హోం

3, ఏప్రిల్ 2013, బుధవారం

రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష రైతు దిగాలు..



 రాష్ట్రంలో ద్రాక్ష పళ్ళ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో నేడు ద్రాక్షతోటలు కనుమరుగవుతున్నాయి, కీసర మండలంలో గతంలో ఒక వెలుగు వెలిగిన ద్రాక్షతోటలు నేడు ఒక్కసారిగా కంటికి కనబడకుండా పోతున్నాయి. రైతన్నలు వేల ఎకరాల్లో సాగుబడిచేసిన ద్రాక్షతోటలు నేడు పదుల స్థానాల్లోకి విచ్చేశాయి. నియోజకవర్గంలోనే మండలం ద్రాక్షతోటలకు ప్రధాన నిలయంగా ఉండేది. మండలంలోని కుందన్‌పల్లి గ్రామంలో ద్రాక్షతోటలను సాగుబడి చేసిన ఇక్కడి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంచరించి రైతులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేశారు. రానురాను ద్రాక్షతోటలు మండలంలో కనుమరుగవడానికి రైతులకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందకపోవడంతో పాటు కూలీల రేట్లు, మందుల రేట్లు విపరీతంగా పెరగడంతో ద్రాక్ష రైతులు ఈ తోటల మీద అసక్తి రోజురోజుకు సన్నగిల్లుతుంది. ద్రాక్షతోటలు సాగుబడిచేసిన రైతులు ఆ పంటలను కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ తోటల విషయంలో ఏమైన ఆశ్రద్ధ వహిస్తే తగిన నష్టం వాటిల్లక తప్పదు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల కంటే కీసర మండలమే ద్రాక్షతోటలకు ప్రధాన వేధికగా ఉండేది. పలు ప్రాంతాల నుంచి పలువురు రైతులు మండలానికి విచ్చేసి రైతులు సాగుబడిచేసిన ద్రాక్ష తోటలను పరిశీలించి ఇక్కడి రైతుల నుంచి పలు సూచలను తీసుకొని వేరే ప్రాంతాల్లో సాగుబడి చేసుకోనేవారు. రానురాను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడి రైతులు ఉన్న ద్రాక్షతోటలను తీసివేసి దానిస్థానంలో పందిరి కూరగాయలను సాగుబడి చేసే పంటల మీద అసక్తిని చూపిస్తున్నారు. 

రోజురోజుకు తరిగిపోతున్న ద్రాక్ష తోటల దిగుబడి:
ఈ సంవత్సరం మండలంలో ద్రాక్ష తోటల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. మండలంలోని పలు గ్రామాల్లో సాగుబడే చేసే రైతుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోధుమకుంటలో వంగేటి మల్లాడ్డి 7 ఎకరాలు, కుందన్‌పల్లి గ్రామంలో చిత్తార్ల వెంక 15 ఎకరాల్లో, కీసర మండల కేంద్రంలో 10 ఎకరాలు, చీర్యాల్ గ్రామంలో 10 ఎకరాలు, కరీంగూడ గ్రామంలో 8 ఎకరాలు, తిమ్మాయిపల్లి గ్రామంలో ద్రాక్షతోటలను సాగుబడి చేస్తున్నారు. గతంలో వేల ఎకరాల్లో ఉన్న ఈ తోటలు పడిపోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఒక ఎకరాలో ద్రాక్షతోటలను సాగుబడి చేయాలంటే రైతులకు కనీసం రూ.60 వేల నుంచి రూ.70 వేల రూపాయల ఖర్చు అవుతుంది. రైతులకు తలకుమించిన భారంగా ఖర్చులు ఎక్కువ కావడంతో ఈ తోటల నుంచి చాల మంది రైతులు తప్పుకున్నారు.        
         గత సంవత్సరం 28 గ్రోమార్ రూ.250 ఉంటే నేడు రూ.1250, డీఏపీ గత సంవత్సరం రూ.350 ఉంటే నేడు రూ.1500, ఎస్‌ఓపీ పోటాష్ గత సంవత్సరం రూ.500 ఉంటే నేడు రూ.1750 ధరలు రైతుల మీద తీవ్రంగా మోపడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు స్ప్రే మందుల ధరలు కూడ విపరీతంగా పెరిగాయని పలు గ్రామాలకు చెందిన రైతులు దిగాలు పడుతున్నారు. దీంతో వేల ఎకరాల నుంచి వందల ఎకరాల వరకు సాగుబడులు ఒక్కసారిగా పడిపోయాయని పలువురు రైతులే పేర్కొంటున్నారు. కూలీల కొరతతో పాటు భూగర్భజలాలు ఒక్కసారిగా అడిగంటిపోవడంతో రైతుల పరిస్థితుల రోజురోజుకు ఆగమ్యగోచరంగా మారిపోయాయి.
గతంలో ఆకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన ద్రాక్షతోటలు కూడా నీటిమునిగిపోవడంతో ద్రాక్షరైతులు ఒక్కసారిగా భయపడిపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా చాల తోటలు మట్టిపాలు కావడంతో సంవత్సరం వరకు కంటికిప్పలా కాపాడి ఒక్కసారిగా చేతికొచ్చిన పంట కళ్ళ  ముందే ధ్వంసం కావడంతో రైతులు ఒక్కసారిగా దిగాలు పడ్డారు. అప్పట్లో ప్రభుత్వం కూడా ప్రకృతి వైపరీత్యాల్లో దెబ్బతిన్న రైతాంగానికి ప్రభుత్వం తగిన రీతిలో నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు పడ్డ అవస్థలు వర్ణానుతీతంగా ఉన్నాయి. 
బ్యాంకుల్లో పేరుకుపోయిన అప్పులు:
ద్రాక్షతోటలను సాగుబడిచేసిన రైతన్నలకు ప్రతి సంవత్సరం బ్యాంకుల అప్పులు కట్టకపోవడంతో ప్రతి సంవత్సరం బ్యాంకు రుణాలు కాస్తా తడిసి తడిసి మోపడు కావడంతో రైతుల పరిస్థితులు రోజురోజుకు దుర్భరంగా మారిపోతున్నాయి. ద్రాక్షతోటలంటే భయపడే స్థితిలో రైతులు ఉన్నారు. ద్రాక్షతోటలను సాగుబడిచేసిన చాలమంది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సకాలంలో కట్టక ఉన్న భూములను తక్కువకు అమ్ముకొని బ్యాంక్ రుణాలను కట్టిన దుస్థితి మండలంలోని పలు గ్రామాల్లో నెలకొంది.                                                                            -నమస్తే తెలంగాణా నుండి.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి