హోం

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం


చారిత్రాత్మక ఘటన సాకారమైంది. నాలుగున్నర కోట్ల ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష,.. లోక్ సభలో ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో లాంఛనం ముగిస్తే.. తెలంగాణ స్వయంపాలన శకం మొదలైనట్టే. అదీ ఎంతో దూరంలో లేదు.. ఇప్పుడో ..రేపో .. ఆ మహత్తర ఘట్టం కూడా ఆవిష్కారం కానుంది. మొత్తానికి ఆరు దశాబ్దాల.. ఆంధ్రా అసుర పాలన అంతమైంది! దుష్టపాలనకు తెరపడింది! తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చింది. వెయ్యిమంది బిడ్డల ఆత్మత్యాగం ఫలించింది! పుష్కర కాలంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న కేసీఆర్ సైనికుడై తెలంగాణను ఒంటిచేత గెలిపించారు! బరిగీసి కొట్లాడి నెత్తురోడిన తెలంగాణ గడ్డ ఇప్పుడొక ఆత్మగౌరవ పతాక! ఐదున్నర దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర కోట్ల ప్రజల పోరాటం ముగిసింది! ఎన్నాళ్లో వేచిన ఉదయం నులివెచ్చగా పలకరించింది. ఉద్యమం గర్జించిన బెబ్బులిలా ఢిల్లీ మెడలు వంచేలా సరికొత్త చరిత్రను లిఖించింది. కొలిమై అంటుకున్న తెలంగాణ గొంతుక ఆరున్నర దశాబ్దాలుగా అడవి నిండుగా ప్రతిధ్వనించింది! మట్టి పెళ్లగించుకుని వచ్చిన ప్రతి మొలకా పాటై చిగురించింది! సంస్కృతిని మూలం చేసుకున్న అస్థిత్వ ఉద్యమం ఇప్పుడు విజయతీరాలకు చేరింది. మోటకొట్టిన రాత్రి మోగిన పాట.. కల్లమూడ్చిన అవ్వ కలలో గింజ.. పదునెక్కిన గళం మదిమదిలో డమరుక నాదమైంది! తెలంగాణ ఓటమి తెలియని వీరులవనంగా మారింది! ఆటుపోటు అలజడులు ఎదురుదెబ్బలు విస్మరణలు ప్రకటనలు పక్కదార్లు...!!మొత్తంగా ఈ నేల ఓ పడిలేచే కెరటమైంది! ఊరూరు ఉద్యమంలో వసంతమై చిగురించింది. దండుకట్టి డప్పులు మోగించి కదంతొక్కినా...! బతుకమ్మలాడినా...బోనాలనెత్తినా... పీరీలనెత్తి అసోయ్దూలా అన్నా.. అదంతా గడిచిన వసంతం తోడుగా సాగిన పోరాటమే ! కాలం కత్తుల వంతెన కట్టినా... పాలకుడు మెత్తని ద్రోహం చేసినా... మడమ తిప్పని మట్టిబిడ్డలంతా ఎదురు నిలబడి పోరాడి విజయతీరంలో సగర్వంగా నిలబడ్డారు. ఇప్పుడిక దిగ్భ్రాంతికి చోటు లేదు. కత్తి మొనమీద నెత్తురు చుక్కవోలె ధగధగ మెరవాలె. అమ్మా తెలంగాణమా.. నీకు వేనవేల దండాలు..!! నాలుగున్నర కోట్ల ప్రజల తరుపున నీకు బోనాలు!! సమ్మక్క తల్లీ.. ఒక్కసారి చూసుకోమ్మా.. నువుగన్న తెలంగాణ ఇప్పడు జంపన్న వాగులో శిగమూగుతోంది!

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

డిల్లీలో అనుకూల పవనాలు

* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పెరుగుతున్న మద్దతు 

బిల్లు ఆమోదానికి కృషి ; రాహుల్ 


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (టీ మీడియా): తెలంగాణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపజేసేందుకు కషి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం.శనివారం ఆయన నివాసంలో వివిధ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ చిట్‌చాట్‌లో పలు జాతీయ అంశాలతోపాటు రాష్ట్ర రాజకీయాలతోపాటు తెలంగాణపై కూడా తన అభిప్రాయాలను వ్యక్తపర్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రేస్ పార్టీ తీవ్ర కషి చేస్తున్నదని.. రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడుతున్నామని,  ఈ విషయంలో తాము సీరియస్‌గా ఉన్నట్లు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

                                                 ***


 పూర్తి మద్దతిస్తాం: లాలు 
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు తాము పూర్తి మద్ధతునిస్తున్నామని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఇవాళ టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతోపాటు ఆపార్టీ నేతల బందం లాలూను కలిసి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం లాలూ మాట్లాడుతూ... తెలంగాణ బిల్లుకు పూర్తి మద్ధతునిస్తున్నామని ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. వెంటనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని సోనియాగాందీని, రాహుల్‌గాంధీని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర నేతలు చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ. . .అసెంబ్లీ తీర్మానాలు కేంద్ర నిర్ణయంపై ప్రభావం చూపవని గంటాపథంగా చెప్పారు.

                                                 ***

 ఆప్ అనుకూలం
- ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్ నేత యోగేంద్రయాదవ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు అనుకూలమని పునరుద్ఘాటించింది. పార్టీ సిద్ధాంతపరంగా, విధానపరంగా మేం తెలంగాణకు అనుకూలం. చిన్నరాష్ర్టాల డిమాండ్‌కు మేం మద్దతు ఇస్తాం అని ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్‌నేత యోగేంద్ర యాదవ్ శనివారం మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రవాసుల హక్కుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విభిన్న సంస్కతుల కలబోత అయిన హైదరాబాద్ విశిష్ఠతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నదీ జలాల పంపిణీ వంటి అంశాల్లో సీమాంధ్రులకు న్యాయ, రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని అన్నారు.

                                                   ***



రాంవిలాస్ పాశ్వాన్‌:
న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు కూడగట్టే పనిలో తలమునకలై ఉన్నారు. ఈమేరకు ఢిల్లీలో మకాం వేసిన ఆయన పలువురు జాతీయ నేతలను కలుస్తూ బిల్లుకు మద్ధతివ్వాలని కోరుతున్నారు. ఇవాళ ఆయన లోక్ జన్‌శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్‌ను కలిసి తెలంగాణ బిల్లుకు మద్ధతు ఇవ్వాలని కోరారు. అందుకు పాశ్వాన్ సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు మద్ధతిస్తామని తెలిపారు.

                                                    ***

శరత్ యాదవ్ :

ఢిల్లీ : తెలంగాణ సమస్య చాల సున్నితమైందని జనదళ్ (యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ అన్నారు. తెలంగాణ బిల్లుకు మద్దతు కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శరద్‌యాదవ్‌ను ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు రాకుండా రాష్ట్ర విభజన జరిగేలా జరిగేలా చూడాలన్నారు. పార్లమెంట్‌లో టీ బిల్లు ఆమోదం కు మద్దతు తెలిపిన శరద్‌యాదవ్‌కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇంతకు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్‌యాదవ్ మద్దతు తెలిపి లేటరు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు