హోం

24, మార్చి 2012, శనివారం

ఎక్కడుంది అశాంతి, తెలంగాణా ప్రజల ఒట్లలోన, కాంగ్రెస్ కు పోయిన సీట్లలోనా..?



తెలంగాణా లో శాంతి యుత వాతావరణం ఏర్పడితేనే చర్చల ప్రక్రియ ప్రారంభమౌతుంది-రెండు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ బోడోలాండ్ ఉద్యమ నేతల ముందు చేసిన కామెంట్.
తెలంగాణా వాదం తగ్గింది, అందుకే టి ఆర్ ఎస్ కు 2010 ఉప ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఓటింగ్ శాతం తగ్గింది-గండ్ర వెంకట రమణ రెడ్డి, డి కే అరుణ.
మా ఫలితాలు గతంలో కంటే మెరుగుపడ్డాయి-చంద్రబాబు నాయుడు.
మహబూబ్ నగర్ లో మతతత్వం గెలిచింది, మతం పేరుతో బి జే పీ ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకుంది-లగడపాటి రాజగోపాల్.
                            ఉపఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఇవి, ఎలాగు గెలవలేకపోయము కదా గెలిచిన వారికి మసిపూసి మారేడుకాయ చేద్దాం అనే తీరులో వ్యవహరిస్తున్నారు. 
             తెలంగాణా అట్టుడికింది, బంద్ లు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరాహార ధీక్షలు, సమ్మె లతో,.. ఒకవైపు ఆత్మహత్యలు, మరో వైపు పోలీసు ల దౌర్జన్యాలు, కాని నేడు తెలంగాణా ప్రశాంతంగా ఉంది, సునామి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సునామి బారిన పడిన నేల ఎలా ఉంటుందో అలాగే ఉంది, శాంతి నేలకోనాలి శాంతి నేలకోనాలి అని పాడిన పాటే పాడిన కేంద్ర సర్కార్ మాటకు తలొగ్గి నేడు తెలంగాణా శాంతించింది, ఈ శాంతి ఎలాంటి శాతి అంటే ఇది సునామి ధాటికి మరణించిన మనుషుల శవాల గుట్టల్లో ఉండే స్మశాన శాంతి, ప్రధానికి ఇంకెంత శాంతి కావాలి..? నేల రాలిన యువకుల స్మృతులను తలచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ మాత్రుముర్తుల హృదయ రోదనలు ప్రధానికి సైరన్ మోతల్లా వినిపిస్తున్నాయా..? ఎక్కడుంది అశాంతి, తెలంగాణా ప్రజల ఒట్లలోన, కాంగ్రెస్ కు పోయిన సీట్ లలోనా..? 
కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణా లో ప్రశాంత వాతావరణం ఏర్పడినట్లా..? 
                          2010 ఎన్నికలతో పోల్చుకుంటే తెలంగాణా కు పడిన ఓట్లు తగ్గాయి. తెలంగాణా వాదం తగ్గింది, అవును తెలంగాణా వాదం తగ్గింది, పదవి రాకముందు ఉన్నంత తెలంగాణా వాదం చీప్ విప్ అనే చిల్లర పదవి రాగానే తెలంగాణా వాదం తగ్గిపోయింది, కాంగ్రెస్ కు ఇద్దరు ఎం ఎల్ ఎ లు ఉన్న మహబూబ్ నగర్ లో ఈ ఉప ఎన్నికలతో ఒక స్థానం తగ్గింది లింగు లిటుకు మంటూ ఇప్పుడు ఉన్నది ఒక్క ఎం ఎల్ ఎ నే కదా మరి ఇక్కడ ఒక్క స్థానం కూడా లేని టి ఆర్ ఎస్, బిజేపీ లు చెరొక స్థానం నేగ్గాయి, మరి తెలంగాణా వాదం తగ్గిందా, కాంగ్రెస్స్ వాదం తగ్గిందా..? అనేది జిల్లా మంత్రికే తెలుసు.
                           గతంలో కంటే మెరుగు పడ్డాడట బాబు, గతంలో అన్ని స్థానాల్లో డిపాజిట్లు రాలేదు కాని ఇప్పుడు 6 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లోనే డిపాజిట్ రాలేదు అంటే మెరుగు పడ్డట్టే కదా.. టి ఆర్ ఎస్ బలం, తెలంగాణా వాదం బలం అమాంతం తగ్గి టి డి పీ అసామాన్యంగా పుంజుకుంది కదా.. మహబూబ్ నగర్, ఆదిలాబాద్ టి డి పి కి కంచుకోటలు ఒకప్పుడు కాని నేడు తెలంగాణా వాదం దెబ్బకు ఆ కోటలు బీటలు వారి ముక్కలు ముక్కలు గా విరిగి పోయాయి, 7 స్థానాల్లో నలుగురు ఎం ఎల్ ఎ లు (కొవ్వురుతో కలిపి) గతంలో టి డి పీ వారె నాలుగింటికి నాలుగు ఓడిపోయినా ఇతను మేరుగుపడ్డాడట.. 
                   రాష్ట్రంలో అతిపెద్ద జ్యోతిష్కుడు ఎవరో మీకు తెలుసా..? విజయవాడ ఎం పీ లగడపాటి, ఉప ఎన్నికల ఫలితాలతో జోకర్ గా మారాడు, తన సర్వ్ రిపోర్ట్స్ ఎప్పుడు తప్పుకావని ప్రతి ఎన్నికల ముందు వీరు గెలుస్తారు వారు ఓడుతారు అని చెప్పే లగడపాటి ఈ ఎన్నికల్లో కూడా అలాగే చెప్పారు కాని మహబూబ్ నగర్ లో మాత్రం ఇతను చెప్పింది జరగలేదు అక్కడ టి ఆర్ ఎస్ గెలుస్తున్ధనేది ఇతని జ్యోస్యం కాని అక్కడ బి జే పి గెలిచేసరికి తట్టుకోలేక పోయిన లగడపాటి మతతత్వం గెలిచింది, ఇది రాష్ట్రానికి ప్రమాదకరం అని చెప్పారు, మరి లగడపాటి జ్యోస్యనికి ఈ ప్రాంతీయ తత్వం భోధపడిన ఈ జాతీయ వాదికి మత తత్వం ముందుగా కనబడలేదా..?
             ఎవరు ఏమనుకున్న తెలంగాణా ప్రజలు సమైక్య వాద పార్టీలకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు, మూడు స్థానాల్లో టి డి పి కి డిపాజిట్ లు పోయాయి, టి డి పి గెలుపు కోసం కాకుండా డిపాజిట్ల కోసం ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది, కాంగ్రెస్ కు కూడా చావుతప్పి కన్ను లోట్టపోయింది, మహబూబ్ నగర్ లో టి ఆర్ ఎస్ ఓటమి గురించి తెలంగాణా వ్యతిరేఖులు రక రకాలుగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏమనుకున్న అక్కడ తెలంగాణా కు మద్దతుగా ఉద్యమిస్తు జే ఎ సి లో భాగంగా ఉన్న బిజెపి, టి ఆర్ ఎస్ లే పోటి పడ్డాయి, చివరి వరకు ఆ రెండు పార్టీల మధ్యే పోరు నడిచింది, చివరికి 1800 ఓట్ల తేడాతో బిజెపి విజయం సాధించింది, ఒక లక్ష పది వేల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో దాదాపు ఎనభై వేల ఓట్లు టిఅరేస్, బిజెపి లకు దక్కాయి, మిగతా ఓట్లను ఇండిపెండెంట్లు, సిపిఎం తో పాటు కాంగ్రెస్, టిడిపి లు దక్కించుకున్నాయి, మరి ఇక్కడ ఎ వాదం గెలిచింది..? తెలంగాణా వాదం కాదా.? 
         2010 లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటి చేసిన వారు, 2009 సార్వత్రిక ఎన్నికల్లో టి ఆర్ ఎస్ పార్టీ తరపున గెలిచిన వారే, కావున వారి ఓటింగ్ శాతం అనేది 2010 లో ఘననీయంగా పెరిగింది, కాని నేటి ఎన్నికలు పూర్తిగా విభిన్న మైనవి, ఇప్పుడు పోటి చేసిన వారు గతం లో వేరే పార్టీల తరపున ఎన్నికై ఇప్పుడు తెలంగాణా కోసం రాజీనామా చేసి ఎన్నికల్లో పోటిపడుతున్నవారు, అంతే కాకుండా గతంలో కనీసం టి ఆర్ ఎస్ పోటి చెయ్యని కొల్లాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి వంటి నియోజకవర్గాలలో టి ఆర్ ఎస్ గెలుచుకుంది, అంటే ఆయ ప్రాంతాల్లో టి ఆర్ ఎస్ బలపడుతుంది, 2009 సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ , కొల్లాపూర్, ఘనపూర్ లలో భారి మెజారిటి తో గెలవాలి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్కు కు,పి ఆర్ పి కి పడ్డ ఓట్లు మొత్తం కాంగ్రెస్కు పడాలి కాని పడలేదు అంటే కాంగ్రెస్ కు ఓటింగ్ శాతం పెరిగిందా, తగ్గిందా..? టి ఆర్ ఎస్ కమూనిస్ట్ లతో కలిసి మహా కూటమిగా వచ్చి కామారెడ్డి, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ లలో పోటి చేసిన టిడిపి బలం ఏంటో ఈ ఎన్నికలతో తెలిసింది, ఇప్పుడు వచ్చిన ఓట్లను బట్టి చూస్తే టిడిపి ఒంటరిగా పోటి చేస్తే గెలవడం కష్టం అనేది సుస్పష్టం అయ్యింది, గత ఎన్నికలలో మహబూబ్ నగర్లో కేవలం 1800 ఓట్లను తెచ్చుకున్న బిజెపి ప్రస్తుతం 1800 ఓట్ల మెజారిటి తో గెలిచి టిడిపి, కాంగ్రెస్ ల డిపాజిట్ లు గల్లంతు చేసిందంటే ఈ బలం ఎక్కడినుండి వచ్చింది..? తెలంగాణా వాదం నుండి కాదా..?
                  అయితే వచ్చిన ఫలితాలతో సంతృప్తి పడకుండా జరిగిన పొరపాట్లు మల్లి జరగకుండా ముందు ముందు నడుచుకోవాలి, తెలంగాణా కు మద్దతు ఇస్తున్న బిజెపి ని టి ఆర్ ఎస్ కలుపుకొని పోవాలి, మహబూబ్ నాగర్ లో రెండింటిలో  ఏదో ఒక పార్టీ పోటి చేస్తే 50000 మెజారిటి వచ్చేది, కాని రెండు పార్టీలు పోటిచేయ్యడం వల్ల ఒక దశలో ఓట్లు చీలి ఇతర పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఏర్పడింది, కావున భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో ఈ రెండు పార్టీ లతో పాటు తెలంగాణా కు మద్దతు ఇచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి, పర్కాల లో జరిగే ఉపేన్నికతో జగన్ తెలంగాణా లో పాగా వెయ్యాలని చూస్తున్నాడు, ఈ రెండు పార్టీలు విడి విడి గా అభ్యర్థులను నిలబెట్టకుండా, ఒక్క అభ్యర్తినే నిలబెట్టి ఇద్దరు సహకరిస్తే జగన్ ను తెలంగాణాలో అడ్డుకోవడం కష్టమేమి కాదు.

21, మార్చి 2012, బుధవారం

జయహో తెలంగాణా



రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో కారు జోరు, ఫ్యాన్ హోరుకు కాంగ్రెస్, టీడీపీ చతికీల బడ్డ్డాయి. కామారెడ్డిలో టీడీపీ డిపాజిట్ గల్లంతు చేసి రెండుకండ్ల సిద్దాంతం చంద్రబాబుకు తగు రీతిలో బుద్ది చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో నమ్మక ద్రోహపు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేసి తెలంగాణలో సరైన నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణలో అడ్రస్ ఉండదాని నిరుపించారు. కామారెడి- గంప గోవర్థన్ 44,466, స్టేషన్‌ఘన్‌పూర్- రాజయ్య 32,63 ఓట్ల మెజారిటితో గెలిపించి త్యాగదనులకు తమ గుండెల్లో స్థానం ఉంటుందని నిరుపించారు.కొల్లాపూర్- జూపల్లి 15013 , ఆదిలాబాద్-రామన్న 31396 , నాగర్‌కర్నూల్- నాగం 27325 , కోవూరు- ప్రసన్న 23496  వోట్లతో విజయం సాధించారు, మొత్తంగా 2 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో టి డి పీ ధరావతు గల్లంతు అయ్యింది.

                                    మహబూబ్‌నగర్ అసెంబీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇబ్రహింపై 1895 ఓట్ల తేడాతో గెలుపొందారు.  మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి యెన్న శ్రీనివాస్‌రెడ్డి విజయం తెలంగాణ ప్రజల విజయమని, తెలంగాణ వాదం విజయమని కిషన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి, బీజేపీకి ఓట్లు వేసి సహకరించిన ప్రజలందరికి జేఏసీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన కళాకారులు, కార్యకర్తలు ఈ విజయంలో బాగస్వాములన్నారు. తెలంగాణ విషయంలో మోసం చేసిన వారికి తగిన బుద్ది చెప్పారని తెలిపారు.

20, మార్చి 2012, మంగళవారం

మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఎగ్జిట్ పొల్ల్స్:

ఆరా  అనే సంస్థ సేకరించిన ముందస్తు ఎన్నికల ఫలితాల ప్రకారం బి జే పి మహబూబ్ నగర్ స్థానం నుండి గెలుస్తుంది, కాని ఇతర సర్వ్ ల ప్రకారం ఈ స్థానం కూడా టి ఆర్ ఎస్ కాతలోకి వెళ్తుంది, ఆర నిర్వహించిన ఎగ్జిట్ పొల్ల్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

సాయుధ పోరాట యోధులు-ఆరుట్ల దంపతులు:


ఆరుట్ల కమలాదేవి
తెలంగాణ సాయుధ పోరాటంలో బందూకు పట్టిన వీరనారి ఆమె! తెలంగాణ సాయుధ సమరసేనాని ఆరుట్ల రామ చంద్ర రెడ్డి సతీమణే ‘ఆరుట్ల కమలాదేవి’. తండ్రి పి. వెంకట్ రామ్‌డ్డి. వీరి సొంత ఊరు నల్గొండ జిల్లా, ఆలేరు మండలంలోని మంతపురి. 1920లో ఆమె పుట్టారు. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన మేనబావ ఆరుట్ల రామ చంద్రా రెడ్డితో 11సం॥ వయసులోనే పెండ్లి జరిగింది. కమలాదేవి అసలు పేరు ‘రుక్మిణి’. అప్పట్లో పేర్గాంచిన మహిళా నాయకురాలు ‘కమలాదేవి చటోపాధ్యాయ’ స్ఫూర్తితో పెండ్లిలో రామ చంద్రా రెడ్డి, తన పేరును ‘కమలాదేవి’గా మార్చారు. భర్త ప్రోత్సాహంతో హైదరాబాద్ రెడ్డి గర్ల్స్ హాస్టల్‌లో ఆమె మెట్రిక్ వరకు చదివారు. తర్వాత చదువుకు స్వస్తి చెప్పి భర్తతో తెలంగాణ సాయుధ పోరాట కార్యరంగంలోకి దూ కారు. ఆంధ్ర మహిళా సభ, ఆర్యసమా జ్ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పనిచేసారు.

సాయుధ పోరాటంలో ‘గెరిల్లా’ శిక్షణ తీసుకున్నారు. నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రజాకారు సైన్యాలపై గెరిల్లా దళాలు చేసిన దాడుల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. చాలా రోజులు అజ్ఞాత జీవితం గడిపారు. నల్గొండ, వరంగల్, సికింద్రాబాద్ జైళ్లలో రెండున్నర సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి 1951లో విడుదలయ్యారు. 1952 నుండి 1971 వరకు ఆలేరు నియోజక వర్గానికి వరుసగా మూడుసార్లు ఎమ్.ఎల్.ఎ.గా గెలిచారు. అనేక ప్రజాసమస్యల పరిష్కారానికి ఆమె నిరంతరం కృషి చేసారు.

ఆరుట్ల రామచంద్రారెడ్డి
వెట్టి చాకిరీ చేసే మట్టి మనుషుల్ని పోరాటయోధులుగా చేసి, నియంతల గుండెలదర గొట్టిన తెలంగాణ సాయుధ సమరసేనాని ‘ఆరుట్ల రామ చంద్ర రెడ్డి’. ఈయన 1909లో భువనగిరి తాలూకాలోని కొలనుపాక గ్రామంలో జన్మించారు. హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో ఉండి, నాంపల్లి హైస్కూల్‌లో మెట్రిక్ చదివారు. 1930లో జరిగిన ‘దండి సత్యాక్షిగహం’తో ఉత్తేజితులయ్యారు. గాంధీజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచారు. 1931-33లో ఉస్మానియా యూనివర్శిటీలో చదివారు. నిజాం ఆంధ్రమహాసభల్లో క్రియాశీలక ప్రతినిధిగా పనిచేశారు. 1945లో పాలకుర్తి కుట్ర కేసులో అరెస్టయి హైదరాబాద్ సెంట్రల్ జైలులో ఒక సంవత్సరం ఉన్నారు. తెలంగాణ పోరాట సమయంలో, 1947లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మొదటి గెరిల్లా శిక్షణ తరగతికి హాజరయ్యారు. ఈ శిక్షణ తర్వాత బందూకు పట్టుకొని సాయుధ పోరాటంలో సాగిపోయారు. ఈ పోరాట సమయంలో పోలీసులకు పట్టుబడి 1952 జనవరి వరకు నిర్బంధంలో ఉన్నారు.

1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల పార్టీ టికెట్ లభించలేదు. అయినా, నల్లగొండ జిల్లాలోని 14 శాసనసభ స్థానాలకు, 2 పార్లమెంట్ స్థానాలకు సి.పి.ఐ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేష కృషి సలిపారు. 1962లో సి.పి.ఐ పార్టీ తరఫున భువనగిరి నియోజక వర్గ ఎమ్.ఎల్.ఎ.గా గెలిచి, ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేశారు.


12, మార్చి 2012, సోమవారం

మల్లినాథ సూరి



తెలంగాణకు చెందిన మహాకవులలో మల్లినాథ సూరి ఒకరు. పంచ కావ్యాలను వారు సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. మెదక్ జిల్లాలోని కొలిచాల పస్తుతం కొల్చారం) గ్రామం ఆయన జన్మస్థలం. 16వ శతాబ్ధంలో పేద బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన పశువుల కాపరిగా పనిచేస్తున్న సమయంలోనే తిరుమలయ్య గుట్టలో ఓ సాధువు స్ఫూర్తితో వేదాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే పంచ కావ్యాలుగా చెప్పుకునే రఘువంశం, మేఘసందేశం, హర్షవైష్ణము, మాఘకావ్యం, కుమార సంభవంతో పాటు అనేక సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించారు. 

రాచకొండ రాజ్యాన్ని పరిపాలించిన సింగభూపాలుడు సూరిని మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించారు. వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదుతో పాటు అనేక సంస్థానాల్లోనూ ఆయన సన్మానాలు పొందారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనూ కొంతకాలం మల్లినాథ సూరి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.ప్రస్తుతం మెదక్ జిల్లాలోని కొల్చారంలో ఆయన నివసించిన ఇంటిని ఎవరూ పట్టించుకోక పోవడంతో శిథిలమై పశువుల పాకగా మారింది. మరోవైపు గ్రామంలో ఏర్పాటు చేస్తామన్న ఆయన విగ్రహం విషయంలో అంతే నిర్లక్షం ప్రదర్శిస్తున్నారు. ఆ విగ్రహాన్ని వీధిలో వదిలి వేయడంతో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ ప్రజాప్రతినిధుల నిర్లక్షానికి అద్దం పడుతోంది.

7, మార్చి 2012, బుధవారం

చిన్న రాష్ట్రాలే శరణ్యం!

భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ పర్యటించినా ఫలితం దక్కలేదు..! ఇందిరమ్మ పోలికలున్న ప్రియాంక కలిసి ఓటర్లు నమ్మలేదు..! సాక్షాత్తు సోనియాగాంధీ దిగివచ్చినా వారు జైకొట్టలేదు..! దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరవూపదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బతగిలింది. అతిపెద్ద రాష్ట్రంలో ఆ పార్టీ నాలుగో స్థానానికే పరిమితమైంది..! ఒక్క ఉత్తరవూపదేశ్‌లోనే కాదు.. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు, గుజరాత్, బీహార్, మధ్యవూపదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ వంటి చోట్ల కూడా ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. చిన్న రాష్ట్రాల్లో మాత్రం గెలుపోటములు ఊరిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్ బతికిబట్టకట్టాలంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనివార్యమని ఆ పార్టీ నేతలు అభివూపాయపడుతున్నారు.

పార్టీ బలం ఉందని చెప్పుకోదగ్గ ఒకే ఒక్క పెద్ద రాష్ట్రం ఆంధ్రవూపదేశ్‌లోనూ రాబోయే ఎన్నికల్లో పరాభవం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ సెగకు చిత్తుకావాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. సీమాంవూధలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ హవా సాగుతుందని, ఇక తెలంగాణలో ‘ప్రత్యేక’ మాటెత్తకుంటే పార్టీ బతకడం కష్టమని అధిష్ఠానానికి విజ్ఞప్తులు వెల్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి పార్టీని కాపాడాలని ఆ నేతలు కోరుతున్నారు. నానాటికీ పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు పట్టు సడలుతున్నది. పెద్ద రాష్ట్రాల వల్ల జాతీయ స్థాయిలో పార్టీకి భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించడం లేదని కాంగ్రెస్ నేతలు అభివూపాయపడుతున్నారు. తాజాగా వెలువడిన ఉత్తరవూపదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. 

ఆయా రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధికారాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఆంధ్రవూపదేశ్ మినహా మిగతా పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ జీరో స్థాయికి పడిపోయిందనే నిజాన్ని నమ్మక తప్పదని పార్టీ నేతలు కొందరంటున్నారు. ఒకప్పుడు ఉత్తర్‌వూపదేశ్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ పరువు కాపాడుకునే పనిలో పడింది. భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న యువనేత రాహుల్ గాంధీ లాంటి నాయకుడు యూపీలో ఎంత శ్రమించినా కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోయారు. రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంక, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా విస్తృతంగా పర్యటించినా వారి చరిష్మా అక్కడ తేలిపోయింది. కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా చేరుకోలేక పోవడం గమనార్హం. ఆర్‌ఎల్‌డీ పార్టీ పొత్తుతో గతంలో కంటే ఈ సారి కొన్నిసీట్లు అధికంగా సాధించినా, నాల్గో స్థానానికే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సొంత బలంతో పోటీ పడితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పెద్దరాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం ముందు చతికిలపడుతూనే ఉంది. యూపీ సంగతి ఇలా ఉంటే ఇక బీహార్‌లో సైతం గత ఎన్నికల్లో రాహుల్ పర్యటించినా ఆ పార్టీ గౌరవ ప్రదమైన స్థానాలు దక్కించుకోలేకపోయింది. తమిళనాడు, గుజరాత్, మధ్యవూపదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ గత ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. ఇప్పటివరకు ఆ పార్టీకి గట్టి పట్టు ఉన్న పెద్ద రాష్ట్రాలు అంటూ ఉంటే ఆంధ్రవూపదేశ్ ఒక్కటే..! ఇక్కడ కూడా తెలంగాణ దెబ్బకు పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పని పరిస్థితి నెలకొందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

తెలంగాణ ప్రకటించకుంటే అంతే..!
తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయకుండా 2014 ఎన్నికలకు వెళితే ఆంధ్రవూపదేశ్‌లో కూడా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికైనా యూపీ ఫలితాలతో కళ్లు తెరవాలని పార్టీ సీనియర్లు కొందరు హైకమాండ్‌కు సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీమాంవూధలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని, ఆ రెండు పార్టీలే నువ్వా, నేనా అనేరీతిలో దూసుకొచ్చే అవకాశాలుంటాయని, కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమని పార్టీ నేతలకు లోలోపల భయం వెంటాడుతున్నది. సీమాంవూధలో కాంగ్రెస్‌కు ఎలాగో కలిసొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం ద్వారా తెలంగాణలోనైనా కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చని ఆ పార్టీ నేతలు హైకమాండ్‌కు సూచిస్తున్నారు. తాజా ఫలితాలు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ అధికారంలో రావాలంటే కాంగ్రెస్‌కు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్న రాష్ట్రాలు కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్ర విభజనతో పాటు మిగతా పెద్ద రాష్ట్రాలను సైతం విభజిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ఎంతో ప్రయోజనం ఉంటుందనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో చిన్న చిన్న రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ పార్టీకి ఓటమి ఎదురైనా స్వల్ప తేడాతోనే అన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రాష్ట్రాలతోనే ఇటు రాష్ట్రాల్లో అధికారంతో పాటు లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సాధించే అవకాశం తప్పనిసరిగా ఉంటుందని టీ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

                    నమస్తే తెలంగాణా నుండి...