హోం

29, ఏప్రిల్ 2013, సోమవారం

బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు..!



విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ ఉక్కు కర్మాగారం సాధించుకున్న విషయం ఆంధ్ర పెత్తందారులు అప్పుడే మరిచి పోయినట్టున్నారు. కేజీ బేసిన్ గ్యాస్‌పై మాకు హక్కు లేదా అంటూ అరిచి గీ పెట్టిన నిన్నమొన్నటి విషయం కూడా మరిచి పోయినట్టు చాలా గొప్పగా నటిస్తున్నారు! ఇప్పుడు ఈ పెద్దమనుషులకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టమని అడుగుతున్న తెలంగాణ వారిలో ప్రాంతీయ సంకుచితత్వం కనబడుతున్నది! బయ్యారం ఖనిజం జాతీయ సంపద కనుక ఆంధ్ర ప్రాంతానికి తరలించవచ్చని కూడబలుక్కుని నీతులు చెబుతున్నారు.విశాఖ ఉక్కు, కేజీ బేసిన్‌గ్యాస్ తమ హక్కని చేస్తున్న ఆంధ్ర పెద్దల వాదన కన్నా బయ్యారం ఉక్కు మా హక్కు అని తెలంగాణ జనం చేస్తున్న నినాదంలో న్యాయం ఉన్నది, నీతి ఉన్నది.
             విశాఖ పట్నంలోని ఉక్కు ఫ్యాక్టరీ జాతీయ పరిక్షిశమ అనీ, అది మనందరిదీ అనీ, దానికి బయ్యారం ఖనిజాన్ని తరలించడంలో తప్పులేదని ముఖ్యమంత్రి అంటున్నారు. నిజాని కి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎవరిదనే ప్రశ్న తెలంగాణ వారు అడగడం లేదు. విశాఖ పట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని కోరే హక్కు ఆంధ్రవారికి ఎంత ఉన్నదో, ఖనిజం పుష్కలంగా లభిస్తున్న బయ్యారంలో తమకు కూడా ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని కోరే హక్కు తెలంగాణ వారికి అంత ఉన్నది. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రతిపాదన గతంలో ఉన్నదే.
         తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకుండా మా నోరు కొట్టే హక్కు మీకెవరిచ్చారు అని స్థానికులు అడుగుతున్నారు. ఆంధ్ర పెద్దలు వల్లిస్తున్న నీతి సూత్రాల ప్రకారం-కేజీ బేసిన్ గ్యాస్ కూడా జాతీయ సంపద. కానీ ఈ గ్యాస్‌లో రాష్ట్రానికి వాటా ఉండాలని 2009 ఆగస్టులో అసెంబ్లీలో అధికారపతిపక్షాలు పోటీపడి మాట్లాడలేదా? ఇదే నెలలో రాష్ట్ర ఎంపీలు సహజవాయువులో తమ రాష్ట్రానికి హక్కు ఉందంటూ పార్లమెంటులో గొడవ చేసినప్పు డు ఆంధ్ర పత్రికలు పంచరంగుల్లో ముద్రించలేదా? ఆనాడు ఆంధ్ర ఎంపీలతో పాటు తెలంగాణ సభ్యులు కూడా గొంతు కలపలేదా? అదే తెలంగాణ వారు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని అడిగినప్పుడే ఖనిజం జాతీయ సంపద అనే విషయం గుర్తుకు వస్తున్నదా! 
           బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నారనే వింత (ఖ)‘నిజా’న్ని కొందరు ఆంధ్ర నాయకులు, మీడియా పెద్దలు ప్రచారంలో పెట్టారు. ఆంధ్ర పెత్తందారులు ఇటువంటి అతి తెలివితోనే ఇంత కాలం తమను మోసపుచ్చారనేది తెలంగాణ ప్రజలకు తెలుసు కనుకనే ఈ ‘నిజా’న్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొదటి దశలో బయ్యారంలో బెనిఫికేషన్ ప్లాంట్ పెడతారట! తద్వారా శుద్ధిచేసిన ఖనిజాన్ని ఆంధ్రలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తరలిస్తారట. ఆ తరువాత కాలంలో అసలు ఉక్కు కర్మాగారం బయ్యారంలో పెడతారట! 1956లో విలీనం సందర్భంగా ఆంధ్ర ప్రభువులు ఇచ్చిన హామీల చిట్టాలు తెరిచి చూస్తే, ఆ తరువాత జరిగింది గమనిస్తే ఈ (ఖ)‘నిజం’ అనేకరూపాల్లో కనిపిస్తుంది! తెలంగాణ వారికి హామీల కాగితాలు ఉంటాయి. ఆంధ్రకు వనరులు, నిధులు తరలిపోతాయి! ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే కేంద్ర, రాష్ట్ర పాలకుల ‘రహస్య అధ్యాయం’ అమలు జరుగుతూ ఉంటుంది. పెద్ద మనుషుల ఒప్పందం, ఎస్సార్సీ నివేదిక, ప్రాంతీయ మండలి... ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడు చిన్నదవుతుంది.
                610 జీవో సీమాంధ్ర నుంచి తెలంగాణ వారిని పంపించడానికి పనికి వస్తుంది కానీ, తెలంగాణ నుంచి స్థానికేతరులను పంపడానికి పనికి రాదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్ళు పారించుకోవడానికి కాలువలు సన్నగా ఉంటాయి. దశాబ్దాలు గడిచినా కాలువలు పెద్దగ తవ్వరు. పోలవరం ప్రాజెక్టుకు అనుమతి రాకముందే కాలువలు తవ్వుతరు. భూగోళం ఏమూలన కానీ ప్రాజెక్టులు కట్టకముందే కాలువలు తవ్విన వింత ఉన్నదా! ఈ పెద్ద మనుషుల మాట నమ్మి-ఇప్పుడు బయ్యారంలో కాలుష్యాన్ని చిమ్మే శుద్ధి ఫ్యాక్టరీని నెత్తిల పెట్టుకుని అసలు ఖనిజాన్ని ఆంధ్ర ప్రాంతంలోకి తరలించాలట. భవిష్యత్తులో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామనే హామీ కాగితాన్ని పట్టుకుని తెలంగాణ జనం గంతులేయాలట! ఉక్కు ఫ్యాక్టరీ హామీకి నేదునూరు విద్యుత్కేంద్రం గతే పడుతుందని తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే ఆ హామీలు కాదు, అసలు ఉక్కు ఫ్యాక్టరీ కావాలనే అడుగుతున్నారు. 

      విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు అడుక్కున్నారో, దానికి ఖనిజం ఎక్కడి నుంచి తెద్దామనుకున్నారో, ఆ పోరాటానికి ప్రాతిపదిక ఏమిటో తెలంగాణ ప్రజలు ప్రశ్నించడం లేదు. ఈ ఫ్యాక్టరీకి ఒడిషా నుంచి ఖనిజం వస్తున్నదని, వారు కూడా ఇదే విధంగా అభ్యంతరం చెబితే ఎలా అని ఒక ఆంధ్ర పెద్ద మనిషికి ధర్మసందేహం వచ్చింది. అది జాతీయ పరిక్షిశ మ అని వీరే అంటున్నప్పుడు ఆ సరఫరా సంగతి కేంద్రమే చూసుకుంటుంది కదా? మరి వీరికి ఎందుకు కడుపు నొప్పి అని అడిగితే సమాధానం ఏమని ఇస్తారు? ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడంవల్ల తమ ప్రాంతం లబ్ధి పొందాలని, తమ ప్రాంతం వారికి ఉద్యోగాలు రావాలని వారు భావించినట్టే ఇప్పుడు తెలంగాణ ప్రజలు భావించడంలో తప్పేమిటి? అయినా జాతీయ సంపద అని చెబుతున్న విశాఖ ఉక్కులో తెలంగాణ ఉద్యోగులు మూడు శాతం మాత్రమే అని లెక్కలు నిర్ధారిస్తున్నాయి. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనేది కదా ఇక్కడి ప్రజల కోరిక.
         కేజీ బేసిన్‌గ్యాస్‌ను గుజరాత్ సంస్థ బిడ్డింగ్ ద్వారా సాధించుకున్నది. గుజరాత్‌కు ఆంధ్ర వనరులను దోచుకున్న చరిత్ర ఏమీ లేదు. ఖనిజ వనరులు జాతీయ సంపద అని తెలంగాణ వారికి చెబుతున్న నీతిని ఆంధ్ర పెద్దలు గుర్తుంచుకుంటే, గుజరాత్ సంస్థకు గ్యాస్ తరలింపును వ్యతిరేకించడానికి ప్రాతిపదిక ఏమీ ఉండదు. కానీ తెలంగాణ వనరుల దోపిడీ కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఆంధ్ర పాలక వర్గ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తున్నది. తమ వనరులు పరాయి ప్రాంతానికి తరలిపోకుండా తెలంగాణ జనం పోరాడుతున్నారు. బయ్యారం పోరాటానికి ఇటువంటి న్యాయమైన నేపథ్యం ఉన్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఉత్త హామీ ఇచ్చి ఉక్కును తరలించాలని చూస్తున్నారనేది వాస్తవం. అయినా ఇదేమీ సత్యం కానట్టు, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు డిమాండ్ అసంబద్ధమైనట్టు నీతి పలుకులు పలకడం ఆశ్చర్యంగా ఉన్నది.

తెలంగాణ ఉద్యమం ఇంత బలంగా సాగుతున్నా లెక్క చేయకుండా బయ్యారం గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి కట్టబెట్టడం ఆంధ్ర పాలకుల వలస దురహంకారానికి నిదర్శనం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇక్కడి ప్రజలను కూడా సంప్రదించక పోవడం అప్రజాస్వామికం. కనీసం రాజకీయపక్షాలను కూడా సంప్రదించలేదు. ప్రభుత్వ నిర్ణయం- తెలంగాణ వనరులను ఇట్లనే దోచుకుంటాం, ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ఉద్యమకారులను అవహేళన చేసినట్టుగా ఉన్నది.
           విశాఖ ఉక్కు కర్మాగారానికి ఐదువేల హెక్టార్లకు పైగా ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ వేల హెక్టార్ల ఖనిజ నిల్వలు అన్నీ తెలంగాణ ప్రాంతంలోనివే కావడం దిగ్భ్రాంతికరం. ఖమ్మంజిల్లా బయ్యారంలో 2500 హెక్టార్లు, వరంగల్ జిల్లా గూడూరు ప్రాంతంలోనిది మరో 2500 హెక్టార్లు కాగా మిగతా 342 హెక్టార్లు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి ప్రాంతంలోనిది. తెలంగాణ ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఖనిజం తరలించడం కన్నా ఇక్కడే పరిక్షిశమ ఎందుకు పెట్టకూడదు? ముడి ఖనిజంతో పాటు పరిక్షిశమకు అవసరమైన భూమికి కొదువ లేదు. పక్కనే గోదావరి నది ఉన్నందు వల్ల నీటికి ఇబ్బంది ఉండదు. పరిక్షిశమకు అవసరమైన బొగ్గు కోసం సింగరేణి గనులే ఉన్నాయి! గనుల ప్రాంతంలోని వ్యవసాయ భూములు కోల్పోయి నిర్వాసితులు అయ్యేది తెలంగాణ జనమైతే, ఖనిజం మరో ప్రాంతానికి తరలించడమేమిటి? ఇక్కడే పెడితే స్థానికులకు వేలాది ఉద్యోగాలు లభిస్తాయి.
        పరోక్షంగా ఇంకా అనేక మంది లబ్ది పొందుతారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో 12 వందల కోట్ల రూపాయలతో ఉక్కు కర్మాగారం నిర్మించనున్నట్టు గతంలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ప్రకటించింది కూడా. స్థానికంగా ఉన్న హంగులతో పాటు మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ ఉక్కు కర్మాగార నిర్మాణం గిట్టుబాటవుతుందనేది స్థిరపడిన అభివూపాయం. రాష్ట్ర ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే దీనిని పూర్తి చేయించడానికి కృషి సాగించాల్సింది. ఈ గనులను సింగరేణి కాలరీస్‌కు అప్పగించినా ఉక్కు కర్మాగార నిర్మాణం చక్కగా సాగేది. కానీ ఇక్కడి గనులను ఆంధ్ర పెత్తందారుకు కట్టబెట్టడానికో, లేదా ఆంధ్ర ప్రాంతానికి తరలించుకు పోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నది. 
           తెలంగాణ ప్రజల వనరులు ఇక్కడి ప్రజలకు న్యాయంగా దక్కాలని, ఇక్కడి ప్రజల హక్కులు గౌరవించాలని సీమాంధ్ర పాలకులు ఏనాడూ భావించలేదు. బయ్యారం గనులను కొల్లగొట్టడానికి కుట్ర పన్నడం ఇది మొదటిసారి కాదు. వైఎస్ ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడే మొదలైంది. 2009 ఎన్నికలకు ముందు వైఎస్ బంధువు అయిన బ్రదర్ అనిల్‌కు బినామీ సంస్థగా చెబుతున్న రక్షణ స్టీల్స్‌కు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం డొంక దారిని ఎంచుకున్నది. గిరిజనుల ప్రాంతంలోని గనులను ఇతరులకు కేటాయించకూడదు. అదే ప్రభుత్వ రంగ సంస్థ అయితే ప్రాధాన్యం లభిస్తుంది. ఈ లొసుగును ఆసరాగా తీసుకుని రక్షణ స్టీల్స్‌కు కేటాయించడానికి కుట్ర జరిగింది. ఇందు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ గనులను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు రిజర్వు చేయాలంటూ కేంద్రాన్ని కోరింది.
           కేంద్ర నిర్ణయం జరగకముందే- ఈ ఖనిజాభివృద్ధి సంస్థ రక్షణ స్టీల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఖనిజాన్ని తవ్వితీయడం వరకే ఖనిజాభివృద్ధి సంస్థ బాధ్యత. ఆ తరువాత దానిని రక్షణ స్టీల్స్‌కు అప్పగించాలె. అంటే చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఖనిజాన్ని దోచుకోవడమే. బయ్యారం గనులను రక్షణ స్టీల్స్‌కు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ జనం పోరాడారు. జనం అడ్డు చెబుతారని తెలసి కూడా ఇప్పుడు మళ్ళీ ఇవే గనులను నిర్లజ్జగా ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి కుట్ర మొదలైంది. స్థానికంగా ఉక్కు కర్మాగారం నిర్మించే ప్రతిపాదన గతంలో వచ్చినప్పుడు, దానిని ముందుకు తీసుకుపోకుండా ఆంధ్ర ప్రాంత పెత్తందారులకు లేదా సంస్థలకు కట్టబెట్టాలనుకోవడం వివక్షే. ఖనిజం నుంచి ఇతర నిరర్థక పదార్థాన్ని విడదీసే బెనిఫికేషన్ ప్లాంట్‌ను స్థానికంగా నెలకొల్పి ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించే ఆలోచన కూడా ఉన్నది. దీని వల్ల స్థానికులకు కాలుష్యం దక్కుతుంది తప్ప ప్రయోజనం ఏమీ ఉండదనే విమర్శలు ఉన్నా యి. అందువల్ల తెలంగాణలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడమే సముచితంగా ఉంటుంది. 
               ప్రపంచ వ్యాప్తంగా భూమి పుత్రులు తమ వనరుల రక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా వనరుల పరిరక్షణ అనేది కీలకమైన అంశం. ఇక్కడి భూమి, అడవులు, నీళ్ళు, గనులు మొదలైన వనరుల పరిరక్షణ కోసం ఎవరికి తోచిన రీతిలో వారు ఉద్యమాలు సాగిస్తూనే ఉన్నారు. సీమాంధ్ర పాలక వర్గం మాత్రం తెలంగాణ వనరులు స్థానికులకు దక్కకుండా చేస్తూ కుట్ర పూరితంగా కొల్లగొడుతున్నారు. ఉదాహరణకు బొగ్గు ఇక్కడ లభించినా విద్యుత్ కేంద్రాలను ఇక్కడ నిర్మించడం లేదు. మన కండ్ల ముందే బొగ్గు తరలిపోతున్నది. జనం ఉద్యమిస్తుండగానే నీళ్ళ తరలింపు సాగుతున్నది. మరోవైపు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
           నిజాం కాలం నాడే సింగరేణి బొగ్గు గనుల ఆధారంగా పరిక్షిశమలు పెట్టి, ఈ ప్రాంతాన్ని ‘మాంచెష్టర్ ఆఫ్ ఇండియా’గా అభివృద్ధి చేయాలనే పథకం ఉండేది. కానీ సీమాంధ్ర పాలనలో ఎన్టీపీసీ, బొగ్గు గనుల్లోనే తెలంగాణ విద్యావంతులకు చోటు లేకుండా పోయింది. తెలంగాణ కార్మికులు ఆంధ్ర అధికారుల చేత వేధింపులకు గురవుతున్నారు. నిజాం కాలం నాటి పరిక్షిశమలన్నీ మూత పెట్టారు. ఇప్పుడు ఇనుప ఖనిజాన్ని తరలించడానికి కుట్ర సాగుతున్నది. ప్రకృతి సంపద సమృద్ధిగా ఉన్న తెలంగాణ పండ్ల గంప వంటిది. ఇక్కడి వనరులను స్థానిక ప్రయోజనాల కోసం వినియోగిస్తే తెలంగాణ బిడ్డలు పొట్ట తిప్పలు పడుతూ బొంబాయి, దుబాయి వలస పోయే దుర్గతి పట్టదు. తెలంగాణ ప్రజలు తమ వనరులపై తమకే హక్కు ఉందని పోరాడడం మినహా మార్గాంతరం లేదు.

            తెలంగాణ ఉక్కు ఈప్రాంత ప్రజల హక్కు. ఈ ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నప్పటికీ కష్టాలను, నష్టాలను భరిస్తూ సైతం ఉపాధి కోసం ఆరాటపడే పరిస్థితి ఏర్పడింది.ఉత్తర తెలంగాణలో ఓపెన్‌కాస్టు బొగ్గుబావులు, ఇప్పుడు వచ్చే ఇనుప ఖని జం గనులు ఉద్యోగాలు మాత్రం రావు. కానీ మిగిలేది జీవన విధ్వంసమే. అందుకే ఈ ప్రాంత ప్రజానీకం తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నారు.వలస పాలకుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. అపారమైన ఇనుప ఖనిజ సంపద తెలంగాణలో ఉన్న ది. దాన్ని తరలించుకుపోవడానికి సీమాంధ్ర ప్రభు త్వం జీవో జారీ చేసింది. ఆ జీవోను రద్దు చేసి తెలంగాణలోనే స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. ఇక్కడి వనరులు ఇక్కడనే ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి.
           సీమాంధ్ర ప్రభుత్వం ఓపెన్‌కాస్టు బొగ్గుబావుల మాదిరిగా ఈ ఐరన్‌ఓర్ గనులను తవ్వి పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించడానికి కుట్రలు మొదలుపెట్టిం ది.ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం 5342 హెక్టార్ల నుంచి ఇనుప ఖనిజ సంపదను తీసుకెళ్లి...ఈ ప్రాంతాలలో దాదాపు 18 వేల ఎకరాలలో పంటలు పండకుండా మరో 50కి పైగా గ్రామాలలో, గూడాలలో విధ్వంసం సృష్టించడానికి ప్రభుత్వం సిద్ధమైందిపకృతి కనికరిస్తే పడి లేస్తూ బతుకుతున్న తెలంగాణ జీవనంలో మరింత విషం పోయడానికి పాలకులు కుట్రలు చేస్తున్నారు..పెల్లెట్, బెనిఫికేషన్ ఫ్యాక్టరీలు నాలుగేండ్ల లోపు ఏర్పాటు చేయడం, ఆ తరువాత ఖమ్మం జిల్లాలోనే స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం లాంటి హామీలను ప్రభుత్వం ఇచ్చింది. విశా ఖ ఉక్కు జాతీయ కర్మాగారమని, దానికో సాకు చెప్పి నాలుగేండ్లలో పెద్ద ఎత్తున దాదాపు 200 సంవత్సరాలకు ఉక్కు ఫ్యాక్టరీ గనుక తెలంగాణలో (ఖమ్మం జిల్లా లో) ఏర్పాటు చేస్తే జీవితకాలం ఉండే పరిస్థితి ఉండ గా దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా ఓపెన్‌కాస్టు బొగ్గు బావులనుంచి ఎలాగైతే బొగ్గును సీమాంవూధకు తరలించుకుపోతున్నారో అదే పద్ధతులలో ఇనుప ఖనిజాన్ని తరలించుకుపోవాలని చూస్తున్నది. 
             ఉక్కు ఫ్యాక్టరీ కనుక ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తే దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. భవిష్యత్తులో కాంట్రాక్టు, పర్మినెంట్ కార్మికులు కలిపి దాదాపు 25 వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ అవకాశం లేకుండా పెల్లెట్, బెనిఫికేషన్ ఫ్యాక్టరీల పేరి ట నాలుగు వేల మందికి ఉపాధి దొరుకుతుందని నమ్మ బలికి ఇక్కడి సంపదను తరలించుకుపోయే కుట్రకు తెర లేపారు. దీనివల్ల కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఎడారిలా మారే అవకాశం ఉంటుం ది. ఓపెన్‌కాస్టు గనుల వల్ల భూములు కోల్పోయిన ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. వారికి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఇప్పుడు ఈ ఇనుప ఖనిజం వల్ల దాదాపు 50 గ్రామాల మీద ప్రభావం ఉంటుంది. వేలాది ఎకరాలలో పంటలు దెబ్బతింటా యి.
         వేలాదిమంది తినే కంచాన్ని గుంజుకుని వారి ముందు విధ్వంసాన్ని వదిలి వెళ్ళినట్టు పరిస్థితి కానుం ది. దీనికితోడు గిరిపువూతులకు తోడు నీడగా ఉండే వేలా ది హెక్టార్ల అడవి నాశనం కానున్నది. ఒక బయ్యారం విషయంలో వాస్తవాలను మరుగున పెట్టుకుంటూ కేవలం పెల్లెట్ లాంటి చిన్న ప్లాంట్‌లను తెలంగాణకు పడేస్తే సరిపోతుందనే యావలో ప్రభుత్వం ఉన్నట్లు కన్పిస్తోంది. ఈనేపథ్యంలో కొనసాగుతున్న ఉద్యమం లో ప్రతి ఒక్క తెలంగాణవాది కలిసి రావాల్సిన అవసరం ఉందని, ఉద్యమంలో తెలంగాణ ప్రాం త రాజకీయ పార్టీలన్నీ పార్టీలకతీతంగా కలిసి రావాలి. బయ్యారం, గూడూరు, భీమదేవరపల్లి ఉక్కు తెలంగా ణ హక్కు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభుత్వ ఇచ్చిన జీవో రద్దు చేసే వరకు, వనరులున్న చోటే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాల్సిందే.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి