హోం

17, ఏప్రిల్ 2012, మంగళవారం

ఇంద్రవెల్లి విప్లవాల పాలవెల్లి..

ఇంద్ర మారణకాండ జరిగి ఈ ఏప్రిల్ 20కి 31 సంవత్సరాలు. అంటే, అప్పటికీ ఇప్పటికీ ఓ తరం మారింది.
ఈ మూడు దశాబ్దాల్లో ఇంద్రలో పారిన రక్తం గోదావరి, ప్రాణహిత, శబరి, ఇంద్ర నదులు దాటి అదిలాబాద్ 
indra2అడవుల నుంచి దండకారణ్యమంతా విస్తరించింది. అప్పటి విప్లవ జ్వాలలు ఇప్పుడు జంగల్ మహల్ దాకా వ్యాపించాయి. అప్పుడు పోలీస్ కాల్పులుగా ఆదివాసీల మీద ప్రారంభమైన ఈ మారణకాండ ఇప్పుడు ‘గ్రీన్‌హంట్ ఆపరేషన్’గా మారింది. రెండవ దశలో సైనిక మోహరింపు ‘మాడ్’ను మూడు వైపులనుంచీ చుట్టు ముట్టింది. సైనిక, అర్థ సైనిక, ఆక్రమణ యుద్ధ వ్యూహంగా వర్తమాన భారతదేశాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ‘రైతుకూలీ సంఘం’ ఆదివాసీల కొన్ని డిమాండ్‌ల మేరకు తలపెట్టిన నాటి సభ నుంచి ఇవ్వాళ దండకారణ్యంలో ‘క్రాంతికారి జనతన సర్కార్’ స్థాయికి ఒక ప్రత్యామ్నాయ ప్రజాపాలన స్థితి ఎదిగింది. అదిప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్గత పెను ప్రమాదంగా కొనసాగుతూనే ఉంది. సాల్వాజుడుంలు-అటువంటి మరెన్నో చట్టవ్యతిరేక అంతర్యుద్ధ కుట్రలు, గ్రీన్‌హంట్ ఆపరేషన్‌ల వరకూ -చేసిన యుద్ధ ప్రయత్నాలన్నీ ఓడిపోయాయే తప్ప విప్లవ సంకల్పాన్ని, ప్రజల పురోగమనాన్ని నిరోధించలేక పోయాయి. మరి ఇంత దావానలానికి ఇంగలమైన ఆ ఇంద్ర ఎక్కడ ఉన్నది? అక్కడ ఏప్రిల్ 20న ఏం జరిగింది? ఇంద్ర అదిలాబాద్ జిల్లా హైదరాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ పోయే రోడ్డుపై గుడి హత్నూర్ నుంచి ఉట్నూర్, లక్సెట్టిపేట రోడ్డుపై ఉంటుంది. మరొక వైపు నుంచి వస్తే హనుమకొండ నుంచి లక్సెట్టిపేట మీదుగా గుడి హత్నూర్ పోయే రోడ్డుపై కూడా తగులుతుంది. 

1981 ఏప్రిల్ 20న ఇక్కడ అదిలాబాద్ గిరిజన రైతుకూలీ సంఘం ఒక సభ జరుప తలపెట్టింది. ఆ సభ, తదనంతర పరిణామాలను మరోసారి గుర్తు చేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. 

ఒక్క ఇంద్ర మాత్రమే కాదు, ఆదిలాబాద్ ప్రధానంగా గోండు, కోలాం, పరధాన్లు, పరమేశులు మెదలైన ఆదివాసీ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్న జిల్లా అది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతమంతా ఆదివాసులే. ఇంద్ర ఒకప్పుడు 97% ఆదివాసీలు ఉండేవారు. ఈ జిల్లా మహారాష్ట్ర ప్రాంతానికి కూడా దగ్గర్లో ఉండటం వల్ల ఆ రాష్ట్రం వైపు నుంచి కూడా బంజారాలు, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి మార్వాడీలు, నీటి పట్టు ఉన్న చోట్లకు కోస్తా జిల్లాల నుంచి వచ్చిన వారు వచ్చి ఇక్కడి భూములను ఆక్రమించుకున్నారు. వడ్డీ వ్యాపారం చేశారు. అడవిని, కొండలను పోడు చేసుకొనే ఆదివాసీలు క్రమంగా లోతట్టు ప్రాంతాలకు నెట్టబడ్డారు. నిజానికి ఇక్కడివి సారవంతమైన నల్లరేగడి భూములు. ఇక్కడి గోండులు మెట్ట పంటలే కాకుండా పత్తి, జొన్న వంటి వ్యాపార పంటలను కూడా పండిస్తారు. అటవీ సంపద సరేసరి. కానీ, ఇంద్ర ఓ వ్యాపార కేంద్రంగా మారి వస్తు వినిమయంతో తప్పుడు తూకాలతో ఈ ఆదివాసీలను మోసం చేస్తూ వస్తున్నది. 
ఈ ప్రాంతంలో రాంజీ గోండు, కొమురం భీంది.

బ్రిటీష్ సామ్రాజ్యవాదులతో, నిజాం ఫ్యూడల్ నిరంకుశ పాలనతో పోరాడిన వారసత్వం. ‘మా గ్రామాల్లో మా రాజ్యం’ అని ప్రకటించి పన్నెండు గ్రామాల్లో కొమురం భీం ప్రజా అధికారాన్ని స్థాపించి జోడేఘాట్ కేంద్రంగా నిజాంతో పోరాడిందీ. ఒకవైపు ఈ పోరాట వారసత్వం నుండి మరొక వైపు 1967లో నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాటం మార్గదర్శకత్వమైంది. సన్నిహితంగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి 1978 ‘జగిత్యాల జైత్రయాత్ర’ నిర్వహించిన విప్లవకారుల నాయకత్వం లభించింది. వాళ్ళే ఎమ్జన్సీ కాలంలోనే ఈ అడవుల్లోకి పొరకల సార్లుగా ప్రవేశించారు. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత 1980లో పీపుల్స్‌వార్ ఏర్పడగా ఒక వైపు పెద్ది శంకర్, మరొక వైపు మరొక దళం మహారాష్ట్ర, బస్తర్ అడవుల్లో ఆదివాసీల మధ్య పని చేయడానికి కదిలి వెళ్ళాయి. బెల్లంపల్లి బొగ్గుగని కార్మికుని బిడ్డ అయిన పెద్ది శంకర్ ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు.

ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడు రఘుగా ప్రసిద్ధమైన నల్లా ఆదిడ్డి నాయకత్వంలో గజ్జెల గంగారాం, సాహులు సహచరులుగా విప్లవోద్యమం విస్తరించిందీ. రఘు, సాహు, గంగారాంలు ఆదివాసీ భాష నేర్చుకొని ‘జననాట్య మండలి’ పాటలను ఆదివాసీ భాషలోకి అనువదించి, వారి మధ్య పనిచేస్తూ ‘గిరిజన రైతుకూలీ సంఘం’ స్థాపించారు. ఆ గిరిజన రైతుకూలీ సంఘానికి కార్యదర్శిగా ఉన్న హనుమంతరావు నాయకత్వంలో తలపెట్టిందీ 1981 ఏప్రిల్ 20 నాటి గిరిజన రైతుకూలీ సభ. ఆ సభ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు ఇవి: v తాము పోడు చేసుకున్న భూములపై పట్టా ఇవ్వాలి. v తాము మార్కెట్‌కు తెస్తున్న పత్తి, పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. v ఇంద్ర రోడ్డు పొడవునా... సంతలో తాము అమ్ముకుంటున్న అటవీ వస్తువులను సేట్‌లు తప్పుడు తూనికలతో కొలిచి తక్కువ రేట్లతో కొని మోసపుచ్చుతున్నారు. ఈ మోసాన్ని అరికట్టి సరైన పద్ధతిని నియంవూతించాలి. 



-ఇటువంటి న్యాయపరమైన ఆర్థిక డిమాండ్‌లతో ఈ సభ తలపెట్టి అడవంతా తుడుం మోతతో ప్రచారం చేశారు. జిల్లా అంతటా విస్తృతంగా పోస్టర్లు వేశారు. అప్పుడు సి.పి.డి.ఆర్. (కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్షికటిక్ రైట్స్) ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంఘంలో ప్రముఖుడైన కోబాడ్ గాంధీ, రాడికల్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడైన లింగమూర్తి, ఎ.పి.సి.ఎల్.సి. రంగనాథం, ‘జననాట్య మండలి’ గద్దర్ ఆ సభకు ప్రధాన ఆహ్వానితులు. సభకు మొదట అనుమతించిన జిల్లా పోలీస్ యంత్రాంగం హైదరాబాద్ నుండి అందిన ఆదేశాలతో అనుమతి రద్దుచేసి ఏప్రిల్ 20న సభ జరిగే రోజు 144వ సెక్షన్ విధించింది. అప్పటికే కొండల మీద నుంచి, లోయల నుంచి, నలువైపుల నుంచి ఆదివాసీలు సభకు తరలి వస్తున్నారు. వాళ్ళకు 144వ సెక్షన్ అంటే ఏంటో తెలియదు.

ముందుగా ఎటువంటి ప్రకటనా లేదు. సభకు నలువైపులా తరలి వచ్చే ఆదివాసీలపై ఇంద్ర అంతా మోహరించిన పోలీసులు చెట్లపై నుంచి కాల్పులు జరిపారు. ఎంతమంది నేల కూలారో, ఎంతమంది గాయపడ్డారో ఇప్పటికీ లెక్కలు లేవు. రాష్ట్రస్థాయిలో, దేశ స్థాయిలో వెళ్ళిన ఎన్నో నిజ నిర్ధారణ కమిటీలు సేకరించిన సమాచారం ప్రకారం కనీసం 60 మందైనా చనిపోయి ఉంటారు. వందలాది మంది గాయపడ్డారు. మరణించిన, గాయపడిన తమ వారిని ఆదివాసీలు లోతట్టు ప్రాంతాలకు తీసుకు వెళ్ళినందున ఆసుపవూతుల్లో ఈ లెక్కలు తెలిసే అవకాశం లేదు. సంఘటన జరుగగానే హైదరాబాద్ నుంచి అప్పటి ఎ.పి.సి.ఎల్.సి. నాయకులు కన్నాభిరాన్, సి.ఆర్ రాజగోపాలన్, బిపదీప్ నాయకత్వంలో ఒక నిజ నిర్ధారణ సంఘం అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత వరంగల్‌లో రాడికల్ యువజన సంఘం మహాసభల ప్రారంభోపన్యాసానికి వచ్చిన ఢిల్లీ పి.యు.డి.ఆర్. (పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్షికటిక్ రైట్స్) ప్రముఖులు ప్రొ॥ మనోరంజన్ మహంతి నాయకత్వంలో ఒక అఖిల భారత స్థాయి నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళింది. ఇందులో ఎ.పి.సి.ఎల్.సి. నుంచి డా॥ ‘విరసం’ నుంచి కె.వి.ఆర్. కూడా ఉన్నారు. వీళ్ళు సమక్షిగమైన నివేదిక తీసుకొచ్చారు. అప్పటి ఎస్పీ ఇంతటి నిర్విచక్షణగా కాల్పులు ఎందుకు జరిపారని అడిగితే ‘బుప్లూట్లకు నియమాలు తెలియవు’ (Bullets know no rules) అన్నారు. ఈ ప్రత్యక్ష నిర్ధారణల ఆధారంగా ఆ తర్వాత కె.వి.ఆర్. ఫ్రాంటియకల్ రాశారు. 

కాగా, ఈ సంఘటన అనంతరం వి.వి.( ఈ వ్యాస రచయిత) కన్వీనర్‌గా ఇంద్ర అమరుల బాధితుల కుటుంబ సహాయ నిధి ఏర్పడింది. ఒక ఏడాది తర్వాత వి.వి. తో పాటు బాలగోపాల్, కె.సీతారామారావు జోడేఘాట్, పిప్పల్‌ధర్, పిట్ట బొంగరం, పాండుపురం మొదలైన ఆదివాసీ గ్రామాలకు వెళ్ళి మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వచ్చారు. కానీ, వెళ్ళిన వారివద్ద ఉన్న వివరాలు స్వల్పమే. కేవలం 13 మంది మృతుల పేర్లు, ఊర్లు తప్ప ఏమీ లేవు. దాంతో పెద్దగా చేయడానికేమీ లేకుండా పోయింది. 

కానీ, నాటికి నేటికీ ఇంద్ర సంఘటనను ‘జలియన్ వాలా బాగ్’ సంఘటనతో పోల్చడం, అది ప్రపంచ దృష్టికి రావడం ఒక అంశమైతే, నైతిక శక్తి దిగజారకుండా ఓటమిని విజయంగా మలచుకొని కొనసాగే ఒక గొప్ప సంకల్పాన్ని ఇంద్ర సంఘటన విప్లవకారులకు, ఆదివాసీలకు ఇచ్చింది. 

1981-85 వరకు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఇంద్ర ‘ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ సభ’ జరిగింది. ఆంధ్రవూపదేశ్ రైతుకూలీ సంఘం అధ్యక్షుడు గంజి రామారావు ఏడాది పాటు ఇంద్ర ఒక టిన్ షెడ్ వేసుకొని ఉండి పోయి, ఆదివాసీల రక్తం చిందిన చోట భూమిని కొని అమరవీరుల స్థూప నిర్మాణం చేయించాడు. అది దేశంలోనే అమరుల స్థూపాలకు తలమానికంగా ఉండాలని చైనాకు వెళ్ళి అక్కడి ‘చైనా విప్లవం’లో అమరులైన వాళ్ళకోసం ‘తియానాన్మెన్ స్కేర్’లో నిర్మితమైన స్థూపాన్ని చూసి, దాని గురించి అధ్యయనం చేసి 3 అడుగుల ఎత్తున ఇంద్ర స్థూప నిర్మాణం చేయించాడు. 1983 ఏప్రిల్ 20న దాని ఆవిష్కరణ చేయించాడు. ఆ సభలోనే సాహు, అల్లం రాజయ్యల ‘కొమురం భీం’ నవలను బాలగోపాల్ ఆవిష్కరించారు. 

1985లో మనోరంజన్ మహంతి, మురళీ మనోహర్, ఏక్‌నాథ్ సాల్వే, గద్దర్‌లు ఈ సంస్మరణ సభలకు వెళ్ళినప్పుడు పోలీసులు తుపాకులు గురి పెట్టి అరెస్టు చేశారు. 1984లో ఇంద్ర సంస్మరణ సభకు జార్జి ఫెర్నాండెజ్ వచ్చినప్పుడు వందలాది మంది పోలీసులు మోహరించారు. తిరుగు ప్రయాణంలో నిర్మల్ ఘాట్‌రోడ్డు వద్ద ఆయనా, బాలగోపాల్, వి.వి., పంకజ్ దత్‌లు ప్రయాణం చేస్తున్న కారుపై పోలీసులు రాళ్ళు దొర్లించి హత్యా ప్రయత్నం చేశారు.

1985 తర్వాత ఈనాటికి ప్రతి సంవత్సరం ఇంద్ర ఆదివాసులు అమరులైన చోట ఈ ఏప్రిల్ 20న ఆదివాసీలు, ప్రజాసంఘాలు ఎంత నిర్బంధంలోనైనా సంస్మరణ సభలు నిర్వహించుకుంటూనే ఉన్నాయి. పోలీసులు ప్రతి సంవత్సరం 144వ సెక్షన్ విధిస్తూనే ఉన్నారు. గుడి హత్నూర్ నుంచి లక్సెట్టిపేట ఇరువైపుల రోడ్లను బంధిస్తూనే ఉన్నారు.

ఈ ఇంద్ర సభ అప్పటి పరిశోధక విద్యార్థిగా ఉన్న బి.జనార్దన్‌రావును ఆ తర్వాత దేశంలోనే ఒక ప్రముఖ ఆదివాసీ జీవిత పోరాట అధ్యయన శీలిగా మార్చింది. ఈ సభలకు వక్తగా వెళుతున్న కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఆర్.ఎస్.యు. ఉపాధ్యక్షుడు లింగమూర్తితో పాటు జనార్ధన్, సీతారామరావు, ఎన్.వేణుగోపాల్‌లు కూడా ఇంద్ర వెళ్ళారు. ఇంద్ర వీళ్ళు బస్సు దిగగానే పోలీసులు అరెస్టు చేసి బంధించి, ప్రశ్నించి ఈ నలుగురిలోను కొంచెం దృఢకాయునిగా ఉన్న జనార్ధన్‌ను జేబులో చేయి పెట్టుకొని సమాధానాలు ఇస్తున్నాడని తీవ్రంగా కొట్టారు. బక్క పలుచని లింగమూర్తి ఆర్.ఎస్.యు. ఉపాధ్యక్షుడంటే నమ్మలేదు. ఆ తర్వాత అతడు పీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్నప్పుడు, నల్లమలలో కృష్ణా నదిలో (2002లో) పుట్టి మునిగి అమరుడయ్యాడు. ఆయనది కరీంనగర్ జిల్లా అంబాల.
1987లో అదిలాబాద్ జిల్లా ఆలంపల్లిలో సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై పీపుల్స్‌వార్ దళం దాడి చేసింది. అందులో 11 మంది సీఆర్‌పిఎఫ్ జవాన్లు చనిపోయారు. రామకృష్ణ అనే దళ సభ్యుడు అమరుడయ్యాడు. 

ప్రతీకారంగా మఫ్టీలో వచ్చిన పోలీసులు ఇంద్ర స్థూపాన్ని డైనమైట్ పెట్టి పేల్చివేశారు. ఎన్.టి.రామారావు ఈ ‘అదిలాబాద్ జిల్లా ఎక్కడ ఉంది? పీపుల్స్ వార్‌లోని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళతో ఎక్కడ చర్చించాలి?’ అని దూర్త అమాయకత్వాన్ని నటించి అదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పర్చడానికి కోటి రూపాయలు ప్రకటించాడు. ఆదివాసీల ఆగ్రహానికి, గాయానికి మలాం పూయడానికన్నట్లుగా మళ్ళీ స్థూపం నిర్మాణం చేయించారు. ఇప్పుడు మనం చూస్తున్న స్థూపం అదే. అయితే, అది ఇప్పుడు తెలుపు రంగులో ఉంటుంది. గత మహోన్నత శిఖరాయమాన అరుణారుణ స్థూపం కాదది. ‘కొండల్లు ఎరుపు గోగుపూలు ఎరుపు / అడవిలో అమరుల త్యాగాలు ఎరుపు’ అని రాసుకున్న ఆ స్థూపంపై చరణాలు మాత్రం ఆనాటికీ ఈనాటికీ ఆదివాసీల విప్లవకారుల ఆకాంక్షలను ఆ అడవిలో ప్రతిధ్వనింపజేస్తూనే ఉంటాయి.

ఇంద్ర మారణకాండ తర్వాత నుంచి ఇప్పటికీ వస్తున్న సాహిత్యంతో పోల్చదగినంత సాహిత్యం మరే సంఘటనపైనా వచ్చి ఉండదు. అందులో ప్రధానంగా పేర్కొనదగింది సాహు, అల్లం రాజయ్యల రచనలు. సాహు 1980ల వరకే అదిలాబాద్ ఆదివాసీల మధ్య పనిచేస్తూ గోండు భాష నేర్చుకొని ఆ భాషలో పాటలు రాశాడు. ఒగ్గు కథలు రాశాడు. ఆదివాసీల జీవిత పోరాటంపై ‘పటార్’వంటి ఎన్నో కథలు రాశాడు. ఇవన్నీ ‘సృజన’, ‘అరుణతార’ల్లో అచ్చయ్యాయి. అదిలాబాద్ ఆదివాసీల జీవితాన్ని, సంస్కృతినీ 0లలో ఆయన ఎంతో సమక్షిగంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయన క్రమంలో గజ్జెల గంగారాం అమరుడయ్యాడు. అధ్యయనం, కార్యాచరణ కారణంగా వాళ్లిద్దరినీ నల్లా ఆదిడ్డి ఎంతో ప్రోత్సహించాడు. ఒక విధంగా ఇంద్ర సంఘటన కొమురం భీంకు మళ్ళీ ప్రాణం పోసింది. 

కొమురం భీం జీవితం, పోరాటం గురించి ఆయన సమకాలీన పోరాట యోధుల నుంచి సేకరించి, ఎన్నో చరిత్ర గ్రంథాలు, దస్తావేజులు చదివి, పురాతత్వ పరిశోధనలు చదివిన ఆయన అల్లం రాజయ్యతో కలిసి ఒక క్లాసిక్ అనదగిన ‘కొమురం భీం’ నవల రాశాడు. ఆ విధంగా చూసినప్పుడు ఇది తెన్నేటి సూరి రాసిన ‘చంఘీజ్‌ఖాన్’ నవల కన్నా గొప్ప నవల. ఇవ్వాళ తెలంగాణలో మరెవరికీ లేనంతగా కొమురం భీంకు ఇంత గుర్తింపు, ఇంత ఆదరణ లభించడానికి ముఖ్య ప్రేరణల్లో విప్లవోద్యమం- ప్రత్యేక తెలంగాణ ఉద్యమం- ఆదివాసీ పోరాటాలతో పాటు ఈ ‘కొమురం భీం నవల’కు సముచిత స్థానం ఉంటుంది.
ఇంద్ర సంఘటనపై ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ అనే దీర్ఘ కవిత ద్వారానే తెలుగు సాహిత్యంలో విమల ఒక ప్రముఖ కవిగా గుర్తింపు పొందింది. 90లో ఆ పేరుతోనే ఆమె మొదటి కవితా సంకలనం వెలువరించింది. ఒక కవి రమేష్‌కి ఇంద్ర ఇంటి పేరైంది. శివసాగర్ సహచరి పార్వతి తనను ఇంద్ర ఖననం చేయాలని కోరింది. ఇంద్ర సంఘటన తర్వాత విస్తృతంగా ఆ ప్రాంతంలో తిరిగిన గద్దర్ ‘రగల్ జెండా బ్యాలె’ రచించాడు. జననాట్యమండలి ఇప్పటికీ ఎన్ని వందల సార్లు దీనిని ప్రదర్శించిందో లెక్కే లేదు. ఇంద్ర సంఘటన జరుగగానే ‘సృజన’ సమక్షిగమైన అధ్యయనంతో ప్రత్యేక సంచిక వెలువరించింది. చికాగో నగరంలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన చొక్కా ఎర్రజెండా అయినట్లుగా ఇంద్ర సంఘటన నిజ నిరూపణకు వెళ్ళిన కె.వి.ఆర్. కనుగొన్న ఆదివాసీ అమరుని వస్త్రమే ‘రగల్ జెండా’గా సృజన ముఖచివూతమైంది. 

మళ్ళీ ఇంద్ర అమరుల సంస్మరణ సందర్భంగా కూడా సృజన ప్రత్యేక సంచిక తెచ్చింది. కొమురం భీం భార్య సోను భాయి జీవితాన్ని ఆధారంగా పులుగు శ్రీనివాస్ ఓ నవల రాశాడు. భూపాల్ ప్రధాన పాత్రలో కొమురం భీంగా అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ‘కొమురం భీం’ సినిమా వచ్చింది. 92లో నిర్మితమైన ఈ సినిమా విప్లవోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, కొమురం భీం ప్రశస్తి విస్తృతంగా ప్రజల హృదయాల్లో గూడుగట్టుకున్న సందర్భంలో విడుదలయింది.

మొదట చెప్పినట్లుగా ఈ ముప్పై ఏండ్లలో ఆదిలాబాద్‌లోను, తెలంగాణలోనూ దేశవ్యాప్తంగానూ నదులు, అడవులు, లోయలు, కొండకోనలు, పల్లెలు, నగరాలలో రాజ్యం వనరుల దోపిడీ కోసం చాలా రక్తాన్ని ప్రవహింపజేసింది. ఒకప్పుడు రాజ్యాంగంలోని 5, 6 అధికరణలు గానీ, 1/70 చట్టాన్ని గానీ ఆదివాసేతరుల ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా ఉల్లంఘించిన ప్రభుత్వాలు రెండు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారమే బహుళజాతి కంపెనీల కోసం బడా కంపెనీల కోసం ఒక దళారిగా మారి చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఒకవైపు ‘పేసా’ వంటి చట్టాలు తెస్తున్నాయి. మరొక వైపు ‘ఆక్షికమించు, ఖాళీ చేయి, అభివృద్ధి పరుచు’ అనే విధ్వంస నమూనాను అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ప్రయోగిస్తున్నది. 

అదిలాబాద్ జిల్లానే తీసుకుంటే వేలాది మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసే విధ్వంసక కార్యక్షికమాలు అక్కడ జరుగుతున్నాయి. అక్షరాల ఇప్పుడక్కడ ఆకురాలు కాలాన్ని చూస్తున్నాం. కుంతాల జలపాతాన్ని పవర్ ప్లాంట్‌గా మార్చడానికి, కవ్వాల్ అడవులను పులుల అభయారణ్యంగా మార్చడానికి ప్రభుత్వం పథకాలు వేసింది. జోడేఘాట్ దగ్గర నిర్మితమైన ‘జోడేఘాట్ ప్రాజెక్ట్’ ఏ ఒక్క ఆదివాసీ దాహార్తినీ తీర్చిందీ లేదు. ఒక్క ఆదివాసీ భూమిని తడిపిందీ లేదు. పైగా ఉట్నూర్ ప్రాంతమంతా గోండు, కోలాం మెదలగు ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య విద్య, ఉద్యోగ, ఉపాధి విషయాల్లో ఘర్షణ సృష్టిస్తూ ప్రభుత్వం దాన్ని ఆదివాసీల మధ్య సమస్యగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది. న్యాయమైన వర్గీకరణ అమలు చేయకుండా ఘర్షణలు రెచ్చగొడుతున్నది.

(from namaste telangana)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి