పిల్లలమర్రిచెట్టు (Pillalamarri Tree) మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి యాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. మర్రిచెట్టు ప్రక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.
ఇక్కడొక మహా మర్రివృక్షం కనిపిస్తుంది. కనీసం 700 సంవత్సరాల గతానుభవాల్ని మౌనంగా వీక్షించిన ఈ ఘన వృక్షం పిల్లలమర్రికి ప్రత్యేకతను సాధించి పెట్టింది. చెట్లు సైతం రాళ్ళవలే కలకాలం బ్రతుకుతాయి సుమా! అనుకునేట్టుగా పుట్టి పెరిగి ఎదిగిపోయిన పిల్లల మర్రిని చూడడం నిజంగానే అద్బుత అనుభవం. మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రిని తప్పక చూడాలి. పిల్లల మర్రి నీడలో దర్జాగా వెయ్యిమంది కూర్చోవచ్చునన్నది నిజంగానే నిజమైన నమ్మలేని నిజం. ఈ మహావృక్షం వైశాల్యాన్ని కొలవాలంటే అడుగులు, మీటర్లు బొత్తిగా సరిపోవు. ఇది మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. మర్రికి పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇది మహావృక్షమైంది. ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. ఇక్కడొక జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, ఆక్వేరియంఉన్నాయి. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు. అందుకు అవసరమైన సౌకర్యాలున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల ఇక్కడి ఏర్పాట్లు కూడ చురుగ్గా సాగుతున్నాయి. పిల్లల కోసం ఆటస్థలం, సందర్శకులకై పురావస్తు మ్యూజియం, మినీ జూపార్క్, అక్వేరియం చూపురులకు ఆకట్టుకొంటున్నాయి.
పిల్లల మర్రి మ్యూజియాన్ని 1976 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంచారు. వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియం లో పొందుపర్చినారు. క్రీ.శ.7 వ శతాబ్ది నుంచి 15 వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలున్నాయి. రెండు వేల సంవత్సరాల కాలం నాటి మద్య రాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపర్చినారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలున్నాయి.
విహార యాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు మున్నగునవే కాకుండా, చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకొంటున్నది. పిల్లల కోసం ఆటస్థలం ఉంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉంది. పురావస్తుశాఖ, అటవీశాఖాధికారులు పిల్లలమర్రిని 1976లో తమ శాఖల పరిధిలోకి తీసుకున్నారు.పురావస్తుశాఖచే మ్యూజియం ఏర్పాటుచేయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిముంపు కారణంగా కృష్ణా నది తీరంలోని ఈర్లదిన్నె గ్రామం నీటమునగగా, 1981లో అక్కడి నుంచి రాజరాజేశ్వరీ మాత ఆలయంలోని విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకువచ్చారు. ఇక్కడ పాలరాతితో దేవాలయాన్ని నిర్మించి 1983లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్టింపచేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి