హోం

7, జులై 2013, ఆదివారం

భూదాన్ పోచంపల్లి..

                                                 (వినోబాబావే)
చేనేత, భూదానోద్యమానికి పురుడు పోసిన మన పల్లె ఇవాళ అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక విస్తృత అధ్యయన కేంద్రంగా విలసిల్లుతోంది.
నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే, అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు అందరినీ మురిపిస్తాయి మరి. ఇక ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. రక్తపాత రహితంగా జరిగిన భూదానోద్యమం పుట్టింది ఇక్కడే. అందుకే ఈ గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. అనాడు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన నేతగాళ్ళు రాన్రాను అనేక డిజైన్‌లలో చేనేత బట్టలను నేసి, అందరినీ ఆకర్శించేలా చేస్తున్నారు. హైద్రాబాద్ నగరానికి కేవలం 35 కి.మీ. దూరంలోని ఈ ఊరును చూసేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల వారే కాకుండా రోజూ అనేకమంది విదేశీయులు కూడా ఇక్కడికి వస్తూ, వారికి కావల్సిన సమాచారాన్ని మోసుకు పోతున్నారు. 
             అంతేకాదు, ఈ గ్రామం అనేక రకాల శిక్షణలు, వృత్తివిద్యలు, సాంప్రదాయ విద్యలను అభ్యసించే విద్యార్థులకు అధ్యయన వేదికగానూ నిలిచింది. ఒక ‘గ్రామీణ పాఠశాల’గా ఔత్సాహిక పరిశోధకులకు ఉపయోగపడుతోంది. నిజాం నవాబులు వాడిన కండువా రుమాళ్ళను నేసినా, అరబ్బు దేశాలకు ఎగుమతి చేసిన గాజుల పూసలను తయారు చేసినా, పేద ప్రజల ఆశలకు ప్రతిరూపమైన భూదానోద్యమానికి శ్రీకారం చుట్టినా- అది ఈ గ్రామానికే చెల్లిందనుకోవాలి. సాధారణ పడుచుల నుండి దేశ విదేశీ వనితల వరకూ అందరినీ ఆకట్టుకునే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని ఆర్జిస్తూ ఎందరికో ఈ గ్రామం చక్కని ‘అధ్యయన కేంద్రం’గా మారడం గొప్ప విషయమే మరి. 
చేనేత రంగంలో అధ్యయనాలు:-

చేనేత వస్త్రోత్పత్తికి పేరెన్నిక గన్న ఈ గ్రామానికి నిత్యం అనేక మంది చేనేత అధ్యయనకారులు వస్తుంటారు. హైద్రాబాద్‌లోని (ఎన్‌ఐఆర్‌డీ) జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థలో వివిధ అంశాలలో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందే అనేక దేశాలకు చెందిన అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ఆర్థిక రంగ నిపుణులు, అధ్యాపకులు, రాజకీయ వేత్తలు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇక్కడికి తరచూ వస్తుంటారు. ‘పోచంపల్లి చేనేత వస్త్రాలను మార్కెట్ అవసరాలకు దగ్గట్టుగా ఏ విధమైన కొత్త డిజైన్‌లను రూపొందించవచ్చు’ అనే అంశంలోఎన్‌ఐఎఫ్‌టీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) బృందాలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ బృందాల వారూ గ్రామాన్ని సందర్శిస్తారు. వీరితోపాటు నిమ్స్‌మీ (జాతీయ, సూక్ష్మ, లఘు, మధ్య పరిక్షిశమ సంస్థ), చేనేత జౌళి శాఖలకు చెందిన అధికారులు, వివిధ రాష్ట్రాల చేనేత క్లస్టర్ల బృందాలు, పలు రాష్ట్రాలకు చెందిన వీవర్స్ సర్వీసింగ్ సెంటర్స్ సభ్యులు, టెక్స్‌టైల్స్ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు, సెరీఫైడ్, ఎన్‌హెచ్‌డీసీ, ప్రపంచ దేశాలకు చెందిన పలు ఫొటోక్షిగఫీ అసోసియేషన్ సభ్యులు కూడా ఇక్కడికి వస్తుంటారు. మండల పరిధిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ ఫార్కును, పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని, చేనేత కార్మికుల గృహాలను చేనేత ఉత్పత్తిలోని వివిధ ప్రక్రియలను వారు తిలకించడంతోపాటు ఫొటోలు తీసుకుంటారు. 
వ్యవసాయ పరిశోధనలు:-
మరోవైపు వ్యవసాయ పరిశోధకులూ ఇక్కడికి వస్తుంటారు. భూదాన్ పోచంపల్లిలో మూసీ నది ప్రవహిస్తోంది. ఇక్కడి రైతులు ఎక్కువగా వరి పంట పండిస్తారు. హైద్రాబాదుకు అతి తక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి, వ్యవసాయ పరమైన కొన్ని అధ్యయనాలు జరపడానికి ఇక్కడికి ఆంధ్రవూపదేశ్ అగ్రికల్చరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బృందాలు, నాబార్డ్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వివిధ రాష్ట్రాల అధికారులు, గ్రామీణ మహిళామండలి సభ్యులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, డీఆర్‌డీఏ, ఎన్‌సీఆర్‌డీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్) బృందాల వారూ ఈ గ్రామాన్ని సందర్శిస్తారు. 
విద్యార్థులకు కొత్తపాఠాలు:-
ఇక్కడి పురాతన కట్టడాలు పరిశీలించడానికి వివిద రాష్ట్రాలకు చెందిన ఆర్కిటెక్ట్ కళాశాలలకు చెందిన విద్యార్థులూ ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడి 101 దర్వాజల భవనాన్ని, పాత పెంకుటిళ్లను పరిశీలించేందుకే కాకుండా కాలక్షికమేణా నిర్మాణ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేయడం ప్రధానంగా వారి పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది.
పథకాల పరిశీలన:-
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను పరిశీలించేందుకు పలువురు అధికారులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. మరోవైపు మహిళా సాధికారతకు సర్కారు తీసుకునే చర్యలను పరిశీలించేందుకుగాను విదేశాల ప్రతినిధులు, అధికారుల బృందాలు, వివిధ రాష్ట్రాల నిపుణులు, బ్లాక్ లెవల్ అధికారులు, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వంటి వారందరూ తరచుగా ఇక్కడికి రావడం జరుగుతోంది. 
పుణ్యస్థలి:-
మహాత్ముని ప్రియశిష్యుడు ఆచార్య వినోబాబావే నిర్వహించిన భూదాన్యోమం ఇక్కడే పుట్టింది. ఈ దృష్ట్యా అనేక పర్యాయాలు ఇక్కడికి ఎందరో సర్వోదయ నాయకులు, గాంధేయవాదులు వినోబాబావే తన రెండవ జన్మస్థలంగా చెప్పుకున్న ఈ గ్రామాన్ని అత్యంత ఆసక్తితో సందర్శిస్తారు. ఇలా వారికి ఈ గ్రామం ఒక పుణ్యస్థలంగానూ పేరొందింది. 
వృత్తివిద్యలు, శిక్షణల పరిశీలన:-
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు గురువు, తెలంగాణ విమోచన గాంధీ స్వామి రామానందతీర్థ పేరున ఇక్కడ గ్రామీణ యువతీ యువకులకు వివిధ వృత్తివిద్యలతోపాటు సాంకేతిక అంశాలలో శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటైన ఎస్‌ర్‌టీఆర్‌ఐ సంస్థను కూడా పలువురు ఆసక్తిగా సందర్శిస్తుంటారు. 
         హైద్రాబాద్‌కు అతి సమీపంలో ఉండటంతో రాజధానికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులలో చాలామంది పోచంపల్లిని కూడా సందర్శించడం పరిపాటిగా మారింది. అంతేకాదు, వచ్చే ప్రతీ ఒక్కరు వచ్చిన పని ముగిశాక, ఇక్కడి చేనేత కార్మికులు నేసే వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. అలా ఈ కార్మికులకు మరింత పని దొరికేందుకు పరోక్షంగా వారు దోహద పడుతున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్న కారణంగా ఇక్కడ ప్రభుత్వం గ్రామీణ పర్యాటక కేంద్రం ఒకదానిని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకులకు తగు వసతులు కల్పించడం ద్వారా మరింత మంది సందర్శుకులను ఆకట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.

                                                                                   -from namaste telangaana

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి