హోం

7, మార్చి 2012, బుధవారం

చిన్న రాష్ట్రాలే శరణ్యం!

భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ పర్యటించినా ఫలితం దక్కలేదు..! ఇందిరమ్మ పోలికలున్న ప్రియాంక కలిసి ఓటర్లు నమ్మలేదు..! సాక్షాత్తు సోనియాగాంధీ దిగివచ్చినా వారు జైకొట్టలేదు..! దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరవూపదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బతగిలింది. అతిపెద్ద రాష్ట్రంలో ఆ పార్టీ నాలుగో స్థానానికే పరిమితమైంది..! ఒక్క ఉత్తరవూపదేశ్‌లోనే కాదు.. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు, గుజరాత్, బీహార్, మధ్యవూపదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ వంటి చోట్ల కూడా ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. చిన్న రాష్ట్రాల్లో మాత్రం గెలుపోటములు ఊరిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్ బతికిబట్టకట్టాలంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనివార్యమని ఆ పార్టీ నేతలు అభివూపాయపడుతున్నారు.

పార్టీ బలం ఉందని చెప్పుకోదగ్గ ఒకే ఒక్క పెద్ద రాష్ట్రం ఆంధ్రవూపదేశ్‌లోనూ రాబోయే ఎన్నికల్లో పరాభవం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ సెగకు చిత్తుకావాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. సీమాంవూధలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ హవా సాగుతుందని, ఇక తెలంగాణలో ‘ప్రత్యేక’ మాటెత్తకుంటే పార్టీ బతకడం కష్టమని అధిష్ఠానానికి విజ్ఞప్తులు వెల్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి పార్టీని కాపాడాలని ఆ నేతలు కోరుతున్నారు. నానాటికీ పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు పట్టు సడలుతున్నది. పెద్ద రాష్ట్రాల వల్ల జాతీయ స్థాయిలో పార్టీకి భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించడం లేదని కాంగ్రెస్ నేతలు అభివూపాయపడుతున్నారు. తాజాగా వెలువడిన ఉత్తరవూపదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. 

ఆయా రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధికారాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఆంధ్రవూపదేశ్ మినహా మిగతా పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ జీరో స్థాయికి పడిపోయిందనే నిజాన్ని నమ్మక తప్పదని పార్టీ నేతలు కొందరంటున్నారు. ఒకప్పుడు ఉత్తర్‌వూపదేశ్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ పరువు కాపాడుకునే పనిలో పడింది. భావి ప్రధానిగా ప్రచారంలో ఉన్న యువనేత రాహుల్ గాంధీ లాంటి నాయకుడు యూపీలో ఎంత శ్రమించినా కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోయారు. రాహుల్‌తో పాటు ఆయన సోదరి ప్రియాంక, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూడా విస్తృతంగా పర్యటించినా వారి చరిష్మా అక్కడ తేలిపోయింది. కనీసం ప్రతిపక్ష స్థానానికి కూడా చేరుకోలేక పోవడం గమనార్హం. ఆర్‌ఎల్‌డీ పార్టీ పొత్తుతో గతంలో కంటే ఈ సారి కొన్నిసీట్లు అధికంగా సాధించినా, నాల్గో స్థానానికే కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సొంత బలంతో పోటీ పడితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పెద్దరాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం ముందు చతికిలపడుతూనే ఉంది. యూపీ సంగతి ఇలా ఉంటే ఇక బీహార్‌లో సైతం గత ఎన్నికల్లో రాహుల్ పర్యటించినా ఆ పార్టీ గౌరవ ప్రదమైన స్థానాలు దక్కించుకోలేకపోయింది. తమిళనాడు, గుజరాత్, మధ్యవూపదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ గత ఎన్నికల్లో ఎదురుగాలి వీచింది. ఇప్పటివరకు ఆ పార్టీకి గట్టి పట్టు ఉన్న పెద్ద రాష్ట్రాలు అంటూ ఉంటే ఆంధ్రవూపదేశ్ ఒక్కటే..! ఇక్కడ కూడా తెలంగాణ దెబ్బకు పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పని పరిస్థితి నెలకొందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

తెలంగాణ ప్రకటించకుంటే అంతే..!
తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయకుండా 2014 ఎన్నికలకు వెళితే ఆంధ్రవూపదేశ్‌లో కూడా కాంగ్రెస్ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికైనా యూపీ ఫలితాలతో కళ్లు తెరవాలని పార్టీ సీనియర్లు కొందరు హైకమాండ్‌కు సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీమాంవూధలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని, ఆ రెండు పార్టీలే నువ్వా, నేనా అనేరీతిలో దూసుకొచ్చే అవకాశాలుంటాయని, కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమని పార్టీ నేతలకు లోలోపల భయం వెంటాడుతున్నది. సీమాంవూధలో కాంగ్రెస్‌కు ఎలాగో కలిసొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం ద్వారా తెలంగాణలోనైనా కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చని ఆ పార్టీ నేతలు హైకమాండ్‌కు సూచిస్తున్నారు. తాజా ఫలితాలు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ అధికారంలో రావాలంటే కాంగ్రెస్‌కు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్న రాష్ట్రాలు కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్ర విభజనతో పాటు మిగతా పెద్ద రాష్ట్రాలను సైతం విభజిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ఎంతో ప్రయోజనం ఉంటుందనే వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో చిన్న చిన్న రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ పార్టీకి ఓటమి ఎదురైనా స్వల్ప తేడాతోనే అన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రాష్ట్రాలతోనే ఇటు రాష్ట్రాల్లో అధికారంతో పాటు లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సాధించే అవకాశం తప్పనిసరిగా ఉంటుందని టీ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

                    నమస్తే తెలంగాణా నుండి... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి