తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని విలీనానికి ముందే విస్పష్టంగా చెప్పిన వ్యక్తి ఫజల్ అలీ. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌కు ఆయన నేతృత్వం వహించారు. ఈ కమిషన్ 1955లో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై నివేదిక ఇస్తూనే ఆంధ్ర, తెలంగాణ విలీనంపై తన అభివూపాయాలను ఫజల్ అలీ విస్పష్టంగా చెప్పారు. విశాలాంధ్ర అనుకూలవాదనలు సహేతుకంగా, బలంగా ఉన్నప్పటికీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వినిపించిన వాదనలు అంత తేలికగా కొట్టిపారేయగలిగినవికావని తేల్చారు. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి వేరుపడి కొత్త రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఫజల్ అలీ ప్రస్తావించారు. తెలంగాణతో పోల్చితే ఆంధ్ర ఆదాయం తక్కువని, తెలంగాణలో భూమిశిస్తు రూపంలో లభించే ఆదాయం ఎక్కువగా ఉండటంతో పాటు.. ఎక్సైజ్ ఆదాయం ఏటా రూ.5కోట్ల మేర లభిస్తున్నదని తెలిపారు. ఆంధ్రతో విలీనం జరిగితే తమ వనరులను కొల్లగొట్టుకుపోతారని తెలంగాణవాదులు ఆనాడే చెప్పారు. ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘‘పైకి ఎలాంటి అభ్యంతరాలు ప్రకటించినా, ఆంధ్ర-తెలంగాణలను కలపడం వల్ల తమ స్థిరాదాయ వనరులను ఆంధ్రతో పంచుకోవాల్సి వస్తుందని, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఆ డబ్బును అభివృద్ధి పథకాలపై ఖర్చు పెట్టవచ్చునని కొందరు తెలంగాణ నాయకులు భయపడుతున్నట్లు కనిపించారు. తెలంగాణ ఆంధ్ర కంటే అభివృద్ధి పథంలో ఉంది కనుక, పరిపాలనా దృక్కోణం నుంచి చెప్పాలంటే ఆంధ్ర-తెలంగాణ ఏకీకరణవల్ల తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి లాభం ఉండదన్న అభివూపాయం వ్యక్తమైంది’’ అని ఆయన తన నివేదికలో పేర్కొనడం విశేషం. విలీనం నాటి నుంచి తెలంగాణ ప్రాంతం బావుకున్నది ఏమీ లేదు. పైగా అనేక రంగాల్లో తెలంగాణ వనరులు దోపిడీకి గురవుతూనే ఉన్నాయి.
జల వనరులు, అభివృద్ధి పథకాల విషయంలో తెలంగాణవాదులు ఆనాడే భయాందోళనలు వ్యక్తం చేశారు. తెలంగాణలో పరీవాహక ప్రాంతాలు ఉన్న కృష్ణా, గోదావరి నుంచి నీళ్లను ఆంధ్ర ప్రాంతం పట్టుకెళుతుందని భావించారు. వీటిపై ఫజల్ అలీ కమిషన్ ఇలా పేర్కొంది.. ‘‘విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి పథకాల్లో తెలంగాణ ఆకాంక్షలకు తగిన ఆదరణ లభించకపోవచ్చన్న భయం ఈ ప్రాంతంవారిలో వ్యక్తమైంది. ఉదాహరణకు తెలంగాణలోని నందికొండ, కుష్టాపురం (గోదావరి ) ప్రాజెక్టులు తెలంగాణలోనే కాక, దేశం మొత్తం తలకెత్తుకున్న అతిముఖ్యమైన ప్రాజెక్టులలో చేరుతాయి. ఈ రెండు నదుల డెల్టాలలో ఇరిగేషన్ అభివృద్ధికి పథక రచన జరుగుతోంది. కనుక కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఇప్పుడున్న తన స్వతంత్ర హక్కులను వదులుకోవటానికి తెలంగాణ సుముఖంగా లేదు’’ అని పేర్కొన్నారు.
ఆంధ్రతో విలీనం అయితే ఇక్కడి ఉద్యోగాలన్నీ కొల్లగొట్టుకుపోతారని నాడు వ్యక్తం చేసిన భయాలు నేడు వాస్తవరూపంలో కనిపిస్తున్నాయి. దీనిపై ఆనాడే ఫజల్ అలీ వ్యాఖ్యానిస్తూ ‘‘విద్య, ఉద్యోగాలలో అభివృద్ధిచెందిన కోస్తా ప్రజలు విద్యాపరంగా వెనుకబడిన తమను ముంచెత్తుతారని, తమ ప్రయోజనాలను కొల్లగొడతారనే తెలంగాణ ప్రజల భయానుమానాలు కూడా విశాలాంధ్ర పట్ల వ్యతిరేకతకు గల ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ వెలుపల, తెలంగాణ జిల్లాలు విద్యలో దారుణంగా వెనుకబడి ఉన్నాయి. ఫలితంగా ఆంధ్ర వారికంటే తక్కువవిద్యార్హతలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వోద్యోగాలలోకి తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్న అసలు భయం ఏమిటంటే తాము ఆంధ్ర ప్రజలతో పోటీ పడలేని స్థితిలో ఉంటామని, ఇటువంటి భాగస్వామ్యంలో పెద్ద భాగస్వామి అన్ని ప్రయోజనాలను తక్షణమే హస్తగతం చేసుకోగలుగుతుందని, చివరకు దూసుకుపోయే స్వభావం కలగిన కోస్తా ఆంధ్రులకు తెలంగాణ వలసగా మారిపోతుందనే.’’ అని ఫజల్ అలీ పేర్కొన్నారు. నాటి భయాలకు అనుగుణంగానే ఆంధ్ర వలస ప్రాంతంగా తెలంగాణ మారింది.
సొంత రాష్ట్రంగానే ఉంటే ఆర్థికంగా తెలంగాణ తనకు తానే సంఘటితమైన, లాభసాటి పాలనా విభాగంగా ఉండగలదన్న వాదన ముందుకు వచ్చిందని ఎస్సార్సీ నివేదిక పేర్కొంది. ‘‘ఈ ప్రాంతపు రెవెన్యూ ఆదాయం 17 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు డబ్బు సమకూర్చాలి కనుక అది కొత్త రాష్ట్రంపై వడ్డీరూపంలో అదనపు ఆవృత భారాన్ని మోపే మాట నిజమేకానీ, తద్వారా ఏర్పడబోయే లోటు పెద్దగా ఉండకపోవచ్చు. అనుకూల పరిస్థితుల్లో రెవెన్యూ బడ్జెట్‌లో స్వల్పంగా మిగులూ తేలవచ్చు. ఈఆశావహ జోస్యాన్ని రకరకాల కారణాలతో వివరించవచ్చు, సమర్థించవచ్చు’’ అని ఫజల్ అలీ అభివూపాయపడ్డారు.
హైదరాబాద్ రాష్ట్రం గురించిన ప్రస్తావన భాగంలో ఫజల్ అలీ ఇలా పేర్కొన్నారు. తెలంగాణ విశాలాంవూధలో భాగం కాదల్చుకుంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తగిన ఏర్పాట్లకు సమ్మతించడానికి ఆంధ్ర రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నట్లు మాకు అవగతం అయింది. ఈ ఏర్పాట్లు (రాయలసీమ, కోస్తా ఆంధ్రల మధ్య జరిగిన శ్రీబాగ్ ఒప్పందం తరహాలో) ప్రభుత్వోద్యోగాల్లో మూడవ వంతు అవకాశాలను అంటే ఇంచుమించు జనాభా దామాషా- తెలంగాణవారికి కల్పించడానికి, తెలంగాణ ప్రాంత అభివృద్ధి పథకాలపై ప్రత్యేక దృష్టిని పెట్టడానికి హామీ ఇచ్చే రూపంలో ఉండవచ్చు’’.
ప్రస్తుతం తెలంగాణ ఏర్పాటుకు బదులు రాజ్యాంగ రక్షణలన్న వాదనను కూడా అప్పుడప్పుడు సీమాంధ్ర మేధావులు లేవనెత్తుతుంటారు. అయితే.. ఇవి పని చేయవన్న అభివూపాయాన్ని ఫజల్ అలీ నాడే వ్యక్తం చేశారు. ఈ విషయంలో కమిషన్ ఇలా పేర్కొంది.. ‘ఈ తరహాలో చేయగల ఏర్పాట్ల గురించిన వివరాలను మేం జాగ్రత్తగా పరిశీలించాం. శ్రీబాగ్ ఒప్పందం తరహాలో కానీ, బ్రిటిష్ ‘స్కాటిష్ డివల్యూషన్’ తరహాలో రాజ్యాంగపరమైన ఏర్పాట్లు పనిచేయబోవనీ, లేదా తెలంగాణ అవసరాలకు సరిపోవని మాకు అనిపించింది.’
అప్పటి ఆర్థిక, రాజకీయ, పాలనా పరిస్థితుల్లో తెలంగాణ-ఆంధ్ర విలీనానికి ఫజల్ అలీ అయిష్టత చూపారు. దీనికి నిదర్శనంగా నిలుస్తాయి ఈవ్యాఖ్యలు... ‘‘...ఆంధ్ర రాష్ట్రం ఇటీవలే అవతరించింది. కొత్త రాష్ట్రానికి ఎదురయ్యే ఇబ్బందుల నుంచి అది ఇంకా బయటపడేలేదు.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపడటంలో ఎదురైన సమస్యలను ఇంకా పూర్తిగా పరిష్కరించుకోలేదు. ఈ దశలో తెలంగాణ, ఆంధ్ర ఏకీకరణ ఆ రెండు ప్రాంతాలకు పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని మేం ఒక నిర్ధారణకు వచ్చాం. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలి. దానిని హైదరాబాద్ రాష్ట్రంగా పిలవొచ్చు. అయితే 1961లో లేదా ఆ దరిదాపుల్లో జరిగే సార్వవూతిక ఎన్నికల తర్వాత హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండొంతుల మంది సభ్యులు సమ్మతిస్తే ఆంధ్రతో ఏకీకరణ చెందేలా అవకాశం ఉంచాలి... ప్రస్తుతానికి హైదరాబాద్ రాష్ట్రం మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, బీదర్, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో నల్లగొండ జిల్లాను ఆనుకుని ఉన్న మునగాలతో ఏర్పడాలి’’ అని ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
కానీ.. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణకు సమర్థవంతమైన నాయకత్వం కొరవడటం, కేంద్రాన్ని, స్థానిక నేతలను బురిడీకొట్టించిన ఆంధ్ర నేతల పట్టుదల కారణంగా తెలంగాణ ప్రాంతం ఆంధ్రతో విలీనమైంది. నాటి నుంచి తన సొంత అస్తిత్వం కోసం గోస పెడుతూనే ఉంది.
(from namaste telangaana)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి