హోం

17, జూన్ 2012, ఆదివారం

తెలంగాణా రాష్ట్ర శాస్త్రీయ నృత్యం - పేరిణి




రూప సంపన్నత, రసాను భావుకత, తాళజ్ఞత, గమకజ్ఞానం, శరీరంలో తొనికిసలాడే ధ్వని కలిగిన వారు పేరిణి నృత్యానికి అర్హులని చెబుతారు. అంటే యుద్ధం వీరత్వ భావనలు, కళ వేరు వేరు కాదు. వాటి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పిన రీతికి రామప్ప కట్టడం మూలాధారం.
                      జన పదంలో పుట్టి, వీర శైవ మతాచార నృత్యంగా మారి రామప్ప శిల్పాలలో చెక్కబడిన పేరిణి ఒక అద్భుత నృత్యం. గిరిజన మైదాన ప్రాంత నృత్య సంస్కృతికి పేరిణి మకుటాయమాన ఉదాహరణ.
రామప్ప శిల్పాలను సందర్శించి ఆ నృత్య భంగిమలను అధ్యయనం చేసి, పునఃసృష్టించిన నృత్యకళయే పేరిణి. ఇది లలిత కళా రంగంలో ఆధునిక కాలంలో మన దేశంలో జరిగిన ఒక గొప్ప విషయం. గిరిజన, జానపద, శాస్త్రీయ నృత్య రీతులకు ‘రామప్ప’ వజ్రాలు పొదిగిన అద్దం. ఆనాటి సామాజిక జీవితానికి ప్రతిరూపం. కళా సంప్రదాయ రీతులకు సజీవ డాక్యుమెం కేవలం రామప్ప రుద్రేశ్వరాలయమే కాదు, అది ఒక అధ్యయన కేంద్రం. శిల్పంలో మలిచిన దృశ్య శాస్త్ర గ్రంథం.
                         శిల్పి పేరుతో వెలసిన కట్టడం ఇంకెక్కడన్నా ఉందా! లేదు. ఉన్నా ఇంత పెద్ద నిర్మాణం అసలే లేదు. ‘జాయసేనాని’ క్రీ.శ.1253 ప్రాంతంలో నృత్య రత్నావళి రాశాడు. క్రీ.శ.1213లోనే పాలంపేటలో రుద్రేశ్వరాలయాన్ని పూర్తి చేశారు. అంటే ఆ ఆలయం కనీసం ఏభై ఏళ్ళ ముందు ప్రారంభించి ఉంటారు. తటాక నిర్మాణం, రుద్రేశ్వరాలయం కట్టడం ఒకేసారి రూపకల్పన జరిగింది. అంటే, ఆలయాన్ని నిర్మించిన రామప్ప సుమారు క్రీ.శ.1168 ప్రాంతంలోనే కట్టడం నమూనా, నృత్య భంగిమ వివరాలు, సామాజిక జీవితాంశాల వివరాలు, ఏవి శిల్పాలుగా ఉండాలో నిర్ణయించుకునే ఉంటాడు. అంటే జాయపసేనాని కన్నా ఎంతో ముందు రామప్ప స్థపతి జీవించి ఉన్నాడు. కాబటి,్ట నృత్య రత్నావళికి, రామప్ప నృత్యరీతులకు సంబంధం లేదు. పైగా రామప్ప శిల్పరీతుల వల్లే జాయప ప్రభావితుడై నృత్య శాస్త్రాన్ని రచించాడని చెప్పవచ్చు. అన్ని నృత్యశాస్త్ర గ్రంథాలలో దేశీ నృత్యాలను గురించి రాశారు. కాని, రామప్పలో జానపద, శాస్త్రీయ నృత్య రీతులను చెక్కారు. 

* ఇంతకీ పేరిణి ఏమిటి?
జాయప ‘నృత్య రత్నావళి’లోని చివరి - మూడు అధ్యాయాల్లో సుమారు పధ్నాలుగు నృత్య రీతులను పేర్కొన్నాడు. ఇవన్నీ ఆనాటి నుండి నేటి దాకా ప్రచారంలో ఉన్నవే. ఐతే కొన్ని రూపం మారాయి. మరికొన్ని పేర్లు మారాయి. కొన్ని అనామకం అయ్యాయి. పేరిణి నృత్య భంగిమలు ఆ నృత్య శాస్త్రానికి ప్రేరణగా నిలిచాయి.
నటరాజ రామకృష్ణ ఆధునిక కాలంలోని ప్రాచీన నృత్యశాస్త్ర పితామహుడు. ఆలయ నృత్యాన్ని, ఆంధ్ర నాట్యాన్ని గుర్తించి అవే అసలైన తెలుగు నృత్యాలని తేల్చి చెప్పాడు. శిలలో దాగిన పేరిణిని వేల శతాబ్దాల కింది గుడ్డు అవశేషంలోంచి రాకాసి బల్లిని పునఃసృష్టి చేసినట్లు రామప్ప రాతి శిల్పాల లోంచి తెలుగు నాట్యాన్ని సృష్టించాడు. 

నిజానికి నటరాజ రామకృష్ణ తల్లి నుండి ఆలయ నృత్యాలను అభ్యసించాడు. ఆమె వల్ల ప్రేరణ పొందాడు. కళావంతుల ఇంట్లో జన్మించిన తల్లిది నల్లగొండ జిల్లా కొలనుపాక గ్రామం.
పేరిణి నృత్యం స్త్రీలు, పురుషులు విడివిడిగాను, కలగలసి చేస్తారు. గిరిజన సమాజంలో పురుషులతో పాటుగా స్త్రీలు నాట్యం చేయడం సహజం. ఐతే రానురాను పురుషాధిపత్య మతం, సమాజం రూపొందే క్రమంలో పేరిణి పురుష నృత్యం అయ్యింది. అందుకు మరో కారణం అది వీర నృత్యం కావడమే. శైవంలో ఈనాటికీ తెలంగాణలో సజీవంగా ఉన్న కత్తుల నృత్య భంగిమలు పేరిణి నృత్యంతో అతి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.

రూప సంపన్నత, రసాను భావుకత, తాళజ్ఞత, గమకజ్ఞానం, శరీరంలో తొనికిసలాడే ధ్వని కలిగిన వారు పేరిణి నృత్యానికి అర్హులని చెబుతారు. అంటే యుద్ధం వీరత్వ భావనలు, కళ వేరు వేరు కాదు. వాటి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పిన రీతికి రామప్ప కట్టడం మూలాధారం. పేరిణి ఒక్కటే కాదు వీర శైవంలోను, ఆదివాసీ జానపద నృత్యాలు చాలావరకు ఇలాంటి స్వభావం కలిగి ఉన్నవే.
గిరిజనుల వేట విధానాన్ని తిరిగి గిరిజన సమాజంలో enact చేయడమే కళకు- ముఖ్యంగా నృత్యకళకు మూలం. ఈ స్వభావం ప్రాచీన కాలం నుండి కళని అంటి పెట్టుకుని వస్తున్న వైనం గుర్తించనప్పుడు పేరిణి వీరత్వ ప్రకటన నృత్యం అని తెలుస్తుంది.
వీరశైవ కళలు చాలావరకు ప్రజా కళలే. ప్రజలతో సంప్రదాయంగా ప్రచారంలో ఉన్నవాటిని మార్చి కొత్త ఇతి వృత్తాలతో మత, కుల, భక్తుల, గురువుల చరివూతలను రాశారు. ప్రదర్శన రీతిని కథలో, ప్రదర్శనలో వీరత్వ గమకాలను ప్రవేశపెట్టారు. అందులో ప్రేంఖణం, చిందు, కోలాటం, గొండ్లి, బహురూపి, ఘట నృత్యం వంటి జానపద నృత్యాలను పేర్కొనవచ్చు. ఈ నృత్యాలన్నీ తెలంగాణలో ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి.

జాయాప్ప పేరు జాయప అనీ, శ్రీజాయ అనీ సంస్కృతీకరించిన పేర్లు కనిపిస్తాయి. రామప్ప, జాయాప్ప ఇద్దరూ కాకతీయ రాజల కింద ఉద్యోగులు. వరంగల్ దగ్గర ములుగు రోడ్డు పక్కన ఉన్న ఏనుగుల గడ్డ వద్ద గజ సైన్యం ఉండేది. అక్కడ ఏనుగులని సంకెళ్ళతో బంధించిన బండ రాళ్ళ గుర్తులు మా చిన్నతనంలో చూశాం. అక్కడ గణపతి రుద్రదేవుడు జాయపకి గజ సాధక పదవి నిచ్చాడు. వైరి గోధూమ ఘరట్టి (శత్రువులనే గోధుమ గింజలను పిండిగా చేసే ఇసురురాయి) అనే బిరుదును కూడా ఇచ్చాడు.
ఇతను ‘గీత రత్నావళి’ అనే సాహిత్య గ్రంథం కూడా రాశాడు. ముఖ్యంగా ఇది దేశీగీత ఛందోరీతులు తెలిపే సంస్కృత గ్రంథం అయ్యుంటుంది. నేటికీ ఆ గ్రంథం లభించకపోవడం తెలుగు సాహిత్యం దురదృష్టం.
రామప్ప అనేవాడు నిర్మాణ దక్షిత కలిగినవాడు. అతని చరిత్ర కూడా లభ్యం కావడం లేదు. రామప్ప ప్రాంతంలోని కొందరు వృద్ధులతో మాట్లాడితే ‘వందల ఏళ్ళ నుండి రామప్ప గుడి అనే మేం అంటున్నాం’ అని తెలిపారు. రామప్ప అనే వ్యక్తి చరిత్ర, రామప్ప ఆలయంలో దాగిన పేరిణి వంటి ఇతర నృత్యాల డాక్యుమెం ద్వారా అధ్యయనం జరగవలసి ఉంది. తెలంగాణ పుత్రుడు నటరాజ రామకృష్ణ చేసిన అసాధారణ కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ‘రామప్ప’లో చరివూతని తవ్వడానికి తెలంగాణ మేధావులు నడుం కట్టాల్సిన సమయం ఇది! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి