హోం

15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

కర్ణాటక లోకాయుక్తగా తెలంగాణ ముద్దుబిడ్డ


కర్ణాటక లోకాయుక్తగా తెలంగాణ ముద్దుబిడ్డ
స్వస్థలం కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో సంబరాలు
- ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్
- భాస్కర్‌రావు స్వస్థలం కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్

బెంగళూరు/ కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 14: కర్ణాటక లోకాయుక్తగా జస్టిస్ వై.భాస్కర్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. గురువారం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్షికమంలో గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ ప్రమాణం చేయించారు. 75 యేళ్ల భాస్కర్‌రావు గతంలో కర్ణాటక హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. లోకాయుక్తగా నియమితుడైన భాస్కర్‌రావు గతంలో జాతీయ మానవ హక్కుల సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. కాగా, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు రావడంతో లోకాయుక్త పదవికి శివరాజ్ వీ పాటిల్ రాజీనామా చేశారు. దీంతో లోకాయుక్త పోస్టు 2011, సెప్టెంబర్‌నుంచి ఖాళీగా ఉంది. లోకాయుక్త నియామకంలో అవకతవకలు జరిగాయని బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా.. స్పందించేందుకు భాస్కర్‌రావు నిరాకరించారు. కేసుల విచారణ వేగవంతం చేస్తారా.. ఇందుకు ఏదైనా రోడ్‌మ్యాప్ ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఏం జరగబోతున్నదో రానున్న రోజుల్లో మీరే చూస్తారు’’ అని అన్నారు. ఆస్తి వివరాలపై ప్రశ్నించగా.. ‘‘ఇందులో దాచడానికి ఏమీ లేదు. అంతా బహిరంగమే. వివరాల్ని వెబ్‌సైట్‌లో పెడతాం’’ అని భాస్కర్‌రావు చెప్పారు. అనంతరం గవర్నర్ హెచ్ ఆర్ భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. లోకాయుక్తా నియామకంపై సంతోషం వ్యక్తం చేశారు. భాస్కర్‌రావు సమర్థుడని కొనియాడారు. 

కాల్వశ్రీరాంపూర్‌లో సంబరాలు
జస్టిస్ ఎరబాటి భాస్కర్‌రావు కర్ణాటక లోకాయుక్తగా నియమితులు కావడంతో ఆయన స్వస్థలమైన కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్‌వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. మండల కేంద్రానికి చెందిన భాస్కర్‌రావు కష్టపడి చదివి న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. ఎరబాటి రఘునాథరావుకు నలుగురు సంతానం కాగా, భాస్కర్‌రావు మూడో వాడు. భాస్కర్‌రావు జన్మించిన రెండు సంవత్సరాల్లోనే అతడి తండ్రి రఘునాథరావు చనిపోవడంతో.. భాస్కర్‌రావు అన్న రాజేశ్వర్‌రావు అన్నీ తానై కుటుంబ బాధ్యతలు చేపట్టి వారిని పెంచి పెద్ద చేశాడు. ప్రాథమిక విద్య కాల్వశ్రీరాంపూర్‌లో పూర్తిచేసిన భాస్కర్‌రావు.. హన్మకొండలోని తన బంధువుల ఇళ్లలో ఉంటూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం న్యాయవాద వృత్తిలో రాణించి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసి రాష్ట్ర హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 1999లో కర్ణాటక చీఫ్ జస్టిస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

2000 సంవత్సరంలో పదవీ విరమణ పొందారు. 2002లో మానవ హక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్‌గా వ్యవహరించి, 2003లో కేంద్ర మానవ హక్కుల సంఘం సభ్యులుగా పని చేసి 2008 వరకు కొనసాగారు. భాస్కర్‌రావుకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతో ఎంతో అనుబంధం ఉండేదని గ్రామస్థులు చెప్పారు. భాస్కర్‌రావుకు టీఆర్‌ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు సమీప బంధువు. కాల్వశ్రీరాంపూర్‌లో హరిహరదేవాలయ నిర్మాణానికి 24 గుంటల భూమిని భాస్కర్‌రావు విరాళంగా ఇచ్చారని గ్రామస్థులు తెలియజేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి