ఇంకెంత సమయం కావాలి?
నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ రద్దు విషయంలో
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చురకలు
- సభా సంఘం సిఫారసుల అమలులో జాప్యం
- కోర్టు ధిక్కరణ చర్యగా భావించాల్సి వస్తుంది
- ప్రభుత్వ న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం
- మూడువారాల్లోగా చర్యలకు తాజా ఆదేశం
- లేకపోతే ప్రతివాదులు కోర్టుకు రావాలని హైకోర్టు హెచ్చరిక
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని, డిస్టిలరీని ప్రైవేటుపరం చేస్తూ జరిగిన ఒప్పందం రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ శాసనసభా సంఘం చేసిన సిఫారసులపై నిర్ణయం తీసుకోవడంలో ఇంత జాప్యమెందుకని ప్రశ్నించింది. సభాసంఘం సిఫారసులపై అధికారుల కమిటీ నిర్ణయం వెలువరించిన తర్వాత ఆరువారాల్లో చర్యలు చేపట్టాలని 2012 జూలై 16న జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ విలాస్ వీ అఫ్జల్ పుర్కర్ ధర్మాసనం ప్రభుత్వంపై మండిపడింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడం కోర్టు ధిక్కరణ చర్యగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో చర్యలు చేపట్టకపోయిన పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మిగతా ప్రతివాదులు స్వయంగా కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. శాసనసభాసంఘం సిఫారసులపై అధికారుల కమిటీ నివేదిక ప్రకారం త్వరితంగా నిర్ణయం అమలు చేయలని కోర్టు పేర్కొంది.
శాసనసభా సంఘం సిఫారసులపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి మరో మూడు వారాలు గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది బుధవారం నాటి విచారణ సందర్భంగా న్యాయస్థానాన్ని అర్థించారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద రూ.25 వేలు జరిమానా చెల్లించాలన్న న్యాయమూర్తి.. ప్రభుత్వ న్యాయవాది సంజాయిషీతో జరిమానా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇంకా ఎన్నిసార్లు గడువు ఇవ్వాలంటూ సీరియస్ అయ్యారు. చివరికి.. ఇదే తుది గడువు అంటూ మూడు వారాలు పొడిగించారు. గడువు ముగిసేలోగా నిజాం షుగర్స్ వ్యవహారంలో సభాసంఘం సిఫారసులపై కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయంతో హైకోర్టుకు రావాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. లేని పక్షంలో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శి, షుగర్‌కేన్ కమిషనర్, నిజాం షుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్, నిజాం దక్కన్ షుగర్స్ చైర్మన్ గోకరాజు గంగరాజు, మేనేజింగ్ డైరెక్టర్ గోకరాజు రంగరాజు స్వయంగా హాజరుకావాలని తీర్పు చెప్పారు.
హైకోర్టు ఆదేశాలతో నిజాం షుగర్స్ జాయింట్ వెంచర్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకోకతప్పని పరిస్థితి రాష్ట్ర మంత్రివర్గానికి ఏర్పడింది. బోధన్‌లోని శక్కర్‌నగర్ చక్కెర ఫ్యాక్టరీ, మెదక్ జిల్లా మమోబోజుపల్లి, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని ముత్యంపేట చెక్కరఫ్యాక్టరీలు, బోధన్‌లోని ఒక డిస్టిలరీ నిజాం షుగర్స్ నిర్వహణలో ఉన్నాయి. వీటికి, డెల్టా పేపర్‌మిల్స్ లిమిటెడ్‌కు మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తూ 2002 ఆగస్టు 28న అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాయింట్ వెంచర్ పేరిట నిబంధనలను పాటించకుండా కారుచౌకగా డెల్టా పేపర్‌మిల్స్‌కు నిజాంషుగర్స్‌ను అప్పగించింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా చెరుకు రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, జాయింట్ వెంచర్ పేరిట జరిగిన నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై అప్పటి ఎమ్మెల్యే రత్నాకర్‌రావు నాయకత్వాన 12 మంది ఎమ్మెల్యలతో శాసనసభా సంఘాన్ని నియమించింది. ఈ సంఘం 2006 జూలై 31న ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. మోసపూరితంగా జరిగిన జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. జాయింట్ వెంచర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యనమల రామకృష్ణుడుతోపాటు అప్పటి ముగ్గురు మంత్రులపై విచారణ చేపట్టాలని పేర్కొంది.
అయితే, శాసన సభాసంఘం సిఫారసుల అమలులో ప్రభుత్వం జాప్యం చేసింది. దీంతో 2007లో నిజాం షుగర్స్ పరిరక్షణ సమితి కన్వీనర్ ఎం అప్పిడ్డితో పాటు నలుగురు రైతు నాయకులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 2012లో కే హనుమంతరావుతోపాటు మరికొందరు రైతులు మరిన్ని ప్రజావూపయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. నిజాం షుగర్స్‌కు చెందిన భూమలను డెల్టా పేపర్ మిల్స్ అమ్మకుండా అడ్డుకోవాలని, జాయింట్ వెంచర్ ఒప్పందంపై సీఐడీ విచారణ జరపాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా 2012లోనే హైకోర్టు ప్రభుత్వ వివరణను కోరింది. శాసనసభ సంఘం సిఫారసులపై అధికారుల కమిటీని నియమించామని, నాలుగు వారాల్లో కమిటీ నివేదిక అందించనుందని ప్రభుత్వం హైకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ అందించింది. ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన అప్పటి తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్ల ధర్మాసనం అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా ఆరు వారాల్లో చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2012 జూలై 16న ఉత్తర్వులను వెలువరించింది. గడువు పూర్తయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై మరోసారి తాజాగా కంప్లయెన్స్‌గా హైకోర్టు విచారించింది. దీనిపై సైతం వాయిదాలు కోరుతూ వచ్చిన ప్రభుత్వం, కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిజాం షుగర్స్‌ను రక్షించండి : హరీష్‌రావు
నిజాం షుగర్స్‌ను రక్షించాలని టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉప నాయకుడు టీ హరీష్‌రావు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిని డిమాండ్ చేశారు. నిజాం షుగర్స్‌ను ప్రైవేటీకరించడం అక్రమమని ఆయన ఆరోపించారు. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్‌డ్డి అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆయన ఆరోపించారు. కనీసం కిరణ్‌కుమార్‌డ్డి అయినా జరిగిన తప్పును సరిదిద్ది నిజాం షుగర్స్‌ను రక్షించాలని హరీష్‌రావు ఒక ప్రకటనలో కోరారు. -namaste telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి