హోం

22, ఫిబ్రవరి 2012, బుధవారం

దర్శనీయం....అలంపూర్ క్షేత్రం






‘‘బ్రహ్మేశోయం సవిశ్వేశః సకాశి హేమలాపురి, 
సాగంగా తుంగభద్రేయం సత్యమేవం నవంశయః’’


రాష్ట్రంలో చారిత్రకంగా ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాల్లో తెలంగాణలోని అలంపూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా, శ్రీశైలానికి పశ్చిమ ధ్వారంగా వెలుగొందుతున్న ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దేవి దేవతలు శ్రీ బాలబ్రహ్మేశ్వరుడు, జోగుళాంబ అమ్మవారు. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో అయిదవ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో బ్రహ్మకు తొమ్మిది ఆలయాలు ఉండడం విశేషం. ఇంతటి ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. చారిత్రకంగా ఈ ఆలయాన్ని 6వ శతాబ్దానికి చెందిన బాదామిచాళుక్య వంశంలోని రెండవ పులకేశి నిర్మించినట్లు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అలంపూర్‌కు పూర్వనామం హేమలాపురం. కాలక్రమేణ ఈ నామం రూపాంతరం చెందుతూ హతంపురం, యోగులాపురం, జోగుళాపురం, అలంపురంగా రూపాంతరం చెందింది. 
బాలబ్రహ్మేశ్వరుడు:-
బ్రహ్మదేవుడు ఈశ్వరుని గురించి ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు. బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడు. బ్రహ్మ కారణంచేత ఈశ్వరుడు ఇక్కడ వెలిసినందున ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడుగా, బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తున్నారు. బాలబ్రహ్మేశ్వరుని విగ్రహాన్ని పరిశీలించినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది. శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్థూపారకంగా ఉంటాయి. అలంపూర్‌లో మాత్రం గోస్పాద ముద్రిక, రసాత్మ లింగంగా వెలిసి ఉంది. ఆవు పాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలిసి ఉండడం విశేషం. పూర్వం ఈ విగ్రహం నుంచి అనేకమైన రసాలు వెలువడుతుండగా, రససిద్దులు అనే మహానుభావులు పరుశవేది అనే మూలికతో ఆ రసాలను మిళితం చేస్తూ కొన్ని రకాలైన పరిశోధనలు జరిపి విగ్రహంలో నుంచి బంగారాన్ని తయారు చేశారు. ఆ బంగారంతో ప్రధాన ఆలయం చుట్టు అదే రీతిగా ఎనిమిది ఆలయాలను నిర్మించారు. ఆ విధంగా వెలసిన ఈ తొమ్మిది ఆలయాలే నవబ్రహ్మ ఆలయాలుగా విరాజిల్లుతున్నాయని చరిత్ర చెపుతోంది. ఇందులో కుమార, ఆర్క, వీర, విశ్వ, తారక, గరుఢ, స్వర్గ, పద్మబ్రహ్మేశ్వర ఆలయాలను ఇక్కడ భక్తులు దర్శించుకుంటున్నారు. ఆలయాలపై చూపరులను ఆకట్టుకునే విధంగా గరుఢ, గంధర్వ, కిన్నెర, కింపురుష మూర్తులు ఇక్కడ రమణీయంగా నిలిచారు. ఇక్కడ ఆలయాలపై ఉన్న శిల్పసంపదపై పంచతంత్ర కావ్య కథా శిల్పాలు, ఆదిత్య హృదయం, రామాయణ, మహాభారత శిల్పాలు దర్శనమిస్తాయి. ఈ దేవాలయాల మీద శ్రీమార, నయన్‌ప్రియన్, శ్రీకంఠాచార్యన్ తదితర శిల్పాచారుల పేర్లు నేటికి కనపడతాయి. రెండవ పులికేశి నిర్మించిన పట్టదకళ్లు దేవాలయం కంటే ఇక్కడ శిల్ప సంపద, అపూర్వ, వాస్తు వికాసం అధ్యాయన పరులను ఆకట్టుకుటుంది. 




అయిదవ శక్తిపీఠం:-


‘‘లంబస్తమి వికృతాక్షిం ఘోర రూపం మహాబలం 
ప్రేతాసన సమారుడం జోగుళాంబం నమామ్యహం’’ 


అని ఇక్కడ వెలసిన శక్తి స్వరూపిణి జోగుళాంబ అమ్మవారిని గురించి శంకరాచార్యులు పై స్తోత్రంతో కీర్తించారు. శంకరాచార్యులు దేశంలోని శక్తిపీఠాలను సందర్శించిన సమయంలో అలంపూర్‌లోని జోగుళాంబ అమ్మవారిని అయిదవ శక్తిపీఠంగా కీర్తించారు. ఇక్కడ వెలసిన అమ్మవారి గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం దక్ష ప్రజాప్రతినిధి నిర్వహించిన నిరీశ్వరయాగంలో అందరి ముందు శివనింద చేయడంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యోగాగ్నిని కల్పించుకుని దేహ త్యాగం చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పరమశివుడు ప్రళయ కాలరుద్రుడై యాగాన్ని సమూలంగా నాశనం చేసి మరణించిన సతీదేవిని తన భుజస్కందంపై వేసుకుని రుద్రతాండవం చేశాడు. దీంతో పరమేశ్వరుని కోపాగ్నిని శాంతింపచేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది శకలాలుగా విభజించారు. ఆ పద్దెనిమిది భాగాలు వేరు వేరు ప్రాంతాల్లో పడ్డాయి. వాటిని శంకరాచార్యులు పద్దెనిమిది పీఠాలుగా గుర్తించి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఇందులో దంత పంక్తి భాగం అలంపూర్‌లో పడ్డట్లు, దాంతో ఇక్కడ జోగుళాంబ అమ్మవారు వెలిసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. 




అలంపూర్ టూ కాశీ:-
ఉత్తర భారతంలోని కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వరుని దర్శిస్తే అంతే మహాపుణ్యం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. కాశీలో ఉత్తర వాహిణి గంగానది అయితే అలంపూర్‌లో ఉత్తర వాహిణి తుంగభద్ర నది ప్రవహిస్తుండడం విశేషం. కాశీలో 64 స్నాన ఘట్టాలు(మణికర్ణిక) ఉండగా, అలంపూర్‌లో 64 స్నాన ఘట్టాలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైన కాశీ విశాలాక్షి అమ్మవారు అక్కడ వెలిస్తే అయిదవ శక్తిపీఠంగా జోగుళాంబ అమ్మవారు ఈ క్షేత్రంలో కొలువై ఉండడంతో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. 


విశేష దినాలు:-
అలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో జోగుళాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే నవ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో విఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన బాలబ్రహ్మేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
                                (నమస్తే తెలంగాణా నుండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి