హోం

20, జులై 2013, శనివారం

తెలంగాణ తొవ్వ


రాష్ట్రాన్ని ఒకవేళ విభజిస్తే పరిష్కరించలేని సమస్యలుంటాయా? విభజనతో విపరీతమైన ఇబ్బందులు వస్తాయా? అసలు ప్రపంచంలో విభజన డిమాండ్ కొత్తగా ఇక్కడే పుట్టిందా? విభజన అంటూ జరిగితే.. పారే నీళ్లు, బొగ్గులు మండితే వచ్చే విద్యుత్, వివిధ పనుల్లో జనానికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, భూములు.. అవి సృష్టించిన బూమ్‌లు.. అవి పుట్టించిన ప్రైవేటు సంపదలు.. వాటి నుంచి మొలిచిన రాజకీయ అధికారాలు.. ఆ అధికారాలను కిందిస్థాయిలో పాలనగా మార్చే అధికార యంత్రాంగాలు.. అవి కేంద్రంగా ఉండే రాజధాని!! సకల రంగాల్లో సమస్యలు ఏపాటివి? విభజన జరుగకపోతే ఫలితమేంటో అనుభవాలు ఉండనే ఉన్నాయి. అవి అప్రస్తుతం! రాష్ట్రాన్ని విభజిస్తే ఏం జరుగుతుంది? తలెత్తే సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? పరిష్కారాలను చేరుకునే తొవ్వలేంటి? విభజన అనేది బీభత్స రస ప్రధాన దృశ్యం కానేకాదు. ఎవరైనా అలా అంటే కచ్చితంగా అది వారి స్వప్రయోజ నాల కోసమేనని భావించాల్సి ఉంటుంది. నిజానికి ఈ వాదనలు కొత్తవేమీ కావు. 

విభజన అనంతర పరిస్థితులపై మేధావులు కాచివడపోసినవే. నీళ్లు.. విద్యుత్.. ఉద్యోగాలు.. రాజధాని! ఎటు చూసినా సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్న కీలక రంగాలు ఇవే! విభజన జరిగితే.. ఎగువన ఉన్న తెలంగాణ నుంచి పారే నదుల నీటిలో ఆంధ్రకు హక్కు ఎగిరిపోదు. ఎందుకంటే ఈ అంశం కొత్తగా ఏర్పడే తెలంగాణ దయాదాక్షిణ్యాలపై ఉండదు! దీనికి ట్రిబ్యునళ్లు ఉంటాయి. అంతర్జాతీయ జల పంపకాల సూత్రాల ప్రకారం అవి ప్రకటించే అవార్డులుంటాయి. వాటిని పర్యవేక్షించే కోర్టులుంటాయి! ఉద్యోగాలు పోతాయన్న బెంగే లేదు. ఎందుకంటారా.. తెలంగాణ విభజనతో మిగిలే సీమాంధ్ర ప్రాంతాల రాష్ట్రానికి అంతే స్థాయిలో అధికార యంత్రాంగం అవసరం! నీటి వనరుల పంపిణీకి ప్రత్యేక విధానాలున్నట్లే.. విద్యుత్ విషయంలోనూ మార్గదర్శకాలున్నాయి. ఇక మరో కీలక అంశం రాజధాని! వాస్తవానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంతం మరింత వృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 

కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతానికి అందే వేల కోట్లు.. కూలి పని చేసినా.. కాంట్రాక్టులు చేసినా.. అంతిమంగా వెళ్లేది స్థానిక ప్రజల్లోకే! వీటన్నింటికి మించి రాజకీయ ప్రయోజనాలు కూడా కోరుకునేవారికి కోరుకున్నన్ని! ప్రస్తుత రాజకీయ చిత్రంలో చూస్తే.. తెలంగాణ ఏర్పాటుతో.. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ బలీయమైన శక్తిగా పుంజుకుంటుంది. తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ అనివార్యంగా కాంగ్రెస్‌లో విలీనం కాక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రీత్యా కాంగ్రెస్‌కు ఇక్కడ ఇది అత్యంత ప్రయోజనకారి. మరి సీమాంవూధలో? అక్కడా కాంగ్రెస్‌కు లబ్ధి కలిగేందుకే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర మంత్రి చిరంజీవి సహా అనేక మంది సీమాంవూధులే. తెలంగాణలో కొత్తగా వచ్చే బలంతో కాంగ్రెస్‌కు పెరిగే పునాది సహజంగానే సీమాంవూధలోనూ కలిసివస్తుంది. 

ఊపుతగ్గిందని భావిస్తున్న జగన్ పార్టీ రేపోమాపో కాంగ్రెస్‌లో కలిసే అవకాశాలూ లేకపోలేదు! ఈ రీత్యా అక్కడా కాంగ్రెస్‌కు జయమే! దేశంలో ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన అనేక చోట్ల విభజన అనుభవాలున్నాయి. సామరస్యపూర్వకంగా ఎలా విడిపోవచ్చో అవి నిరూపించాయి. విడిపోయి అభివృద్ధి దిశగా ఎలా దూసుకుపోవాలో పాఠాలు చెబుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా తోడు చేసుకోవాల్సింది ఒక సుహృద్భావపూర్వక వాతావరణమే! ఒక తెలుగు రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలుగా శక్తిని రెట్టింపు చేసుకునేందుకు దీర్ఘకాలం తర్వాత లభిస్తున్న సువర్ణావకాశం! విభజనపై కాంగ్రెస్‌పార్టీ దాని నేతృత్వంలోని ప్రభుత్వం అటో ఇటో తేల్చేస్తామని చెప్పి, ఏం జరిగితే ఏమవుతుందో రోడ్‌మ్యాప్‌ల తయారీ నిమిత్తం తన పార్టీలోని ముగ్గురు ముఖ్య నేతలను ఆదేశించిన క్రమంలో.. తెలంగాణ ప్రజల తరఫున ‘నమస్తే తెలంగాణ’ ఒక చొరవ చేస్తున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి, ఆత్మబలిదానాల నుంచి, దశాబ్దాల అన్యాయాల నుంచి అక్షరీకరించిన ‘తొవ్వ’ను కేంద్ర పాలకులకు అందజేస్తున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి