ప్రకృతి అందాలకు, ఆదివాసిల ఆట పాటలకు, అందాల జలపాతాలకు, వన్య మృగాలకు, నది నదాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు మన ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది పచ్చని అడవులు, అందమైన జలపాతాలు, ఇది ప్రకృతి అందాలకే కాదు హస్తకళలకు నెలవు, నిర్మల్ బొమ్మల అందాలు చూపరులను యిట్టె ఆకట్టుకుంటాయి, ఆదిలాబాద్ జిల్లా చరిత్రను అందాల వన కన్యల వయ్యారాలను, సోయగాల జలపాతాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను గురించి తెలుసుకుందాం.....
ఆదిలాబాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం ఆదిలాబాదు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ఎడ్లవాడ అని పిల్చేవారు. రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇదిఒకటి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది. మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్ధిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్ధికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కధనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది.
చారిత్రకంగా అదిలాబాదు జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. దక్షిణభారతదేశ సరిహద్దులలో ఉపస్థితమై ఉన్న కారణంగా ఇది ఉత్తరభారతదేశ సామ్రాజ్యాధినేతలైన ముగలాయిలు, మౌర్యులు, దక్షిణ భారతదేశ సామ్రాజ్యాధినేతలైన శాతవాహనులు మరియు చాళుక్యులు పాలించారు. ప్రస్థుతం ఈ జిల్లా ప్రజలలో పొరుగున ఉన్న మరాఠీ సంప్రదాయం రాష్ట్ర తెలుగు సంప్రదాయంతో గుర్తించ తగినంతగా కలిసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ జిల్లాలో, పలు సంస్కృతులకి చెందిన వారైన బెంగాలి, మళయాళీ మరియు గుజరాతీలు,పరస్పర సహకార జీవనం సాగిస్తున్నారు.
ఆదిలాబాదు జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్రంలోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున చంద్రాపూర్ జిల్లా ఉంది, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదులుపరంగా దక్షిణాన గోదావరి నది, తుర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్ గంగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 16203.8 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం పరంగా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంది. జిల్లాలో 40 శాతం ఉండే అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి. జిల్లాలో 75% భూభాగం ఉష్ణమండల తేమతోకూడిన అడవులతో నిండి ఉంది. ఇది ఆంద్రప్రదేశ్ లోని అటవీప్రాంతం కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. అదిలాబాదు జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు మరియూ సత్మాల కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది. ఈ జిల్లాలోని ప్రధాన నదులు ప్రాణహిత, పెన్‌గంగ మరియు వార్థా.
నదులు:
ఆదిలాబాద్లో ప్రదానంగా ప్రవహించే నది గోదావరి, ఆంద్ర ప్రదేశ్ లో గోదావరి నది ఆదిలాబాద్ జిల్లా లోనే అడుగుపెడుతుంది, జిల్లలో గోదావరి ఉపనదులు అనేకం ప్రవహిస్తున్నాయి, పెన్ గంగా, వెన్ గంగ లు కలిసి ప్రాణహిత నది ఏర్పడుతుంది, ఇది గోదావరి నది ఉపనది, అత్యంత ఉదృతం గా ప్రవహించే నది ఈ ప్రాణహిత, జిల్లా లోని మరో నది కడెం నది, ఇది కూడా గోదావరి ఉపనదే, పెద్ద వాగు కూడా గోదావరికి ఉపనదే.
కడెం ప్రాజెక్ట్: ఇది గోదావరి నది ఉపనది ఐన కడెం నదిపై కడెం మండలం లోని పెద్దూర్ గ్రామంలో ఉన్నది, దీనిని 1964 లో నిర్మించారు, 68,000 ఎకరాలకు ఖరిఫ్ కాలంలో నీరందిస్తుంది. ఈ డాం మొత్తం గా 18 గేటు లను కలిగి ఉంది, దీని ఎత్తు 35.70M,
నీటి సామర్ద్యం 7603 Mcft, కనీస నీటి మట్టం: 78.70 M.cum.
శ్రీరామ్ సాగర్:
గోదావరి నదిపై నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలములో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కలదు. దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. గోదావరినదిపై ఆంధ్ర ప్రదేశ్ లో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టు తరవాత గోదావరి నదిపై దీనిని నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు ఇది. దీనికి కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ , లక్ష్మీ కాల్వ అనే మూడు కాల్వలు కలవు. ఈ ప్రాజెక్టు వల్ల నిజామాబాదు జిల్లా కంటె ఇతర జిల్లాలకే అధికలాభం చేకూరినది.1963 లో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రారంభంలో కేవలం నీటిని నిల్వచేసి నీటిపారుదలకు ఉపయోగపడే జలాశయం గానే ఉండేది. 1983 తర్వాత నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయంలో ఈ ప్రాజెక్టును విస్తరించి జల విద్యుత్ ఉత్పాదన సంస్థగా అభివృద్ధి చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జిల్లా కేంద్రమైన నిజామాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి నుండి 5 కిలోమీటర్లు లోనికి ఉంది. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ పట్టణం నుండి దీని దూరం 20 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు 18°58' ఉత్తర అక్షాంశం, 78°19' తూర్పు రేఖాంశం పై ఉంది.
ప్రారంభం:
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ను 1963 లో అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ప్రారంభంలో ఇది కేవలం నీటిపారుదల ప్రాజెక్టుగానే సేవలందించగా, రెండు దశబ్దాల అనంతరం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి హయాంలో ఈ ప్రాజెక్టు విద్యుదుత్పాదన ప్రాజెక్టుగా అవతరించింది.
జలాశయ సామర్థ్యం
శ్రీరాంసాగర్ జలాశయపు నీటిమట్టం గరిష్ట ఎత్తు 1091 అడుగులు,
జలాశయ నీటి నిల్వ సామర్థ్యం 90 శత కోటి ఘనపుటడుగులు
ఈ ప్రాజెక్టునకు మొత్తం 42 వరద గేట్లు కలవు.
ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాఆయె కాలువలు: కాకతీయ కాల్వ, సరస్వతి కాల్వ, లక్ష్మి కాల్వ, వరద కాల్వ.
విద్యుదుత్పత్తి సామర్ద్యం 27 మెగావాట్లు, మూడు టర్బయిన్‌ల సహాయంతో కాకతీయ కకాలువకు నీటి విడుదలచేస్తారు.
శ్రీ పాద సాగర్(ఎల్లంపల్లి ప్రాజెక్ట్): మంచిర్యాల సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్, దీని మొదటి దశ పనులు పూర్తయ్యాయి, రెండవ దశ పనులు కొనసాగుతున్నాయి.
ప్రాణహిత-చేవెళ్ళ: ఈ ప్రాజెక్ట్ ను ఆదిలాబాద్ లో నిర్మించి అక్కడనుండి రంగ రెడ్డి వరకు నీటిని సరఫరా చెయ్యాలని భావించారు, మొత్తం తెలంగాణా లోని ఆరు జిల్లాలకు నీటిని అందించే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం భారిగా కేటాయింపులు స్వల్పంగా ఉండడంతో ఇది ఎప్పటి మొదలవుతుందో, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి.
వ్యవసాయం:
ఆదిలాబాదు జిల్లాలో అధికంగా సాగుచేయబడే ఆహారపు పంట జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, ఇతర పప్పులు, మిరపకాయలు, గోధుమలు, చెరకు. వాణిజ్యపంటలు పత్తి, పసుపు. నిర్మల్, లక్షింపేట్, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యం ఔతున్న కారణంగా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. 3.5% భూమిలో సాగుచేయబడే ఉద్యానవన సాగుబడి వలన విదేశీమారకం వంటి ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. సాధారణ వర్షపాత ప్రాంతం అలాగే నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో ఉద్యానవన సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, కూరగాయలు అలాగే సుగంద ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి.
పట్టుపురుగుల పెంపకం కూడా జిల్లాకు కొంత ఆదాయం సమకూరుస్తుంది. పట్టుపురుగుల పెంపకం కొరకు 1000 ఎకరాలలో మలబరీ చెట్లు పెంచబడుతున్నాయి. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం కొరకు అనుకూల వాతావరణం ఉంది కనుక పట్టుపురుగుల పెంపకం అబివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ ప్రణాళిక కారణంగా జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వలన ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. జిల్లాలోఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు పెంచబడుతున్నాయి. జిల్లాలో భూపరిస్థితి పెంపుడు జంతువుల పెంపకానికి అనుకులంగా ఉంది. జిల్లాలో 87 పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో ఉన్న పచ్చిక నిండిన కొండ ప్రాంతాలు గొర్రెలు, మేకలు పెంచడానికి అనుకూలంగా ఉంది.
పరిశ్రమలు:
ఆదిలాబాదు జిల్లాలో బియ్యపు మిల్లులు, నూనె శుద్ధి కర్మాగారాలు, మొక్కజొన్న పిండి, శక్తినిచ్చే ఆహరపదార్థాలు, మినపప్పు మిల్లులు, సుగంధద్రవ్య పొడులు, బేకరీలు, ఐస్ క్రీం, అల్లం ముద్ద, సేమ్యా, మిరపకాయల కారం, నూడుళ్లు, బిస్కత్తులు, కాగితపు రుమాళ్ల తయారీ, ఊరగాయలు, అప్పడాలు, వేరుశనగ బర్ఫీ, పశుగ్రాసం, వ్యవసాయం, వ్యవసాయ సంభంధిత పరిశ్రమలు జిల్లాలో ఉపాధి కల్పిస్తున్నాయి. ముడి మరియు నాణ్యత పెంచబడిన తోలు, తోలు సంచులు, తోలు చెప్పులు, తోలు వస్తువులు తయారీ ఉపాధిని కలిగిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, అల్లికలు, పాఠశాల సమవస్త్రాలు, ఉపయోగానికి సిద్ధమైన దుస్తులు, స్క్రీన్ ప్రింటింగ్, వస్త్ర పరిశ్రమ సంభంధిత పరిశ్రమలున్నాయి. ప్లాస్టిక్ సంచులు, ఎలెక్ట్రానిక్ పరికరములు, గాజులు పూసలు, టైర్లు తయారీ పరిశ్రమలున్నాయి. సిమెంటి ఇటుకలు, మట్టి ఇటుకల తయారీ పరిశ్రమలు కూడావున్నాయి. బ్లాక్ & వైట్ ఫెనిలిజ్, బట్టలుతుకు పొడి తయారీ చేస్తున్నారు. పుస్తకాలు, ఆభినందన పత్రికలు, వివాహ పత్రికలు తయారు చేస్తున్నారు. శుద్ధనీరు తయారీ, డేటా ప్రొసెసింగ్, అల్యూమినియం పాత్రలు, ఫర్నీచర్, సైబర్ కేప్స్, యంత్రాలు మరమ్మత్తు పనులు వంటివికూడా వున్నాయి.
మంచిర్యాల లో సున్నపు రాతి నిల్వలు అదికంగా ఉన్నాయి, ఇక్కడ ఎ సి సి సిమెంట్ కర్మాగారాన్ని నెలకొల్పారు, బెల్లం పెల్లి, శ్రీరాంపూర్, ఆసిఫాబాద్ ప్రాంతాలలో భూగర్భ బొగ్గు గనుల ద్వారా సింగరేణి సంస్థ బొగ్గును వెలికి తీస్తుంది. బెల్లం పెల్లి లో సింగరేణి సంస్థ 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పింది.
సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు:
ఇది నిజాం కాలం లో ప్రారంబించిన పేపర్ మిల్లు, ఆదిలాబాద్ జిల్లలో అత్యదికంగా అడవులు ఉండడం వాళ్ళ ఇక్కడ అటవీ ఉత్పత్తుల ఆదారిత పరిశ్రమలు గతంలోనే ఏర్పాటు చెయ్యబడ్డాయి. అందులో ప్రముఖమైనది ఈ పేపర్ మిల్.
ఇది 1938 లో స్థాపించబడింది, 1942-43 నాటికి దీని ఉత్పత్తి 5000 TPA, ఈ సమయంలో హైదరాబాద్ కన్స్ట్రక్షణ్ కంపని నిర్వహణలో ఉండేది, 1953లో అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం హయాంలో బిర్ల కంపెనీకి నిర్వహణలో ఉండేది, ప్రస్తుతం దీని సామర్థ్యం 83,550 TPA (paper and paperboard) to 1,38,300 TPA , ఇక్కడినుండి తెలుపు మరియు రంగు కాగితాలు శ్రీ లంక, మలేషియా, బంగ్లాదేశ్, నేపాల్, యు ఎ ఈ, సింగపూర్, నైజీరియ మరియు దక్షిణ ఆఫ్రికా లకు సరఫరా అవుతాయి. ఈ కంపని అధికారిక కార్యాలయము హైదరాబాద్ లోను, కార్పోరేట్ ఆఫీసు గుర్గావ్ లోను ఉన్నది.
పరిపాలన విభాగాలు:
ఆదిలాబాదు జిల్లాలోని ఐదు డివిజన్లుగా 52 రెవిన్యూ మండలాలుగా విభజించినారు. డివిజన్లు పేర్లు ఆదిలాబాదు, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల్.
ఆదిలాబాదు లోక్‌సభ స్థానం : ప్రస్తుత ప్రతినిధి: రమేష్ రాథొద్
స్థానం | ప్రతినిధి |
సిర్పూర్ | కె. సమ్మయ్య, తెరాస |
చెన్నూర్ | నల్లాల ఓదెయ్య, తెరాస |
బెల్లంపల్లి | జి. మల్లేష్, సీపీఐ |
మంచిర్యాల | అరవింద రెడ్డి , తెరాస |
ఆసిఫాబాద్ | అత్రం సక్కు, కాంగ్రెస్ |
ఖానాపూర్ | సుమన్ రాథోడ్ , తెదేపా |
ఆదిలాబాదు | జోగు రామన్న - తెరాస, |
బోధ్ | జి. నగేష్, తెదేపా |
నిర్మల్ | మహేశ్వర రెడ్డి , ??? |
ముధోల్ | వేణు గోపాల చారి , ??? |
స్థానిక స్వపరిపాలన:
జిల్లాలో 1743 గ్రామాలు 866 గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మరియు పట్టణ ప్రాంతాలకొరకు ఏడు పురపాలక సంఘాలున్నాయి. పురపాలక సంఘాల పేర్లు: ఆదిలాబాదు, మంచిర్యాల్,,బెల్లంపల్లి,మందమర్రి.నిర్మల్,భైంసా, కాగజ్‌నగర్.
ఉట్నూర్ ITDA:
జిల్లాలోని ఉట్నూర్ లో గిరిజనాభివృద్ది కోసం ప్రభుత్వం Integrated Tribal Development Agency (ITDA) ను ఏర్పాటుచేసింది, దీనికి ఒక కలెక్టర్ స్థాయి అధికారి పీ ఓ (Project Office) ఉంటారు, జిల్లా గిరిజన విద్యాదికారి కూడా ఇక్కడ ఉంటారు, ఇది గిరిజనుల అభివృద్దికి, వారి సమస్యలను తీర్చడానికి ఏర్పాటు చెయ్యబడింది.
2003లో విభాలుగా విభజించిన రైల్వేశాఖలో దక్షిణమద్య రైల్వే లోని హైదరాబాదు విభాగానికి చెందిన ముద్ఖేదు స్టేషన్ అదిలాబాదులో ఉంది. హైదరాబాదు రైల్వేశాఖను రెండు భాగాలుగా విభజించిన తరువాత అదిలాబాదు నాందేడ్ విభాగంలో చేరుతుంది. ఇక్కడి నుండి హైదరాబాదు, నిజామాబాదు, నాందేడు, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాట్నా, నాగపూరు, నాసిక్, ముంబాయి, వరంగల్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, ఔరంగాబాదు, మన్మద్, గుల్బర్గా, బీదర్, బీజపుర్, షోలాపూరు మొదలైన ఊర్లకు హైదరాబాదు ద్వారా నేరు రైళ్ళు ఉన్నాయి.క్రిష్ణా ఎక్స్ ప్రెస్ అదిలాబాదు కు ఒక ప్రధాన రైలు.
దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. ఇక్కడ వాయుమార్గం 1948లో జరిగిన పోలీస్ ఏక్షన్ భారతీయ వాయు సేనలచేత నాశనం చేయబడింది. అతిసమీపంలో ఉన్న విమానశ్రయం నాగపూరులో ఉన్నా హైదరాబాదు విమానాశ్రయం మరింత ఉపయోగకరమైనది.
జనాభా:
ఆదిలాబాద్ జిల్లా జనాభా: 2,737,738 (2011 జన గణన),
పురుషులు: 1,366,964, స్రీలు: 1,370,774
2001 తో పోల్చిన 10.04% జనాభా వృద్ది రేటు నమోదైనది.
జిల్లా అక్షరాస్యత : 61.55% (2011 తాజా)
పురుష అక్షరాస్యత: 71.22 %, స్త్రీ అక్షరాస్యత: 51.99%
మొత్తం విద్యావంతులు 1,503,106 కాగ ఇందులో పురుషులు:864,990, స్త్రీలు:638,116
స్త్రీ పురుష నిష్పత్తి: 1003:1000, బాల బాలికల నిష్పత్తి: 942:1000
సంస్కృతి:
ఆదిలాబాదు జిల్లాలో అడవులు అధికంగా ఉన్నాయి కనుక ఇక్కడ గిరిజన సంస్కృతి నేటికీ వర్ధిల్లుతూనే ఉంది. ఒకప్పటి సంస్కృతిని చాటి చెప్పే కోటలు, కట్టడాలు, గుళ్ళూ, చెక్కిన రాళ్ళు, ఇoకా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. నిర్మల్ బొమ్మలు ప్రసిద్ధి గాంచినవి.
అటవీ సంపద:
ఆదిలాబాద్ జిల్లా లోనే అతిపెద్ద అడవులలో ఒకటైన కవ్వాల్ అభయారణ్యం ఉంది, ఇటీవలే దీనిని ప్రభుత్వం టైగర్ రిసర్వ్ ఫారెస్ట్ గా గుర్తించింది, ఆదిలాబాదు జిల్లా అరణ్యాలను రెండు విభాగాలుగా ఉంటుంది. ఎగువ బాగంలో తాలుక్, నల్లమద్ది, బిజసల్, చైర్మను, విప్ప, జిత్రేగి, ముష్టి వంటి వృక్షసంపద ఉంది. దిగువ భాగంలో ఉసిరి, మారేడు, మౌదుగు, వెదురు, సారపాపు వంటి వృక్షసంపద ఉంది. ఆదిలాబాదు జిల్లా దట్టమైన అరణ్యప్రాంతంలో పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, హైనాలు, తోడేళ్ళు మరియు అడవి కుక్కలు వంటి జంతువులు నివసిస్తున్నాయి. అలాగే అరణ్య మైదానాలలో అలాగే పక్షి జాతులలో నెమలి, పావురాళ్ళు, అడవి కోళ్ళు, రామ చిలుకలు, మైనాలు ఉన్నాయి. నీలి ఆవులు, చుక్కల జింకలు మరియు సంబార్ వంటి సాదు జంతువులు నివసిస్తున్నాయి.
దర్శనీయ ప్రదేశాలు:
ఆదిలాబాద్ అందమైన ప్రకృతి సోయగాల నడుమ ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది, ఇక్కడ చూడదగిన ప్రాంతాలలో కుంటాల, పోచ్చేర జలపాతాలు ముఖ్యమైనవి.
ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి ఎత్తయిన జలపాతం కుంటాల జలపాతం. ఇవి ఆదిలాబాదు జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉన్నాయి. 7వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మల్ నుండి ఆదిలాబాదు పోవు మార్గానికి కొద్దిగా కుడివైపునకు, మండల కేంద్రము నేరడిగొండకు 12 కిలోమీటర్ల దూరంలోఈ జలపాతం ఉంది. 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరికి ఉపనది అయిన కడెం నది పై ఈ జలపాతం ఉంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాదు నుండి ఇది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.జలపాతము యొక్క దిగువభాగము సమతల బండరాయితో కూడుకొని నునుపుదేలి జారుడుగా ఉండును. జలపాతం వద్ద గుండాలు చాలా లోతుగా ఉండి సుళ్ళు తిరుగుతూ ఉండటం వలన ఇక్కడి నీళ్ళలో ఈదటం చాలా ప్రమాదకరం.జలపాతానికి ఈ పేరు దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందని స్థానిక ప్రజల విశ్వాసం. ఈ జలపాతం మరియు పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.
ఈ ప్రాంతములో మూడు జలపాతాలు, గుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా వ్యవహరిస్తారు. జలపాతం వద్ద ప్రకృతిసిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటంవల్ల ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను దర్శించుకొని పూజలు నిర్వహించడాన్ని సోమన్నజాతరగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో రెండు రోజులపాటు ఈ జాతర జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.
జలపాతాలకు చుట్టు ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కలిగి అధికముగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఛాంపియన్ / సేథి అటవీ వర్గీకరణ ప్రకారము సమూహము 5నకు చెందినది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు మరియు పక్షులు ఉన్నాయి. ఇక్కడే మరొక అందమైన జలపాతం పోచ్చేర జలపాతం కూడా ఉంటుంది.
వన్యమృగ సంరక్షణ కేంద్రాలు:
ప్రాణహిత వన్యమృగ సంరక్షణ కేంద్రం,
శివ రామ్ వన్యమృగ సంరక్షణ కేంద్రo,
కవ్వాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం.
ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని బాసరలో కాలు మోపడంతోనే ప్రతి ఒక్కరికీ చెప్పలేని అద్వితీయ అనుభూతి కలుగుతుంది. ఇక అమ్మవారిని దర్శించుకోవడంతో పరిపూర్ణత సిద్ధిస్తుంది.
చిన్నారుల చిట్టి చేతులు పలకా బలపం పట్టి మొట్టమొదటిసారిగా అక్షరాలు దిద్దే ఆ అపురూప క్షణాలకు పరవశించని తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. పసిపిల్లలకు విద్యాభిక్ష పెట్టే మన జ్ఞాన స్వరూపిణికి వందనం.
అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం దిద్దుకోవడంతోనే పిల్లలు ఆగిపోరు. బాల్య వయసుకు చేరుకున్నాక విద్యార్జనలో తమకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించమంటూ 11 రోజుల పాటు అక్కడ కఠోర దీక్షకు దిగుతారు. మధ్యాహ్నపు ఎండలో, కాళ్లకు చెప్పులైనా లేకుండా, లేత పాదాలతో కాలినడకన బాసరలోని ఇల్లిల్లూ తిరుగుతారు. భుజానికి జోలె వేసుకుని ఇండ్లలోని తల్లులు పెట్టే భిక్షను స్వీకరిస్తారు. అలా తెచ్చుకున్న అన్నంతోనే ఒంటి పూట కడుపు తింటూ, అక్కడే అమ్మవారి నీడన నిద్రిస్తారు. పెద్దలను సైతం బిత్తరపరిచే ఈ అసాధారణ సన్నివేశం ఇప్పటికీ అక్కడ కొనసాగుతోంది.
ఆ బాసర సరస్వతి దేవి ముఖాన నక్షత్రంలా మెరిసే ముక్కుపుల్లకు ఆకర్షితులు కాని చిన్నారులు ఉండరు. ప్రతి బిడ్డకు ఒక అపురూప విద్యాశక్తిని అక్కడి బాసర తల్లి ప్రసాదిస్తుందన్న నమ్మకం ప్రతి ఒక్కరి కళ్లలో ద్యోతకమవుతుంది.
ఇక్కడ కొలువై ఉన్న మహా సరస్వతీ అమ్మవారే పూజారుల చేత తమ పిల్లలకు ఓనమాలు దిద్దుస్తుందన్న పరిపూర్ణ విశ్వాసం వారిది. అలాగే, బాసర క్షేత్రంలో నిద్ర చేస్తూ, నిత్య భిక్షలతో కడుపు నింపుకునే పిల్లలకూ అమ్మవారు జ్ఞానభిక్ష పెడుతోంది.
- బాసర ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షచ్ఛాయలో దత్త మందిరం ఉంది. పశ్చిమ భాగాన మహాకాళీ దేవాలయం.
-దక్షిణ భాగాన శ్రీ వ్యాస మందిరం. ఇక్కడ వేద వ్యాసుని విగ్రహంతోపాటు ఎంతో మహిమాన్వితమైనట్లుగా భావించే వ్యాసలింగం ఉన్నాయి.
-బాసర గ్రామానికి వెళ్లే దారిలో ఒక పెద్ద శిల ఉంటుంది. దానికి ‘వేదవతి’ (ధన పుంగవుడు) అని ప్రసిద్ధి. పక్కనే ఉన్న మరో చిన్న శిలతో దీనిని కొడితే విచివూతమైన శబ్దం వినిపిస్తుంది.
జైనథ్ సూర్య దేవాలయం:
సూర్య దేవాలయం’ అనగానే మనకు జాతీయ స్థాయిలో కోణార్క్, ఆంధ్రలో పేరెన్నిక గన్న అరసవిల్లి ఆలయాలు గుర్తుకు వస్తాయి. కానీ, తెలంగాణలో ఎంతో చార్రితక ప్రాధాన్యం గల ‘ఆదిత్యుని ఆలయం’ ఒకటి ఆదిలాబాద్ దగ్గర ఉందన్న సంగతి చాలామందికి తెలియదు.
అది జైనద్ మండల కేంద్రం. ఆదిలాబాద్ పట్టణం నుండి తూర్పువైపున చంద్రాపూర్ మార్గంలో సుమారు 20 కి.మీ. దూరంలో ఈ చిన్న పట్టణం ఉంటది. పూర్వకాలంలో అయితే, ఈ ఊరును ‘ఝేంఝ’ అని పిలిచేవారని, తర్వాత కాలక్రమేణా అది ‘జైనద్’గా మారిందని చరిత్రకారుల కథనం.
ఆదిలాబాద్ జిల్లాలోనే దీనిని ‘అతి ప్రాచీనమైన దేవాలయం’గా చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణ శైలి అంతా మహారాష్ట్ర, త్రయంబకంలలోని దేవాలయాల రీతిని పోలి ఉంటది. అంతేకాదు, ఈ రకమైన అన్ని ఆలయాలకు ఉపయోగించిన ‘శిలా స్వరూపం’ ఒక్కటే కావడం గమనార్హం.
ఇక్కడి మూల విరాట్టును ‘లక్ష్మినారాయణస్వామి’గా పిలవడం మరో విశేషం. అయితే, స్వామి విగ్రహం తల వెనుక భాగంలో నమ్మశక్యం కాని రీతిలో ‘జ్వాలా తోరణం’ ఉంది. ఈ కారణంగానే ఆయన్ని ‘సూర్యనారాయణస్వామి’గా కూడా భక్తులు పిలుస్తారు. దీనికి మరో కారణం ఏమంటే, మందిరంలో ఒకటిన్నర అడుగుల వైశాల్యంలో ఓ శిలా శాసనం ఉంది. దానిపై దేవనాగరి లిపిలో ఇరవై శ్లోకాలు ఉన్నట్టు చెబుతారు. ఈ శాసనం ‘నమః సూర్యాయ’ అంటూ ప్రారంభమైంది. ఈ రీత్యాకూడా ఇక్కడి స్వామి ‘సూర్యనారాయణుడు’ అయ్యాడు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమూ ఉంది. అదేమంటే ఏడాదిలో నాలుగు నెలలపాటు సూర్యకిరణాలు స్వామి పాదాలను స్పృశిస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మళ్లీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు తూర్పు మధ్యలో ఉదయించిన కాలంలో ప్రప్రథమ లేలేత కిరణాలు ఈ స్వామి పాదాలను స్పర్శించడం విశేషం.
ఎంతో అరుదైన ఈ దేవాలయం రాష్ట్ర కూటులు లేదా కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మితమై ఉండవచ్చునని చరివూతకారులు భావిస్తున్నారు. కాగా, ఈ గ్రామంలో నూతన గృహాల నిర్మాణానికి గాను పలువురు పునాదుల కోసం తవ్వకాలు జరిపినప్పుడు పలు శిల్పాలు బయట పడుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే, పురాతత్వ శాఖ వారు కూడా రెండుమార్లు ఈ దేవాలయం వద్ద తవ్వకాలు జరిపారు.
ప్రస్తుతం ప్రధాన దేవాలయం పక్కన శిథిలమైన మరో శివాలయమూ ఉంది. దీని ముందున్న పుష్కరిణి కూడా బాగా శిథిలమై ఉంది. ప్రస్తుతం అదొక చెరువులా కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రదేశమంతా ఓ పట్టణంగా ఉండి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అయితే, ఆహ్లాదకరంగా గ్రామం పక్కన ఉన్న ఏరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకప్పుడు వారం వారం సంత జరిగేది. ఇక్కడ పశువుల సంత కూడా ఉండేది. అప్పట్లో చుట్టూ ఉన్న పది, ఇరవై గ్రామాల ప్రజలు ఈ సంతలలో పాల్గొనే వారు. ఇక్కడ పశువుల అమ్మకాలు జోరుగా జరిగేవనీ చెప్తారు. అయితే, ఇప్పుడు ఈ సంతకు ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
1985 వరకూ ఇక్కడికి రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో పట్టణంతో సంబంధం తెగిపోయేది. గ్రామంలోని రోగులనైతే మంచంపై పడుకోబెట్టి ఆదిలాబాద్ తీసుకెళ్లే వారు. ఇప్పుడు చంద్రాపూర్ వరకూ పక్కా రోడ్డయ్యింది. గుడి దాకా రవాణా సౌకర్యం కొంతవరకు మెరుగైంది. ప్రస్తుతం జైదన్ గ్రామంలో ఆరోగ్య కేంద్రమూ ఉంది. దానికి స్వంత భవనం ఏర్పాటైంది. ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్ వంటివీ ఉన్నాయి. ఆదిలాబాద్ తాలూకా పరిధిలో జూనియర్ కళాశాల ఉన్న మండలం కేంద్రం ఇదే. కాకపోతే మెరుగైన మంచినీటి సౌకర్యం లేదు. వేసవి కాలంలో ఇక్కడనీటికి కటకటే.
జైదన్‌లోని శ్రీ సూర్యనారాయణ స్వామిపట్ల అనేకమంది భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. సంతానం లేని వారు స్వామి వారిని ‘కొంగు బంగారం’గానూ భావిస్తారు. స్వామి వారి దర్శనానికి నాందేడ్, యవత్‌మాన్, చంద్రాపూర్ (మహారాష్ట్ర) జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో (శుద్ధ ద్వాదశి నుండి బహుళ దశమి దాకా) స్వామి వారి కళ్యాణోత్సవం, రథోత్సవం, జాతరలు వైభవంగా జరుగుతాయి. తెలంగాణ స్వర్రాష్టం సాకారమయ్యాక అయినా ఇటువంటి దేవాలయాలను అభివృద్ధిలో ముందువరుసలో ఉంచాల్సి ఉంటుంది.
గూడెం గుట్ట:
ఆదిలాబాద్ లో మరో ప్రముఖ పుణ్య క్షేత్రం గుడెంగుట్ట, ఇది మంచేర్యాల కు సుమారు 40 కిలోమిటర్ల దూరంలో ఉంటుంది, ఇక్కడ కొలువైన దేవుడు సత్యనారాయణ స్వామి, గోదావరి నది పరివాహంలో ఉన్న ఈ ఆలయంలో కార్తిక మాసం లో జరిగే నోములు వ్రాతలు ప్రత్యేకం, ఇక్కడే కొలువైన మరో దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం, దీనిని మరో శబరీ మలై అంటారు.
వేలాలగుట్టలో మల్లన్నస్వామి:ఆదిలాబాదు జిల్లా జైపూర్ మండలంలో పవిత్ర గోదావరి తీరాన పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణంలో కొండపై వెలసిన దేవుడు వేలాల మల్లన్న. భక్తులకు కొంగు బంగారంగా కొలువైన సాంబశివున్ని శివరాత్రి నాడు పిల్లాపాపలతో దర్శించి తరిస్తారు భక్తులు. ‘కొండల్లో ఉన్న మల్లన్నా! కోటి దండాలు నీకన్నా!’ అంటూ వేలవేల భక్తులు వివిధ ప్రాంతాల నుండి కార్తీకమాసం, మాఘమాసం శివరాతిరికి వారం, పది రోజుల ముందు నుండే వచ్చి చేరుతారు. ‘గుట్ట, గుట్టా ఎక్కి నీ తానకు వచ్చాం...’ అని విన్నవించు కుంటారా పరమశివునికి.
http://naatelangaana.blogspot.in/2013/03/blog-post_13.html
నిర్మల్:
నిర్మల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది ముఖ్యంగా కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. ఈ పట్టణము హైదరాబాదు నుంచి ఉత్తరముగా 210 కిలో మీటర్ల దూరంలో 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉంది. గోదావరి నది నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇక్కడి నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.నిర్మల్ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 6068 హెక్టార్లు మరియు రబీలో 1397 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, జొన్నలు.
1600 - 1650 మధ్య కాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉన్న కంచర్ల రామదాసు (గోపన్న) భద్రాచలం నందు శ్రీ సీతారామాంజనేయ ఆలయాలు నిర్మించి, ఉత్సవాలను జరిపించుటవల్ల కుతుబ్‌షాహీ ఖజాన ఖర్చుపెట్టినందున, అప్పటి గోల్కొండ నవాబు తానీషా శ్రీ రామదాసును చెరసాల లో పెట్టించిరి. శ్రీ రామదాసుకు సన్నిహితుడైన వెలమ దలవాయి నిమ్మనాయుడు మరి కొందరు, తానీషాతో చేయి కలిపి కుట్రపన్నిన వెలమ భూస్వాముల ధ్రోహనికి విసుగెత్తి, పాల్వంచ, భద్రాచలం జమీందారులకు భూమి పన్ను చెల్లించు తగాధాలో మాట కలిసిరాక నిమ్మనాయుడు కుటుంబ సమేతుడై కొంత సిబ్బంది తో నిరాశ, నిస్పృహ లతో గోల్కొండను విడిచి భద్రాచలం తూర్పు గోదావరి నదీ తీరం వెంబడి చెన్నూరు, కోటి లింగాల నుండి మట్టి కోటగా నెలకొని ఉన్న నల్లగుటాః (ఇప్పటి ఖానాపురం సమీపమున గలది) ప్రాంతానికి మొదటి రాత్రికే చేరుకున్నాడు. ఇచ్చట ఔరంగజేబు నియమించిన అప్పటి ఖిల్లాధారుతో ఆ రాత్రి పోరాడి నిమ్మనాయుడు విజయం సాధించాడు.
నిర్మల్ పట్టణానికి తూర్పు దిశగా ఉన్న "పులిమడుగు" (బత్తీస్ గఢ్ ప్రాంతం) పేరుతో ఒక బస్తీ ఉందేధి. ఛత్రపతి శివాజీ నాయకత్వం లో గోల్కొండ సైన్యాలు మహారాష్ట్ర యోధుల అండదందలతో ఎన్నో సార్లు మొగలు సైన్యాలను పులిమడుగు లో ఓడించారు కూడా. సైనికులు యుద్ధ సమయాల్లో తలదాచుకోవడానికి కోటగోడలు, బురుజులు, నేల బోయారాలు (సొరంగాలు) కందకాలు మొదలగునవి ఏర్పర్చుకున్నారు.
కొన్ని రోజుల తరువాత నిమ్మనాయుడు ఉత్తర పశ్చిమంగా ప్రయాణం చేయుచు పులిమడుగు ప్రాంతం నుండి రాత్రి పూట వెళుతుండగా అదివరకే నల్లగూట్ట యందు జరిగిన సంఘటన వినిన పులిమడుగు ఖిల్లాదారుడు నిమ్మణాయుని చెలిమిని కోరి అతనిని తనకు సహాయముగా ఉంచుకొన్నాడు.
అనంతరం ఒకనాడు నిమ్మనాయుడు తెల్ల ఏనుగు పై ఎక్కి వేట కుక్కలను వెంటబెట్టుకొని వేటకై ఇప్పటి దేవరకోట శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి మందిరం ప్రాంతానికి బయలుదేరాడు . తన వేట కుక్కలను కుందేళ్ళు, నక్కలు తరిమేయుట చూసి, స్థల మహత్తును తెలుసుకొని నిమ్మనాయుడు యుక్తిచే పులిమడుగు దుర్గాథిపతి (ఖిల్లాదారు) ని మచ్చిగ చేసుకొని ఆయన అనుమతి తో పర్వత లోయలో కుటీరం ఏర్పరుచుకొని స్థిరపడ్డాడు. దేవరకోట శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి మంధిర స్థలం లోనే "శ్రీ సీతారామాంజనేయ" విగ్రహాలను స్థాపించి నిత్యం దీప, ధూప, నైవేద్యం, భజనాదులు చేసేవాడు. అప్పుడే కొన్ని కూటీరములు ఏర్పర్చుకున్నాడు.
నిమ్మనాయుడు ఈ ప్రాంతం లోని అటవీ భూసంపత్తిని ఉపయోగంలోకి తేవడానికి తనకు పరిచయం ఉన్న ప్రాంతాలు భద్రాచలం, సిరిపంచ, కొండపల్లి, విజయవాడ, ఖమ్మం, మధుర, ఎలగందుల, ఓరుగల్లు, కొండవీడు, తదితర ప్రాంతాల నుండి కర్రబోమ్మలు చేసేవారిని, బ్రాహ్మణ, వైష్ణవ, ఆరాద్య, పద్మశాలి, తెనుగు, కుమ్మరి, కమ్మారి, వడ్రంగి, నగిషీ (నాకాశి) మొదలగు జాతుల వారిని రప్పించి వారి నివాసానికై అరణ్యంలో ఇప్పటి "కసుబ" అణు వీధిలో 12 ఇండ్లతో గ్రామాన్ని రూపొందించాడు. ఇట్టి నూతన గ్రామానికి తన పేరు చిరస్థాయిగా ఉండుటాకై "నిమ్మల" అణు నామకరణం చేశాడు. ఇట్టి "నిమ్మల" అను శబ్దం ను తరువాత వచ్చిన పాలకులు "నిర్మల్" గా మార్చిరి. ఇప్పుడు గూడ చుట్టు ప్రక్కల ఉన్న పల్లె ప్రజలు "నిమ్మల" అనియే అందురు.
నిర్మల్ పట్టణము కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. దీనికి సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. కర్రలతో కొయ్యబొమ్మలు చేసి చిత్రమైన బొమ్మలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కర్రలను సేకరించడం, వాటిని ఆరబెట్టి తగిన రుపాలకు చెక్కి బొమ్మలుగా తీర్చిదిద్దడం, వాటికి పెయింటింగ్ చేయడం, విక్రయించడం కొందరు తరతరాలుగా చేస్తున్నారు. పక్షులు, జంతువులు, ఫలాలలాంటి కొయ్యబొమ్మలకే కాకుండా వర్ణచిత్రాలకు కూడా నిర్మల్ పేరుగాంచినది. 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను ఏర్పర్చినారు.రాష్ట్రపతిచే అవార్డు కూడా పొందినారు.
నాగోబా జాతర:
ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో జరిగే తెలంగాణా లోని రెండో అతిపెద్ద జాతర "నాగోబా", ఆదివాసి గిరిజనులలో గోండు జాతికి చెందినా వారు జరుపుకునే ఉత్సవమే నాగోబా జాతర, ఇక్కడ ఉత్సవాలని ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తుంది, ఈ జాతరకు జిల్లా కలెక్టర్ వచ్చి ప్రారంభిస్తారు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా హాజారవుతారు.
ఈ జాతర వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది, ఇక్కడ ఒక దేవాలయం ఉంది, ఇందులో ఆదిశేషుడు కొలువై ఉంటాడు, ఆయనను కొలిచే వేడుకే ఈ నాగోబా జాతర, సాంప్రదాయం ప్రకారం గోండు జాతిలోని మోస్రం వంశీయులు ఈ వేడుకలను నిర్వహిస్తారు, జాతర సందర్భంగా వీరు మర్రి చెట్లకు కింది భాగంలో బస చేస్తారు, ఆడవారు బస చేసే ప్రాంతాన్ని గోవాడ్ అంటారు.మోస్రం వంశీయులు తెల్ల వస్త్రాలను ధరించి ఉంటారు, వీరు నాగోబా గుడిలో పూజ చేసిన అనంతరం పాదయాత్ర చేస్తారు, వీరు ఇంద్రవెల్లి, ఉట్నూర్, జైనూర్, సిర్పూర్ మీదుగా జిన్నారం మండలం లోని కలమడుగులో ఉన్న గోదావరి నదికి చేరుకుంటారు, నదిలో పూజలు చేసి నది నీటిని తీసుకొని పాదయాత్ర గా తిరిగి నాగోబా గుడికి చేరుకుంటారు, ఆ నీటితో నాగోబా గుడిలో పూజలు చేసి జాతర ప్రారంభం ఐనదని ప్రకటిస్తారు. ఆ తర్వాత మహా జాతర ప్రారంభం అవుతుంది, ఈ జాతర ప్రతి సంవత్సరం ఫాల్ఘుణ మాసంలో జరుగుతుంది, అయితే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, చేత్తిస్ ఘడ్, జార్ఖండ్ నుండి కూడా భక్తులు భారి సంఖ్య లో వస్తారు.
http://naatelangaana.blogspot.in/2012/01/blog-post_22.html
జిల్లాలోని ప్రముఖులు:
కొమురం భీo :
గిగిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.
కొమరంభీమ్ (సినిమా) - కొమురం భీమ్ జీవితగాధ ఆధారంగా రూపొంది రెండు నంది పురస్కరాలను గెలుచుకున్న చిత్రం.
సామల సదాశివ:-
సామల సదాశివ: జిల్లాలోని దేహగాం మండలం లోని తెనుగు పల్లెలో సదాశివ జన్మించారు, ఆయన ఎం ఎ, బి ఎడ్, డీలిట్ విద్యార్హతలతో,కాగజ్ నగర్ ప్రాథమిక పాటశాలలో ఉపద్యాయునిగా తన వృత్తి జీవితం ప్రారంభించారు,ఈయన జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్ గా కూడా చేసారు, ఈయన రచనను 1972 లో 5 వ తరగతి పుస్తకంలో పాట్యాoశం గా చేర్చారు, ఈయన 7 భాషలలో సాహిత్య సేవ చేసారు, ఈయన తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్ లను అందుకున్నారు, 2010 లో కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు, 2011 సంవత్సరానికి గాను ఈయన రాసిన "స్వరలయలు" అనే పుస్తకం ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ను గెలుచుకుంది, 2012 ఆగస్ట్ నెలలో ఆయన కన్ను మూసారు.
జయంత్ మునిగాల: జయంత్ గారు ఆదిలాబాద్ జిల్లా కు చెందినా మొదటి ఐ ఎ ఎస్, ఈయన 1953 లో జన్నారం మండలం, కామన్ పల్లె గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు, బీహార్,ఝార్కాండ్ రాష్ట్రాల్లో ఆయన తన సేవలను అందించారు.
జస్టిస్. జి. చంద్రయ్య: ఈయన జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామం లో 1954లో ఒక సాదారణ రైతు కుటుంబంలో జన్మించారు, ఆంద్ర ప్రదేశ్ హై కోర్టులో జడ్జ్ గా విదులు నిర్వహించారు.
తులసి రామ్ కూడా ఆదిలాబాద్ జిల్లా వారే..
తెలంగాణా సాయుధ పోరాట యోధుడు రంజీ గోండ్ కూడా జిల్లాకు చెందినా వారే...
ఉద్యమాలు:
ఇంద్రవెల్లి విప్లవాల పాలవెల్లి..
1981 ఏప్రిల్ 20న ఇక్కడ అదిలాబాద్ గిరిజన రైతుకూలీ సంఘం ఒక సభ జరుప తలపెట్టింది. ఆ సభ, తదనంతర పరిణామాలను మరోసారి గుర్తు చేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
ఒక్క ఇంద్ర మాత్రమే కాదు, ఆదిలాబాద్ ప్రధానంగా గోండు, కోలాం, పరధాన్లు, పరమేశులు మెదలైన ఆదివాసీ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్న జిల్లా అది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతమంతా ఆదివాసులే. ఇంద్ర ఒకప్పుడు 97% ఆదివాసీలు ఉండేవారు. ఈ జిల్లా మహారాష్ట్ర ప్రాంతానికి కూడా దగ్గర్లో ఉండటం వల్ల ఆ రాష్ట్రం వైపు నుంచి కూడా బంజారాలు, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి మార్వాడీలు, నీటి పట్టు ఉన్న చోట్లకు కోస్తా జిల్లాల నుంచి వచ్చిన వారు వచ్చి ఇక్కడి భూములను ఆక్రమించుకున్నారు. వడ్డీ వ్యాపారం చేశారు. అడవిని, కొండలను పోడు చేసుకొనే ఆదివాసీలు క్రమంగా లోతట్టు ప్రాంతాలకు నెట్టబడ్డారు. నిజానికి ఇక్కడివి సారవంతమైన నల్లరేగడి భూములు. ఇక్కడి గోండులు మెట్ట పంటలే కాకుండా పత్తి, జొన్న వంటి వ్యాపార పంటలను కూడా పండిస్తారు. అటవీ సంపద సరేసరి. కానీ, ఇంద్ర ఓ వ్యాపార కేంద్రంగా మారి వస్తు వినిమయంతో తప్పుడు తూకాలతో ఈ ఆదివాసీలను మోసం చేస్తూ వస్తున్నది.
ఈ ప్రాంతంలో రాంజీ గోండు, కొమురం భీంది.
బ్రిటీష్ సామ్రాజ్యవాదులతో, నిజాం ఫ్యూడల్ నిరంకుశ పాలనతో పోరాడిన వారసత్వం. ‘మా గ్రామాల్లో మా రాజ్యం’ అని ప్రకటించి పన్నెండు గ్రామాల్లో కొమురం భీం ప్రజా అధికారాన్ని స్థాపించి జోడేఘాట్ కేంద్రంగా నిజాంతో పోరాడిందీ. ఒకవైపు ఈ పోరాట వారసత్వం నుండి మరొక వైపు 1967లో నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాటం మార్గదర్శకత్వమైంది. సన్నిహితంగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి 1978 ‘జగిత్యాల జైత్రయాత్ర’ నిర్వహించిన విప్లవకారుల నాయకత్వం లభించింది. వాళ్ళే ఎమ్జన్సీ కాలంలోనే ఈ అడవుల్లోకి పొరకల సార్లుగా ప్రవేశించారు. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత 1980లో పీపుల్స్‌వార్ ఏర్పడగా ఒక వైపు పెద్ది శంకర్, మరొక వైపు మరొక దళం మహారాష్ట్ర, బస్తర్ అడవుల్లో ఆదివాసీల మధ్య పని చేయడానికి కదిలి వెళ్ళాయి. బెల్లంపల్లి బొగ్గుగని కార్మికుని బిడ్డ అయిన పెద్ది శంకర్ ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు.
ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడు రఘుగా ప్రసిద్ధమైన నల్లా ఆదిరేడ్డి నాయకత్వంలో గజ్జెల గంగారాం, సాహులు సహచరులుగా విప్లవోద్యమం విస్తరించిందీ. రఘు, సాహు, గంగారాంలు ఆదివాసీ భాష నేర్చుకొని ‘జననాట్య మండలి’ పాటలను ఆదివాసీ భాషలోకి అనువదించి, వారి మధ్య పనిచేస్తూ ‘గిరిజన రైతుకూలీ సంఘం’ స్థాపించారు. ఆ గిరిజన రైతుకూలీ సంఘానికి కార్యదర్శిగా ఉన్న హనుమంతరావు నాయకత్వంలో తలపెట్టిందీ 1981 ఏప్రిల్ 20 నాటి గిరిజన రైతుకూలీ సభ. ఆ సభ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు ఇవి: తాము పోడు చేసుకున్న భూములపై పట్టా ఇవ్వాలి. తాము మార్కెట్‌కు తెస్తున్న పత్తి, పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇంద్ర రోడ్డు పొడవునా... సంతలో తాము అమ్ముకుంటున్న అటవీ వస్తువులను సేట్‌లు తప్పుడు తూనికలతో కొలిచి తక్కువ రేట్లతో కొని మోసపుచ్చుతున్నారు. ఈ మోసాన్ని అరికట్టి సరైన పద్ధతిని నియంత్రించాలి.
మరింత సమాచారం కొరకు: http://naatelangaana.blogspot.in/2012/04/blog-post_17.html
తెలంగాణా ఉద్యమం:
ఆదిలాబాదు జిల్లాలో తెలంగాణ విమోచనోద్యమం మొదట నిర్మల్‌లోనే ప్రారంభమైనది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి మట్టి కరిపించిన ఘనతను ఈ పట్టణం సొంతంచేసుకుంది. ఉద్యమాలే ఊపిరిగా దూసుకువెళ్ళి ఒకేసారి వెయ్యిమంది ఉరికంబం ఎక్కిన ఘనత ఈ ప్రాంతానిదే. ఇదే వెయ్యి ఉరుల మర్రి సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది,
వెయ్యి ఉరులమర్రి సంఘటన
తెలంగాణ విమోచనోద్యమంలో ప్రఖ్యాతిగాంచిన వెయ్యి ఉరులమర్రి సంఘటన నిర్మల్ పట్టణ శివారులోని ఖజానా చెరువు ఒడ్డున ఉన్న మర్రిచెట్టు వద్ద జరిగింది. పట్టణ మరియు పరిసర గ్రామప్రజలు గిరిజన నాయకుడు రాంజీగోండు ఆధ్వర్యంలో నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించారు. నిజాం సైనికులపై దాడులు చేసి వారిని గజగజలాడించారు. రాంజీగోండు ఆధ్వర్యంలోని కొందరు లంచాలకు ఆశపడి గోండు ఆచూకిని నిజాంకు తెలియజేశారు. దీనితో నిజాం సైనికులు రాంజీగోండును సోన్ సమీపంలో గోదావరి నది ఒడ్డున పట్టుకున్నారు. ఆయనతోపాటు వెయ్యిమంది అనుచరులను నిర్మల్ నుండి బత్తీస్‌గడ్ వైపు వెళ్ళు రహదారిలో ఖజానా చెరువు ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకు నిర్దాక్షిణ్యంగా ఉరితీశారు.చాలాకాలం పాటు ఈ చెట్టు విమోచనోద్యమ అమరవీరులకు గుర్తుగా మిగిలింది. భారీవర్షాలకు ఈ చెట్టు కూకటివేళ్ళతో సహా కూలిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమరవీరుల స్తూపం నిర్మించబడింది. ఏటా సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటారు.
ముగింపు:
ఇంతటి ప్రకృతి సంపద, అపారమైన ఖనిజాలు, చుట్టూ నదులు ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది, అందమైన అడవులు, సరస్సులు, జలపాతాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎ నాడు పట్టించుకోలేదు, పర్యాటక కేంద్రం గా రుపొంచేందుకు ముందుకు రాలేదు, అరకొర అందాలు ఉన్న అరకు ను కోట్ల రూపాయలు ఖర్చుచేసి కృత్రిమ సోగబులు అద్ది పర్యాటక కేంద్రంగా తీర్చిన ప్రభుత్వం కళ్ళ ముందే ఉన్న సహజమైన అటవీ అందాలను మాత్రం పట్టించుకోవడం లేదు, ఇక జిల్లా ఎదుర్కుంటున్న సమస్యల్లో మరొకటి ఫ్లోరిడ్, చుట్టూ జీవనదులు ఉన్న జిల్లలో అనేక గ్రామాల్లో నల్లగొండ మాదిరిగానే ఇక్కడ కూడా ఫ్లోరిడ్ భూతం పట్టి పీడిస్తుంది, వానాకాలం లో ఏజెన్సి లలో సరైన వైద్య సదుపాయాలు లేక పోవడం వాళ్ళ అన్తువ్యడులకు గురై అనేకమంది మరణిస్తున్నారు, మరో సమస్య వలసలు, సరైన ఉపాది లేక ఇక్కడి యువకులు కుటుంబాన్ని వదిలి గల్ఫ్ బాట పడుతున్నారు. ఇంకో సమస్య ఓపెన్ కాస్ట్ మైనింగ్, ఈ సమస్యలన్నీ తీరాలంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉన్న ఏకైక మార్గం తెలంగాణా రాష్ట్ర సాధనే..