హైద్రాబాద్ రెవిన్యూ – నిజా నిజాలు:
‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది.
‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై రూపమే ‘హైద్రాబాద్ సెంటిమెంటు.’ రాష్ట్ర ఆదాయంలో హైద్రాబాద్ నుండి వచ్చే ఆదాయమే 50 శాతం అని కొందరు చెబుతుంటే మరి కొందరు 70 శాతం అని చెబుతున్నారు. ఇంత ఆదాయాన్ని కోల్పోతే సీమాంధ్ర ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం కూడా కష్టం అవుతుందని అనేకమంది బలంగా వాదిస్తున్నారు. దానితో ఉద్యోగులు భయాందోళనలతో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇస్తూ అందులో పాల్గొంటున్నారు.
రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇంత పిచ్చి పనికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందా? ఇందులో వాస్తవాలు విచారించడం అవసరం. రాష్ట్ర విభజన సందర్భంగా అయినా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాల పైన చర్చ జరగడం ఒక ఆహ్వానించదగిన పరిణామం కాగా, ఆ చర్చ ఆరోగ్యకరమైన రీతిలో కాకుండా అపోహలతో, విద్వేషపూర్వక వాతావరణంలో జరగడం దురదృష్టకరం!
కొన్ని అంశాలు చూద్దాం.
1..రాష్ట్రాల ఆదాయం ప్రధానంగా పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం పన్నుల ఆదాయంలో వాటా, గ్రాంట్ ఇన్-ఎయిడ్ ల మొత్తం.
2. విభజన ప్రభావం కేంద్ర పన్నుల వాటా, పన్నేతర ఆదాయం (ప్రభుత్వ భూముల అమ్మకంపై వచ్చే ఆదాయం), గ్రాంట్-ఇన్-ఎయిడ్ లపైన ఉండదు. పైగా సీమాంధ్రలో కొత్త రాజధాని వల్ల రియల్ ఎస్టేట్ ఆదాయం పెరుగుతుంది కనుక పన్నేతర ఆదాయం పెరుగుతుంది. హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోతుంది గనక ఆ ఎరకు తెలంగాణ పన్నేతర ఆదాయం తగ్గుతుంది.
3. విభజన ప్రభావం ఉండేది రాష్ట్ర పన్నుల ఆదాయం పైనే.
4. అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపులు & రిజిస్ట్రేషన్, వాహన పన్ను... ఇవే రాష్ట్ర పన్నుల ఆదాయంలో ప్రధానం (98 శాతం). ఇవి జిల్లాల్లోనే వసూలవుతాయి గనక విభజన తర్వాత ఎవరివి వారికే చెందుతాయి.
5. 2003-06 మధ్య కాలంలో గ్రేటర్ హైద్రాబాద్ సగటు సాంవత్సరిక పన్నుల ఆదాయం 7,704 కోట్లు అని, రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఇది 37 శాతం అని అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య గారు శాసనసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆగస్టు 28, 2013).
6. 2012-13 లో రాష్ట్ర పన్నుల ఆదాయం 66,021 కోట్లు.
7. రోశయ్య గారు చెప్పినట్లు ఇందులో 37 శాతం అంటే 24,428 కోట్లు.
8. గ్రేటర్ హైద్రాబాద్ అంటే హైద్రాబాద్ నగరం మాత్రమే కాదు. ఇందులో 54 లక్షల జనాభా నివసించే హైద్రాబాద్ తో పాటు సంగారెడ్డి, భువనగిరి మునిసిపాలిటీలు, 849 అర్బన్ గ్రామాలు కూడా ఉన్నాయి. వీటి జనాభా 19 లక్షలు. ఇవి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోనివి.
9. ఈ పన్నుల ఆదాయం కూడా మొత్తం హైద్రాబాద్ కి చెందినవి కాదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమ్మకాలు జరిపే కంపెనీలు హైద్రాబాద్ లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే రాష్ట్ర వ్యాపితంగా అమ్మకాలు జరిపినా, పన్ను (APGST) మాత్రం హైద్రాబాద్ డివిజన్ లో కడతారు.
10. రాష్ట్రం విడిపోయాక ఆయా కంపెనీలు హైద్రాబాద్ లోనే కొనసాగితే అవి సీమాంధ్రలో జరిపే అమ్మకాలు అంతర్రాష్ట్ర అమ్మకాలు అవుతాయి. కాబట్టి వాటిపైన కేంద్ర పన్నులు ఉంటాయి తప్ప తెలంగాణ రాష్ట్ర పన్నులు కాదు.
11. కంపెనీలు తమ రిజిష్ట్రేషన్ ను సీమాంధ్ర రాజధానికి మారిస్తే అవి తెలంగాణలో జరిపే అమ్మకాలపై కూడా కేంద్ర పన్నులు వర్తిస్తాయి తప్ప సీమాంధ్ర రాష్ట్ర పన్నులు కాదు.
12. కంపెనీలు తమకు ఏ పన్నులు తక్కువో బేరీజు వేసుకుంటాయి. కేంద్ర పన్నులా, తెలంగాణ పన్నులా లేక సీమాంధ్ర పన్నులా... ఇందులో ఏది తక్కువో తేల్చుకుని ఆ మేరకు రిజిస్ట్రేషన్ మార్చుకుంటాయి. కొత్తగా వచ్చే సీమాంధ్ర రాష్ట్రం తగిన సౌలభ్యం కల్పిస్తే ప్రాంతంతో సంబంధం లేకుండా కంపెనీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయాల్ని మార్చుకుంటాయి.
13. కాబట్టి కొత్తగా వచ్చే ఇరు రాష్ట్రాలు కేంద్రంతో చర్చలు జరిపి తగిన రాయితీలు తెచ్చుకోడానికి పోరాడాలి తప్ప తమలో తాము తగువు పడడం సరికాదు. రాష్ట్ర విభజన వలన అదనపు రెవిన్యూ ఆదాయం ద్వారా లబ్ది పొందేదీ కేంద్రమే తప్ప తెలంగాణ కాదని ఇక్కడ అర్ధం అవుతోంది.
14. పైగా సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పడే క్రమంలో అక్కడ ఉత్పాదక కార్యకలాపాలు వేగం అవుతాయి. అంటే జి.డి.పి వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కొత్త రాష్ట్రానికి పన్నుల ఆదాయం కూడా వేగంగా పెరుగుతుంది. ప్రారంభంలో కొన్నేళ్లపాటు సీమాంధ్ర రాజధానిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి అయితే, హైద్రాబాద్ లో పడిపోతుంది. అనంతరం స్ధిరీకరణ చెందుతుంది.
15. సీమాంధ్రకు 973 కి.మీ పొడవైన సముద్ర తీరం ఉంది. దేశంలో గుజరాత్ తర్వాత సీమాంధ్ర కోస్తా తీరమే పొడవైనది. దీన్ని అభివృద్ధి చేసుకుంటే బోలెడంత రెవిన్యూ. రామాయపట్నం రేవుకి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి అనుబంధంగా అనేక వ్యాపారాలు జరుగుతాయి. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.
16. హైద్రాబాద్ ఐ.టి ఉద్యోగాలు మిస్ అవుతాయనీ, ఆ ఉద్యోగాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా కోల్పోతామని కొందరు చెబుతున్నారు. ఆ లెక్కన బెంగుళూరులోనూ తెలుగువారు అత్యున్నత ఐ.టి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఆదాయం మనకే రావాలని అడగొద్దా? మద్రాసు, ఢిల్లీ నగరాల్లోనూ తెలుగువారు ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికా, ఐరోపాల్లోనూ చేస్తున్నారు. అక్కడి ఆదాయాల్లో వాటా వద్దా? ఎద్దు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నట్లు ఈ వాదన ఉంటుంది. సీమాంధ్ర రాష్ట్రంలో ఆదాయాలు పెంచుకునే మార్గం చూడడం మాని వాళ్ళ ఆదాయం మనకి కావాలనడం అన్యాయం కాదా?
17. విభజన వల్ల ఒక తరం నష్టపోతుందని ఎ.పి.ఎన్.జి.ఓ నేత చెబుతున్నారు. అంటే ఆ తర్వాత తరాలకు నష్టం ఉండదు అన్న అంగీకారం ఇందులో ఉంది. కానీ 60 యేళ్లుగా (అంటే మూడు తరాలా?) నీళ్ళు, ఉద్యోగాలు లేక తెలంగాణ జనం ఎదుర్కొన్న నష్టం మాటేమిటి?
-విజయశేఖర్ గారు
' జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ' బ్లాగ్ నుంచి
శ్రీ విజయ శేఖర్ గారికి నమస్కారములు! తాము తెలిపినవి అక్షర సత్యాలు. వాళ్ళు దోచుకోవడానికే ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు గాని, మన ఆత్మగౌరవం ఏం పట్టించుకుంటారు? మనం ఏమైనా సరే, కలిసుందామనే అంటారు. ఎద్దు పుండు కాకికేం బాధ కలిగిస్తుంది?
రిప్లయితొలగించండినే నీక్రింది పద్యాలు రాసి, నా బ్లాగులో ప్రచురించాను. మీ అభిప్రాయం తెలుపగలరు. నా బ్లాగు చిరునామా: ratnaalaveena.blogspot.in (నా తెలంగాణ కోటి రత్నాల వీణ)
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-
నా తెలంగాణ కోటి రత్నాలవీణ...
వీణను మీటి జాతి తెలివిం దగఁ బెంచఁగఁ గోరి, యీ తెలం
గాణము మా దటంచు నవకావ్యము వ్రాసియుఁ దెల్గువారిలోఁ
బ్రాణము నింపి, "దాశరథి" పాటు లవెన్నియొ పొంది, తెల్గు మా
గాణమునందుఁ గ్రొత్త మొలకల్ మొలిపించెను దేశభక్తితో! (1)
నిన్నటి యాంధ్ర రాష్ట్రమును నిర్మితిఁ జేసినవారె మా తెనుం
గన్నలు గోరినట్టి తెలగాణను స్వార్థవిమోహ బుద్ధులై
యన్నును మిన్నుఁ గానక మహాంధ్ర కవుంగిలిఁ జేర్చ, నేఁడు నా
ల్గున్నర కోట్ల తెల్గులకుఁ గొంపలు గాలె స్వరాష్ట్ర హీనతన్! (2)
ఆలన పాలనన్ మఱచి, యాంధ్ర ప్రదేశపు మంత్రు లెందఱో
కాలముఁ బుచ్చుచుండఁ దెలగాణము వెన్కఁబడెన్ గదా! విప
త్కాలము దాపురించె! సరదాలను మాని తెనుంగులార! యీ
నేలయు నింగియున్ మొరయ నిక్కపు భక్తిని జాటి వెల్గుఁడీ! (3)
అదిగదిగో తెలుంగు జను లాకసమంత విశాల చిత్తులై
పద పద మంచు మీ యెదను భక్తి సుమాలను బాదుకొల్పెడిన్
ముద మొనఁగూడు కైతలను బొంగులు వారు ప్రయత్నయుక్తితోఁ
బదములు పాడి, పిల్చి రిఁకపై గెలువం దెలగాణ రాష్ట్రమున్! (4)
నాయక ముఖ్యు లెందఱొ ప్రణాళికలన్ రచియించి, రాష్ట్రమున్
న్యాయ పథాన వేగముగ నందఁగ నెంచి, సభల్ విరాజిలన్
జేయు వచో విజృంభణ విశిష్టతలన్ వెలయించి, తెల్గులన్
వేయి విధాల నాదుకొన వేచియు నుండిరి రండురం డిఁకన్! (5)
"నా తెలగాణ! కోటి రతనమ్ముల వీణ" యటంచుఁ బల్కి, తా
నేతగ నుండి, పోరి, చెఱ నిల్చి, "నిజాము పిశాచమా! మహా
భూతమ!" యంచుఁ బిల్చి, మన పూర్వపుఁ దెల్గుల విల్వఁ బెంచు ధీ
దాతయు, శక్తి యుక్తుఁ డగు "దాశరథి" త్వర మార్గదర్శియౌ! (6)
....ధన్యవాదాలతో..
భవదీయుడు,
గుండు మధుసూదన్,
వరంగల్.