హోం

15, ఫిబ్రవరి 2012, బుధవారం

చదవులతల్లి మన బాసర సరస్వతి




ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని బాసరలో కాలు మోపడంతోనే ప్రతి ఒక్కరికీ చెప్పలేని అద్వితీయ అనుభూతి కలుగుతుంది. ఇక అమ్మవారిని దర్శించుకోవడంతో పరిపూర్ణత సిద్ధిస్తుంది.


చిన్నారుల చిట్టి చేతులు పలకా బలపం పట్టి మొట్టమొదటిసారిగా అక్షరాలు దిద్దే ఆ అపురూప క్షణాలకు పరవశించని తల్లిదండ్రులు ఎవరూ ఉండరు. పసిపిల్లలకు విద్యాభిక్ష పెట్టే మన జ్ఞాన స్వరూపిణికి వందనం


అమ్మవారి సన్నిధిలో అక్షర శ్రీకారం దిద్దుకోవడంతోనే పిల్లలు ఆగిపోరు. బాల్య వయసుకు చేరుకున్నాక విద్యార్జనలో తమకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించమంటూ 11 రోజుల పాటు అక్కడ కఠోర దీక్షకు దిగుతారు. మధ్యాహ్నపు ఎండలో, కాళ్లకు చెప్పులైనా లేకుండా, లేత పాదాలతో కాలినడకన బాసరలోని ఇల్లిల్లూ తిరుగుతారు. భుజానికి జోలె వేసుకుని ఇండ్లలోని తల్లులు పెట్టే భిక్షను స్వీకరిస్తారు. అలా తెచ్చుకున్న అన్నంతోనే ఒంటి పూట కడుపు తింటూ, అక్కడే అమ్మవారి నీడన నిద్రిస్తారు. పెద్దలను సైతం బిత్తరపరిచే ఈ అసాధారణ సన్నివేశం ఇప్పటికీ అక్కడ కొనసాగుతోంది.
ఆ బాసర సరస్వతి దేవి ముఖాన నక్షత్రంలా మెరిసే ముక్కుపుల్లకు ఆకర్షితులు కాని చిన్నారులు ఉండరు. ప్రతి బిడ్డకు ఒక అపురూప విద్యాశక్తిని అక్కడి బాసర తల్లి ప్రసాదిస్తుందన్న నమ్మకం ప్రతి ఒక్కరి కళ్లలో ద్యోతకమవుతుంది. 
ఇక్కడ కొలువై ఉన్న మహా సరస్వతీ అమ్మవారే పూజారుల చేత తమ పిల్లలకు ఓనమాలు దిద్దుస్తుందన్న పరిపూర్ణ విశ్వాసం వారిది. అలాగే, బాసర క్షేత్రంలో నిద్ర చేస్తూ, నిత్య భిక్షలతో కడుపు నింపుకునే పిల్లలకూ అమ్మవారు జ్ఞానభిక్ష పెడుతోంది.


గౌతమీ తీరాన వెలసిన సరస్వతి కథ
పూర్వం వైకుం శ్రీమన్నారాయణుని సన్నిధానంలోనే సరస్వతీ దేవి గంగాదేవితో గొడవ పడుతుంది. ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలంలోని వాసర గ్రామం వద్ద గౌతమీ నది తీరాన నదిగా మారుతుంది. ఇదే కాలక్షికమేణా ‘సరస్వతీ నది’గా పేరు గాంచింది. ఇక్కడి దేవిని దర్శించుకునేందుకు మునులు, మహర్షులు, బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి వెళ్తుండేవారంటారు.


ఇలా కొన్ని రోజులు గడిచాక తన మహిమలు తెలిపేందుకు సరస్వతీ దేవి ఒకరోజు ఉన్నట్టుండి ఇక్కడ్నించి మాయమైంది. దాంతో సమస్తం స్తంభించి పోతుంది. మహర్షులు, దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మరల స స్వతీ అనుగ్రహం పొందేందుకు మార్గం చూపమని వేడుకుంటారు. వారి ప్రార్థనను ఆలకించిన బ్రహ్మ ‘సరస్వతీ దేవి పునరావిర్భావం వేదవ్యాసుడి వల్ల పొందవచ్చని’ వారికి చెప్తాడు. అప్పుడు వారంతా వేద వ్యాసుడి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వారి మనోభావాలు గ్రహించిన వ్యాసుడు యోగాసీనుడై నిశ్చల చిత్తంతో, తన హృదయ కమలం మధ్యలోని వాణిని ధ్యానిస్తాడు. దాంతో దేవి అనుగ్రహిస్తుంది. దేవతలంతా చూస్తుండగానే దేవి వ్యాసుడితో -
‘‘ఓ వ్యాసమునీ! నీ స్తోత్రంతో ప్రసన్నురాలి నైతిని. నా అనుగ్రహం తో నీ కోరికలన్నీ నెర వేరుతాయి’’ అని పలికింది. ‘‘అంతేకాకుండా వ్యాసరా నగరమున సుమనోహరమైన సరోవర తీరాన నన్ను ప్రతిష్ఠించి, పూజించు’’ మంటుంది. 
ఆ మహాతల్లి అనుజ్ఞ మేరకు అక్కడ అమ్మవారి ప్రతిష్టకు స్వయాన వేద వ్యాసుడే ఉపక్రమిస్తడు. ‘‘ముందు గౌతమీ తీరాన ఉన్న ప్రమాణ పరిమితమైన సైకతాన్ని (ఇసుకను) తెచ్చి నా విగ్రహాన్ని ప్రతిష్ఠించమని’’ అమ్మవారు ఆజ్ఞాపించింది. అలా, ఆ మహర్షి ప్రతిష్ఠించిన కారణాంగానే ఆ వ్యాసపురి క్రమేపీ ‘వ్యాసర’గా మారింది. అదే ఇవాళ్టి బాసర పుణ్యక్షేత్రం.


అమ్మవారి సన్నిధిలోనే అక్షరాభ్యాసం
బాసర అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది చదువుల తల్లి సరస్వతీ. అక్కడ అమ్మవారి వద్ద, ఆలయ ప్రాంగణంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇందుకు వసంత పంచమి, అక్షయ తృతియ వంటి పండగ రోజులు మరింత శుభవూపదమని భక్తులు నమ్ముతారు. అటువంటి ప్రత్యేక దినాలలో అయితే ఆ ఒక్కరోజే దాదాపు 3000 అక్షరాభ్యాసాలు జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. 


కఠోర దీక్ష పిల్లల ‘అనుష్ఠానం’
బాసర జ్ఞాన సరస్వతీ దేవి మొక్కును తీర్చుకునేందుకు భక్తులు చేపట్టే దీక్షల్లో అనుష్ఠానం అతి ముఖ్యమైంది. ఈ దీక్ష కఠోర నియమ నిష్టలతో సాగుతుంది. చదువుకునే తమ పిల్లలు ఉన్నత చదువుల్లో బాగా రాణించాలని, పరీక్షల్లో ఉత్తమ శ్రేణుల్లో పాస్ అవ్వాలన్న కోరికతో బాలలచేత వారి తల్లి దండ్రులు అనుష్ఠానాన్ని ఆచరింపజేస్తారు. 


‘తమ కోరికలు తీరినట్లయితే అనుష్ఠానం చేస్తామని’ బాల భక్తులు మొక్కుకుంటారు. పదకొండు రోజుల పాటు ఆ పిల్లలు బాసరలోనే ఉండి, దీక్షను కొనసాగిస్తారు. ఆలయ సమీపంలో అనుష్ఠాన ధ్యానమందిరం ఉంది. అక్కడ భక్తులు విడిది చేస్తారు. ఈ దీక్షలో భాగంగా పిల్లలు నిత్యం సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. కాలకృత్యాల అనంతరం బాసర గోదావరిలో పుణ్యస్నానం చేస్తారు. అనంతరం ధ్యాన మండపం చేరుకొని అమ్మవారిని తలచుకుంటూ ధ్యానం చేస్తారు. 


తర్వాత జోలె భుజానేసుకుని పాదరక్షలు లేకుండా బాసర గ్రామంలోకి కాలినడకన అందరూ కలసి గుంపుగా సాగుతారు. అక్కడి బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి బిక్షాటన చేస్తారు. గృహస్థులు వారి జోలెలో వండిన అన్నం, పప్పు, కూర వంటివి వేస్తారు. కొందరు విడిగా బియ్యం, పప్పులను సాహిత్యంగా ఇస్తారు. అలా పలు ఇళ్లన్నీ తిరిగి, వచ్చి తమ విడిది చేరుకుంటారు. అక్కడ తెచ్చుకున్న ఆహారాన్ని లేదా వంట చేసుకొని భోజనం చేస్తారు.
ఈ అనుష్ఠానంలో కొనసాగినన్ని రోజులూ బాలభక్తులు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. మాజీ ప్రధాన దివంగత పి.వి.నరసింహారావు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ప్రభృతులంతా ఇలా ఈ బాసర సరస్వతీ దేవి చెంత అనుష్ఠానం చేసిన వారే. ఈ దీక్ష ఎంత కఠినమో అంత పవిత్రము, అంత ప్రయోజకరమన్న నమ్మకం భక్తులది. 




దేశంలోనే సరస్వతీ ఆలయాల్లో రెండో అతి ప్రతిష్టాత్మక స్థానం బాసరది. వేద వ్యాసుడే ఆ సరస్వతీదేవి కరుణ కోసం బాసర సమీపంలోనే దీక్ష చేసినట్లు ప్రతీతి. వసంతపంచమి రోజునే ఆ మహర్షికి అమ్మవారు ప్రత్యక్షమైనట్లు చెబుతారు. అందుకే, ఈ వేడుకలను బాసరలో భక్తజనం అంత గొప్ప పండగగా నిర్వహించుకుంటారు.


నిత్యపూజలు
బాసర ఆలయ పరిపాలన బాధ్యతలన్నీ దేవాదాయ, ధర్మాదాయ శాఖతో ఏర్పాటుచేసిన ధర్మకర్తల సంఘం, కార్య నిర్వహణాధికారులు నిర్వర్తిస్తారు. 
- ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 6 గంటలకు పూజలు ప్రారంభం. నిత్యం ఉదయం 5 గంటలకు అమ్మవారికి మంత్రోపేతంగా పంచామృతం, ధూపదీపాలతో అర్చనలు చేస్తారు. ఉదయం హారతి, మంత్రపుష్పం అయ్యాక తీర్థ ప్రసాదాలు విక్రయిస్తారు.  అక్షరాభ్యాసం, కేశఖండనం, ఉపనయనం, వివాహాలు భజనలు వంటివి నిరంతరం కొనసాగుతుంటాయి. 


ఉత్సవాలు
అమ్మవారి ఆలయంలో ఏడాదికి మూడు ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండువగా నిర్వహిస్తారు.
- ఆశ్వీయుజ శుద్ధ పౌడ్యమి: ఈ రోజు ఉదయం, సాయంత్రం 64 ఉపచారాలతో (చతుష్టి పూజ) వైదిక పద్ధతిలో అర్చనలు చేస్తారు. 
- మహర్నవమి: ఈ రోజు చండీ వాహనం, శ్రీదేవి భాగవతం, దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు. 
- విజయదశమి: మహాభిషేకం, పల్లకీ సేవ, శమీపూజ నిర్వహిస్తారు. దసరా నవరావూతులను పురస్కరించుకుని ఆలయాన్ని శోభాయమానంగా అలంకరిస్తారు.


జాతరలు
క్షేత్రంలో రోజూ పెద్ద జాతరే. ప్రత్యేకించి దసరా వంటి పర్వదినాలలో అయితే మూడు రోజులపాటు జాతరలు సాగుతాయి. చుట్టు పక్కల జిల్లాలు, ఇరుగు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యవూపదేశ్‌ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ మూడు రోజులు సంగీత సభలు, భరత నాట్యాలు, హరికథలు, భజనలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ దినం సరస్వతీ నదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి, పునీతులవుతారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.


దర్శనీయ ప్రదేశాలు
- బాసర ప్రధాన దేవాలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్షచ్ఛాయలో దత్త మందిరం ఉంది. పశ్చిమ భాగాన మహాకాళీ దేవాలయం. 
-దక్షిణ భాగాన శ్రీ వ్యాస మందిరం. ఇక్కడ వేద వ్యాసుని విగ్రహంతోపాటు ఎంతో మహిమాన్వితమైనట్లుగా భావించే వ్యాసలింగం ఉన్నాయి. 
-బాసర గ్రామానికి వెళ్లే దారిలో ఒక పెద్ద శిల ఉంటుంది. దానికి ‘వేదవతి’ (ధన పుంగవుడు) అని ప్రసిద్ధి. పక్కనే ఉన్న మరో చిన్న శిలతో దీనిని కొడితే విచివూతమైన శబ్దం వినిపిస్తుంది.


వసతులు
- భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ధర్మశాల, మరో అతిథి గృహం బాసరలో ఉన్నాయి. 
- వేములవాడ దేవస్థానం వారి ఆర్థిక సాయంతో నిర్మితమైన అతిథిగృహాలు కూడా భక్తుల విడిదికి అందుబాటులో ఉన్నాయి.


రవాణా సౌకర్యాలు
- హైదరాబాద్ నుంచి మన్మాడ్- షిర్డీ వెళ్లే రైలు మార్గంలో నిజామాబాద్ తర్వాత వచ్చే నాలుగో స్టేషన్ బాసర. 
- నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి బాసరకు 35 కి.మీ. దూరం ఉంటుంది. ఇక్కడ్నించి బాసరకు నిరంతరం ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
                            (నమస్తే తెలంగాణా నుండి..)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి