హోం

23, డిసెంబర్ 2011, శుక్రవారం

భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు మన పివి..!!


భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావుపీవీ (P V Narasimha Rao, PV) గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
తొలి జీవితం: ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్లు జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ లు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండీ పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్నఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడు ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు [1].స్వామి రామానంద తీర్థబూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందాడు.
రాష్ట్ర రాజకీయాల్లో పివి:1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.

ముఖ్యమంత్రిగా

ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు.
తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.
కేంద్ర రాజకీయాల్లో పివి:తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.

లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం

మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980 - 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.

ప్రధానమంత్రిగా పీవీ

ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా.

పీవీ విజయాలు

  • పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవథలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
  • పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
  • కాశ్మీరు తివ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
  • ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
  • 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు.

    పీవీపై విమర్శ

    పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.
    • 1994 లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
    • 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయన ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
    • ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
    • సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు. ( ఇది చాలా తప్పు అభిప్రాయం. ఆయన ప్రధాన మంత్రి పదవిలో ఉండగా ఎన్నడూ, ఎప్పుడూ, ఎవరినే దగ్గిరికి దరిచేరనివ్వలేదు. ఎందుకంటే ఆయన పదవిని, ఆయన సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని లబ్దిపొందుతారని ఆయన భయం. అయితే ఎవరిని నొప్పించే స్వభావం కానందువల్ల ఆయన పేరు వాడుకోవడం వల్ల ఆ అభిప్రాయం ఏర్పడింది)  
    •  అవినీతి ఆరోపణలు:ఐదేళ్ళ పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలని పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుండి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయన్ని వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది.
    •  ఆయన ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు:
      • జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు: పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000 సెప్టెంబర్ 29 న పీవీని ఈ కోసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి పూర్వ ప్రధానమంత్రి, పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
      • సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు: 1989 లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీ తో విభేధించి, ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన వి.పి.సింగ్ ను అప్రదిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎకౌంటు తెరిచిన కేసది.
      • లఖుభాయి పాఠక్ కేసు: లఖుభాయి పాఠక్ అనే పచ్చళ్ళ వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకై పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చానని ఆరోపించాడు.
      పై మూడు కేసుల్లోను పీవీ నిర్దోషిగా పై కోర్టులు తీర్పిచ్చాయి. ఈ మూడూ కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్‌కేసుల్తో పీవీకి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి నిరాధారాలని తేలింది.
      సాహితీ కృషి:రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషి గా ఇది తెలుగులోకి అనువాదమయింది. ఆయన రచనలు:
      • సహస్రఫణ్విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీవీ కి లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
      • అబల జీవితంపన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.
      • ఇన్‌సైడర్: ఆయన ఆత్మకథ. ఇది వివిధ భాషల్లోకి అనువాదమయింది.
      • ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు
      ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995 లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది[6].
      తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశ్యం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
      పివి విశిష్టత:

      • బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడిక్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.
      • పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన. పీవీ చివరిరోజుల్లో ఒకసారి ఆయన్ను కలిశాను. మాటలమధ్య... 'మీ మీద పుస్తకం రాయబోతున్నాను' అని చెస్తే 'నువ్వన్నా రాయవయ్యా, నా గురించి జనానికి నిజం తెలుస్తుంది' అన్నారు నీరసంగా నవ్వి. ఆయన్ని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధవేసింది.--కె.విజయరామారావు (ఈనాడు8.11.2009)
      • ఆయన దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు.ఆగ్రహాన్ని దాచేవారు.శాసనసభలో, లోక్ సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవి చూచారు.
      • కల్యాణీ శంకర్ జర్నలిస్టుగా పి.వి.కి బాగా దగ్గరైంది. ఒక సందర్భంలో ఆమెను పక్కన కూర్చుండపెట్టుకుని తిరుపతిలో కల్యాణమహోత్సవంలో కూడా పాల్గొన్నారు.
      • పి.వి. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్.ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. ఆ ఖ్యాతి పి.వి.కి దక్కాలి. మరొకవైపు బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది.పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది.సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి.                                                 
      • తొలి తెలంగాణా ప్రదాని ఐన పివి సరిగ్గా ఏడు సంవత్సరాలక్రితం ఈ రోజే తుది శ్వాస విడిచారు, నేడు ఆయన వర్ధంతి. తెలంగాణా ప్రజలు తమకు ఆయన ఏమి చేయ్యలదనే కోపంతో ఉన్న దేశం గర్వించదగ్గ ప్రధాని అని ఆయన గొప్పదనాన్ని తెలుసుకోవాలి, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు బలైన పివి చిరస్మరణీయుడు....                                                       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి