చారిత్రాత్మక ఘటన సాకారమైంది. నాలుగున్నర కోట్ల ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష,.. లోక్ సభలో ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో లాంఛనం ముగిస్తే.. తెలంగాణ స్వయంపాలన శకం మొదలైనట్టే. అదీ ఎంతో దూరంలో లేదు.. ఇప్పుడో ..రేపో .. ఆ మహత్తర ఘట్టం కూడా ఆవిష్కారం కానుంది. మొత్తానికి ఆరు దశాబ్దాల.. ఆంధ్రా అసుర పాలన అంతమైంది! దుష్టపాలనకు తెరపడింది! తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చింది. వెయ్యిమంది బిడ్డల ఆత్మత్యాగం ఫలించింది! పుష్కర కాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న కేసీఆర్ సైనికుడై తెలంగాణను ఒంటిచేత గెలిపించారు! బరిగీసి కొట్లాడి నెత్తురోడిన తెలంగాణ గడ్డ ఇప్పుడొక ఆత్మగౌరవ పతాక! ఐదున్నర దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర కోట్ల ప్రజల పోరాటం ముగిసింది! ఎన్నాళ్లో వేచిన ఉదయం నులివెచ్చగా పలకరించింది. ఉద్యమం గర్జించిన బెబ్బులిలా ఢిల్లీ మెడలు వంచేలా సరికొత్త చరిత్రను లిఖించింది. కొలిమై అంటుకున్న తెలంగాణ గొంతుక ఆరున్నర దశాబ్దాలుగా అడవి నిండుగా ప్రతిధ్వనించింది! మట్టి పెళ్లగించుకుని వచ్చిన ప్రతి మొలకా పాటై చిగురించింది! సంస్కృతిని మూలం చేసుకున్న అస్థిత్వ ఉద్యమం ఇప్పుడు విజయతీరాలకు చేరింది. మోటకొట్టిన రాత్రి మోగిన పాట.. కల్లమూడ్చిన అవ్వ కలలో గింజ.. పదునెక్కిన గళం మదిమదిలో డమరుక నాదమైంది! తెలంగాణ ఓటమి తెలియని వీరులవనంగా మారింది! ఆటుపోటు అలజడులు ఎదురుదెబ్బలు విస్మరణలు ప్రకటనలు పక్కదార్లు...!!మొత్తంగా ఈ నేల ఓ పడిలేచే కెరటమైంది! ఊరూరు ఉద్యమంలో వసంతమై చిగురించింది. దండుకట్టి డప్పులు మోగించి కదంతొక్కినా...! బతుకమ్మలాడినా...బోనాలనెత్తినా... పీరీలనెత్తి అసోయ్దూలా అన్నా.. అదంతా గడిచిన వసంతం తోడుగా సాగిన పోరాటమే ! కాలం కత్తుల వంతెన కట్టినా... పాలకుడు మెత్తని ద్రోహం చేసినా... మడమ తిప్పని మట్టిబిడ్డలంతా ఎదురు నిలబడి పోరాడి విజయతీరంలో సగర్వంగా నిలబడ్డారు. ఇప్పుడిక దిగ్భ్రాంతికి చోటు లేదు. కత్తి మొనమీద నెత్తురు చుక్కవోలె ధగధగ మెరవాలె. అమ్మా తెలంగాణమా.. నీకు వేనవేల దండాలు..!! నాలుగున్నర కోట్ల ప్రజల తరుపున నీకు బోనాలు!! సమ్మక్క తల్లీ.. ఒక్కసారి చూసుకోమ్మా.. నువుగన్న తెలంగాణ ఇప్పడు జంపన్న వాగులో శిగమూగుతోంది!
Congratulations sir
రిప్లయితొలగించండి