు.

ఎలా వెళ్ళాలి?
కరీంనగర్ జిల్లా గోదావరిఖని నుండి ఇందారం మీదుగా వెళ్ళవచ్చు. సుందిళ్ళ గుట్టలో యోగ నరసింహస్వామి ఎదురుగా వేలాలగుట్టలో మల్లన్నస్వామి దర్శనమిస్తాడు.ఈ రెండు ప్రాంతాల మధ్య అయిదారు కిలోమీటర్ల దూరమే.
కరీంనగర్ జిల్లా మంథని నుండి పవిత్ర గోదావరి మీదుగా కూడా వెళ్ళవచ్చు. అయితే, ప్రజలు ప్రభుత్వాన్ని అడిగి అడిగి విసిగి వేసారి తామే రోడ్డు వేసుకున్నారు. ఇక్కడకు మంథని నుంచి వాహనాలన్నీ వెళ్ళే సౌకర్యం ఉంది.

mallanna2స్థల పురాణం
వేలనామాలున్న వాడు, వేలాలలో కొలువైన పరమశివుని గురించిన అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి.
దేవ దానవులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా పాలకడలిని చిలుకుతుండగా అపురూపమైన అనేక వస్తువులు పైకి వచ్చాయి. కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, చింతామణి మొదలైన వాటిని చూసి దేవేంవూదుడు తన పాలుగా తీసుకున్నాడు. అమృతానికి ముందు హాలాహలం వచ్చింది. దాని పొగలు, సెగలు చూసిన దేవదానవులంతా భయపడ్డారు. హాలాహలం తీస్తేనే అమృతం లభిస్తది. కాని, ఎవరు దాని ఛాయలకు వెళ్ళేది? భోళాశంకరుడది గ్రహిస్తాడు. పదిమందికి ఉపయోగించే పనిచేస్తున్నప్పుడు తన ప్రాణానికేమైనా సరేనని తలచి, హాలాహలం తాగి కంఠంలో నిక్షిప్తపరుచుకుని గరళకంఠుడయ్యడు. ఎప్పుడైతే విషాన్ని గ్రహించాడో ఆ వెంటనే ఆయన చెవి, ముక్కు, గొంతు దెబ్బ తిన్నవి. ‘మల్లన్నకు చెవుడు వచ్చింది.

అమ్మ అర్థరాత్రి ఏమి గుసగుసలాడినా వినిపించని పరిస్థితి.’ పరమశివుని చూసి అమ్మ పరాచికంగా పకపక నవ్వింది. శివునికి కోపం వచ్చింది. ఉదయాన్నే లేచి ఊరి వెలుపలి కొండెక్కి కూచున్నాడు. ధ్యానం చెయ్యాలని తలపోసాడు. గుట్టెక్కుతుంటే నాగులు గునగున వచ్చి కంఠాభరణాలయ్యాయి. విషానికి విషమే విరుగుడని దీనివల్లే ఆదిదంపతుల కంతః కలహం మొదలైందని తలచి, కోరలతో విషాన్ని పీల్చసాగాయి. ఇదే అదనని గంగమ్మ స్వామి శిఖలో చేరింది. సుధాకరుడు చంద్రుడు తన కత్యంత దూరంలో ఉండే శివుడు కొండపైకి రావటంతో తనకు దగ్గరైనాడని సంతోషించాడు. నందికేశ్వరుడు రాయభారాన్ని అమ్మ పంపంగా వెళ్ళాడు. ‘ప్రణయ కలహాల్లో పరాచిక మాడితే తప్పా! క్షమించి కిందికి రమ్మని’ వేడుకున్నాడు. ఏడాది కొక్కనాడైనా దర్శనమివ్వమని బతిమాలాడు. అందుకే, మేళతాళాలతో, దీపాలు దివిటీలతో ఉత్సవ విగ్రహాలకు వేలాల గుట్టకింద వైభవంగా కల్యాణం చేస్తారు భక్తులు.
                                                                                              
-డా॥ ఆర్.కమల, 98491 55756
                                                                                                                       -from BATHUKAMMA

11, మార్చి 2013, సోమవారం

అర్ నారాయణమూర్తి అంతరంగం ..




                                                                                                                         
                                                              - from V6 NEWS

1, మార్చి 2013, శుక్రవారం

ధీర నాయకురాలు ఈశ్వరీబాయి



తరతరాలుగా దోపిడీకి, పీడనకు గురౌతున్న దళితుల వికాసానికి, అభివృద్ధికి దృఢ సంకల్పంతో, సేవా భావంతో తన జీవితాంతం అలుపెరుగని పోరాటం జరిపిన ధీర వనిత ఈశ్వరీబాయి... తెలుగుతనానికి నిదర్శనం ఈశ్వరీబాయి కట్టూ, బొట్టూ. ఆమె జీవన శైలి మహిళలకు ఆదర్శం. ఆమె వాక్చాతుర్యం యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. ఆమె ఉపన్యాసాల పరంపర యువకులను, స్త్రీలను ఉత్తేజపరిచేవి. 

కుల వివక్ష, దళితులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా అంకిత భావంతో ప్రతిఘటించిన ధీర నాయకురాలు శ్రీమతి ఈశ్వరీబాయి. సికింద్రాబాద్ వాసి నిజాం రైల్వేస్‌లో గూడ్స్ మాష్టారుగా పనిచేసే దళిత కుటుంబానికి చెందిన బలరామస్వామి, రాములమ్మ దంపతులకు ఈశ్వరీబాయి 1918, డిసెంబర్ 1న ఆమె జన్మించారు. కీ న్స్ హైస్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈశ్వరీబాయికి 13వ ఏట పూనా నివాసి డా.జె. లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఆ దంపతుల ఏకైక సంతానం గీత. అనతికాలంలో భర్త మరణించటంతో పూనా నుంచి సికింద్రాబాద్‌లోని తండ్రి దగ్గరకు కుమార్తెతో సహా మకాం మార్చారు. స్త్రీ స్వయం ప్రతిపత్తి, స్వావలంబన భావాలుగల ఈశ్వరీబాయి పరోపకారిణి. పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా జీవితం ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖలో ఉద్యోగినిగా పనిచేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలో 'గీతా విద్యాలయం' పాఠశాలను స్థాపించి ఆ ప్రాంతంలో స్త్రీలందరినీ చేరదీసి వారికి చేతివృత్తులలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ళపై వారు నిలబడేలా చేశారు.

నాటి సమాజంలో అంటరానితనం కారణంగా దళితులు పడుతున్న అవస్థలు ఈశ్వరీబాయిని కదిలించాయి. బాబాసాహెబ్ డా.అంబేద్కర్ ఉద్యమాలు, ప్రసంగాలు ఆమెను ప్రభావితం చేశాయి. విమోచన ఉద్యమాలవైపు అడుగులు వేయటం ప్రారంభించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం పాలన నుంచి భారత ప్రభుత్వంలో కలుపుకున్న తరువాత 1951లో హైదరాబాద్-సికింద్రాబాద్ నగర పాలక సంస్థకు ప్రప్రథమంగా జరిగిన ఎన్నికలలో చిలకలగూడ (సీతాఫల్‌మండి) వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కార్మికులు, దళితులు, స్త్రీల శ్రేయస్సు కోసం ఈశ్వరీబాయి విశేషంగా కృషి చేశారు. అధికార పార్టీలో చేరాలని ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ప్రలోభాలకు లొంగక బాబాసాహెబ్ సిద్ధాంతాలు విడువక 'అఖిలభారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య'లో చేరి హైదరాబాద్‌లో ప్రముఖ పాత్ర పోషించారు. బి. జగన్నాధం అధ్యక్షులుగా ఈశ్వరీబాయి ప్రధాన కార్యదర్శిగా అఖిలభారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాలకు నాయకత్వం అందించారు.

1956, అక్టోబర్ 4న నాగపూర్‌లో బాబాసాహెబ్ డా.అంబేద్కర్ ధమ్మదీక్ష స్వీకార కార్యక్రమం ఏర్పాటుచేసి 5 లక్షల మంది అనుయాయులతో బౌద్ధమతం స్వీకరించారు. ఆ కార్యక్రమంలో ఈశ్వరీబాయి కీలకపాత్ర వహించారు. అనేకమంది అనుయాయులతో దీక్షను స్వీకరించారు. 1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈశ్వరీబాయి పోటీచేసి గెలుపొందారు. బాబాసాహెబ్ రాజకీయ వారసురాలన్న గుర్తింపే ఆమెను ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి దేవాదాయ శాఖ మంత్రి టి.ఎన్. సదాలక్ష్మిపై గె లిచేందుకు దోహదం చేసింది. తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం మొదలైన ప్రతిపక్ష నాయకుల సరసన ఆమె అదే హోదాను పొందారు. ఆ తరువాత జరిగిన 1972 శాసనసభ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి రెండవ సారి ఎన్నికయ్యారు.

మొదటి సారి శాసనసభలో ప్రతిపక్షనాయకురాలిగా అడుగిడిన ఈశ్వరీబాయి సభలో అనేక సమస్యలను ప్రస్తావించారు. చర్చల్లో చురుగ్గా పాల్గొని తన సలహాలను అందిచారు. సమసమాజ స్థాపన, రాజ్యసామ్యవాదం, కార్మికుల రక్షణ-భద్రత, కనీసవేతన చట్టం, భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి బంజరు భూమి పంపిణీ, అస్పృశ్యత నివారణ చట్టాన్ని పటిష్ఠంగా అమలుపరచాలని, అస్పృశ్యత పాటించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బలహీనవర్గాల కార్మికులకు ఇతర నిరుపేదలకు నిత్యావసర వస్తువులు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని, బౌద్ధమతం స్వీకరించిన అస్పృశ్యులకు ఎస్.సి. హోదా కల్పించాలని (1992లో నియో బౌద్ధులను ఎస్.సి.లుగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది), ఇంటర్‌మీడియేట్ వరకు స్త్రీలకు ఉచిత విద్య అందించాలని, వితంతువులకు పింఛనులు ఇవ్వాలని, పట్టణ ప్రాంతంలోని మురికివాడలలో నివసించే వారికి పక్కా గృహాలను నిర్మించి మంచినీరు, విద్యుత్ సరఫరా సక్రమంగా అందించాలని, హైదరాబాద్‌లోని ముస్లిం మహిళలకు ఉచిత విద్య-ఉపాధి కల్పించాలని ప్రభుత్వంపై ఈశ్వరీబాయి ఒత్తిడి తెచ్చారు. అప్పటి ప్రభుత్వం ఈశ్వరీబాయిని ఆంధ్రప్రదేశ్ మహిళా-శిశు సంక్షేమ సంస్థకు అధ్యక్షురాలిగా నియమించింది.

ఆ హోదాలో రాష్ట్రమంతటా పర్యటించి స్త్రీలు, శిశువుల స్థితిగతులను వారి సమస్యలను తెలుసుకొని అనేక సంస్కరణలను ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ముఖ్యంగా మహిళా విద్యార్థులకు ఉచిత విద్య ఉండాలని, శిశు సంరక్షణకు మార్గదర్శకాలను సూచించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ (ఐ.సి.ఎస్.డబ్ల్యూ) హైదరాబాద్ చాప్టర్‌కు సభ్యురాలిగా సేవలందించారు. ఇండియన్ రెడ్ క్రాస్‌కు రాష్ట్ర సభ్యురాలిగా పనిచేశారు. సివిక్ రైట్ కమిటీ (సి.డబ్ల్యూ.సి.) స్థాపించి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. ఈశ్వరీబాయి ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి. భారతదేశంలోనే దళితుల ఏకైక నాయకురాలిగా ఎలాంటి సమస్య పరిష్కారానికైనా యాచించే విధానాలను విడనాడి న్యాయపరమైన హక్కు, పోరాటం ద్వారా సాధించాలన్న డా. అంబేద్కర్ సిద్ధాంతానికి ప్రతీకగా ఉండేది ఆమె వ్యవహార శైలి. పిడికిలి బిగించి గర్జించే స్వభావం ఆమెది. నిజాయితీగా చిత్తశుద్ధితో కుండబద్దలైనట్లు మాట్లాడటం ఆమె నైజం. ఎన్ని త్యాగాలనైనా భరించి స్త్రీ సమాజంలో స్వేచ్ఛా సమానత్వం సాధించాలన్నదే ఈశ్వరీబాయి ప్రబోధం. ఆమె సభలకు, సమావేశాలకు స్త్రీలు అధికంగా పాల్గొనేవారు. పురుషులు వ్యసనాలకు ముఖ్యంగా తాగుడుకు బానిసలు కాకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత స్త్రీలే వహించాలని అనేవారు.

1968లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని విద్యార్థులు, న్యాయవాదులు, 'తెలంగాణ ప్రజా సమితి' నేర్పాటు చేశారు. డా. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. సమితి కార్యనిర్వాహక సభ్యురాలిగా ఈశ్వరీబాయి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, విద్యుత్ లాంటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అనేక సభల్లో ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. దాంతో తెలంగాణ ప్రాంతంలో ఆమె పేరు ప్రఖ్యాతులు పెంపొందాయి. అగ్రకుల నాయకులు పదవులకు అమ్ముడుపోయినప్పటికీ ఈశ్వరీబాయి తెలంగాణ సమస్యలపై నిరంతరం నిస్వార్థమైన పోరాటం నిర్వహించారు.

తరతరాలుగా అంటరానితనం అంటగట్టబడి దోపిడీకి, పీడనకు గురౌతున్న దళితుల వికాసానికి, అభివృద్ధికి దృఢ సంకల్పంతో, సేవా భావంతో తన జీవితాంతం అలుపెరుగని పోరాటం జరిపిన ధీర వనిత. ప్రతిపక్ష నాయకురాలి హోదాలో 'ఫైర్‌బ్రాండ్ లేడీ లీడర్'గా ఖ్యాతి పొందారు. మహామహులైన ముఖ్యమంత్రుల చేత నీళ్ళు తాగించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (కె) జాతీయ అధ్యక్షురాలిగా దేశం నలుచెరుగుల అభిమానులను, శిష్యులను సంపాదించుకున్న నాయకురాలు.

కృష్ణా జిల్లా కంచికచర్లలో కోటేశు అనే దళిత యువకుడిని అగ్రవర్ణాలు సజీవంగా దహనం చేసిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈశ్వరీబాయి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ సంఘటనపై ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి క్షమాపణలు చెప్పారు. అయినా ఈశ్వరీబాయిలో ఆవేదన, ఆక్రోశం తగ్గలేదు. ఇం తలో నాటి వ్యవసాయ శాఖ మంత్రి తిమ్మారెడ్డి వ్యంగ్యంగా ఎత్తిపొడిచే ధోరణిలో.. 'దొంగతనం చేస్తే ముద్దు పెట్టుకుంటారా...' అన్న మాటలు పూర్తికాకుండానే 'షటప్, ఇంకొక్కమాట మాట్లాడితే చెప్పుతో కొడతా జాగ్రత్త...' అంటూ చెప్పుచేతబూని మంత్రి వైపుకు దూసుకెళుతున్న ధీర సభ్యురాలిని 'అమ్మా శాంతించు... శాంతించు...' అంటూ అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈశ్వరీబాయి ఆవేశానికి గాబరాగా అడ్డుకుంటూ క్షమించమని ప్రాధేయపడ్డారు.

తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్ట, నిగర్వి. సామాన్యుడికి సైతం ఎల్లవేళలా అందుబాటులో ఉండే మనస్తత్వం ఆమెది. నిరాడంబర సంఘసేవకురాలుగా గుర్తింపు పొందారు. తెలుగుతనానికి నిదర్శనం ఈశ్వరీబాయి కట్టూ, బొట్టూ. ఆమె జీవన శైలి మహిళలకు ఆదర్శం. ఆమె వాక్చాతుర్యం యువ నాయకులకు స్ఫూర్తిదాయకం. ఆమె ఉపన్యాసాల పరంపర యువకులను, స్త్రీలను ఉత్తేజపరుస్తాయి. అటువంటి ఈశ్వరీబాయి ఆకస్మాత్తుగా అస్వస్థతకు లోనై చికిత్స చేయించుకుంటూ 1991, ఫిబ్రవరి 24న తుదిశ్వాస వదిలారు. ఈశ్వరీబాయి ఆశయాలను ప్రస్తుతం ఆమె కుమార్తె గీతారెడ్డి సారధ్యంలో 'ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్' కొనసాగిస్తోంది. మహిళలకు వృత్తి విద్య శిక్షణ, పేదలకు వైద్య సదుపాయాలు కల్పించడం, మహిళలకు విద్యావకాశాలు కల్పించడం, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడటం తదితర లక్ష్యాలతో ఆ ట్రస్టు పనిచేస్తోంది. ఈశ్వరీబాయి జీవితం అందరికి మార్గదర్శకం. ఆమె కీర్తి అజరామరం.

- డా. జె. గీతారెడ్డి
రాష్ట్ర మంత్రివర్యులు
(from andra jyothi)